దైవ రహస్యం...(పూర్తి నవల)

 

                                                                                             దైవ రహస్యం                                                                                                                                                                                             (పూర్తి నవల)

1515 ఆగస్టు 15….విశాలపురం అనే గ్రామంలో

తన ఇంటి ముందున్న ఖాలీ స్థలంలో ఒక గుడి కట్టాలని అశోక వర్మ నిర్ణయించుకున్నాడు. మాట విని చాలా సంతోషపడింది భార్య శేషమాంబ. విశాలపురంలో ఇంట్లోనే గుడి అనేది బాగా శాస్త్రము తెలిసున్న వాళ్ళ ఇళ్ళల్లో మాత్రమే కట్టగలరు! మిగిలినవారు ఊరికి బయట పది మైళ్ళ దూరంలో ఉన్న అమ్మోరి గుడికి వెళ్ళాల్సిందే. పెళ్ళైన కొత్తలో శేషమాంబ కూడా ఊరి బయట ఉన్న అమ్మోరి గుడికే వెళ్ళింది.  అలా ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద పాములను చూసి శేషమాంబ భయపడింది.   

పెళ్ళికి ముందు విజయనగరంలో శేషమాంబ ఇంటికి దగ్గరలోనే రెండు గుడులు ఉండేవి. రోజూ రెండు పూటలా గుడికి వెళ్ళి రావటం శేషమాంబకు అలవాటు. పెళ్ళి చేసుకుని విశాలపురంలోని భర్త ఇంటికి వచ్చినప్పుడు, శేషమాంబకి అంతా కొత్తగానూ, తేడాగానూ ఉండేది. వాటిల్లో శేషమాంబని ఎక్కువ కష్టపెట్టింది ఇదిగో గుడి సమస్య. గుడికి వెళ్ళాలంటే పది మైళ్ళ దూరం వెళ్ళాలి. ఆరు సంవత్సరాల తరువాత సమస్యకు ఇప్పుడు ముగింపు వచ్చింది. అదికూడా భర్త అశోక వర్మ ద్వారా రావడం శేషమాంబని ఎక్కువ సంతోష పెట్టింది.

తాపీ మేస్త్రీతో పాటు మరో నలుగురు వచ్చి దిగారు. అందరూ పని ముట్లతో సహా రెడీగా ఉన్నారు. తాపీ మేస్త్రీ గుడి కట్టాల్సిన ప్రదేశాన్ని చూశాడు.

ప్రదేశంలోని ఈశాన్య మూలలో ఐదడుగుల ఎత్తుతో ఒక రాయి ఉన్నది. మేస్త్రీ తన భుజం మీదున్న తుండుతో  రాయిని తుడిచాడు. రాయి పైన ఒక మూల త్రిశూలం ఆకారం చెక్కబడుంది. రాయి క్రింద బాగంలో ఏవో అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. అయితే అక్షరాలు చెరిగిపోయున్నాయి. 

" రాయిని తీసేసి పని మొదలు పెట్టండి. శుభమూహర్త సమయం దాటిపోతుంది. .." అన్నాడు అశోక వర్మ.

"అయ్యా రాయిపైన ఏవో రాతలు ఉన్నాయండి"

"పరవాలేదు తీసేయండి. రాతల గురించి తెలుసుకోవటానికి పండితులను ఇదివరకే పిలిపించాను. ఎవరూ చదవలేకపోయారు. కట్టేది గుడి కాబట్టి దోషమూ ఉండదని చెప్పారు "

"అలాగే అయ్యాగారు" అన్నాడు మేస్త్రీ.

రాయి పక్కనే నిలబడున్న ఒక కూలి రాయిని పట్టుకుని ఊపాడు.

                                                            **********************

2015 ఆగస్టు 15…… విశాలపురం టౌన్ లో

(అలనాటి విశాలపురం గ్రామమే నాటి విశాలపురం టౌన్)   

నాలుగు రోడ్ల కూడలిని చూస్తుంటే విదేశాలను గుర్తుకు తెస్తోంది. విశాలపురానికి అడ్డంగా నాలుగు రోడ్లు వెడుతున్నాయి. నాలుగు రోడ్ల మధ్యలో రావి, చింత చెట్లు వరుసక్రమంలో నిలబడున్నాయి.

ఊర్లో ఉన్న వృద్దులు కొంతమంది చెట్ల క్రింద నిలబడి రోడ్డు యొక్క అందాన్నీ, రోడ్డు మీద వేగంగా పోతున్న వాహనాలను చూసి ఆనందిస్తూ ఉంటారు.

సెల్ ఫోన్ యుగంలో కూడా ముక్కుపొడికి డిమాండ్ ఉందంటే అది ఊర్లోనే ఎక్కువ. తోటల క్రిష్ణారావ్ గారు భోజనం లేకుండా కూడా ఉండగలరు, కానీ ముక్కుపోడి లేకుండా ఉండలేరు. ముక్కు ద్వారా ముక్కుపొడిని పీలుస్తుంటే ఆయనకు ఒళ్లంతా కరెంటు పాకినట్లు అనిపిస్తుంది. శ్వాసించుకోవటం కోసం భగవంతుడు మనుషికి ముక్కు ఇచ్చాడు. అందులో ముక్కుపొడి వేసుకోవటాన్ని కనిపెట్టింది, రెండు విధాలుగా ముక్కును ఉపయోగుంచు కోవటం మానవుని తెలివితేటలు.

తోటల క్రిష్ణారావ్ గారికి డెబ్బై ఏళ్ల వయసు ఉంటుంది. వయసు పైబడితేనే కాలం గడపటానికి శ్రమ పడవలసి వస్తుంది. ఎందుకనో తెలియదు...టీ.వీ చూడటం ఆయనకు ఇష్టం లేదు. రేడియోలో పాటలు వినడానికి కూడా ఇష్టపడరు. కబుర్లు, చర్చ అంటే మాత్రం చాలా ఇష్టం. కబుర్లు, చర్చలలో ఊర్లోని గొడవ ఉండాల్సింది చాలా అవసరం.

ముక్కుపొడి వేసుకున్న ఉత్సాహంతో 'కబుర్లు చెప్పుకోవటానికి ఎవరైనా కనబడతారా?' అని ఆయన  ఎదురుచూస్తున్నప్పుడు ....ఎదురుగా వచ్చాడు మాటల కోటేశ్వర రావ్. ఇద్దరూ మంచి స్నేహితులు.

"ఎంతసేపు నీకోసం ఎదురుచూడాలి?" అని ఆయనతో గొడవ పడి కబుర్లలోకి వెళ్ళాడు క్రిష్ణారావ్. ఇద్దరూ కలిసి నాలుగు రోడ్ల కూడలిలోని రావి చెట్టు క్రింద ఉన్న బెంచి మీద కూర్చున్నారు.

సిమెంటు బెంచి మీద కూర్చుంటే చల్లగా ఉంది.

 "రోడ్డు వేసే కాంట్రాక్టర్ల దగ్గర నుండి చెట్టూ, సిమెంటు బెంచి ఎలాగో తప్పించుకున్నాయి...కదా కోటేశ్వర రావ్" 

"అవును క్రిష్ణారావ్! కానీ, చెట్టును కొట్టేయడానికి ప్రయత్నించిన ప్రతిసారి కొట్టేయడానికి వచ్చిన మనుషులకు రక్తగాయలు ఏర్పడి రక్తం ప్రవాహంగా పోవటంతో భయపడ్డారు. దాంతోపాటూ కాలంలో కాశీకి వెళ్ళే మునులు, రుషులు సేద తీర్చుకోవటానికి చెట్టు క్రింద కూర్చునేవారట. తరువాత ఒక సర్పం చెట్టు సందులోకి వెళ్ళిందట. అప్పటి నుంచి చెట్టును నాగేంద్రుడి చెట్టు అని పిలుస్తారు. అందుకనే చెట్టును కొట్టేయడానికి ఎవరూ సాహసం చేయరు..."

"ఇప్పుడు కూడా పాము ఉన్నదా?"

"తెలిసే మాట్లాడుతున్నావా... చెట్టును వందో, రెండొందలో ఏళ్ళ క్రితం నాటారు. ఇంకానా పాము ఇక్కడుంటుంది?"

"మరి ఇప్పుడు కూడా చెట్టుకు దైవశక్తి ఉన్నదంటావా?"

" పాము లేకపొతేనేమి...వాళ్ళ వంశోద్ధారకులుండరా?”

"అలాగైతే పాములు వచ్చి కాటు వేసుండాలి కదా...వాళ్ళకు గాయాలు ఎలా తగిలినై?"

"ఇప్పుడు ఏమంటావు... చెట్టుకు దైవశక్తి లేదు అంటావా?"

"అది చెట్టు...అంతే! దేముడూ లేడు...దైవశక్తీ లేదు. నాగేంద్రుడికి లోకంలో వేరే చోటే లేదా... చెట్టులోకి వచ్చి తలదాచుకోవటానికి?"

"తలతిక్కగా మాట్లాడకపోతే నీకు తోచదా...?"

వాళ్ళిద్దరి మధ్యా చర్చ మొదలయ్యింది. వేగం పుంజుకుంది. వాళ్ళ చర్చలో ఎన్నో పాత విషయాలు చోటుచేసుకున్నాయి.

కనుచూపు మేరలోనే నాలుగు రోడ్ల 'టోల్ గేట్' తెలుస్తోంది. అక్కడ చాలా కార్లు, లారీలు,  బస్సులు వరుసగా నిలబడున్నాయి.

వాటిని చూసిన క్రిష్ణారావుకి నీరశం వచ్చింది.

"నువ్వెందుకు అలా నీరశంగా ఉన్నావు?"

"ఎందుకా? 'టోల్ గేట్' ఉన్న స్థలం నాది. ప్రభుత్వం లాక్కుంది. దానికొసం నాకు కొన్ని వేలు ఇచ్చారు. కానీ వాళ్ళు కోట్లకొద్ది సంపాదిస్తున్నారు"

"రోడ్డు వేసి దాన్ని బాగా ఉంచుకోవటానికే కదా వాళ్ళు వసూళ్ళు చేస్తున్నారు"

"వసూళ్ళు చేసి రోడ్డు బాగోగులు వీళ్ళేం చేసి చించేస్తున్నారు. రోడ్డుకు వెళ్ళి చూడు 'టోల్ గేట్' రెండువైపులా వంద మీటర్లదాకా ఎప్పుడూ బాగానే ఉంచుకుంటారు. తరువత అంతా గుంతలే. రోడ్డూ లేదు పాడూ లేదు. పోనీ రోడ్డు పక్కనున్న చెట్లకు నీళ్ళుపోస్తున్నారా....అదీలేదు"

"చివరగా నువ్వేం చెప్పదలచుకున్నావ్ క్రిష్ణారావ్" 

"దొచుకుంటున్నారు. ప్రజలను దోచుకుంటున్నారు...ఇలా అని తెలిసుంటే నా స్థలాన్ని ఇచ్చేవాడినే కాదు"

"అలా గనుక నువ్వు చేసుంటే పాటికి నిన్ను జైల్లో తోసుంటారు...నోరు మూసుకుని ఉండు"

వెళ్ళి వస్తున్నప్పుడల్లా కార్ల వాళ్ళు, బస్సుల వాళ్ళు యాబై, వందా ఏడుస్తూ ఇచ్చుకుంటున్నారు. కారు, బస్సు కొనేటప్పుడే రోడ్డుకని ఒక టాక్స్ లాకుంటున్నారే, తరువాత ఎందుకీ 'టోల్ టాక్స్?"

"ప్రపంచం మొత్తం ఉందప్పా! పాత రోడ్డు ఎలా ఉండేది...ఇప్పుడెలా ఉన్నది?”

"ఏం మాట్లాడుతున్నావు...! ఇలా రోడ్డు వేసివ్వాల్సింది గవర్నమెంట్ బాధ్యత.  దానికొసం పన్ను కడుతున్నాం కదా...అలాంటప్పుడు ఎందుకు రోజు రోజు పన్ను?”

"నీకు మైండ్ దొబ్బింది...అందుకే అలా పిచ్చిగా మాట్లాడుతున్నావు!"

నీలాంటి వాళ్ళు ఉండబట్టే కాంట్రాక్ట్ తీసుకున్నవాడు తన ఇష్టం వచ్చినట్లు వసూలు చేసి....కొల్లగొడుతున్నాడు. కారు పెట్టుకున్న వాళ్ళందరూ పాపం! పెట్రోల్, డీజల్ రేట్లు ఒక పక్క వేధిస్తున్నాయి....వీళ్ళు ఒక పక్క పీక్కుతింటున్నారు"

క్రిష్ణారావ్ దగ్గర ఇలాంటి సామాజిక కోపాలు చాలానే బయటపడతాయి. అందులో ఎక్కువ...న్యాయం ఉంటుంది. వాటికి సరిసమంగా జవాబు చెప్పలేక కోటేశ్వరరావ్ తికమక పడుతూంటే............

పడవలాంటి కారు వాళ్ళను ఆనుకున్నట్టు వచ్చి ఆగింది. కారు అద్దాలు క్రిందకి దిగటంతో లోపల కూర్చున్న లావుపాటి ఆకారం కనబడింది. నోటిలో సిగిరెట్టు ఒకటి.

క్రిష్ణారావ్, కోటేశ్వరరావ్ లోతుగా చూశారు. ఆకారమూ సిగిరెట్టు పోగ వదుల్తూ...   

"ఇదేనా విశాలపురం?"

"అవును"

"ఇక్కడ పరమేశ్వర్ గారి ఇల్లు ఎక్కడుందో చెప్పగలరా?"

"పరమేశ్వర్ గారా... పరమేశ్వర్ గారిని అడుగుతున్నారు? ఊర్లో పేరుతో ముగ్గురున్నారు"

ఈయన చీరాల పక్కన కాలేజి ప్రొఫసర్ గా ఉన్నారు..."

...మన చదువుల మేధావి పరమేశ్వరా?"

చదువుల మేధావి అవునో, కాదో నాకు తెలియదు సార్.......ప్రొఫసర్ పరమేశ్వర్"

"అరె.ఏమిటి సార్ మీరు....

పరమేశ్వర్ ను పరమేశ్వరుడు అని పిలవటం లోక సహజం. అందుకే అలా చెప్పాను. మా ఊర్లో ఎక్కువగా చదువుకున్నది ఆయనే. అందువల్లే చదువుల మేధావి పరమేశ్వరా అని అడిగాను" 

"సరే...ఆయన ఇళ్ళు చూపించగలరా?"

"తప్పకుండా... నేను నేరుగా వచ్చి చూపిస్తాను...కార్లో ఎక్కనా?"

అంటూనే కోటేశ్వరరావ్ ఎక్కవ చొరవతో వెనుక డోర్ ను తెరిచి కారులో ఎక్కి కూర్చున్నాడు.

కారు తీసుకుని ఎవడొస్తాడా: ఫ్రీగా సవారి చేశేద్దాం అని పడుంటుంటాడు. స్నేహితుడు పక్కనున్నాడే అని కూడా ఆలొచించడు..." అంటూ క్రిష్ణారావ్ గొణుకున్నాడు.

కారు బయలుదేరింది.

కారు వైపే చూస్తున్న క్రిష్ణారావు కి కారు వెనుక భాగంలో రక్తపు మరకలు కనబడ్డాయి.

క్రిష్ణారావు అధిరిపడ్డాడు.

   

                 ***************************************PART-2****************************

విశాలపురం గ్రామంలో 

మేస్త్రీతో పాటు,మరో ఇద్దరు కలిసి చెతితోనే రాయిని తీసేయడానికి ప్రయత్నించారు. అది కొంచంగా కదిలింది.

" రాయిని తీయడం అంత శులభం కాదు అయ్యగారు". మేస్త్రీ చెప్పాడు.

"క్రింద నుండి బాగా త్రవ్వండి...అదే వస్తుంది" అన్నాడు ఆశోక వర్మ.

"అవునండీ...అసలు ఇక్కడ రాయి ఎందుకుంది?" అడిగాడు మేస్త్రి.

"ఎవరికి తెలుసు... నా చిన్నప్పటి నుంచి రాయి అక్కడే ఉన్నది. దేవుడి రాయి అని చెప్పారు. సరే ఉండనీ అని నేనూ వదిలేశాను"

"అబ్బే దేవుని బొమ్మ ఏమీలేదండి. కానీ, రాతి మీద సూర్యుని గుర్తు, త్రిశూలం బాగా కనబడుతున్నాయి. రాతలు మాత్రం సరిగ్గా కనబడటం లేదు

పండితులు వచ్చినప్పుడు రాతలను కొద్దిగా చదవగలిగారు….పాండిత్య వంశ ప్రతాప్ రాయులు అనే పేరు రాసున్నదని చెప్పారుకొద్దికాలం క్రితం ఊర్లో వంశీయులు ఉండేవారని చెప్పారు

"అలాగైతే వాళ్ళెవరు అయ్యగారూ?”

రోజుల్లో నాలుగు అక్షరాలు రాయగలిగే వాడిని పాండిత్య వంశం అనేవారు. రాతిమీద, చెక్క మీద రాసేవారట. అలా రాతిమీద చెక్కబడిందే రాయి"

మాట్లాడుతూనే... రాయిని ముగ్గురూ కలిసి లాగి, పైకి తీసి పక్కన పడేశారు. రాయి తీసిన చోట ఒక గుంట కనబడింది. గుంటలో లోతుగా చూశారు. క్రింద మంచం లాంటి ఆకారంలో ఎత్తుగా మట్టిదిబ్బె ఉన్నది.

అక్కడ గుంట ఉండటం, గుంట లోతులో అలా ఒక మట్టిదిబ్బె ఉండటం, అలా ఎందుకుందో అర్ధం కాలేదు.

అక్కడున్న మేస్త్రి, మరో ముగ్గురి ముఖాలలో ఆశ్చర్యం చోటు చేసుకుంది.

                                                                     ************************* 

విశాలపురం టౌన్ లో 

 కారు వెనుక భాగంలో రక్తం మరకలు చూసిన క్రిష్ణారావుకి గుండె గుభేల్ మన్నది.  

'వచ్చేదార్లో కారును ఎవరి మీదకు ఎక్కించాడో తెలియటంలేదు! కారు వెనుక భాగంలో రక్తం మరకలు ఉన్నాయి...'-అంటూ తనలో తానే అనుకుంటున్నప్పుడు క్రిష్ణారావును దాటి వేగంగా వెళ్ళింది ఎనిమిదడుగుల పాము

దాన్ని చూసిన మరుక్షణం అతని వెన్నుపూసలో వణుకు పుట్టింది.

అది వేగంగా చెట్టు బొందులో దూరి మాయమయ్యింది. క్రిష్ణారావుకు గొంతు ఎండిపోయింది.  

'కోటేశ్వరరావు చెప్పింది నిజమే కాబోలు! అమ్మో...ఎంతపెద్ద పామో?' అంటూ గొణుగుతూ...ఇక అక్కడ ఉండటానికి ధైర్యంలేక తన ఇంటివైపు నడవటం మొదలుపెట్టాడు.

అది ప్రొఫసర్ పరమేశ్వర్ గారి ఇల్లు!

ఇంటిముందు పెద్ద వేపచెట్టు. లేత ఆకులతో చిగురించి, వేప పువ్వుతో నిండిపోయింది.

నేల చుట్టూ రాలిపోయిన వేప పూత ఒక తివాచీలాగా ఉన్నది. తివాచీ మీదకు వచ్చి ఆగింది పడవలాంటి కారు. కారులో నుండి ఒక లావుపాటి మనిషి దిగాడు.

అలాగే కోటేశ్వరరావు కూడా కార్లోనుండి దిగాడు.

"ఇదేనండి మన పరమేశ్వర్ గారి ఇల్లు"  

"పాతకాలం నాటి ఇల్లులాగా ఉన్నదే...?"

"అవునండి... ఊర్లోని అన్ని ఇళ్ళూ పాతకాలం నాటివే! ఇది రోజుల్లో జమీందారి రకం ఇల్లు. ఎలా కట్టేరో చూడండి. ఈరోజుల్లో ఇలా కట్టగలరా?"

కోటేశ్వరరావు గర్వంగా చెప్పాడు.

కారులోనుండి దిగిన లావుపాటి మనిషి, కళ్ళకు పెట్టుకున్న నల్ల కళ్ళద్దాలను తీసి జేబులో పెట్టుకుంటూ "ఇల్లు చూపించినందుకు చాలా ధ్యాంక్స్ అండి" అన్నాడు మాట ఎలా ఉందంటేఅలాగే మీరు ఇక ఇంటికి వెళ్ళిపోవచ్చు’. 

 కోటేశ్వరరావు అదేమీ పట్టించుకోకుండా "మీరు విషయం మీద వచ్చారో చెప్పనే లేదు?" అని అడిగినప్పుడు లావుపాటి మనిషి ముఖంలో చిరు మందహాసం.

ఈలోపు ఇంటి వాకిట్లో కారు వచ్చి ఆగటం తెలుసుకుని పరమేశ్వర్ గారే బయటకు వచ్చి చూశారుఆయన్ను చూసిన వెంటనే లావుపాటి మనిషి దగ్గర ఒక చిరు నవ్వు.

"నమస్తే ప్రొఫసర్..."

"...మీరా?"

"నేనే! నన్ను మీరు ఇక్కడ ఎదురు చూడలేదుగా?"

"అవును! మీతో అప్పుడే చెప్పేశాను కదా నేను స్థలం అమ్మను అని

"అరె, ఏమిటి ప్రొఫసర్ సార్! చెప్పిందే చెబుతున్నారు? మొదట ఇంటికి వచ్చిన వాళ్ళను లోపలకు రండి అని పిలవరా?"

"సరె...లోపలకు రండి..."

మనసు అగీకరించక పోయినా ఆయన్ని లోపలకు రమ్మని పరమేశ్వర్ గారు పిలవటం, కారులోనుండి దిగిన లావుపాటి మనిషి బయట మాట్లాడటం ఇష్టంలేక లోపలకు వస్తాననడం గ్రహించిన కోటేశ్వరరావు, ఏదో ముఖ్యమైన విషయం అని గ్రహించాడు. పరమేశ్వర్ గారు కూడా తనని ఇంట్లోకి రమ్మని పిలవక పోవటంతో మెల్లగా వెనక్కి తిరిగాడు కోటేశ్వరరావు. ఎదురుగా క్రిష్ణారావు రావటం గమనించాడు. కోటేశ్వరరావును చూసిన క్రిష్ణారావుకి విపరీతంగా కోపం వచ్చింది.

"ఏమిటి క్రిష్ణారావు...నిన్ను అక్కడే వదిలేసి నేను కారులో ఎక్కి వచ్చాశానని కోపమా?"

"రాదామరి... నువ్వూ ఒక స్నేహితుడివేనా? ఒకడు కార్లో వచ్చి దారి అడిగితే...నోటితో చెప్పొచ్చుకదా! అదేమిటి చిన్న పిల్లాడిలాగా కార్లోకి ఎక్కి కూర్చోవటం? నిన్ను తలుచుకుంటే ఒళ్ళు మండి పోతోంది. మనకని ఒక గౌరవం ఉండద్దూ?"

క్రిష్ణారావు...కోటేశ్వరరావుని మందలిస్తుంటే పరమేశ్వర్ గారి ఇంట్లో నుండి గట్టిగా కేకల లాంటి మాటలు వినబడ్డాయి. అది పరమేశ్వర్ గారి గొంతు

"దయచేసి వెళ్ళండి సార్! స్థలాన్ని ఇప్పుడు అమ్మదలుచుకోలేదు. ఆస్థలంలో నేనే ఒక 'కాంప్లెక్స్కట్టి అద్దెలకు ఇవ్వాలనే ఆలొచనలో ఉన్నాను" అంటున్న పరమేశ్వర్ గారి గొంతు కోటేశ్వరరావుకుక్రిష్ణారావుకు విషయాన్ని తెలియపరిచింది

చూస్తూ నిలబడ్డారు.

లావుపాటి వ్యక్తి నిరాశతో తిరిగి వచ్చాడు.

పరమేశ్వర్ గారు వెనక్కి తిరిగి ఇంటిలోపలకు వెళ్ళి తలుపులు వేసుకున్నారు.

క్రిష్ణారావు, కోటేశ్వరరావు ఇద్దరూ లావుపాటి వ్యక్తి దగ్గరకు చేరుకుని అతని ముఖంలోకి చూశారు. అతను కూడా ఇద్దరినీ అదొలాగా చూశాడు.

"వచ్చింది స్థలం కొనడానికా?" అడిగాడు కోటేశ్వరరావు.

అవునన్నట్లు తల ఊపాడు వ్యక్తి.

"మన పరమేశ్వర్ గరి స్థలమే కావాలా...?"

"అవును... మూడు ఎకరాలే కావాలి"

" స్థలాన్ని కొనడానికా ఆశపడుతున్నారు?"

"అవునండి! కానీ పరమేశ్వర్ గారు అమ్మనంటే అమ్మనని మొండికేస్తున్నారు"

"దానికి మీరు సంతోషపడాలి"

"ఎందుకని అలా చెబుతున్నారు?"

"అది పరమేశ్వర్ గారి వారసత్వపు ఆస్తి. వాళ్ళ ఇంట్లో ఎవరు చనిపోయినా స్తలంలోనే పూడుస్తారు. అక్కడకెళ్ళి చూశారా?"

"చూడలేదు...! కానీ, పరమేశ్వర్ గారి దగ్గర స్థలం ఉన్నదని తెలుసుకునే, రేటెంతో అడుగుదామని వచ్చాను. అవును...ఇక్కడ ఒక సెంటు ఎంత?"

"అదెందుకు అడుగుతున్నారు?"

" మూడు ఎకరాలకూ నేను కోటి రూపాయలు ఇస్తానన్నాను. మీరే చెప్పండి...మంచి రేటే కదా?"

"ఏమిటీ...ఎందుకూ పనికిరాని మూడు ఎకరాల స్థలానికి కోటి రూపాయలా? ఈశ్వరా...ఇక్కడ అత్యధిక రేటే ఏకరానికి పది లక్షలు. మూడు ఎకరాలకు ముప్పై లక్షలు. అందులోనూ స్థలం శవాలను పూడ్చిన చోటు. శవాలను పూడ్చిపెట్టే చోటుకు పదిలక్షలే చాలా ఎక్కువ"

క్రిష్ణారావు  తల కొట్టుకున్నాడు.  

"ఇలా చూడండి! మేము వేరే మంచి స్థలాన్ని కొనిపెడతాం. అందులోనూ దీంట్లో సగం రేటుకే. మాకు మీరు 5 శాతం కమీషన్ ఇవ్వండి చాలు..." అని కోటేశ్వరరావు అప్పుడే వ్యాపారాన్ని మాట్లాడటం మొదలుపెట్టాడు.

కానీ లావుపాటి వ్యక్తి దగ్గర దీర్ఘమైన మౌనం.

"ఏమిటండీ మౌనంగా ఉన్నారు...?"

"ఏమీలేదు...మీరడిగే 5 శాతం కమీషన్ పరమేశ్వర్ గారి స్థలానికే ఇస్తాను. ఆయనతో మాట్లాడి నాకోసం ఆయన్ని ఒప్పించగలరా?" 

"అరే...ఏమిటండీ మీరు? అది ఎందుకూ పనికిరాని భూమి. శ్మశానం లాంటిది. దానికిపోయి ఇంతగా ఆశపడుతున్నారే"

"సరే...మీవల్ల కాకపోతే వదిలేయండి! నేను ఇంకెవరినైనా చూసుకుంటాను. అవును, ఊర్లో జీవానంద శ్వామీజీ అనే ఒకరున్నారా?"

"ఉన్నారు...! మీకు ఆయన తెలుసా?"

"బాగా తెలుసు. హైదరాబాద్ ఔటర్లో ఉన్న గాంధీనగర్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సింహాద్రిని తెలియని శ్వామీజీలే ఉండరు"  

"అంటే మీరు శ్వామీజీలను వెతుక్కుంటూ వెలతరా?"

"అవును! నేను పరమ శివుడు భక్తుడ్ని. శ్వామీజీలంటే చాలా ఇష్టం. ఇక్కడ నేను కొనాలనుకుంటున్న మూడెకరాల స్థలం శ్వామీజీ చెప్పబట్టే కొనడానికి వచ్చాను..."

"నాకు తెలియక అడుగుతున్నాన్ను...శ్వామీజీకి మతి చెలించిందా? ఒక శ్మశానాన్ని కొనమని చెబుతున్నారే...?"

"హైదరాబాదులో ఇలాంటి శ్మశానాలు కొన్నవారే రోజు కొటీశ్వరులుగా ఉన్నారు. స్థలాన్ని శుభ్రం చేసి...గుంతలు చేసి ఎముకలను తీసిపారేసి, వాస్తు దోషం పోవటానికి అక్కడొక యాగం చేస్తే సరిపోతుంది..."

"అదిసరేనండి...దానికి ఎందుకు అంత రేటు ఇవ్వాలి అని అడుగుతున్నా?"

క్రిష్ణారావు అసలు పాయింటు పట్టుకున్నాడు. కానీ, లావుపాటి మనిషి ప్రశ్నకు మాత్రం జవాబు చెప్పలేదు. వాళ్ళతో ఇంకేమీ మాట్లాడటానికి లేకపోయేసరికి వ్యక్తి కారు ఎక్కి...శ్వామీజీని చూడటానికి వెళ్ళిపోయాడు.

                  ***************************************PART-3*****************************

విశాలపురం గ్రామం

రాయిని తీసి, రాయి క్రింద ఉన్న గుంతలోకి చూసినప్పుడు క్రింద మంచం లాంటి ఒక మట్టి దిబ్బె ఉండటం చూసి మేస్త్రీకి చెందిన మనుష్యులు ఆశ్చర్యపోయారు.

"అయ్యా... రాయికి క్రింద ఒక మట్టిదిబ్బె ఉన్నది. అది ఆరడుగులు లోతులో ఉన్నది. అది పడగొడితేనే  మనం పునాది వేయగలం" 

"ఏదీ? నన్ను చూడనీ" అంటూ మేస్త్రీ గుంతలోకి చూశాడు. అతని ముఖంలోనూ ఆశ్చర్యం.

"ఏమిటి మేస్త్రీ...మట్టి దిబ్బే అంటున్నారుగా...మరైతే దానిమీదే పునాది వేయొచ్చుగా?"

"నాకెందుకో అది వట్టి మట్టి దిబ్బెలాగా కనబడటం లేదు... మట్టి దిబ్బె క్రింద ఇంకేదైనా ఉన్నదేమోనని అనుమానంగా ఉంది...అందుకని మట్టి దిబ్బెను జాగ్రత్తగా తవ్వి చూశేద్దాం"

"అలాగే చేయండి" చెప్పాడు అశోక వర్మ.

గుంతలో నుంచి మేస్త్రీతో పాటు నలుగురు క్రిందకు దిగారు. నలుగురూ నాలుగ పక్కలా నిదానంగా మటిదిబ్బెను తవ్వటం మొదలు పెట్టారు. రెండు అడుగులు తవ్విన తరువాత 'ఖంగుమని శబ్ధం వినబడింది. అక్కడ మరింత జాగ్రత్తగా తవ్వారు. ఆశ్చర్యం అక్కడ ఒక ఇనుప పెట్టి ఉన్నది. తాళం వేసుంది.

విషయాన్ని ఆశోక వర్మకు చెబుతూఅయ్యా...చూస్తుంటే అది దేవుడి పెట్టె లాగా కనబడుతోంది.. ఈశాన్య మూల ఉన్నదంటే  అదే అయ్యుంటుంది. ... పెట్టెలో ఏముందో చూడాలి      

"దేవుడి పెట్టె అని ఎలా చెబుతున్నావు?"

"పెట్టె మీద త్రిశూలం బొమ్మ వేసుంది. దేవుడి విగ్రహమో లేక ఆభరణాలో అయ్యుంటుంది" 

అశోకవర్మకు చెమటలు పట్టటం మొదలయ్యింది. 'గుడి కడదామనుకున్నాం. విషయం ఇంకోమాదిరిగా మారుతోంది' తనలో తానే మాట్లాడుకుంటూ మేస్త్రి మాటలకోసం ఎదురు చూశారు. కొద్ది నిమిషాలు గడిచినై. మేస్త్రీ దగ్గర నుండి సమాధానం రాలేదు. 

"మేస్త్రీ ఏమిటి ఆలశ్యం?" అశోకవర్మ గారే అడిగారు.  

"తాళం పగలకొట్టటానికి కుదరటం లేదండి. పెట్టెను పైకి తీసుకు వచ్చి ఇంకేదైనా వస్తువుతో పగలకొట్టాలి"

పైకా? పెట్టెను ఎలా పైకి తెస్తారు?"

పెట్టెకు పైన ఒక పిడి ఉందండి. దానికి తాడు కట్టి పైకి లాగొచ్చు"

"మరైతే అలాగే కానివ్వండి".

పెద్ద తాడు వచ్చింది.

తాడును పెట్టె పిడికి గట్టిగా కట్టి పెట్టెను పైకి లాగారు.

పెట్టెను తెరవటానికి వాళ్ళ దగ్గరున్న ఆయుధాలన్నింటినీ ఉపయోగించారు. ఎన్నో సంవత్సారాలుగా తెరవని పెట్టె కాబోలు, ఒక పట్టాన రాలేదు. అందరికీ చెమటలు కారుతున్నాయి. చివరికి ఒక గొడ్డలితో నలుగురూ నాలుగుసార్లు కొట్టినప్పుడు తాళం తెరుచుకుంది. పెట్టెను తెరిచి చూసినప్పుడు.....

                                                  ****************************************

విశాలపురం టౌన్ 

 "టక...టక...!"

తలుపు ఎవరో కొడుతున్నారు...పరమేశ్వర్ గారు తెరిచారు.

ఎదురుగా కోటేశ్వరరావ్!

"ఎవరయ్యా లావుపాటి వ్యక్తి...మీ శ్మశాన స్థలాన్ని కొనడానికి వచ్చినట్లు తెలుస్తోంది?"

కోటేశ్వరరావ్ నేరుగా విషయానికి వచ్చాడు. అలాగే పరమేశ్వర్ ఆహ్వానం లేకుండానే ఆయన ఇంటిలోపలకు ప్రవేశించి హాలులోని కుర్చీలో కూర్చున్నాడు. అతని ధోరణిలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు.

కోటేశ్వరరావ్ కొంత గొడవ పెట్టుకునే మనిషి.

ఉర్లో వున్న అందరి ఇళ్ళలోని విషయాలు కొంతవరకు తెలుసు. అందుకని కోటేశ్వరరావ్ అంటే పరమేశ్వర్ గారికి ఒక చిన్న భయం. భయం పరమేశ్వర్ గారి ముఖంలోనూ కనపడ్డది.

"ఏమిటి పరమేశ్వర్... నేను అడిగినదానికి సమాధానమే చెప్పలేదు?"

"ఏం చెప్పమంటారు అంకుల్...? ‘ప్రాణాలు కావాలంటే వదిలేయండి. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ స్థలాన్ని మాత్రం ఎవరికీ అమ్మొద్దుఅని మా నాన్నగారూ, అమ్మగారూ చెప్పి చనిపోయారనేదే కారణం. ఇదంతా లావుపాటి ఆయనకు చెప్పదలుచుకోలేదు. అందుకే....స్థలం అమ్మటం ఇష్టంలేదు, మీరు వెళ్ళచ్చు అని చెప్పాను" 

"అమ్మకీ, నాన్నకీ  ఇలాగేనా గౌరవం ఇచ్చేది! లావు మనిషి కోటి రూపాయలదాకా ఇస్తానంటున్నాడే...?"

మీరు నా దగ్గర ఇంకేమీ మాట్లాడకండి! మీ వయసుకు మర్యాద ఇచ్చి...ఏది కారణమో దాన్ని మీ దగ్గర చెప్పేశాను. అంతకు మించి నన్నేమీ అడగకండి"

పరమేశ్వర్ గారి ముఖం, చెంపలు రంగు మారినై.

కోటేశ్వరరావ్ కోపంగా చూసుకుంటూ వెళ్ళిపొయాడు.

వాకిలి దాటిని కోటేశ్వరరావ్ తిరిగి పరమేశ్వర్ గారి ఇంటి లోపలకు వచ్చాడు. 

" లావుపాటి మనిషి శ్వామీజీని చూడటానికి వెళ్ళాడు. శ్వామీజీ నిన్ను పిలిచి స్థలాన్ని అమ్మేయి అంటే నువ్వేం చేస్తావ్?"

నేను కొలుస్తున్న ఏడుకోండలవాడే వచ్చి చెప్పినా నేను వినను. ఎందుకంటే...ఆయన మాట కన్నా నాకు నా తల్లితండ్రుల మాటే ఎక్కువ  

కోటేశ్వరరావ్ కి చెప్పుతో కొట్టినట్టు అనిపించింది. అప్పుడే పరమేశ్వర్ గారి ల్యాండ్ లైన్ ఫోన్ మోగింది.

చెవులు పెద్దవి చేసుకున్నాడు కోటేశ్వరరావ్.

"ఆశీర్వాదం పరమేశ్వర్! నేను శ్వామీజీ మాట్లాడుతున్నాను. శివ కటాక్షంతో అన్నీ బాగానే జరుగుతాయి ...ఇప్పుడు నాకు బాగా కావలసినవాడు,  సింహాద్రి అనే అతను మీ స్థలం విషయంగా నిన్ను కలిశాడుట. నువ్వు అమ్మనన్నావట?"

"అవును శ్వామీజీ! ఇప్పుడే కోటేశ్వరరావ్ అంకులు కూడా స్థలాన్ని అమ్మితే ఏమైంది నీకు అని అడిగారు. నేను కొలుస్తున్న శ్రీనివాసుడే వచ్చి చెప్పినా, మా పెద్దల ఆశ ప్రకారం స్థలాన్ని నేనే ఉంచుకుంటాను అని చెప్పాను. మీకూ అదే సమాధనం. మరొకసారి చెప్పాల్సిన అవసరం ఉండదిని అనుకుంటున్నాను" అని శ్వామీజీకి సరైన సమాధానం చెప్పారు పరమేశ్వర్ గారు.  

 పరమేశ్వర్ గారితో ఇంతకంటే మాట్లాడటానికి ఏమీలేదని నిర్ణయించుకున్న శ్వామీజీ ఫోను పెట్టాశారు.

గుమ్మం దగ్గరే నిలబడి వీళ్ళ మాటలను వింటున్న కోటేశ్వరరావ్ నిరాసతో వెనుతిరిగి వాకిటి గుమ్మం దాటేటప్పుడు 'కొరియర్  పోస్ట్ వచ్చింది. కొరియర్ పోస్ట్ తెచ్చిన అతన్ని ఒక సారి క్రిందకూ, పైకి చూసి కోటేశ్వరరావు వెళ్ళిపోయారు.

పరిగెత్తుకెళ్ళి సంతకం పెట్టి కొరియర్ తీసుకున్నారు పరమేశ్వర్ గారు.

కొరియర్ మీదున్న ఫ్రమ్ అడ్రెస్స్ చూసిన వెంటనే అది హైదరాబాదులో ఉంటున్న తన కూతురు తులసి దగ్గర నుండి అని తెలుసుకున్నారు.

పరమేశ్వర్ గారి భార్య మీనాక్షి కూడా ఆశతో  దగ్గరకు వచ్చింది.

"ఎవరండి...తులసియేనా?" 

"అవును మీనాక్షీ"

"అలాగే గట్టిగా చదవండి...నేనూ వింటాను"

"నీ కూతురు ఇంకా పాతకాలంలోనే ఉన్నది అనుకుంటే...నువ్వు కూడా అలాగే ఉన్నావే?" అంటూ చదవటం మొదలుపెట్టారు.

'మై డియర్ మమ్మీ-డాడీ... 

ప్రేమ ముద్దులు!

ఇక్కడ నా 'ట్రైనింగ్' ముగిసింది. 'డ్యూటీ'లో చేరడానికి ఆర్డర్ ఇచ్చేశారు. మధ్యలో ఒక రోజు కూడా 'లీవ్' లేదు.

నాకు 'క్రియేటివ్ అసిస్టంట్' పోస్టింగ్ వేశారు. అన్ని అలవన్స్ తో కలిపి నలభై వేల రూపాయలు జీతం వస్తుంది. మొదటి నెల జీతం తీసుకున్న వెంటనే అది తీసుకుని వస్తాను. మన కులదైవమైన పార్వతీపురంలోని వెంకటేశ్వర స్వామి కి అభిషేకం చేయించి, మీరు చెప్పినట్లు మొదటి జీతం డబ్బును హుండీలో వేశేద్దాం.

నవీన యుగంలో ఇలా నేను ఉత్తరం రాయటానికి కారణం ఉన్నది. 'సెల్ ఫోన్లోమాట్లాడితే... నిమిషాలతో నా మాటలు ముగిస్తాయి. ఉత్తరం అంటే అలా కాదు. అమ్మకి నా జ్ఞాపకము వచ్చినప్పుడల్లా తీసి చదువుకోవచ్చు. ఎక్కువ ఖర్చూ లేదు. అంతేకాదు, ఉత్తరాలు ఆలొచనలను లోతుగా పంచుకోవటానికి సరైనవి.

'సెల్ ఫోన్పరమ 'వేస్టు’ ! ఇది వ్యాపార లావాదేవీలు మాట్లాడుకొవటానికే ఉపయోగపడుతుంది మరియు దీనివలన నష్టం జరుగుతోంది. నాతో పనిచేస్తున్న ఒక అమ్మాయి చాలా పాపం. 'హాస్టల్లొఆమె స్నానం చేస్తున్నప్పుడు ఎవరో దొంగతనంగా 'సెల్ ఫోన్లో' వీడియో తీశారు. అది చూపి డబ్బు గుంజటానికి ప్రయత్నించారు. తరువాత నేనే ఆమెకు ధైర్యం చెప్పి, పోలీసులకు కంప్లైంట్ చేసి...వీడియో తీసిన అతన్ని పట్టుకోవటానికి సహాయపడ్డాను. వాడు ఏడేళ్ళ వరకు బయటకు రాలేడు. అలా చాలా బలమైన నేరారోపణలను రిజిస్టర్ చేశాము.

ఇది చదివేసి నా గురించి అనవసరంగా కంగారు పడకండి. నేను జాగ్రత్తగానూ, రక్షణగానూ ఉన్నాను...ఉంటాను.

కారణం, నేను మీ కూతుర్ని.

నన్ను ఎవరూ, ఏమీ చేయలేరు.

నాకు పార్వతీపురం వెంకటేశ్వర స్వామి తోడు ఉంది.

విపూది పెట్టుకోకుండా ఆఫీసుకు వెళ్ళను. దీనివలన నా సహ ఉద్యోగులు, స్నేహితులూ నన్ను  ఎగతాలిగా  'తులసి మాతాజీ'  అని పిలుస్తారు. వాళ్ళ ఎగతాలి నాకు సంతోషాన్నే ఇస్తోంది.

నాన్నా! నువ్వు కాఫీలో పంచదార వేసుకోకు. అమ్మా...నువ్వు రోజూ మోకాళ్ళు మడిచి వ్యాయామం చెయ్యి. అప్పుడే నీకు మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటుంది.

నాన్నా... ఉత్తరం చేరినట్లు నాకు ఫోన్ చేయండి. ఫోనులో దీని గురించి ఐదు నిమిషాలు మాట్లాడితే...నిజానికి అదే ఆనందం !

ఇట్లు.

ప్రేమతో.

మీ తులసి.

                ***********************************PART-4********************************

ఆ పొడువాటి ఉత్తరాన్ని చదివిన పరమేశ్వర్ గారికి చాలా సంతోషంగానూ, తృప్తిగానూ అనిపించింది. తులసి తెలివితేటలు, ఆలొచనలు ఆయనకి కొండంత ధైర్యానిచ్చింది.

తల్లి మీనాక్షి కళ్లల్లో నీళ్ళు జేరాయి.

"ఏమండి.... వెంటనే దానికి ఫోన్ చేయండి. దాని గొంతు వినాలి..."

ఉండు మీనాక్షీ...నీలోని ఆతృత కొంచం తగ్గనీ! ఈపాటికి ఉత్తరం దొరికి...మనం చదువుతున్నట్లుగా ఊహించుకుంటూ ఉంటుంది తులసి. ఆదే ఆలొచనతో మన ఫోను కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ, మనం వెంటనే ఫోన్ చేయకూడదు. కొంచం దాన్ని ఏడిపిద్దాం"

"ఏమిటండి మీరు...అది చిన్న పిల్ల! దాన్నిపోయి ఏడిపించడం?" ఎప్పుడెప్పుడు ఆటలు ఆడాలో తెలియదా?.

"మన పిల్ల దగ్గర మనం ఆడకపోతే ఇంకేవరు ఆడతారు"

"వద్దండీ అది తట్టుకోలేదు"

"అరె...దానికోసం నువ్వెందుకు ఏడవటం? ఏదో సరదాకోసం చెప్పాను. దానికొసం అంత సీరియస్ అవ్వాలా?"

మరేమిటండి...మనల్ని విడిచిపెట్టి అది ఒకత్తిగా ఉంటోంది. హోటల్ భోజనం. ఎవరి చేతి వంటోనో తింటూ అఫీసు పనులు చేసుకుంటోంది...దానికి మన ఆలొచనలే సుఖాన్నీ, తృప్తిని ఇస్తాయి"

"దానికి మాత్రమేనా...మనకి కూడా కదా?”

"మాట్లాడుతూనే ఉన్నారు గానీ ఫోన్ చెయటం లేదు....ఫోన్ చెయ్యండి"

"నేను ఫోను చేసి ఇవ్వకపోతే...రైలెక్కి మీ అమ్మాయిని చూడటానికి నేరుగా వెళ్ళిపోతావనుకుంటా?"

"ఖచ్చితంగా...అలాగనుక నేను వెలితే, నా బంగారు తల్లికి నాలుగురోజులు నా చేత్తో వండిపెడతా"

"పిచ్చిదానా! దానికి నువ్వు ఇప్పుడే రెడీ అవ్వు. నేనూ నీతో వస్తాను. ఇద్దరం మన కూతురి ముందు వెళ్ళి నిలబడదాం"

"నిజంగా చెబుతున్నారా?......సరే...ఫోన్?"

"అరే, మనం నేరుగా వెల్తున్నాం కదా?"

"మనం వెళ్ళటానికి ఎలాగూ ఏడెనిమిది గంటలు పడుతుంది. ఈలోపు మన దగ్గర నుండి ఫోన్ రాలేదే నని తులసి కంగారుపడుతుందే?"

"బాగా కంగారు పడని"

"సరే! మనం ఫోను చేయకపోతేనేం...అదెలాగూ చేస్తుంది"

"అదేమీ కుదరదు. నా సెల్ ఫోన్ 'ఆఫ్' చేసేశ్తాను"

"ఏమిటండి మీరు? తిరిగి తిరిగి మీ దారిలోకే వెలుతున్నారు"

నేను ప్రేమను చేరుస్తున్నాను. మనకి ఫోన్ చేసి స్విచ్డ్ ఆఫ్ అని వచ్చి తులసి కంగారుపడుతూంటే దాని ఎదురుగా వెళ్ళి నిలబడతాం. అప్పుడు తులసికి ఎలా ఉంటుందో ఊహించుకో"

"దాన్ని కంగారు పెట్టి దాని ఎదురుగా నిలబడటం? ఏమిటండీ మీ ఆటలు? ఫోన్ చేసి ఇద్దరమూ బయలుదేరి వస్తున్నాము అంటే... మాట ఎంత సంతోషం ఇస్తుందో తెలుసా?"

మీనాక్షి...నీ ప్రేమకు ఒక హద్దు లేదుఏప్పుడూ నువ్వొక విషయాన్ని మరిచిపోయే మాట్లాడతావు. మనకు వయసు పైబడుతోందిమనం మన జీవితాంతం దానితో ఉండగలమా?”   

"మీరేం మాట్లాడుతున్నారు? మీ మాటలు నాకేమీ అర్ధంకావటంలేదు"

పిచ్చిదానా...కలిసి ఉండేటట్లే...విడిపోయి ఉండటం కూడా నేర్చుకోవాలి. ఒకవేల మన జీవితం ముగిసి మనం వెళ్ళి జేరిపోతే, మన అమ్మాయి భయపడి నిలబడిపోకూడదు. ధైరంగా తన దారిలో తాను ఎదుగుతూ ముందుకు వెళ్ళిపోవాలి. దానికి ఇదంతా ఒక ట్రైనింగ్ "

పరమేశ్వర్ గారు తన వాదనను న్యాయపరిచాడు.

మీనాక్షి మాత్రం చివరివరకు భర్త మాటలను అంగీకరంచలేదు. భర్తకు తెలియకుండా రహస్యంగా కూతురుకి ఫోన్ చేయాలని నిర్ణయించుకుంది.

తులసి 'సెల్ ఫోన్నాట్ రీచబుల్ అనే వస్తోంది!

                                                     ************************************

విశాలపురం గ్రామం

పెట్టెను తెరిచి చూసినప్పుడు.....

అందులో ఒక విగ్రహం పడుకోబెట్టబడి ఉంది. పెట్టెలోని విగ్రహం నిటారుగా పడుకుని ఆకాశాన్ని చూస్తోంది. చాలా కాలంగా విగ్రహం పెట్టెలోనే ఉండటం వలన అది మట్టితో మూసుకుపోయుంది. మంచి గుడ్డతో విగ్రహం పైన ఉన్న మట్టిని తుడిచారు. అప్పుడు విగ్రహం పై పడిన వెలుతురులో విగ్రహం కాంతితో వెలిగిపోయింది. అది ఒక దేవత విగ్రహం. దేవతో తెలియటం లేదు. మూడడుగుల వెడల్పు, ఐదడుగుల ఎత్తు ఉన్నది. ఒక చేతిలో చేతి నిండుగా ఆయుధాలు! ఇంకొకక చేతిలో ఒక చిన్న కత్తి మాత్రమే ఉన్నది.   

మేస్త్రీ, మెస్త్రీ మనుష్యులు, అశోక్ వర్మ, ఆయన భార్య శేషమాంబ విగ్రహం ను చూసి విస్తుపోయారు.

"అయ్యగారూ...దేవుని విగ్రహం"

"చూస్తే అలాగే ఉన్నది. కానీ ఎందుకు విగ్రహం ను పెట్టెలో పెట్టి తాళం వేశారో తెలియటం లేదు" చెప్పాడు మేస్త్రీతో ఉన్న ఇంకో వ్యక్తి.

"ఇప్పుడేం చెయ్యాలయ్యా?"

"ఏంచేయాలో నాకూ తెలియటం లేదు"

"ఏమండి మన ఊరి చివర్లో ఉన్న కొండ మీద నివసిస్తున్న ఆత్మానంద శ్వామీజి ని కలిసి విషయం చెప్పి వివరాలు ఆయన్ను అడుగుదామా?" శేషమాంబ సలహా ఇచ్చింది.

"ఇలాంటి విషయాలను అడగటానికి శ్వామీజీయే సరైన వ్యక్తి. అలాగే చేయండి! ప్రస్తుతానికి విగ్రహం ను పెట్టలోనే పెట్టి గుంత పైనే ఉంచుదాం. ఆత్మానంద శ్వామీజీ గారు వచ్చి చూసిన తరువాత ఆయన ఎలా చెబితే అలా చేద్దాంఅని చెప్పి తన పనిని వాయిదా వేశాడు మేస్త్రి

అశోక వర్మ లో ఆదుర్దా కనబడుతోంది. మేస్త్రీ గుంపు వెళ్ళిపోయాక....శేషమాంబ అడిగింది.

"ఏమండి...ఏమిటండి ఇదంతా? మంచికా...చెడుకా?"

"అదే శేషూ నాకూ అర్ధం కావట్లేదు. ఇది దన్నం పెట్టుకో వలసిన  విగ్రహమా...లేక ఇలా భూమిలోపలే ఉండాల్సిన విగ్రహమా?...తెలియటం లేదు"

"సరే రండి...ఇప్పుడే కొండపైకి వెడదాం"

"ఇప్పుడు మనకు అదొక్కటే దారి" అని చెప్పి, బయలుదేరటానికి ముందు ఇంట్లో ఉన్న చెక్క పలకలను తీసుకుని గుంతను మూయడానికి ప్రయత్నించాడు. కుదరలేదు. ఈలోపు విషయం తెలుసుకున్న ఊరి ప్రజలు అక్కడకు రావటం మొదలు పెట్టారు.

                                                     *********************************

విశాలపురం టౌన్

పరమేశ్వర్ గారు, ఆయన భార్య మీనాక్షీ నాలుగురోడ్ల కూడలిలో ఉన్న బస్ స్టాండుకు వచ్చారు. బయట ఉర్లకు వెళ్ళే బస్సులు ఆగే చోటుకు వెళ్ళి నిలబడ్డారు.

తుపాకీలో నుంచి బుల్లెట్లు దూసుకు వెడుతున్నట్టు నాలుగురోడ్ల రహదారి మీద వాహనాలు దూసుకు వెడుతున్నాయి. భార్య మీనాక్షి ముఖం వాడిపోయుండడం గమనించారు పరమేశ్వర్ గారు. అలా ఎందుకుందో ఆయనకు అర్ధమైంది

"మీనాక్షీ...నీ కూతురితో మాట్లాడ దలుచుకుంటే మాట్లాడు" అంటూ సెల్ ఫోన్ ఆమె చేతిలో పెట్టాడు. ఆమే ఫోన్ చేసింది.

"నాట్ రీచబుల్ అనే వస్తోంది..."

"అంటే తులసి సిగ్నల్ దొరకని చోట ఉండుంటుంది

"అదెలాగండీ...మన టౌన్ లోనే సిగ్నల్ దొరుకుతున్నప్పుడు...అంత పెద్ద నగరంలో సిగ్నల్ దొర్కకుండా పోతుందా?"

"కోపగించుకోకు...! కొన్ని సమయాలలో సిగ్నల్  టవర్ కుపవర్ కట్ఏర్పడుతుంది. మన దేశంలోపవర్ కట్లేని ఊరే లేదే?"

పరమేశ్వర్ గారి మాటలు ఆమెకు తృప్తినివ్వలేదు. ఆమెకు తులసితో మాట్లాడితేనే మనసుకు ఊరట కలిగేటట్టు ఉంది.

సమయంలొనే వాళ్ళు ఎక్కవలసిన హైదరాబాద్ బస్సు అటువైపు వచ్చింది. కానీ అక్కడ ఆగకుండానే వెళ్ళిపోయింది. మరో రెండు బస్సులు కూడా ఆగకుండా వెళ్ళిపోయినై.

"ఏమిటండీ ఇది! బస్సులు చూస్తే ఖాలీగానే ఉన్నాయికానీ ఒక బస్సు కూడా ఆగటం లేదు"

బస్సులన్నీ నగరంలో వారికే కాబోలు"

"మనం కూడా టాక్స్ కడుతున్నాముగా?"

మనమెంత కడుతున్నాం....వాళ్ళలాగా వేలు కాదుగా. కొంచంగా కడుతున్నాం"

"మీరు ప్రభుత్వానికి ఆదరణగా మాట్లాడుతున్నారా లేక ఎదిరించి మాట్లాడుతున్నారా?

"నేను న్యాయాన్ని మాట్లాడుతున్నాను! నీకెలా తీసుకోవాలనిపిస్తే అలా తీసుకో. నగర జీవితంలో కొంత చెడు, కొంత మంచి ఉన్నది. టౌన్ జీవితంలోనూ అంతే!" 

"ఎందుకిలా ఏమిటేమిటో మాట్లాడుతున్నారు...ఇంతవరకు బాగానే ఉన్నారుగా?"

"ఏం చేయను...బస్సు దొరికేంత వరకు మనకు టైము గడవాలిగా?"

పరమేశ్వర్ గారు సరదాగా చెబుతుంటే, వాళ్ళని రాసుకుంటూ ఒక కారు వచ్చి నిలబడింది.

కారు అద్దాలు గబుక్కున దిగినై.

కారులో ఉన్న అతని ముఖం కనబడింది...అంతకు ముందు పరమేశ్వర్ గారి ఇంటికి వచ్చిన లావుపాటి మనిషి.

"హలో ప్రొఫసర్..." అన్నాడు.

పరమేశ్వర్ గారికి అతన్ని చూడటానికి ఇష్టం లేదు.

తల తిప్పుకున్నాడు.

"ప్రొఫసర్...మిమ్మల్నే! ఎక్కడికి బయలుదేరారు?"

"అది మీకెందుకు?"

కోపగించుకోకండి....మీరి చెప్పక పోయినా నాకు అర్ధమవుతోంది. మీరు నిలబడున్న చోటు చూస్తేనే మీరు హైదరాబాద్ వెడుతున్నారని. నేనూ హైదరాబాద్ కే వెల్తున్నాను. ఎక్కండి. హైదరాబాద్ లో ఎక్కడ దిగాలో చెప్పండి"

"చాల ధ్యాంక్స్! మేము బస్సులోనే వెలతాం"

"ఏమిటి ప్రొఫసర్...నన్ను మీ జన్మ విరొధిని చూసినట్లు చూస్తున్నారు. నేను చాలా మంచివాడిని"

"ఇప్పుడు మీరు కొంచం నోరు మూసుకుంటారా?"---పరమేశ్వర్ గారు కొపంగా అరిచారు.

ఇంక ఏమీ మాట్లాడకుండా అతను కూడా అక్కడి నుండి బయలుదేరాడు.

వెనకాలే ఇంకొక కారు! చూసిన వెంటనే అదొక ట్రావల్స్ కారు అని తెలుస్తోంది. కారు కూడా పరమేశ్వర్ గారిని ఆనుకుంటూ నిలబడ్డది.

                *************************************PART-5*******************************

లోపల నుండి డ్రైవర్ మాట్లాడాడు.

"సార్...వస్తారా? కారు హైదరాబద్ వరకు వెడుతోంది"

"లేదయ్యా...మేము బస్సులోనే వెల్తాం"

"సార్...బస్సు చార్జీ ఎంతో అంతే డబ్బులు ఇవ్వండి"

పరమేశ్వర్ గారు ఆలొచనలో పడ్డారు.

"ఏమండీ...వెల్దామండి..." అన్నది భార్య మీనాక్షి.

సరేనయ్యా...కానీ ఒక కండిషన్! వెళ్ళే దారిలో ఇంకెవరినీ ఎక్కించుకోకూడదు"

"అలాగైతే ఒక వందరూపాయలు చేర్చి ఇవ్వండి సార్"

"ఇప్పుడే కదా బస్సు చార్జీ డబ్బులు ఇస్తే చాలన్నావు?"

"డీజల్ ఖరీదు గురించి కొంచం ఆలొచించండి సార్"

"ఇలా చూడయ్యా... డీజల్ ఖరీదులు నీకు మాత్రమే కాదు; నాక్కూడా!"

"సరే సార్...మీ ఇష్టమైనట్టే ఇవ్వండి...ఎక్కండి"

డ్రైవర్ కారు దిగి, వెనుక డిక్కీ ఓపన్ చేశాడు.

వాళ్ళ సూట్ కేసులను అందులో పెట్టి, డిక్కీ మూశాడు.

వాళ్ళు వెనుక సీటులో ఎక్కి కూర్చున్నారు.

మీనాక్షికి కి ఉత్సాహంగా ఉంది.

డ్రైవర్ .సి ఆన్ చేసి, సి.డి పెట్టి పాటలు ఆన్ చేశాడు.

"డ్రైవర్...పాట ఆపు! నాకు సినిమా పాటలంటేనే ఇస్టం లేదు" అన్నారు పరమేశ్వర్ గారు.

డ్రైవర్ పాటలు ఆపాడు.

"ఏమండి ఇప్పుడు ఫోన్ చేసి చూడండి. తులసి లైన్ దొరుకుతుందేమో..."

పరమేశ్వర్ గారు ఫోన్ చేసి చూశారు. లైన్ దొరకలేదు.

ఇంతలో టోల్ గేట్ వచ్చింది.

విసుగ్గా డబ్బులు అందించాడు డ్రైవర్. రసీదు తీసుకుంటూ "సరైన దోపిడీ దారులు సార్ వీళ్ళు....రోడ్డువేసి దాన్ని మైన్ టైన్  చేయాల్సిన బధ్యత ప్రభుత్వానిది! ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని సంపాదిస్తున్నది కాంట్రాక్టర్లు" తన కోపాన్ని కక్కాడు.  పరమేశ్వర్ గారు నవ్వుకున్నారు.   

"కరెక్టుగా చెప్పావయ్యా...నా ఊరికి నేను రావటానికి వీడి దగ్గర రోజూ అనుమతి అడగాల్సి వస్తోంది. దారికి అడ్డుపడి కూర్చుని మరీ ప్రాణం తీస్తున్నారు. బాధ్యత కోసం కొద్ది డబ్బులు తీసుకుంటే పరవాలేదు. వందల లెక్కలో టాక్స్ వేసి కొల్ల గొడుతున్నారు. నిజానికి రోడ్డు వేయటానికి ఎంత ఖర్చు పెట్టారు?...దాన్ని 'రికవర్ చేయడానికి టోల్ గేట్ టాక్స్ కలక్షన్ సరైన పద్దతేనా? అని నాలో చాలా ప్రశ్నలు ఉన్నాయి….కొన్ని టోల్ గేట్ లలో పది పదిహేను సంవత్సరాలుగా టోల్ వసూలు చేస్తున్నారు. ప్రజలు విప్లవంతో ఎదురు ప్రశ్న వేస్తే గానీ వీళ్ళు మారరు"

డ్రైవర్ ఒక సారి తిరిగి చూసి నవ్వాడు.

పరమేశ్వర్ గారు కూతురు తులసికి మళ్ళీ ఫోన్ చేశాడు. మంచికాలం సారి కనెక్షన్ దొరికింది.

"తులసీ..."

"నాన్నా..."

"ఏంటమ్మాయ్...నీ లైన్ దొరకటమే కష్టంగా ఉన్నది"

"నేను ఏం.డి రూములో మీటింగులో ఉన్నాను. అక్కడ సెల్ ఫోన్ వర్క్ చేయదు. జామర్ ఉన్నది..."

"అదా సంగతీ!  'బై బై'...నీ ఉత్తరం అందింది. బాగా రాసావమ్మా!"

"ధ్యాంక్స్ నాన్నా! మీ ఫోను కోసమే రూము బయటకు వచ్చాను...వెంటనే మీ దగ్గర నుండి కాల్ వచ్చింది"

"కొంచం ఉండమ్మా మీ అమ్మ మాట్లాడాలట..." అంటూ పరమేశ్వర్ గారు ఫోనును భార్యకు ఇస్తూ మనం కారులో వస్తున్నట్టు చెప్పకు... సస్పెన్స్ గా వెళ్ళి నిలబడదాం" అన్నాడు.

అవేమీ పట్టించుకోకుండా సెల్ ఫోన్ తీసుకుని "తులసీ" అన్నది మీనాక్షి.

"అమ్మా...వచ్చే నెల కచ్చితంగా నిన్ను కలుస్తానమ్మా"

"ఎలా ఉన్నావురా?"

"నాకేమమ్మా...బాగున్నాను! కానీ, భోజనానికే కష్టంగా ఉన్నది. నేను తింటున్న మెస్ లో రాఘవులు అనే ఒకాయన వంటాయనగా ఉంటున్నాడు. ఆయనకి ప్రపంచంలోనే చాలా ప్రియమైనది గుమ్మడి కాయ. రోజూ దానితోనే సాంబార్, అలాగే బీట్రూట్ కూర. ఎందుకంటే కూరగాయల మార్కెట్టులో రెండు కూరలే చౌకగా దొరుకుతాయి...అందుకే"

"అలాగైతే నీ నాలుక చచ్చిపోయిందని చెప్పు"

"అది చచ్చి...దాన్ని పూడ్చి కొన్ని నెలలవుతోంది. ఇప్పుడు నేను అద్దెకు తీసుకున్న నాలుకతో మాట్లాడుతున్నా" పకపక నవ్వింది తులసి.

మీనాక్షీకి కళ్ళల్లో నీళ్ళుతిరిగినై. పెదవులదాకా వచ్చిన 'మేము వస్తున్నామమ్మా' మాటను బలవంతంగా ఆపుకుంది.

"ఊర్లో వర్షాలు ఏమైనా పడ్డాయా?"

"వర్షాలా....గిర్షాలా! ఊరి ప్రజలందరూ కలిసి ఏడిస్తే...కళ్ళల్లో నీళ్ళొచ్చి, అందులో నాలుగు చుక్కలు నేలమీద పడితేనే"

"ఊరి కోలనులో నీళ్ళున్నయ్యా...ఎండిపోయిందా?"

ఏవో కొంచంగా ఉన్నాయి. పవర్ కట్టేనమ్మా ప్రాణం తీస్తోంది. పనిచేయకపోయినా ఎండల వేడికి, చెమటకు టయర్డ్ అయిపోతున్నాం"

"ఇక్కడ నాకు ఆఫీసులో .సి ఉందమ్మా...కానీ రూములో చాలా కష్టం"

"హాస్టల్లొ కాకుండా పోనీ వేరుగా ఇల్లు తీసుకుని ఉండొచ్చుగా

అద్దె పది నుండి పేన్నెండు వేల దాకా పెట్టాలమ్మా. వచ్చే జీతంలో సగం డబ్బు అద్దెకే కట్టేస్తే ఎలాగమ్మా?"

"అందుకని ఇలాగే ఎన్ని రోజులు కష్టపడతావు"

"నా జీతంతో ఇల్లు కొనుక్కునేంతవరకు సహించుకోవాలమ్మా" 

"దాని కంతా యొగం కావాలమ్మా. మనకని ఉన్న స్థలాన్నే మనం ఉపయోగించుకోలేకపోతున్నాము..."

"నేనూ అడగాలనే అనుకున్నాను! దాన్ని ఉంచుకోవటం కంటే ఎవరికైనా ఆమ్మేస్తే పొతుందిగా అమ్మా..."

అదెందుకు అడుగుతావ్... రోజు కూడా స్థలం కొనడానికి ఒకరొచ్చారు..."---మీనాక్షి స్థలం గురించి మాట్లాడటం మొదలుపెట్టినప్పుడే విశాద సంఘటన చోటు చేసుకుంది.

వెగంగా వెడుతున్న వాళ్ళ కారు మీద...'బ్రేక్' పట్టని లారీ ఒకటి అత్యంత వేగంతో ఢీ కొట్టింది. శబ్ధాన్ని సెల్ ఫోన్ మూలం తన చెవిలో విన్న తులసి మనసు తునకలయ్యింది...తల్లి చేతిలోని సెల్  ఫోన్ లాగానే ?       

విశాలపురం గ్రామం

ఊరుఊరంతా విగ్రహం గురించిన గుసగుసలే.

విగ్రహాన్ని చూడటానికి జనం వస్తున్నారు, పోతున్నారు. ఊరి జనాన్ని ఆపలేమని తెలుసుకున్న అశోక వర్మ, శేషమాంబ దంపతులు శ్వామీజిని కలవడానికి బయలుదేరారు. అప్పుడు వాళ్ళ ఎదురుగా తొంబై ఏళ్ళ వృద్దుడు ఒకాయన గడ్డాన్ని తడుముకుంటూ వచ్చాడు. ఆయన్ను చూసి అశోక వర్మ దంపతులు ఆగారు.  దగ్గరుండి ఆయన్ను విగ్రహం దగ్గరకు తీసుకు వెళ్ళారు. 

ఆయన పెట్టె తెరిచి అందులో ఉన్న విగ్రహాన్ని చూశారు. చూసిన వెంటనే "అరె భగవంతుడా! ఇది ఊరు వదిలి వెళ్ళలేదా...ఇక్కడే పడుందా?" అనే ప్రశ్నలతో కొంచం పెద్దగానే  గొణుకున్నారు.

"ఆయ్యా...అయితే విగ్రహం గురించి మీకు తెలుసా?"

"ఎందుకు తెలియదు...బాగానే తెలుసు! ఇది తిష్టాదేవి విగ్రహం. అత్యంత శక్తి కలిగిన రసాయన విగ్రహం" అన్నారు.

"తిష్టాదేవి విగ్రహమా...నేను ఎప్పుడూ వినలేదే?"

"గుడిలో పెట్టి పూజిస్తూ ఉండుంటే అందరికీ తెలిసేది! కానీ,  12 శతాబ్ధమే ఊరు వదిలి వెళ్ళిపోయింది"

"మీరేం చెబుతున్నారో అర్ధం కావటం లేదు"

"మనం అమ్మవారిని, లక్ష్మీదేవిని, సరస్వతి దేవిని కొలుస్తున్నాం! కానీ రోజుల్లో....అంటే వెయ్యి సంవత్సరాలకు ముందు తిష్టాదేవే ఊరికి మహాలక్ష్మి. ఆవిడనే అందరూ కొలిచేవారు. ఈవిడకు పూజలు చేశేవారు, ప్రార్ధనలు చేశేవారు, కోరికలు కోరుకునే వారు స్వచ్చమైన మనసుతో ఈవిడకు పద్దతిగా పూజలు చేయాలి…..అలా కాకుండా కాలుష్య మనసుతో  ఆమె దగ్గరకు వచ్చిన వారు ఆమె కోపానికి గురి అయ్యి నాశనమైపోతారు. ఆవిడ ఎలాంటి అవినీతినీ సహించదు"

"ఏమిటేమిటో చెబుతున్నారే...?"

"నేను ఎక్కడ్రా చెబుతున్నాను? నేను విన్నది చెప్పాను. తిష్టాదేవి విగ్రహం ఊరి సరిహద్దులో ఉండేది. గుడి ఉండేది కాదు. ఎందుకంటే తిష్టాదేవికి ఆరుబైట ఉండటమే ఇష్టమట" 

"ఎందుకలా?"

"నాకెలా తెలుస్తుంది? కానీ, ఒక విషయం బాగా తెలుసు. ఈమెను ప్రార్ధన చేసే మనుష్యుల సంఖ్య క్రమంగా తగ్గుతూ...కొన్ని రోజులకు ఈమెను ప్రార్ధించేవారే కరువయ్యారు. ఒక పూజారి తప్ప. అంటే ఊరిలో అవినీతి పెరిగిపోయిందన్నమాట.

ఈమెను ప్రార్ధన చేయటం మానేసినప్పుడు ఊరే నాశనం అయ్యింది. కరువు, క్షామము, అనావృష్టి, దుర్భిక్షం. ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు కాదు....ఏకంగా పదమూడు సంవత్సరాలు. అన్ని సంవత్సరాలు వర్షమే కురవకపోతే ఏలా ఉంటుంది? పదమూడు సంవత్సరాల పూజరి ప్రార్ధనకు మెచ్చి ఆయనకు దర్శన మిచ్చి "నన్ను నిద్రా బంగిమలో ఉంచితే, అంటే నన్ను కొలవకపోతే నా కోపాగ్ని నుండి మానవులు తప్పించు కుంటారు" అని చెప్పిందట. పూజారి ఆమెను నిద్రా బంగిమలో ఉంచిన తరువాతే మళ్ళీ ఊరు మామూలు స్థితికి వచ్చింది. కానీ ఏమి ప్రయోజనం ఎటుచూసినా అవినీతి, మోసం, కుట్ర నేరాలూ పెరిగిపోయేయి. ఆవిడే గనుక ఉండుంటే మన ఊరే కాదు, మన దేశమే బాగుపడేది" "

పెద్దాయన చెప్పింది విన్న అశోక వర్మ, శేషమాంబ నొరెళ్ళబెట్టారు.

పెద్దాయన చెప్పినదాంట్లో నమ్మలేని కొన్ని వార్తలు!

                                   ************************************

విశాలపురం టౌన్ 

నందిగామ ప్రభుత్వ వైద్యశాల.

పరమేశ్వర్ గారి ప్రాణం ఆయన్ని విడిచి వెళ్ళిపోయింది.

మీనాక్షి ప్రాణం ఊగిసలాడుతోంది.

హడావిడి పడుతూ వచ్చింది తులసి.

బంధువులు కూడా వచ్చి జేరేరు.

కొందరు పరిగెత్తుకుంటూ వచ్చి తులసిని కౌగలించుకుని ఏడ్చారు.

ఇంతవరకు దుఃఖం అంటే ఏమిటో తెలియకుండా పెరిగింది తులసి.

తులసి పుట్టిన దగ్గర నుండి బంధువులలొ కూడా ఎవరూ మరణించలేదు. అందుకని, దాని గురించో...దాని తాపం గురించో ఆమెకు కొంచం కూడా తెలియదు.   

తులసి తల్లి-తండ్రులను విడిచి ఉండటం, ఆమె ఉద్యోగానికని హైదరాబాద్ వచ్చినప్పుడే. నిజానికి చాలా కష్టమైన రోజులవి. తల్లి-తండ్రుల ఎడబాటును కొన్ని రోజులకే తట్టుకోలేక మధ్యరాత్రులలో లేచి  కూర్చుని ఏడుస్తున్నప్పుడు, పక్క మంచంలోని రూం మేట్ తులసిని గమనించి ఓదార్చేది.

 *********************************************PART-6*********************************

ఆడవారు పుట్టింటిని విడిపోవు బాధను అలవాటు చేసుకోవాలి. పెళ్ళి బంధం వాళ్ళను పూర్తిగా విడగొడుతుంది. తరువాత తల్లి-తండ్రులే మూడో మనిషి. తన భర్త, పిల్లలు, ఇల్లు అని జీవించాల్సింది వాళ్ళ జీవితమైపోతుంది. "దీన్నే మార్చాలి" అనేది తులసి

పరమేశ్వర్ గారు ఎప్పుడు పెళ్ళి మాటలు ఎత్తినా, 'నాన్నా...మిమ్మల్ని, అమ్మనీ నేను ఏరోజూ విడిచిపెట్టను. నన్ను పెళ్ళిచేసుకోవటానికి సమ్మతించేవారితో ఇదే చెబుతాను. ఒప్పుకుంటేనే పెళ్ళికి ఓకే చెబుతాను. లేకపోతే పెళ్ళే వద్దూఅని చెప్పేస్తుంది. పరమేశ్వర్ గారు నవ్వుతారు

"అమ్మా తల్లీ! ఏళ్ళతరబిడిగా వస్తున్న ఆచారాన్ని...ఒకేరోజులో మార్చేయాలని అనుకుంటున్నావ్! నీ ప్రేమను నేను అర్ధం చేసుకోగలను. ఇవన్నీ కొన్ని రోజులేనమ్మా. నువ్వు సంతోషంగా నీ భర్తతో కాపురం చేస్తుంటే నువ్వు మాతో ఉండటంకంటే, భర్తతో అత్తగారింట్లో ఉండటమే మాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందమ్మా' అన్నారు.

"ఏమిటి నాన్నా...ఎన్నో విషయాలు కాలంతో పాటూ మారలేదా? నేను మార్చి చూపిస్తాను"

ఎప్పుడూ మగపెళ్ళి వాళ్ళే ఆడపిల్లలను చూడటానికి పెళ్ళిచూపుల పేరుతో వెళ్ళాలా? ఏం మనమెందుకు పెళ్ళికొడుకును చూడటాని పెళ్ళిచూపుల పేరుతో వెళ్ళకూడదుఅప్పుడు అబ్బాయిని చూసి నృత్యం తెలుసా...సంగీతం తెలుసా? అని అడగకూడదా!? మనం మార్చి చూపుదాం..." అంటుంది. పరమేశ్వర్ గారు కూతురు మాటలు వింటూ ఆనందిస్తాడు.

అలా కూతురి మాటలు వింటూ సంతోషించిన పరమేశ్వర్ గారి ముఖం 'బ్యాండేజ్' వేసి చుట్టేసి మార్చురీలో శవాలతో ఒక శవంగా పడుంది. అది చూసిన తులసికి పొత్తి కడుపులో కెలుకుతున్నట్టు అనిపించింది. మానవుల జీవితంలో ఇలాంటి  కష్టాల అధ్యాయము దాగున్నదనే విషయం ఆమెకు అప్పుడే తెలిసింది.

"అయ్యో...ఇదేం కర్మ? కొన్ని గంటల ముందు వరకు 'గలగలమని మాట్లాడిన మనిషి, ఇప్పుడు ఇలా చుట్టిన పరుపులా పడున్నారే!" ఆమె కళ్ళలో నీళ్ళు నిండుకున్నాయి.

అప్పుడు...కట్లు వేసిన వొంటిమీద 'మార్చురీ రిపార్ట్' ను చూసి ఆయన పేరు రాసి, ఆయనకని ఒక 'నెంబర్ను వేసి, శరీరాన్ని ఒక మూలకు తోశాడు మార్చురీ స్వీపర్.

"అత్తయ్యా...నాన్నని వాడు చెత్తని తోసినట్లు తోస్తున్నాడు...అలా చేయొద్దని చెప్పత్తయ్యా"--తులసి గిలగిలలాడింది.

అది స్వీపర్ చెవిలో పడలేదు! బయటకు వచ్చి ఆమెను చూసి "మీ బాడీ పేరు ఏమిటి?" అని అతను అడగగానే "జీవితం ఇంత నిలకడలేనిదా?" అని అడగాలనుకున్నది.

"బాడీ కాదయ్యా...నాన్న! నా నాన్న పేరు పరమేశ్వర్!"

"...! పరమేశ్వర్ బాడీనా?"

స్వీపర్ 'బాడీ' అనే మాటను వదల్లేదు. తులసికి అది మొదటి దృశ్యం. అతని వరకు అది పదివేల శవాలలో ఒకటి.

అప్పుడు డాక్టర్ వచ్చాడు. తులసి దగ్గర కొన్ని కాగితాలలో సంతకాలు తీసుకున్నాడు. మధ్య మధ్యలో దీనికి, దానికి అని ఇష్టంవచ్చినట్లు డబ్బులు గుంజారు. పోలీసులు సర్టిఫికేట్ ఇవ్వాలట. శవాన్ని అంతవరకు వాళ్ళు అలాగే ఆపేయగలరట

యాక్సిడెంట్ లో కొన్ని విషయాలు 'క్లియర్ అవలేదు...'. ఇది ఒక హత్యగా కూడా ఉండొచ్చు అని వాళ్ళు గనుక రాగాలు తీస్తే పెద్ద తలకాయ్ నొప్పి. ఇదంతాడబ్బు కోసమే!

చనిపోయిన తరువాత మనిషి దేనికీ ఉపయోగపడడని ఎవరు చెప్పారు? ప్రభుత్వ హాస్పిటల్స్ కు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. చనిపోయినవారికి సంఘంలో ఉన్న అంతస్తు, బంధు మిత్రులు....వీటిని చూసి ఆయనరేటుఇష్టమొచ్చినట్టు పెరుగుతుంది.

ఆంబ్యులాన్స్ లోకి శవాన్ని ఎక్కించే వాళ్ళ నుండిడ్రైవర్వరకు డబ్బు గుంజేవారే. దృశ్యాలన్నీ ఇక్కడ కూడా చోటుచేసుకున్నాయి. 'తండ్రే పోయిన తరువాత...డబ్బు దేముంది పెద్ద డబ్బు?' అనే భావన తులసి మనసులో చేరింది.

డాక్టర్ కూడా అరచేతిని గోకున్నాడు.

"ఇన్స్యూరన్స్ పాలసీలు ఏమన్న వేశున్నారా?" అడిగాడు డాక్టర్.

"వేసున్నారు..."

"అలాగే యాక్సిడెంట్ సర్టిఫికేట్, మార్చురీ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ చాలా ముఖ్యం. జరిగింది వంద శాతం ప్రమాదమే నని మేము రాసిస్తేనే 'క్లైమ్ అమౌంట్' పూర్తిగా దొరుకుతుంది. ఇది హత్యగా ఉండే అవకాశం ఉన్నదని రాస్తే అంతే...." 

డాక్టర్  చెప్పింది విన్న తరువాత కడుపులో తిప్పుతున్నట్టు అనిపించింది తులసికి.

తులసికి బాగా అర్ధమయ్యింది.

స్కూల్లో బాగా మార్కులు తెచ్చుకుని 'మెడికల్ సీటుతెచ్చుకుని డాక్టర్ అవడం తెలుసుకున్నతనికి మంచి మనిషిగా ఎలా ఉండాలో తెలియటం లేదే నని బాధ పడ్డది.

"మీ లంచం ఎంత సార్?" అని గబుక్కున అడిగేసింది. ఆయనకి చెంప మీద చెల్లుమని కొట్టినట్లు అనిపించింది.

"...లంచం...లేదు...లేదు...ఇదంతా ఫార్మాలిటీ అమ్మా. ఇక్కడ నువ్వు పనిచేసి చూడు. నీకు కష్టం తెలుస్తుంది. శపించబడ్డ ఉద్యోగం" అంటూ తను అడిగిన దాన్ని న్యాయ పరచడం మొదలుపెట్టాడు.

తులసి హ్యాండ్ బ్యాగులో నుండి రెండు వేల రూపాయలు తీసి ఆయన ముందు చాపింది. ఇచ్చేటప్పుడే..."దీనికోసం నేను నాలుగు రోజులు ఆఫీసులో కష్టపడాలి" అని చెప్పటం మరిచిపోలేదు.

ఏలాగో శరీరం వచ్చి చేరింది.

అందరూ వ్యాన్ ఎక్కి కూర్చున్నారు.

తులసిని.సి.యులో ఉన్న తల్లి జ్ఞాపకము వేదిస్తోంది.

"వెళ్ళి అమ్మను ఒకసారి చూసొస్తాను..." అని వ్యాను దిగి పరిగెత్తింది.

'.సి.యు!'

లోపల...ముక్కులో ట్యూబ్ పెట్టబడి, అపస్మారకంగా పడుకొనుంది. ఆమె దగ్గరగా నిలబడి ఉన్నాడు లావుపాటి వ్యక్తి సింహాద్రి.

తులసి రావటంతో "తల్లీ! నువ్వేనా మా ప్రొఫసర్ కూతురు?" ఆప్యాయంగా అడిగాడు.

"అవును...మీరు?"

"నేను ఎవరనేది తరువాత చెప్తాను. మొదట మీ అమ్మ పరిస్థితి ఏమిటో తెలుసుకో. తలలో మెదడు దగ్గర దెబ్బ. అందువల్ల ఇప్పుడు కోమా స్టేజిలో ఉన్నారు"

"అయ్యో..." తులసికి వీపు వెనుక భాగంలో ఎవరో కత్తితో పొడిచిన ఫీలింగ్.

"తల్లీ...మనసును దృడపరుచుకో! అన్నీ ఏప్పుడో చేసుకున్న పాపాలు. విధి ఎవరిని వదిలిపెట్టింది?"

"మీరు ఎవరు సార్?"

"చెప్తానమ్మా...నా పేరు సింహాద్రి. నా గురించి మీ అమ్మ...నీదగ్గర ఏమీ చెప్పలేదా?"

"లేదే...!"

"అరె...నిన్న కూడా నీతో మాట్లాడబోతున్నట్టు చెప్పారే"

"పరవలేదు...ఇప్పుడు చెప్పండి. మీరు ఎవరు?"

"తల్లీ! నేను 'రియల్ ఎస్టేట్ బిజినస్ చేస్తున్న వ్యక్తిని. ఊర్లో మీకు సొంతంగా మూడెకరాల స్థలం ఉందిగా?"

"దానికేమిటి?"

" స్థలాన్ని నేనేనమ్మా కొనుకున్నాను"

"ఏమిటీ...మీరు కొనుక్కున్నారా?"

"అవునమ్మా...నా దగ్గర అగ్రీమెంటులో సంతకం పెట్టి, యాభై వేల రూపాయలు 'అడ్వాన్స్’   తీసుకుని నిన్ను చూడటానికి మీ అమ్మ, నాన్న బయలుదేరారు"

"దీన్ని నమ్మలేకపోతున్నాను! నాన్న గారు స్థలాన్ని అమ్మరు. అది అమ్మితే పిత్రు దేవతలకు ద్రొహం చేసినట్లు అవుతుందని చెబుతూ ఉండేవారు"

"నా దగ్గర కూడా అలాగే చెప్పారు. కానీ మీ అమ్మే బలవంతంచేసి ఒప్పించింది

"నిజంగానా?"  

"తల్లీ....ఇప్పుడు విషయాలు మాట్లాడే టైము లేదు. నీ జీవితంలో నువ్వు ముఖ్యమైన ఘట్టంలో ఉన్నావు. మొదట నాన్న గారి అంత్యక్రియలు పూర్తి చేద్దాం. తరువాత మిగిలిన విషయాలు గురించి మాట్లాడుకుందాం. రామ్మా..." అంటూ తులసిని తీసుకుని బయట ఉన్న వ్యాన్ దగ్గరకు వెళ్లారు.

తులసికి అంతా అయోమయంగానూ...గజిబిజిగానూ ఉన్నది!

విశాలపురం గ్రామం

అశోక వర్మ- శేషమాంబల తో తొంబై ఏళ్ళ వృద్దుడు, తిష్టాదేవి విగ్రహాన్ని చూస్తూ, విగ్రహం గురించి తనకు తెలిసిన మరికొన్ని విషయాలను  చెప్పటం మొదలుపెట్టాడు

ఎవరో వృద్దుడు వచ్చినట్లు గ్రామ ప్రజలకు తెలియటంతో అక్కడ చిన్న గుంపు గుమికూడింది.  

"నాకు బాగా జ్ఞాపకము ఉంది...అప్పుడు నాకు ఏడు, ఎనిమిది ఏళ్ళు ఉంటాయి. విగ్రహం అప్పుడు కూడా భూమి క్రిందే ఉండేది. అప్పుడు ఇల్లు సోమయాజులు అనే ఆయనకు సొంతమైనది. ఇదేలాగానే ఏదో ఇంటి మరమత్తులకొసం భూమిని తవ్వుతుంటే విగ్రహం...కంట్లో పడిందిదేవుని విగ్రహాన్ని భూమి క్రింద ఎవరో పాతి పెట్టారు...ఎందుకో తెలియటంలేదూ అంటూ ఊరు ఊరంతా గోల గోలగా మాట్లాడుకున్నారు

అప్పుడు కూడా విగ్రహం భూమి క్రింద పడుకోబెట్ట బడే ఉన్నది. తరువాత పడుకోబెట్టున్న విగ్రహాన్ని నిలబెట్టి ప్రతిష్టించారు. కానీ సక్రమంగా నియమ నిష్టలతో విగ్రహ ప్రతిష్ట, పూజలూ జరగలేదు. ఆరోజు మొదలైంది ఊరి కష్టాలు... సంవత్సరాలు గడుస్తున్నా కష్టాలు తీరలేదు. వర్షాలు లేవు. కొలనులో కూడా నీరు ఎండిపోయింది. ప్రజలలో సగం మంది ఆకలి చావుకు బలైపోయారు. సోమయాజులు గారి కుటుంబంలోని వారు  కలరా వ్యాధి సోకి చచ్చిపోయారు. దానికి ముందు వరకు ఏప్పుడూ పచ్చగా ఉన్న విశాలపురం ఏండిపోయిన ఎడారిలా అయిపోయింది.

ఊర్లో బ్రతికి బట్టకట్టిన కొంతమంది ఇల్లు,వాకిలి, పొలాలను అతి తక్కువ ధరకు అమ్ముకుని ఊరు వదిలి వెళ్ళిపోయారు. అలా ఊరు వదిలి వెళ్ళిన వాళ్ళల్లో మా కుటుంబం కూడా ఉన్నది. నేను నా యాభైయ్యవ ఏట మళ్ళీ తిరిగి ఊరికి వచ్చాను. గ్రామంలోని అందరూ కొత్తవారే. ఎవరికీ విగ్రహం గురించి ఏమీ తెలియలేదు. నేను వెంటనే తిరిగి వెళ్ళిపోయాను. అప్పుడప్పుడు ఊరిని చూడటానికీ, విగ్రహం గురించి తెలుసుకోవటానికీ ఊరు వస్తూ ఉంటాను. అలాగే ఇప్పుడు కూడా వచ్చాను. సారి విగ్రహాన్నే చూశాను"

వయసైన వృద్దుడి నోటి నుండి కాలంతోపాటూ కనుమరుగైన ఎన్నో రహస్యాలు బయటకు వచ్చినై.

అక్కడ గుమి కూడిన జనమంతా నొరెళ్ళబెట్టారు.

"సరే...ఇప్పుడు విగ్రహాన్ని ఏం చేద్దాం?" అడిగాడు అశోక వర్మ.

"నీ స్థలంలో దొరికింది. ఏంచేయాలనేది నువ్వే చెప్పాలి"

"నా దగ్గరుండటం నాకు ఇష్టం లేదు! విగ్రహాన్ని బయట పెట్టేసి ఇక్కడ అమ్మవారి గుడి కట్టించుకుంటాను

"నీ ఇష్టం" చెప్పాడు వృద్దుడు.

విగ్రహాన్ని తీసి బయట నిలబెట్టారు.

సమయంలో ఆకాశం మబ్బులతో నిండి ఉన్నది. విగ్రహాన్ని నిలబెట్టిన అరగంట తరువాత అన్ని మబ్బులూ తొలగిపోయి.....'చుర్రుమని ఎండ పడింది.

అక్కడున్న అందరూ ఆశ్చర్య పోయారు.

"చూసారా విగ్రహం లేచి కూర్చున్న వెంటనే తన పని చూపించింది. రాబోయిన వర్షం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. మొదట విగ్రహాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా పడుకోబెట్టి రండి..." ఉరి పెద్ద చెప్పాడు.

తరువాత ఒక లాగుడు బండీలో విగ్రహాన్ని పడుకోబెట్టి ఊరి బయటకు తీసుకు వెళ్ళారు

 అక్కడికి తీసుకువెళ్ళి చెత్తను పోసినట్లు విగ్రహాన్ని తొసేసి బండి వాడు వెనుతిరిగేడు. మరు క్షణం...ఆకాశం తిరిగి మబ్బులతో నిండి వాతావరణాన్నే మార్చేసింది. వర్షం కుండపోతగా కురిసింది.

                 ***********************************PART-7********************************

విశాలపురం టౌన్  

శ్మశానం!

ప్రభుత్వ ఆసుపత్రి నుండి 'పెయింటుపోయిన ఒక 'స్టెచర్లో తీసుకురాబడ్డ పరమేశ్వర్ గారి శరీరం, శ్మశానంలోని ఒక మూల పెట్టేసి, మార్చురీ వేను వాళ్ళు  ఐదువందల రూపాయలు తీసుకుని వెళ్ళిపోయారు.

తులసికి ఒక పెద్దనాన్న ఉన్నారు. ఆయన కొడుకు రమేష్. ఇద్దరూ తిన్నగా శ్మశానానికే వచ్చారు. అతనే పరమేశ్వర్ గారికి తలకొరివి పెట్టి అంత్యక్రియలు జరపాలని బందువులందరూ చెప్పారు

"రమేష్...నువ్వే కొడుకు వరస అవుతావు! మీ చిన్నాన్నకు జరపవలసిన అంతిమ కార్యాలన్నీ ముందుండి జరుపబ్బాయ్" అంటూ ప్యాంట్-షర్టులో ఉన్న అతన్ని పంచ కట్టులోకి మార్చారు. గుండు చేయించుకుని కార్యాలలోకి దిగాడు రమేష్

పరమేశ్వర్ గారి శరీరంలో ముఖం మాత్రమే బయటకు కనిపిస్తోంది. మిగిలిన భాగాలు కట్లలో అనిగి ఉన్నాయి. ముఖం పైన కొన్ని ఈగలు...తులసికి వాటిమీద కోపం వచ్చి, దగ్గరగా కూర్చొని వాటిని తరుముతోంది. అలాగే ముఖాన్ని తీవ్రంగా చూసి వెక్కి వెక్కి ఏడ్చింది.

అది చూస్తున్న చుట్టూ ఉన్నవారికి జాలేసింది.

ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి ఒకరోజు మరణించ వలసిందే నని అందరికీ తెలిసున్నా...ఎలాగైనా సరే జీవించటానికే ఇష్టపడతాం. జీవితం ముగిసి పోయేటప్పుడు అది ప్రకృతి న్యాయం అని ఆలొచించకుండా, ఏదో పొగొట్టుకోకూడనిది పోగొట్టుకుంటున్నామని విలపిస్తాం.

శ్మాశానంలో కొన్ని మేకలు గడ్డి మేస్తున్నాయి.

శవాలకు వేయబడ్డ పూలమాలలలో ఉన్న పువ్వులను తిని అవి తమ ప్రాణాలను కాపాడుకోవటానికి పోరాడుతున్నట్లు ఉన్నాయి. ఒకే చోట ఎన్ని రకాల దృశ్యాలు!

సింహాద్రి కూడా అక్కడకు వచ్చాడు.

పడవలాంటి ఆయన కారు శ్మాశానం బయట నిలబడుంది. ఆయన్ను చూసిన కోటేశ్వరరావుకి , క్రిష్ణారావుకు  ఆశ్చర్యం కలిగింది.

"ఏమిటండి...ఏమిటో చాలా కావలసిన మనిషిలాగా శ్మాశానానికే వచ్చారు?" అని క్రిష్ణారావు అతని చెవిలో గొణిగాడు.

సింహాద్రి ముఖం అదొలా మారింది.

"అవును, ప్రొఫసర్ చనిపోయారు కదా! స్థలాన్ని కొనగలవని నమ్మకంతో వచ్చావు?" అంటూ కోటేశ్వరరావు మరోవైపు నుండి గొణిగాడు.

సింహాద్రి వారిద్దరినీ తీవ్రంగా చూశాడువాళ్ళిదరికీ సమాధానం చెప్పకుండా...అంత్యక్రియ కార్యాలను గమనించడం మొదలుపెట్టాడు.

తులసి ఏడుస్తూనే ఉన్నది. సింహాద్రి విషయం తులసికి చెప్పాలని మెల్లగా ఆమె పక్కకు జరిగాడానికి ప్రయత్నం చేశాడు కోటేశ్వరరావు

అది చూసిన సింహాద్రి కి ఏదో అర్ధం అయ్యింది. వెంటనే క్రిష్ణారావును, కోటేశ్వరరావును పక్కకు పిలిచి, తనతో రమ్మని చెప్పి, వాళ్ళిదరితో కలిసి ఒక పక్కగా వెళ్ళి నిలబడ్డాడు సింహాద్రి. పక్కన ఒక సమాధి. దానిపైన చిన్న గడ్డంతో ఒక మేక. సమాధిలో ఇరవై సంవత్సరాలకు ముందు చనిపోయిన లక్ష్మీ బాయ్ ఉన్నదని ఆమె పేరు సమాధి పలకపై రాసుంది.

కోటేశ్వరరావు, సింహాద్రి ను చూసి..."కూర్చుని మాట్లాడుకుందామా?" అని అడిగాడు. సమాధి పైనే కూర్చున్నాడు సింహాద్రి

"పరమేశ్వర్ గారు స్థలాన్ని నాకు అమ్మడానికి అంగీకరించారు. నా దగ్గర అడ్వాన్స్ తీసుకుని తిరిగి వెల్తుండగా ప్రమాదం జరిగింది" అని మొదలెట్టాడు సింహాద్రి.

"తరువాత?"...అంటూ కోటేశ్వరరావు అనడం వెక్కిరిస్తున్నట్టు అనిపించింది సింహాద్రికి.

"ఏమిటి తరువాత...నేనేమన్నా కథ చెబుతున్నానా?" కోపంగా అడిగాడు.

"కథ కాబట్టే ఆనందిస్తున్నాము"

"అంటే నేను చెప్పేది మీరు నమ్మటం లేదా?"

"మిమ్మల్ని మెడ పట్టుకుని బయటకు తోసి ఇంట్లో నుండి పరమేశ్వర్ గారు తరిమింది మేము చూశామే...?" 

"అది నిజమే నండి! కానీ, తరువాత ఆయన భార్య మీనాక్షి ఆయనకు ఎత్తి చూపిన తరువాత ఆయన కన్విన్స్ అయ్యాడు"

"అంటే స్థలం కొనడానికి అడ్వాన్స్ ఇచ్చాను అంటున్నావు..." 

"అవును...'రిజిస్ట్రేషన్' చేసేటప్పుడు మిగిలిన డబ్బు ఇచ్చి సెటిల్ చేస్తానుగా"

"ఇప్పుడాయన చనిపోయారే...ఏం చేస్తారు?"

"భార్య ఉన్నది! కూతురు కూడా ఉన్నదిగా"

భార్య కోమాలో ఉన్నది...ఆయన కూతురు వాళ్ళ నాన్న కంటే నాలుగు రెట్లు ఎక్కువ. అమాయి వచ్చి...స్థలాన్ని రిజిస్టర్ చేసిస్తుందని కలలు కనకండి

"రిజిస్టర్ చేసి ఇస్తుంది! ఎందుకంటే పరమేశ్వర్ గారు 'తనకు పూర్తి అంగీకారం' అని స్టాంప్ పేపర్ మీద సంతకం చేసి ఇచ్చారు"

"సంతకమా...దాన్ని ఎవరైనా పెట్టొచ్చు. రేఖలు ఉన్నాయా. అంటే వేలి ముద్రలు?"

"సందేహంగా ఉన్నదా...? డాక్యూమెంట్ కూడా కారులోనూ ఉన్నది. చూపించనా?"

"ఏది... చూపించు"

కోటేశ్వరరావు కొంచం కూడా నమ్మకం లేకుండా చూడటంతో సింహాద్రి కారు దగ్గరకు బయలుదేరాడు.

అంతలో ఇద్దరి మధ్యా గుసగుసలు.

"కోటీ...వీడు పెద్ద అబద్దాల కొరుగా ఉన్నాడే!"

"అంతే కాదు క్రిష్ణ... స్థలాన్ని వదిలేటట్టు లేడు! నాకెందుకో వీడిమీద అనుమానంగా ఉన్నది. పరమేశ్వర్ గారి మీద లారీ ఎక్కించి ఇతనే చంపించుంటాడు అనిపిస్తోంది"

"నాకూ అలాగే అనిపిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో శవం ఉండటం... ఇతను అక్కడికి రావటం"

"అలా ఏముంది స్తలంలో? మనకు తెలిసి అది ఒక శ్మశానం. తవ్వే ప్రతిచోట ఎముకలే ఉంటాయి. నా స్థలం పక్కన శ్మశానమా? అంటూ సుబ్రమణ్య శర్మగారు 'కోర్టు కేసు వేశారు. చివరకి ప్రభుత్వం స్థలాన్ని ఊరి శ్మాశానం అని చెప్పి చాటింపు వేసింది. కానీ, అది మా వంశపారంపర్య  ఇలవేల్పు దేవత స్థలం అని పరమేశ్వర్ గారి తాతయ్య రామదాసు గారు కోర్టులో నిరూపించి స్థలాన్ని చెజిక్కించుకున్నారు. తరువాత ఆయన కొడుకు అశోక వర్మ గారు కూడా స్థలాన్ని ఖాలీగా ఉంచుకుని చూట్టూ కంచెవేశారు. అందులో పిచ్చి చెట్లూ, గడ్డీ పెరిగింది. నిన్న పరమేశ్వర్ గారు స్థలంలో కాంప్లెక్స్ కడతానన్నారు...ఇదేకాదా స్థలానికున్న చరిత్ర"

"రానివ్వు చూద్దాం... మనిషి ఏం చేస్తాడో తెలుసుకుందాం"--కారు తలుపు మూసేసి తిరిగి వస్తున్న సింహాద్రిని చూస్తూ చెప్పాడు క్రిష్ణారావు.

శ్మశానంలో పరమేశ్వర్ గారి అంత్యక్రియల కార్యకలాపాలు ఒక పక్క జరుగుతున్నాయ్. శవాన్ని చితి మీదకు ఎక్కించారు.

సింహాద్రి, కోటేశ్వరరావు దగ్గరకు వచ్చి తన దగ్గరున్న 'అగ్రీమెంట్ కాపీ' ని చూపించాడు. అందులో ముందు రోజు తారీఖు వేసి, మూడు ఎకరాల స్థలాన్ని, ఎకరానికి ఐదు లక్షల చొప్పున మొత్తం పదిహేను లక్షలకు అమ్మటానికి అంగీకరించినట్లు, అడ్వాన్స్ గా యాబై వేల రూపాయలు పుచ్చుకున్నట్టు  స్పష్టంగా రాసి పరమేశ్వర్ గారు సంతకం చేసున్నారు. సంతకం క్రింద వెలిముద్ర కూడా ఉన్నది.

ఇద్దరికీ గుండె గుభేలు మన్నది.

"ఓయ్...నువ్వు పెద్ద మాయగాడివయ్యా! కోటి రూపాయల స్థలానికి పదిహేను లక్షలా...ఎవరి దగ్గర నాటకాలాడుతున్నావు"

అది నామనసులో అనుకున్న రేటు. కానీ పరమేశ్వర్ గారు ఐదు లక్షలకే వొప్పుకున్నారు.

"ఏమిటయ్యా.... ఆయన ప్రాణాలతో లేరనే ధైర్యంతో మా దగ్గర కధ చెబుతున్నావా?"

"ఇలా చూడండి...మీ దగ్గర నాకు మాటలు అనవసరం? స్థలానికీ, మీకూ ఏమిటి సంబంధం? ఏదో ఊరి పెద్దలు కదా...నేను అడ్రెస్సు అడిగినప్పుడు దారి చూపించేరే నని మీ దగ్గర ఇవన్నీ చూపించాను. మీరేమిటి స్థలం మీదే అన్నట్లు మాట్లాడుతున్నారు..." --సింహాద్రి కూడా గట్టిగానే మాట్లాడాడు

"చూస్తామయ్యా...చూస్తాం! నువ్వు స్థలం ఎలా కొంటావో చూస్తాం. అమ్మాయి తులసి దగ్గర...జరిగినవన్నీ చెబుతాము. ప్రొఫసర్ దగ్గర చివరగా నేను కూడా ' స్థలం అమ్మి పారేయకూడదా?' అని చెప్పినప్పుడు కుక్క లాగా నన్ను కరవటానికి వచ్చారు. ఇవన్నీ చెబుతాను"

కోటేశ్వరరావు వేలు చూపి మాట్లాడుతుంటే 'నువ్వో...నేనో?' తేల్చుకుందాం అనే విధంగా ఉన్నది.

మరు క్షణమే సింహాద్రి నవ్వడం మొదలుపెట్టాడు.

"ఏమిటయ్యా నవ్వుతున్నావ్...మమ్మల్ని చూస్తుంటే చచ్చు వెధవలం లాగా కనబడుతున్నామా?"

"చచ...అలంటిదేమీ లేదు. మీ ధైర్యం నాకు బాగా నచ్చింది. నాకు ధైర్యమే పెద్ద ఆస్తి"

"ఇప్పుడు నువ్వు అసలు విషయానికి రా. డాక్యూమెంటు...వేలి ముద్ర...సంతకం ఇవన్నీ సెట్టప్పే కదా?"

"అవును...నాకు స్థలం కావాలి...నేను చెప్పినట్లు ఒక కోటి రూపాయలు ఇవ్వటానికి నేను ఇప్పుడు కూడా రెడీ. కానీ, 'అగ్రీమెంట్' ప్రకారం పదిహేను లక్షలను అమ్మాయి చేతిలో పెట్టేసి రిజిస్ట్రేషన్ ముగించాలి. మిగిలిన ఎనబై ఐదు లక్షలను మీ ఇద్దరికీ సరి సగం పంచేస్తాను. కానీ, నాతో పాటూ చివరిదాకా ఉండి...  అమ్మాయితోనూ మాట్లాడి మంచిగా ముగించాలి. సమ్మతమేనా...?"

సింహాద్రి అంత వేగంగా ఒక్కసారిగా డబ్బుతో కొడతాడని వాళ్ళిద్దరూ కొంచం కూడా ఎదురుచూడలేదు.

ఆశ్చర్యపోయి నోరెళ్లబెట్టారు.

"స్థలానికి పదిహేను లక్షలు. మాకు ఎనబై ఐదు లక్షలా? ఏమయ్యా...మేము వెర్రిబాగులోళ్ళమనుకున్నావా?"

"లేదు లేదు! కావాలంటే అమ్మాయికి ఎకరానికి పది లక్షల చొప్పున ముప్పై లక్షలు ఇచ్చేసి...మీకు డెబ్బై లక్షలు ఇవ్వనా?"

"ఏయ్...ఏమిటి నువ్వు, 'ఎక్స్ప్రెస్స్వేగంతో వేలం వేస్తున్నావు? మేము తెలియక అడుగుతున్నాం...అంత డబ్బు పెట్టి కొనడానికి స్థలంలో ఏముందయ్యా?"

" విషయం మీకెందుకు...? అతి త్వరలో ఊరే మారబోతోంది! పెద్ద పెద్ద ఐటి కంపెనీలు రాబోతున్నాయి. అందులో విదేశీ కంపెనీలు కూడా ఉన్నాయి. ఊరిలోనే ఉండి ఆకాశంలో తిరుగుతున్న 'ఏలియన్ శాట్' అనే అంతరిక్ష నౌకను పట్టుకోవటం చాలా సులభమట. దీని వెనుక ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి..."

"...  కథ అలా పోతోందా? ఇప్పుడు  కథ అర్ధమమవుతోంది!" 

కోటేశ్వరరావు, క్రిష్ణారావు కళ్ళు పెద్దవి చేసుకుని ఒకర్నొకరు చూసుకుంటూ... 

"కోటిగా...అయితే నా పెరుమీదున్న ముప్పై సెంట్ల స్థలానికి కూడా మంచి రేటు వస్తుందని చెప్పు..." ఉత్సాహంగా చెప్పాడు క్రిష్ణారావు.

"...మీదగ్గర ముప్పై సెంట్లు ఉన్నదా? బలే! ఇంకో ముప్పై ఎకరాలున్నా నేను కొనుక్కుంటాను. మంచి రేటు కూడా ఇస్తాను. క్షణం నుండి మనమంతా ఒకటే...ఏమంటారు?"

సింహాద్రి షేక్ హాండ్ ఇవ్వటానికి చేయి చాచాడు.

కోటేశ్వరరావు, క్రిష్ణారావు మార్చి మార్చి ఒకరినొకరు చూసుకుని సింహాద్రి వైపు తిరిగారు. కానీ షేక్ హాండ్ ఇవ్వలేదు.

"ఏమిటి...అనుమానంగా ఉన్నదా?"

"ఉండదా...నువ్వేమన్నా గాంధీ గారికి మనవడివా? లేక సత్య హరిస్చంద్రుడి ఇంటి వెనుక పుట్టావా?"

"వాళ్ళందరినీ వదలండి. నేను మోసగాడినే. కానీ నా మాట స్వచ్చం. మనం కలిసుంటే ఊరే మన చేతిలోకి వస్తుంది. లేకపోతే నాకెలాంటి నష్టమూ లేదు. మీకు ఇస్తానన్న డబ్బును మన జీవానంద శ్వామికి డొనేషన్ గా ఇస్తే చాలు...ఆయనే నా పనులను పూర్తి చేసి ఇస్తారు...?"

--సింహాద్రి శ్వామీజి పేరు చెప్పగానే...ఇద్దరికీ షాక్ కొట్టినట్లు అయ్యింది. వాళ్ళిద్దరూ వేరుగా వెళ్ళి గుసగుసలు మాట్లాడుకుని, తిరిగొచ్చి 'సరే' నంటూ బొటను వేలు చూపించి నవ్వారు.

అదే సమయంలో చితిపైనున్న పరమేశ్వర్ గారి తలకు తలకొరివి పెడుతున్నాడు రమేష్.

తులసి "..." అంటూ గట్టిగా ఏడవటం... శబ్ధం శ్మశానం మొత్తం వినిపించింది.

               ***********************************PART-8*********************************

విశాలపురం గ్రామం

విశాలపురం గ్రామంలో రోజు మొదలైన వర్షం నాలుగు రోజులైనా ఆగలేదు. కారణం బండివాడు పడేసిన తిష్టాదేవి విగ్రహం, చెత్తకుప్పపై కూర్చున్నట్టు పడింది. ఉరంతా వరద. చాలా ఇళ్ళు  నీట మునిగినై. భయంతో ఊరి ప్రజలందరూ వణికి పోయారు. వర్షం ఆగట్లేదు.

అశొక వర్మకు అనుమానమొచ్చింది. వెంటనే  తిష్టాదేవి విగ్రహాని పడేసిన చెత్త కుండి దగ్గరకు పరిగెత్తాడు....అతని అనుమానం నిజమైంది. తిష్టాదేవి విగ్రహం చెత్త కుండిలో కూర్చొనున్న స్థితిలో ఉన్నది. విగ్రహం సగానికిపైగా నీరు చేరింది. అశొక వర్మ విగ్రహాన్ని తీసి నీటిలో పడుకోబెట్టాడు. విగ్రహం నీటిలో పూర్తిగా మునిగిపోయింది. వర్షం ఆగింది. సంఘటనను ఊరంతా వేడుకగా చూసింది…..ఆశ్చర్యపడింది.   

" దేవి విగ్రహాన్ని మనం ఎత్తుకు వెళ్ళీ పారేసాము కదా. కోపం వచ్చి వర్షం కురిసింది. అది నీళ్ళల్లో మునగటంతో వర్షం ఆగింది. దీని అధారంగా మనకి ఒక నిజం అర్ధమవుతోంది. దేవత విగ్రహం బయట ఉంటే వర్షం కురుస్తుంది. లోపల ఉంటే వర్షం ఆగుతుంది"

ఊర్లో ఇలాంటి మాటలు ఎన్నో మాట్లాడుకున్నారు. మాటలన్నీ అశోక వర్మ-శేషమాంబ చెవులకు కూడా చేరినై.

'వాళ్ళ వల్లే సమస్య!' అంటూ మాటలు మొదలయ్యాయి. కానీ, అశోక వర్మ-శేషమాంబ ఆత్మానంద శ్వామీజీని కలిసినప్పుడు ఆయన వేరే విధంగా చెప్పారు.

జనాభా సంఖ్య, జాతుల సంఖ్య తక్కువగా ఉన్న కాలంలో తిష్టాదేవిని మొదటగా పూజించేవారుట. విగ్రహాన్ని ఊరిలో ఎవరు ప్రతిష్టించారో ఎవరికీ తెలియదు. పురాణాలలో కూడా పేరు ఎవరూ వినలేదుట. ఊరి ప్రజలకు తిష్టాదేవి ఎవరో కాదు ఒక విధంగా లక్ష్మీదేవి యొక్క సహోదరి. ఈమెను భక్తి శ్రద్దలతో, కాలుష్యం లేని మనసుతో పూజించాలట. ఇల్లు శుభ్రంగా, భక్తిగానూ, సత్య ధర్మాలతోను ఉంటుందో ఇంట్లోకి జొరబడదు. దానికి విరుద్దంగా ఇల్లు  సుచి, శుబ్రత, భక్తి లేకుండా అధర్మమం, అసత్యం, అంటుతో ఉంటుందో అక్కడ మొదట చొరబడుతుంది. ఈమె చొరబడితే ఇల్లు కష్టాలతో నిండిపోతుందిఅంటే వారిని దండించి, శిక్ష వేస్తుంది...తద్వారా వాళ్ళు సత్య ధర్మ బాటలోకి వస్తారు.  

మంచి విషయాన్ని ప్రేమగా చెప్పి ఆచారంలో పెట్టడం ఒక విధం. అదే మంచి విషయాన్ని కఠినంగా చెప్పి ఆచారంలో పెట్టడం ఇంకో విధం. తిష్టాదేవి కఠినమైన దేవత. ఈమె ఉండే ఊరులో అన్నీ శుభ్రంగానూ, సుచిగానూ, నీతిగానూ ఉండాలి. అలా జరగని పక్షంలో మాత్రమే ఇలా జరుగుతుంది.

సమస్య నీ దగ్గరలేదు. ఊరిలోనే ఉంది! ఎందుకంటే ప్రజలలో చాలా శాతం అవినీతికి బానిస అయ్యారు!

ఊరిని బాగుచేయలేము అని మీరు అనుకుంటే... విగ్రహాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళి ఇంతకు ముందు విగ్రహం ఉన్న చోటునే పూడ్చిపెట్టేయండి...." అన్నారు.

అశోక వర్మకు కూడా అదే మంచిదనిపించింది!

                                                   ********************************

విశాలపురం టౌన్

ప్రభుత్వ ఆసుపత్రి!

భర్త చనిపోయారనే విషయం కూడా తెలియని పరిస్థితిలో 'కొమా' లో ఉన్నది మీనాక్షి….ప్రాణం ఉన్నప్పుడే...మరణించటం అంటే ఇదే.

తల్లిని చూడటానికి వచ్చిన తులసి కళ్లు నీరసంగా ఉన్నాయి. అక్కడ ఒంటరిగా కుర్చున్న డాక్టర్ను కలిసింది.

"డాక్టర్..."

"రామ్మా...కూర్చో"

"అమ్మ గురించి..."

"చెబుతానమ్మా...మీ అమ్మ వొంట్లో సమస్య లేదు. కానీ, తలమీద దెబ్బతగలటం వలన మెదడు దెబ్బతిన్నది. అందుకే 'కోమా' లోకి వెళ్ళిపోయింది.”

"దీన్ని గుణపరచవచ్చుగా?"

"దీనికి ఒక డాక్టరుగా సమాధానం చెప్పటం కంటే...మనిషిగా చెప్పటమే కరెక్ట్. అలా చూస్తే...యాబై శాతమే అవకాశం. చ్చికిత్స ఫలం ఇచ్చి అది అరవై, డెబ్బై, ఎనభై  అని పెరుగుతూ వెడితే ఖచ్చితంగా మీ అమ్మగారు 'కోమా' నుండి బయటపడతారు. లేకపోతే...కండిషన్ తలకిందలుగా మారే అవకాశం ఉంది"

"మీ ఇంట్లో ఎవరికైనా ఇలా జరిగుంటే ఏం చేస్తారు?"

"నేను పోరాడుతాను! ఎందుకు చెబుతున్నానంటే...ఈమె చనిపోవాలని విధి ఉంటే మీ నాన్నగారిలాగా అప్పుడే చచ్చిపోయుండచ్చు కదా? ఎప్పుడు ప్రాణం పోలేదో...అప్పుడే ఈమె జీవించాలనేదే భగవంతుని ఇష్టంగా ఉండొచ్చు"

---డాక్టర్ యొక్క యధార్ధమైన సమాధానం తులసికి నచ్చింది. మనసులోని భారం తగ్గింది.

"అయితే...అమ్మకు ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్! మీ నమ్మకం, నా ప్రార్ధన ఆమెకు సహాయపడనివ్వండి"

"ఖచ్చితంగా జరుగుతుంది! నమ్మకం ఉంచు. కానీ..."

"ఏమిటి డాక్టర్?"

"కొంచం ఖర్చౌతుందమ్మా..."

"ఎంత అవుతుంది డాక్టర్?"

"ఈమె కోసమే ప్రత్యేకంగా ఒక 'నర్స్ను పెట్టాలి. నర్సు  ‘రొటీన్ బాడీ యాక్టివిటీస్ను గమనిస్తూ ఉంటుంది. ఇది కాకుండా మెదడుకు 'స్పేషల్ న్యూరో సర్జన్డాక్టర్ ను పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి. కొన్ని సందర్భాలలో ఫారిన్ నుండి మందులు తెప్పించాల్సిన అవసరం వస్తుంది"

"అంటే వేలల్లో కాకుండా లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పండి"

"అవునమ్మా..."

"ఎన్ని లక్షలు అవుతాయ్ డాక్టర్?"

ఖచ్చితంగా చెప్పలేను. ఆరు నెలల లోపు మీ అమ్మ కోలుకుంటే నాలుగైదు లక్షలు. అదే సంవత్సరాల తరబడి అయితే ...పది పదిహేను లక్షల వరకు అవుతుంది..."

డాక్టర్ చెప్పలేక చెప్పలేక చెప్పాడు.

చాలా సేపు మౌనంగా ఉన్నది తులసి.

"నువ్వు ఆలొచించి రేపుకూడా చెప్పమ్మా..." అన్నాడు డాక్టర్.

"ఒకవేల అంత డబ్బు ఖర్చు చేయలేనంటే?"

"నీ వల్ల కాదని చెబితే ఏం చేయగలం. ఇప్పుడిస్తున్న ట్రీట్మెంటును కూడా ఆపాల్సిందే! పల్స్ కొంచం కొంచంగా తగ్గి మూడు రోజుల్లో మీ అమ్మ ప్రాణం విడిపోతుంది."-----నిదానమైన గొంతుతో చెప్పాడు.

తులసికి, ఆమె ప్రాణం కూడా కలిసి వెళ్ళిపోతున్నట్లు అనిపించి నొప్పితొ బాధపడ్డది

"నో డాక్టర్...?"

కళ్ళల్లోనుండి నీరు ఉబికి వస్తోంది.

"అప్పుడైతే ఖర్చుకు దారి ఏమిటని చూడటం మంచిది..."

డాక్టర్ ఖచ్చితంగా చెప్పేటప్పటికి, మౌనంగా లేచింది.

"ప్లీజ్ డాక్టర్...అమ్మకు ఇస్తున్న 'ట్రీట్మెంట్' 'కంటిన్యూ' చేయండి. నాకు అమ్మ కావాలి. నాన్న పోవటమే నేను తట్టుకోలేకపోతున్నా, అమ్మ కూడా పోతే...నేను బ్రతికి ఉండటంలో అర్ధం లేదు డాక్టర్"

"ఆవేశపడకమ్మా! ఇంటికి వెళ్ళి మీ బంధువులతో కలిసి మాట్లాడు. తరువాత ఒక నిర్ణయానికి రా"

------తులసి మౌనంగా బయలుదేరింది.

బస్సు దిగి ఊర్లోకి వెడుతున్న తులసిని కొంతమంది జాలిగా చూశారు. తాము మమూలుగా కూర్చునే చోటులోనే కూర్చున్న క్రిష్ణారావు, కోటేశ్వరరావు ఆమె దగ్గరకు వెళ్ళి "అమ్మా తులసీ...ఆసుపత్రికి వెళ్ళొస్తున్నావా?" అని మొదలుపెట్టారు.

"అవును అంకుల్!"

"ఇంటికి వెళ్ళాము. ఎవరూ లేరు. మీ పెద్దనాన్న కొడుకు రమేషూ, మీ పెద్దనాన్న మాత్రం ఉన్నారు"

"మామయ్య, అత్తయ్య, పిన్ని, చిన్నాన్న అందరూ ఉండాలే...?"

" రోజుల్లో ఎవరమ్మా చావు ఇంట్లో పది రోజులూ ఉంటున్నారు...? శ్మశానం నుండి వచ్చిన వెంటనే స్నానంచేసేసి తర్వాతి బస్సు పుచ్చుకుని వెళ్ళిపోతున్నారు!"

"అవును...అమ్మ విషయంలో డాక్టర్ ఏం చెప్పాడు?" అడిగాడు కోటేశ్వరరావు

"ఇప్పుడే ఏమీ చెప్పలేము అన్నాడు అంకుల్! కానీ, అమ్మకి పూర్తిగా గుణమవుతుందని నమ్ముతున్నాను..."

"నమ్మాలి...నమ్మకమే జీవితం! కానీ, లక్షలలో ఖర్చు అవుతుందేమ్మా?"

"అవును అంకుల్...డబ్బుకు ఏర్పాటు చేయాలి"

"నీకేమమ్మా...నీ దగ్గర మూడెకరాల స్థలం ఉందికదమ్మా! అది అమ్మితే పది, పదిహేను లక్షలు వస్తాయే?"

క్రిష్ణారావు మెల్లగా తులసి ఆలొచనలను కెలికాడు.

తులసికి కొంచం 'గుబేల్మన్నది.

ఏమీ మాట్లాడకుండా నడుస్తున్నది.

ఇంటికి చేరుకున్నప్పుడు వాళ్ళు చెప్పినట్లే పెద్దనాన్న, రమేష్ మాత్రమే ఉన్నారు.

"పెద్దనాన్నా....ఏమిటి ఎవరూ కనబడటంలేదు?"

"అందరూ ఊర్లకు వెళ్ళిపోయారమ్మా...నీకు ఫోన్ చేసి మాట్లాడతామన్నారు"

"ఎందుకు అంత అవసరం పెద్దనాన్నా?"

ఏమిటమ్మా అలా ఆడిగావు ...! మీ అమ్మ వైద్యం కోసం నువ్వు డబ్బులు గిబ్బులు అడిగితే...?"

---పెద్దనాన్న చెప్పినప్పుడు చివుక్కు మన్నది తులసి మనసు.

తులసి కళ్ల నుండి కన్నీరు ధారగా వచ్చింది.

"ఏడవకు తులసీ...మనసు దృడం చేసుకో! అమ్మ విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నావు?" అడిగింది తులసి పెద్దమ్మ.

"ఏం నిర్ణయం తీసుకోగలం పెద్దమ్మా...? ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడుకోవటమే..."

"ఏదో కాళ్ళలోనో...చేతుల్లోనో గాయాలంటే నువ్వు చెప్పేది కరెక్టే. ఇది 'కోమా'! చివరి వరకు మీ అమ్మ కళ్ళు తెరవకుండా వెళ్ళిపోతే?"

మనసును పిండేస్తున్నట్టు గుండెల్లో నోప్పి పుట్టింది తులసికి.  

"నువ్వు ఏం చెప్పదలుచుకున్నావ్ పెద్దమ్మా?"

"వదిలేయ్...! నాన్నతో కలిసి అమ్మ కూడా వెళ్ళిపోనీ. ఇల్లు సొంత ఇల్లు. ఇది కాకుండా మూడు ఎకరాల స్థలం ఉన్నది. నువ్వూ ఉద్యోగం చేస్తున్నావ్. సంపాదిస్తున్నావు కాబట్టి మంచి సంబంధం వస్తుంది. భర్త...పిల్లలు అని హ్యాపీగా జీవితం గడుపు"

పెద్దమ్మని అదొలా చూసింది సంధ్య.

"ఏం తులసి...నేను చెప్పింది నీకు నచ్చలేదా?"

"అవును పెద్దమ్మా!"

"కొన్ని లక్షలు ఖర్చుపెట్టి...అది వేస్ట్ అయిపోతే ఏంచేస్తావమ్మా?"

"పోతే పోయినై పెద్దమ్మా!"

"సరె...డబ్బుకు ఏం చేస్తావ్?"

"అది నా సమస్య పెద్దమ్మా"

"నువ్వు మాట్లాడటం చూస్తే...అన్నీ నేను చూసుకుంటాను అన్నట్లుందే"

"అవును...అదే అంటున్నాను! మా అమ్మను చంపమని చెప్పే ఎవరూ నాకు అక్కర్లేదు"

"చంపమని ఎవరు చెప్పారు. సగం చచ్చిన మనిషిని భాదలు పెట్టకుండా పూర్తిగా చనిపోనివ్వు అంటున్నాను...నేను నీ మంచికే కదా చెబుతా...." 

కానీ, నా మనసు దాన్ని అలా చూడటం లేదు...చూడనూ లేను"

"సరేనమ్మా....ఇక నీ ఇష్టం! రమేష్ బయలుదేరుదాం. సాయంత్రం బస్సును పట్టుకుంటే ప్రొద్దున కోడి కూసే వేలకు ఇంటికి వెళ్ళిపోవచ్చు"

- మరో అరగంట తరువాత వాళ్ళు కూడా బయలుదేరి వెళ్ళిపోయారు.

తులసి ఒంటరిదైపోయింది! గోడ మీద అమ్మ, నాన్నల ఫోటోలు. ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పటి నుండి ఆమె అంచలంచెలుగా ఎదుగుతున్నప్పుడు తీసిన ఫోటోలు.

ఫోటోలను చూస్తూ ఉంటే తులసికి గుండె పగిలేలా అనిపించింది.

ప్రపంచంలో ఎవరికీ ఇలాంటి దుస్థితి రాకూడదు!

వెక్కి వెక్కి ఏడ్చింది. అప్పుడు వాకిలి గుమ్మంలో ఒక రూపం.

తలపైకెత్తి చూసింది.

                                      *********************************PART-9************************************

సింహాద్రి--మొహంలో ఒకవిధమైన నవ్వు.

"రావచ్చా?"

"రండి..."

లోపలకు వచ్చాడు సింహాద్రి. చేతిలో పూలమాల. దాన్ని పరమేశ్వర్ గారి ఫోటోకు వేశాడు.

తరువాత...నడుందగ్గర దాచుకున్న 500 రూపాయల నోట్ల కట్లలో మూడింటిని తీశాడు. మొత్తం ఒకటిన్నర లక్ష.

"ఏమిటిది?"

"డబ్బులమ్మా...ఇవి తీసుకు వెళ్ళి అమ్మ ట్రీట్మెంట్ ఖర్చులకు కట్టమ్మా"

"నాకు డబ్బులివ్వటానికి మీరు ఎవరు?"

ఏంటమ్మా అలా అడిగావు...? ఇవి నీ డబ్బులేనమ్మా! నేను ఆసుపత్రిలోనే చెప్పానే...మీ నాన్న రెండురోజుల క్రితం 'అగ్రీమెంట్' వేశారని"

"నేను దాన్ని నమ్మలేకపోతున్నా..."

" 'అగ్రీమెంట్ పేపర్చూడమ్మా"

---తీసి చూపించాడు.

దాంట్లో తెలిసిన సంతకం...తులసిని కట్టిపడేసింది.

"ఏం చెప్పాలో తెలియటం లేదు సార్"

"ఒక విధంగా ఇది నీకు మంచే కదమ్మా! బంధువులందరూ పారిపోయిన స్థితిలో నీకు, మీ ఆమ్మను కాపాడుకోవటానికి డబ్బు కావాలి. నేను ఇవ్వబోయే పదిహేను లక్షలు...ఆమెను కాపాడితే సంతొషమే కదమ్మా?"

సింహాద్రి పాయింట్ పెట్టి మాట్లాడేటప్పటికి...తులసి సమాధానం చెప్పలేకపోయింది. మౌనంగా సింహాద్రి ఇచ్చిన డబ్బును తీసుకుంది

"మిగిలిన డబ్బును వచ్చే శుక్రవారం డాక్యూమెంట్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఇస్తానమ్మా. ప్రొద్దున పదకుండు గంటలకు మంచి టైము. సంతకం పెట్టటానికి వచ్చేయ్. నేను కారు పంపిస్తాను. వచ్చేటప్పుడు మరిచిపోకుండా స్థలానికి సంబందించిన ఒరిజినల్ డాక్యూమెంట్స్ అన్నీ తీసుకు వచ్చాయి"

చెప్పేసి విజయవంతమైన నవ్వుతో వెళ్ళిపోయాడు సింహాద్రి.

డబ్బును చేతిలో పెట్టుకుని ఏం మాట్లాడాలో తెలియక అలాగే కూర్చుండిపోయింది తులసి.

విశాలపురం గ్రామం

తిష్టాదేవి విగ్రహాన్ని చూడటానికి వచ్చారు ఆత్మానంద శ్వామీజీ. ఆయనతోపాటు ఆయన ముఖ్య శిశ్యుడు సర్వానంద శ్వామి కూడా వచ్చారు. వరద నీరు తగ్గి పడుకున్న విగ్రహం కనబడింది. దూరం నుంచే కర్పూరం వెలిగించి తిష్టాదేవి విగ్రహానికి నీరాజనం చూపి కళ్లకు అద్దుకున్నారు. అప్పుడే విగ్రహం చుట్టూ ఉన్న నీటిలో ఒక పక్కగా చేపలు చచ్చిపోయి తెలుతున్నాయి

శ్వామీజితో పాటు వచ్చిన కొందరు "శ్వామీజీ! విగ్రహం పడున్న నీటిలో జీవిస్తున్న చేపలు కూడా చచ్చిపోయినై చూడండి. విగ్రహాన్ని వెంటనే ఎక్కడైనా దూరంగా తీసుకువెళ్ళి  ఎవరూ లేనిచోట పడేద్దాం" అన్నారు.

శ్వామీజీ వచ్చి విగ్రహాన్నీ చూస్తున్నారని తెలుసుకున్న అశోక వర్మ, శేషమాంబ దంపతులు విగ్రహం ఉన్నచోటుకు వచ్చారు.

"శ్వామీ..."

రా అశోక వర్మ...అమ్మవారిని చూసి దన్నం పెట్టుకో"

"దన్నం పెట్టుకోమని చెబుతున్నారా స్వామి?"

"మరి...ఈమెను నిష్టతో నిజాయితీగా ప్రార్ధిస్తే కోట్లు ఇస్తుంది. చెడు ఆలొచనలతో వస్తే రోడ్డు మీదకు తీసుకు వస్తుంది"

'మీరు చెప్పినట్లు ఇది ఊరి సమస్య...ఉరిని బాగుచేయడానికి నేను ఎవర్ని స్వామి"

"అయితే నీ స్థలానికి తీసుకువెళ్ళి గుడి కట్టు"

గుడి కట్టటమా...భయంగా ఉంది శ్వామిజీ! చూడండి చేపలు ఏం పాపం చేశాయి"

"పిచ్చివాడిలా మాట్లాడకు...! చేపలు చనిపోవడానికి కారణం వేరు"

"ఏమిటా కారణం స్వామీ?"

"చెవి చూపించు చెబుతా"

అశోక వర్మ గారి చెవిలో శ్వామీజీ ఏదో చెప్పారు. అశోక వర్మ ముఖంలో వెలుగు. దాని తరువాత ఏమీ మాట్లాడలేదు. "శ్వామీజీ! పంచాయితిలో తీర్పు తీసుకుని...నా స్థలంలోకి తీసుకు వెళ్ళి గుడి కడతాను. దేవతను ఖచ్చితంగా నిష్టతో పూజిస్తాను..." 

శ్వామీజీతో వచ్చిన ఆయన ముఖ్య శిశ్యుడు సర్వానంద శ్వామీజీకి ఆశ్చర్యం.

ఆత్మానంద శ్వామీజీ అటు తిరగగానే...అశోక వర్మ దగ్గరకు వెళ్ళి "శ్వామీజి మీ చెవిలో ఏం చెప్పారు"

"అది దైవ రహస్యం. బయటకు చెబితే దైవ ద్రోహం"

సర్వానంద శ్వామిజీకి మరింత ఆశ్చర్యం!

                                      ***********************************************

విశాలపురం టౌన్   

రాత్రి సమయం...

వర్షం వచ్చేలాగా ఉన్నది.

మెల్లగా లేచి నిలబడ్డ తులసి...తెరిచున్న కిటికీ తలుపులను ముసేసి వచ్చింది.

ముఖద్వారం తలుపులు కూడా వేసేసి గడియ పెట్టొచ్చి తన పరుపు మీద వాలిపోయింది. ప్రొద్దున్నుంచి ఏమీ తినలేదు. తినాలని అనిపించలేదు. మనసు భారంగా ఉన్నప్పుడు తినడానికి మనసెలా వస్తుంది

మంచం ఎదురుకుండా ఉన్న గోడకు తండ్రి ఫోటో వేలాడుతోంది. ఫోటో కుడి ఎడమలకు ఊగుతోంది. 'బలమైన గాలికి ఫోటోలు ఊగటం సహజమే!' అనుకుని దాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

కానీ, తలుపులన్నీ మూసేసిన తరువాత కూడా ఫోటో ఊగటం...దాని శబ్ధం వినపడటం...ఆమెకు ఆశ్చర్యంగా ఉన్నది. లేచి వెళ్ళి చేతులతో ఊగుతున్న ఫోటోను ఆపింది.

నిశ్శబ్ధం!

తిరిగి వచ్చి పరుపుమీద కూర్చుంది.

తిరిగి ఫోటో ఊగటం మొదలయ్యింది.

'నాన్నా...!' మనసులోనే భయంతొ కూడిన ఒక పెద్ద గొంతు అమెలో మోగింది.

ఎదురుగా ఉన్న ఈజీ చైర్ చిన్నగా ఊగి--ఆగింది.

"అయ్యో...నాన్నా...నువ్వేనా వచ్చింది. ఏమిటి నాన్నా ఇలా చేశావు! మమ్మల్ని ఇలా ఒంటరి చేసి వెళ్లిపోయావు" అని ఈజీ చైర్లో ఆయన ఉన్నట్లుగానే భావించి ఏడుస్తూ మాట్లాడింది.

మరు క్షణం "అమ్మా తల్లీ..." అనే మాటలు గాలిలో నుండి వినబడింది.

నాన్నా..."

"జరిగింది ప్రమాదం కాదమ్మా..."

"అయ్యో... నాన్నా!"

"ప్లాండ్ మర్డర్..." 

"నిజంగానా?"

" సింహాద్రి ఒక హంతకుడు..."

"ఇప్పుడొచ్చి డబ్బులిచ్చి వెళ్ళాడే అతనా...?"

"వాడేనమ్మా...వాడి దగ్గర జాగ్రత్తగా ఉండు!”

---చెవిలో వినబడ్డ అశరీరవాణి తులసిని తారుమారు చేసింది.

తరువాత పెద్ద నిశ్శబ్ధం. అంతవరకు తులసి చెవులకు వినబడిన అశరీరవాణి...నిజంగానే నాన్నదేనాలేక....భ్రమా? అనే ప్రశ్న ఆమెలో తలెత్తింది.

లేచి హాలులోని లైటును వేసింది.

స్నానం చేసినట్లు చెమటలు పట్టినై.

మెల్లగా వేనక్కి తిరిగి...గోడపై వేలాడుతున్న పరమేశ్వర్ గారి ఫోటోను చూసింది. ఫోటో ఇప్పుడు ఊగటంలేదు.

ఒకవేల భ్రమేనేమో?”....మనసులో బలంగా ప్రశ్న లేచింది.

'చావు పడిన ఇంట్లో మొదటి పదిరోజులకు ఇలాంటి సంభవాలు జరుగుతాయనే బంధువులు తోడుగా ఉండటం, నిత్య కర్మలు జరపటం చేస్తారు...ఇవన్నీ చనిపోయిన వారి ఆత్మ అక్కడ తిరగకూడదనే కారణం కోసమే' అని పరమేశ్వర్ గారు ఎప్పుడో చెప్పింది అప్పుడు గుర్తుకు వచ్చింది తులసికి.

వీధిలో ఒక వృద్దురాలు చచ్చిపోయింది. ఒకపక్క బంధుమిత్రుల ఏడుపు గోష...మరో పక్క డప్పుల మోత. చెవులు చిల్లులు పడుతున్నాయి. ఒర్చుకోలేక పరమేశ్వర్ గారి దగ్గర 'ఇదంతా ఏమిటి నాన్న అడవి మనుషులలాగా?'అని ఆయన దగ్గర అడిగినప్పుడు అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానమే ఇది.

చనిపోయిన మనిషి యొక్క ఆత్మ ఇంటిని చుట్టి చుట్టి వస్తుంది అని చెప్పిన విషయం మాత్రం తులసి మనసులో పదిలమయ్యింది.

ఇప్పుడది ఆమె మనసులో ముందుంది. ‘దాని ప్రకారం చూస్తే...నా చెవికి వినబడ్డ అశరీరవాణి నాన్నదేనని ఆమె మనసు నమ్మటం మొదలెట్టింది.

ఇప్పుడు తను ఒంటరిగా ఉండటం, తన ఆలొచనలను ఒక్కరితో కూడా చెప్పుకోలేని శోకం అమె గెండెను ఒత్తిడికి గురిచేసింది.

'పెద్దమ్మ దగ్గర, రమేష్ దగ్గర అంత కఠినంగా మాట్లాడి ఉండకూడదేమో?' అని మనసులో అనిపించినప్పుడు వాకిలి గుమ్మం తలుపులు కొడుతున్న శబ్ధం.

"ఎవరో వచ్చారు...ఎవరై ఉంటారు?" అన్న ప్రశ్నతో వెళ్ళి తలుపు తెరిచింది.

బయట భుజాలకు లెదర్ బ్యాగు తగిలించుకున్న ఒక యువకుడు. వాకిటి లైటును వేసినప్పుడు అతని ముఖం తెలిసింది.

"విజయ్...నువ్వా?" 

"నేనే! అవును తులసీ...నువ్వు ఒక్కదానివే ఉన్నావా? ఎవరూ కనబడటం లేదే?"

"లోపలకు రా...మాట్లాడుకుందాం. ఇప్పుడే, అయ్యో ఒక్కదాన్నే ఉన్నానే! నని అనుకున్నా. మంచికాలం...నువ్వు వచ్చాసావు" అని తిరిగి నడుస్తూ మాట్లాడింది.

అతనూ ఆమె వెనుకే నడిచాడు.

హాలులో ఉన్న టెబుల్ పైన తన బ్యాగును ఉంచాడు. వెనక్కి తిరిగి...గొడమీద కనబడుతున్న పరమేశ్వర్ గారి ఫోటోను చూశాడు. ఫోటో దగ్గరగా వెళ్ళి కళ్ళార్పకుండా ఫోటో వంకే చూశాడు. అతని రెండు కళ్ళూ కన్నీటి బొట్లను దొర్లించడం మొదలుపెట్టాయి. అది తులసికి కొంత ఆశ్చర్యంగానే ఉన్నది. ………….

విజయ్ ఆమె అత్త కొడుకు

అత్తయ్య ప్రేమ పెళ్ళి చేసుకుంది.

అత్తయ్యను పరమేశ్వర్ కుటుంబం వెలివేసింది. ఎప్పుడైనా...ఫంక్షన్లలో  చూసినప్పుడు, చూసుకోవటంతో సరి. అప్పుడు కూడా మాటలు ఉండవు. కానీ, విధి వసాత్తు అత్త కొడుకు విజయ్, పరమేశ్వర్ గారు ప్రొఫస్సర్ గా ఉన్న కాలేజీలోనే, ఆయన క్లాసులోనే విధ్యార్ధిగా చదువుకోవటం వింత

అప్పుడు కూడా 'మామయ్యా' అని తన బందుత్వాన్ని చూపించుకోకుండా కఠినంగానే ఉండిపోయారు పరమేశ్వర్ గారు. విజయ్ కు  కాలేజీలోనే బెస్ట్ స్టూడెంట్ అవార్దు వచ్చినప్పుడు దానికి కారణం ప్రొఫసర్ పరమేశ్వర్ గారే అని చెప్పిన తరువాతే ఆయనకు విజయ్ పైన అభిమానం, ప్రేమ ఏర్పడటం మొదలయ్యింది.

ఒకరోజు విజయ్ ను ఇంటికి పిలిచి...విజయ్ ఎవరనే నిజాన్ని భార్య మీనాక్షి, కూతురు తులసి ముందు బద్దలుకొట్టాడు. తరువాతే వాళ్ళకూ తెలిసింది. కానీ, విజయ్ తల్లిని కలుసుకోవటానికి...మాట్లాడటానికీ అయన రెడీగా లేడు. విజయ్ కు మంచి ఉద్యోగం దొరికింది. కలకత్తాలోని ఒక పెద్ద కంపెనీలో చేరాడు. అతనే ఇప్పుడు వచ్చింది.

కన్నీళ్ళను తుడుచుకుని వెనక్కి తిరిగి తులసిని చూసాడు. సన్నని గొంతుకతో...

"మామయ్య చావుకు మా ఇంట్లో నుండి ఎవరైనా వచ్చారా తులసీ?"

"లేదు విజయ్! ఒకవేల వచ్చున్నా నాకు వాళ్ళేవరూ తెలియదే. మీ ఇంట్లో వాళ్లని నేను చూసిందేలేదు...అందువల్ల గుర్తు పట్టుండను. అమ్మ ఆసుపత్రిలో ఉండటంతో...నాకు చెప్పటానికి కూడా ఎవరూ లేరు"

"పోనీలే....నేనొచ్చాను కదా. నువ్వు ధైర్యంగా ఉండు"

"ధాంక్స్ విజయ్అవును నాన్న చావు గురించి నీకు ఎలా తెలిసింది...నువ్వుండేది కలకత్తాలో కదా?"

"నిజమే తులసీ.... మీ నాన్న చావు గురించి నాకు ఎలా తెలిసిందో నేను చెపితే, ఆ విషయం విని నువ్వు ఆశ్చర్యపోతావు…ఇప్పుడు టైము ఎంత?" అడిగేసి 'హాలులో' ఉన్న గోడ గడియారాం వైపు చూసాడు. దాంట్లో టైము...పదకుండున్నర దాటుతోంది.

                 ************************************PART-10******************************

" రోజు ప్రొద్దున పదకుండు గంటలకు నేను 'డ్యూటీ' లో ఉన్నాను. ముందు రోజు రాత్రి నాకు సరిగ్గా నిద్ర లేదు. తెల్లవారుజాము నాలుగు గంటలవరకు 'కంప్యూటర్తో పోరాడవలసి వచ్చింది. అందువలన డ్యూటీలోనే పదకుండు గంటలకు అలసిపోయి నిద్రలోకి జారుకున్నాను. ఒక పది నిమిషాలే కళ్ళు మూసుకున్నాను. అంతలో ఒక కల...మీ నాన్న, అమ్మ ఒక కారులో వెడుతున్నట్లు గానూ; అది ప్రమాదంలో చిక్కుకున్నట్లుగానూ!

భయంతో కదిలినప్పుడు మెలుకువ వచ్చింది. అప్పుడే అమ్మ దగ్గర నుండి 'ఫోన్వచ్చింది. నిజంగానే కారు ప్రమాదంలో మామయ్య, అత్తయ్య చనిపోయేరనినేను నమ్మలేక పోయాను. ఒక్క నిమిషం అలాగే స్థంభించి కూర్చుండిపోయాను. అమ్మ ఫోనులోనే ఏడుస్తోంది. మీ ఇంటికి వెళ్ళకూడదని నా తండ్రి నా తల్లికి ఆజ్ఞ వేశారుట. దాన్ని కాదని నేను వెళ్ళలేనని చెప్పి ఏడ్చింది మా అమ్మ. "ఏడవకమ్మా! నేను వెల్తానుఅని చెప్పి వెంటనే 'లీవుపెట్టి, ఒక టాక్సి పుచ్చుకుని బయలుదేరి వచ్చాను తులసీ..."

--విజయ్ చెప్పిన విషయాలు...తులసికి భయబ్రాంతులు కలిగించాయి.

"విజయ్...నాన్న చనిపోయింది కారు ప్రమాదంలోనేనీకు అదేలాగా కల వచ్చింది. ఇది నిజంగానే ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఇది ఎలా...? ఇక్కడ ఐదు నిమిషాలకు ముందు నాకు కొన్ని అమానుష అనుభవాలు ఎదురైయ్యాయి. నాన్నగారు రుములో అదిగో ఈజీ చైర్లో కూర్చుని ఎలా నన్ను చూసి మాట్లాడేవారో...అదేలాగా మాట్లాడారు..........జరిగింది ప్రమాదం కాదమ్మా...హత్య అని చెప్పారు! దీన్ని భ్రమ అని చెప్పనా...లేకనిజమేనా? నాకంతా గజిబిజిగా ఉన్నది. అయ్యో! విషయాన్ని ఎవరితోనైనా చెప్పి వాళ్ళ అభిప్రాయం అడుగుదామనుకుంటే ఎవరూ లేరే అని బాధపడుతున్నప్పుడే నువ్వొచ్చి తలుపు తట్టావు..."

చమట కారుతున్న ముఖంతో తులసి చెప్పిన విషయం విన్న విజయ్ ముఖంలో ఏన్నో మార్పులు.

"ఏమిటి విజయ్...ఎందుకు నీ మొహం అదొలాగా మారింది"

"తులసీ...నేను కారులో వచ్చేటప్పుడు నాకు తెలియకుండానే నిద్రపోయాను. అప్పుడు కూడా కలలో నీ తండ్రి వచ్చారు. నువ్వు చెప్పావే 'హత్యఅని...అదే నాతో కూడా చెప్పారు..." 

విజయ్ చెప్పిన మరు క్షణం...తులసి కళ్ళార్పటం ఆగిపోయింది. చూపులు రెండు గుచ్చుకున్నాయి.

ఖచ్చితంగా అదే క్షణంలో గోడకు వెలాడుతున్న ఫోటో చలనంతో ఊగిసలాడింది

ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు……

'సందేహించకండి...నేనే; నేనే' అని చెబుతున్నట్లుంది ఫోటో ఊగిసలాట.

"విజయ్..."

"తులసీ...అది మామయ్యే!"

"దీన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను విజయ్. నాన్నను హత్య చేసి, అమ్మను కోమాలో పడుకోబెట్టిన అతన్ని ఇప్పుడే నా చేతులతో చంపేయాలనుంది..."

-- తులసి ఆవేశపడింది.

"అదెవరు...అతని పేరు ఏమిటి?"

"సింహాద్రి...మాకని ఉన్న మూడు ఎకరాల స్థలం కోసం నాన్నను హత్య చేసేంత వరకు వెళ్ళాడు"

"హత్య వరకు అంటే...నాన్నగారు, అతనికి స్థలం ఇవ్వనని చెప్పేసారా....లేక, మొసం చేసి రాయించుకుందామనుకున్నాడా?"

నాన్న స్థలం అమ్మను అనే చెప్పుండాలి. ఎందుకంటే...అది మన కుటుంబ స్థలం. వంసపారంపర్య ఆస్థి. కంచె వేసి...లోపలకు ఏదీ జొరబడకుండా బద్రత చేసి చూసుకుంటూ వచ్చారు. ఏదైన తోటలు వేద్దామని అడిగితే, 'లేదమ్మా...అక్కడ ఏమీ చేయకూడదు. స్థలం అలా ఉంటేనే మనకు మంచిదిఅంటారు. ‘ఎందుకనిఅని అడిగితే 'అవన్నీ మీకేందుకు?' అన్నారు"

"అంటే స్థలం వెనుక ఏదో రహస్యం ఉంది. అదే సింహాద్రి చేత యాక్సిడెంట్ పేరొతో హత్య వరకు చేయించింది"

"బాగా అలొచిస్తే అలాగే ఉంది. జరిగింది హత్య అని చెబితే...నాన్నగారు రహస్యాలను విడమరిచి చెబితేనే మనం విషయంలో ముందడుగు వేయగలం. ఏదైనా చేయగలం"

తులసి ఆలొచన కరెక్టే. దానికి ఆమోదం తెలిపే విధంగా పరమేశ్వర్ గారి టేబులు మీదున్న పెన్ను ఎవరొ కావాలని తోసినటు క్రింద పడి దొర్లుకుంటూ విజయ్ కాళ్ళ దగ్గరకు వచ్చి ఆగింది.

"తులసీ...ఇది?"

నాన్నగారి ఫేవరేట్ పెన్ను"

ఇది ఇప్పుడు నా కాళ్ళ దగ్గరకు వచ్చింది అంటే...దీన్ని తీసుకోమంటున్నారు. ఆయన మన అన్ని ప్రశ్నలకు సమాధానమివ్వటానికి రెడిగా ఉన్నారు అన్నట్లు ఉంది..."

"నాకూ అలాగే అనిపిస్తోంది….'కమాన్విజయ్..."  

--తులసియే వొంగుని పెన్ను తీసి విజయ్ కి ఇచ్చింది.

అతనూ దాన్ని తీసుకుని రాయడానికి రెడి అన్నట్లు పెట్టుకుని...టేబుల్ ముందు కూర్చుని ఒక నోటు పుస్తకాన్ని తెరిచి పెట్టుకున్నాడు.

విశాలపురం గ్రామం

అశోక వర్మ ఆయన కుటుంబ స్థలంలో తిష్టాదేవికి గుడి కట్టబోతున్నారని ఊరి ప్రజలకు తెలిసింది. గుడి కట్టటానికి ఆత్మానంద శ్వామీజీ కూడా ఒక కారణం అని ఊరి ప్రజలందరూ నమ్మారు. కొందరికి భయం వేసింది. కొందరికి గందరగోళంగా ఉంది.

'తిష్టాదేవిని ఎక్కడా....ఎవరూ దేవతగా కొలవనప్పుడు మనం మాత్రం గుడి కట్టి దేవతగా కొలవాలనుకోవడం సరికాదుఅని మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. చివరిగా...'ఊర్లో గుడికట్టకూడదు. ఊరి బయట ఎక్కడైనా కట్టుకోండిఅని ఉరి పెద్దలందరూ నిర్ణయించుకుని డప్పు చాటింపు వేయించారు. విషయాన్ని ప్రత్యేకంగా అశోక వర్మ కు తెలుపడానికి ఒక ఊరిపెద్దను తిన్నగా వాళ్ళింటికే పంపారు

ఊరి పెద్ద అశోక వర్మ ఇంటికి వచ్చాడు. "వద్దు అశోక వర్మ...ఆత్మానంద శ్వామీజీ చెప్పారు కదా అని తిష్టాదేవికి నీ స్థలంలో గుడి కాట్టాలనుకోవడం సరి అనిపించడం లేదు. దానికి బదులు ఆత్మానంద శ్వామీజీకే విగ్రహాన్ని ఇచ్చి...ఆయన్నే పూజలు చేయమని చెప్పవచ్చుగా?" అని అడిగాడు.

విషయం  ఆత్మానంద శ్వామీజీ కి తెలిసింది. ఆయన కోపంతో.......

"పిచ్చోళ్ళారా….నాకని ఒక దారి ఏర్పరచుకుని, దారిలో నేను వెడుతున్నాను. నేను ఒక శివ భక్తుడ్ని. శివుడిని తప్ప ఇంకెవరినీ కొలవను. అలాగని మిగిలిన దేవతలను కొలవద్దని నేననడం లేదు.

కళాశాల పుస్తకాల్లో ఎన్నో పాఠాలు ఉంటాయి. ఒక్కో విధ్యార్ధికి ఒక పాఠం ఇష్టంగా ఉంటుంది. విద్యార్ధి ఇష్టమైన పాఠాన్నే ఇష్టంగా చదువుతాడు. దీనికి అర్ధం మిగిలిన పాఠాలు చదవరని కాదు….ఇక్కడ తిష్టాదేవి అనేది కూడా ఒక పాఠం. కానీ కష్టమైన పాఠం. దేవత మాత్రం మనం శుభ్రంగా, నిజాయితీగా ఉంటేనే మనకు అనుగ్రహం ఇస్తుంది. అలా ఉండలేము అని అనుకోవటం వలనే తిష్టాదేవికి మన ఊర్లో గుడి కట్టటానికి వ్యతిరేకం ఎక్కువగా ఉన్నది.

ఎప్పుడు ఆమెను కొలవడానికి భయపడటం మొదలుపెట్టారో...అప్పుడే విగ్రహాన్ని తిరిగి పూడ్చిపెట్టేయటమే కరెక్ట్అని తీర్మానించుకుని అశోక వర్మ ని పిలిచి "గుడి కట్టొద్దు...విగ్రహాన్ని పూడ్చిపెట్టేయ్" అని చెప్పి పంపించారు.

అందరూ ఉండగా అశొక వర్మతో అలా చెప్పిన ఆత్మానంద శ్వామీజీ, అశోక వర్మను ఒంటరిగా పిలిచి చెవిలో ఏదో చెప్పారు. తరువాత అశోక వర్మ ముఖంలో సంతోషం, ఆనందం వెళ్ళివిరిసింది.

ఈసారికూడా ఆత్మానంద శ్వామీజీ ముఖ్య శిశ్యుడు సర్వానంద శ్వామిజి అశొకవర్మ ను  పిలిచి "శ్వామీజీ ఏం చెప్పారు?" అని అడిగాడు.

"అది దైవ రహస్యం...తెలుసుకోవాలనుకుంటే శ్వామీజీనే అడగండి" అని అశొకవర్మ చెప్పటంతో సర్వానంద శ్వామిజికి లోలోనా కోపం వచ్చింది.

                                           ************************************

విశాలపురం టౌన్ 

టేబుల్ ముందు విజయ్.

గోడ గడియారంలో క్షణాలు చూపించే ముల్లు శబ్ధం తప్ప ఇంకెటువంటి శబ్ధమూ లేని అర్ధరాత్రి పొద్దు.

తులసి విజయ్ నే చూస్తోంది. అతని చేతిలో రాయడానికి రెడీగా ఉన్న పెన్ను.

"విజయ్... ఇప్పుడు పెన్నును నీ మూలం ఉపయోగించి, మన ప్రశ్నలకు నాన్న సమాధానం ఇస్తారా?"

"అలాగే అనుకుంటున్నా తులసి. ఇదంతా నీకు, నాకు కొత్త అనుభవమేగా?"

"ఖచ్చితంగా...! బయట ఎవరికి చెప్పినా ఎవరూ నమ్మరు"

"ఎందుకు చెప్పాలి తులసి...? ఇది మన అవస్త. మనకోసం చూపించే దారి! ఎంత ప్రేమ ఉంటే మీ నాన్న చనిపోయి ఆత్మ రూపంలో ఉన్నా కూడా వచ్చి మనకు దారి చూపిస్తారు చెప్పు..."

"నిజమే...! నాన్న గారి ప్రేమకు సరిసమంగా తూగే ఇంకొకటి ఈలోకంలోనే లేదు"

చెబుతున్నప్పుడే దుఃఖం పొంగుకువచ్చింది. క్షణం విజయ్ లో కూడా ఒక మార్పు. అతని శరీరంలోకి ఎవరో జొరబడినట్లు ఒక అలజడి.

అతని చేతిలోని పెన్ను వేగంగా రాయడం మొదలుపెట్టింది.

'నా ప్రియమైన తులసి...విజయ్!'

నా రాకను ఎదురు చూసి భయపడకుండా పేన్ను తీసుకుని రెడీగా కూర్చున్న మీకు అభినందనలు. 'చావు తరువాత ఒక మనిషి ఊపిరి ఏమవుతోంది?' అనే ప్రశ్న నాకూ ఉంది. దానికి చాలా సమాధానాలు చదివేను. ఎవరూ ఖచ్చితమైన సమాధనం చెప్పలేదు. ఒకవేల చెప్పినా ...అది సరైన సమాధానమని చచ్చిపోయిన తరువాత గాని ఎవరూ అవగాహన చేసుకోలేరు?

నా అభిమాన పిల్లల్లారా

ఇప్పడు నేను మనసులో లోతైన నిర్ణయాలకు వచ్చాను...మనమైనా సమాధానాన్ని తెలుసుకుని ప్రపంచానికి తెలియచేద్దాంఎదురుచూడని ప్రమాదం వలన నేను కోరిక తీరని ఆత్మలాగా అవటంతో సమాధానం  దొరికే సంధర్బం దొరికింది.

శరీరంలేని పరిస్థితిలో ఆలొచనలను రేడియో లాగా వరుసక్రమంలో పెట్టుకుని అందులోనుండి మాట్లాడటం, రాయడం నాకే కొత్తగా ఉంది.

నేను ఉన్నానా...లేదా అనే విషయంలోనే నాకు స్పష్టత లేదు. తేలుతున్నట్టు, ఎగురుతున్నట్టు ఉన్నది. ఇలా చెప్పటం కూడా తప్పేమో! నా పరిస్థితిని చెప్పటానికి భాషలోనూ మాటలు లేవు. నేను మాట్లాడేదంతా కూడా తప్పేమో....

అందుకనే కాబోలు మన పెద్దవాళ్ళుచూసినవాడు చెప్పడు...చెప్పేవాడు చూసుండడుఅని చెప్పారు.

సమయంలో నా ఆత్మ గురించిన వివరణ అంత ముఖ్యం కాదు. జరిగిపోయిన ప్రమాదం అనే హత్య గురించి, దానికి గల కారణాల గురించి చెప్పాలి.

                    *************************************PART-11****************************

నా వంశపారంపర్య ఆస్తి... మూడేకరాల స్థలమే అన్నిటికీ కారణం. స్థలం మామూలు స్థలం కాదు...ఆందులో మన వంశపారంపర్య ఆస్తి అయిన ఒక దేవుని  విగ్రహం దాగుంది. విగ్రహం మామూలు విగ్రహం కాదు! వెల కట్టలేని లోహాలతో చేసిన తిష్టాదేవి విగ్రహం. విగ్రహాన్ని గర్భ గుడిలో ఉంచి సక్రమంగా పూజలు చేస్తూ వస్తే అంతా మంచే జరుగుతుంది. అలా జరగకపోతే విపరీతాలు జరుగుతాయి.

తిష్టాదేవి దూరంగా ఉండి ప్రజలను కాపాడే దేవత. ఆమెకు లక్ష్మీదేవి తోడుగా ఉంటుంది. ఆమెను జాగ్రత్తగా సక్రమంగా పూజించాలి. పూజలో చిన్న తప్పు జరిగినా ఆపదే! అలాంటిదే...తిష్టాదేవి విగ్రహాన్ని మా ముత్తాతల్లో ఒకరైన  అశొక వర్మ  గారు కనుగొన్నప్పుడు జరిగింది. కరువుతో కొంత కాలమూ, వరదతో కొంతకాలమూ ఊరు కష్టాలలో పడింది. తిష్టాదేవి విగ్రహాన్ని ఎలా ప్రతిష్ట చేయాలో పురాణాలలో ఉన్నదని చెబుతారు. పురాణం తెలిసిన వారు ఎవరూ లేరు.

తిష్టాదేవి విగ్రహం ఎలా విశాలపురం లోకి వచ్చిందీ...ఎలా మన ముత్తాత ఇంట్లోకి వచ్చిందో తెలియదు. తెలుసుకోవటానికి ఆశపడితే...కొన్ని వందల ఏళ్ళ వంశ చరిత్రలోకి వెళ్ళాలి. మా ముత్తాతలు కూడా పరిశోధనలోకి వెళ్ళటానికి ఇస్టపడలేదు. విగ్రహాన్ని ఉంచుకుని పూజలు చేయాటానికే ఇష్టపడ్డారు. కానీ భయపడిపోయిన ఊరి ప్రజల ఎదిరింపుతో విగ్రహాన్ని మూడు ఎకరాల స్థలంలో ఈశాన్య మూలలో పూడ్చిపెట్టారు.  

స్థలంలో దైవం ఉన్నది కాబట్టి స్థలంలో ఎటువంటి అపవిత్రం జరగకూడదు. అలా జరిగితే అది తిష్టాదేవికి ఆగ్రహం తెప్పిస్తుంది. అందుకనే స్థలంలో తోట కూడా వేయలేదు. తోట వేసేటప్పుడు అక్కడ పనిచేసేవాళ్ళు స్థలాన్ని అపవిత్రం చేసే అవకాశం ఉందికదా?

కనుకే స్థలానికి కంచె వేసి కాపాడుకుంటూ వచ్చారు. స్థలంలో తిష్టాదేవి విగ్రహం పూడ్చిపెట్టబడి ఉన్నదనే విషయం మా వంశస్తులకు మాత్రమే తెలుసుకానీ విగ్రహం వెల కట్టలేని లోహాలతో చేసినదని ఎవరికీ తెలియదు. లోహాలకు ఎంత శక్తి ఉన్నదో కూడా ఎవరికీ తెలియదు. కానీ, విగ్రహాన్ని సుచి, శుభ్రతతో సక్రమంగా పూజిస్తే ఉరికి మేలు జరగటంతో పాటూ శుభిక్షంగా ఉంటుంది.

విగ్రహాన్ని ఎలా పూజించాలో తెలియకపోవటమే విగ్రహం పూడ్చుకుపోవటానికి కారణం. విగ్రహం వలన లాభాలు ఏమిటో ఆలశ్యంగా ఆత్మానంద శ్వామీజీ గారి డైరీని చదివిన ఆయన ముఖ్య శిశ్యుడైన సర్వానంద శ్వామీజీ తెలుసుకున్నాడు. ఆయన తనకు తెలిసిన వివరాలను ఎక్కడ రాశాడో, ఎక్కడ బద్ర పరిచి ఉంచాడో తెలియదు. దాన్ని ఎలాగో తెలుసుకున్నాడు ఇప్పుడున్న జీవానంద శ్వామీజీ. రోజుల్లో శ్వామీజీలు నిజాయితీతో ఉండేవారు. రోజుల్లో కొందరు శ్వామీజీలు నకిలీ శ్వామీజీలుగా మారిపోయారు. జీవానంద శ్వామీజీ నకిలీ కోవకు చెందిన వాడు....నేను హత్య గావించబడి ఆత్మగా తిరగటానికి కారణం కూడా అతనే. అతనే సింహాద్రి ని  ప్రోశ్చాహించి స్థలాన్ని కొనడానికి ప్రయత్నించాడు.   

రోజు విగ్రహం ఖరీదు వెయ్యి కోట్లు. అంత ఖరీదైన, పూజింపబడాల్సిన విగ్రహం పూడ్చి పెట్టే ఉంచడం వలన...దాని కారణంగా మన కుటుంబ వంశీకులు కష్టాలే అనుభవించారు.... అంతా ఉరి ప్రజల కోసమేమా అమ్మా, నాన్నా మామూలుగా చనిపోలేదుబస్సు ప్రమాదంలో చనిపోయారు. ఇప్పుడు విగ్రహం విషయం ఒక మానవ మృగానికి తెలిసింది. విగ్రహాన్ని తీసి విదేశాలకు అమ్మి అటు ప్రపంచ ప్రజలకు, ఇటు మన ప్రజలకు నష్టం వాటిల్ల జేస్తారు...దాన్నీ మనం ఆపాలి . అదే మానవ మృగం నన్ను హత్యచేసింది. ఇక తప్పు జరగకూడదు.

విజయ్...నువ్వు నా సహోదరి కొడుకువి. తులసికి వరుస అవుతావు. నా కూతుర్ని పెళ్ళిచేసుకో. దాని వలన విడిపోయిన రెండు కుటుంబాలు కలుస్తాయి. మీరిద్దరూ కలిసి మన స్థలానికి వెళ్ళి పూడ్చి పెట్టబడిన విగ్రహాన్ని తవ్వి తీసి, మన ఊర్లో ఉన్న శివాలయంలోని భావిలో పడేయండి. దీని వలన బావి నీళ్ళు ఆరొగ్యానికి మందు అవుతుంది. ఆలయంలోని భావి నీటిని అభిషేకానికి మాత్రమే ఉపయోగిస్తారు కనుక విగ్రహం కూడా అభిషేకంలో ఉంటుంది.

అత్యాశ ఉన్న వాళ్ళు విగ్రహాన్ని అపహరించటానికి వచ్చి, దానివలన విపరీతాలు జరిగితే దానికి మనమే భాద్యులం అవుతాము. కనుక...విగ్రహం ఆలయ బావిలో ఉండటమే మంచిది. రోజు రాత్రికే ఎలాగైనా, ఎంత కష్టం వచ్చినా పని చేసేయండి. గుడిలోకి మీరు చొరబడటానికి గుడి తలుపులు తెరిచి ఉంటాయి. కాపలాదారును లేపి తలుపులు తెరిచి ఉంచటం నా భాద్యత.

భాద్యతను మంచిగా చేసి ముగిస్తే...ఏమీ జరగనట్లు స్థలాన్ని సింహాద్రికి అమ్మేయండి. అతన్ని, అతనికి తోడుగా ఉన్న శ్వామీజి, క్రిష్ణారావును,కోటేశ్వరరావు నూ నేను చూసుకుంటా.

ఆసుపత్రిలో ఉన్న మీ అమ్మ త్వరలోనే కోలుకుంటుంది. నా ఆత్మ శక్తితో నేను పరలోకానికి చేరుకునే వరకు మీకు తోడుగా ఉండి దారిచూపుతాను. మీరు దేని గురించి ఆలొచించకండి.

ఆశీస్సులతో.

ప్రియమైన నాన్న.

పరమేశ్వర్.  

మాట్లాడవలసినదంతా రాసి పూర్తిచేసిన పరిస్థితిలో రాస్తున్న విజయ్ చెయ్యి హటాత్తుగా ఆగిపోయింది. అతనుకూడా టేబుల్ పైన మొక్కలాగా విరుచుకు పడ్డాడు. అన్నీ కొన్ని క్షణాలే! తరువాత పైకి లేచాడు...రాసినదానిని చదివాడు.

కన్నీళ్ల నిండిన కళ్ళతో తులసి కూడా చదివింది. చదివి వెక్కి వెక్కి ఏడ్చింది. విజయ్...తులసి కన్నీళ్లు తుడిచాడు.

తులసీ! చెడులో ఒక మంచి జరిగినట్లు మీ నాన్న మనతో ఉత్తరం ద్వారా మాట్లాడారు. ఇది ఎంత పెద్ద విషయమో తెలుసా? ఎవరికి దొరుకుతుంది ఇలాంటి అదృష్టం?  

ధైర్యం తెచ్చుకుని బయలుదేరు. మీ నాన్న చెప్పినట్లు మొదట విగ్రహాన్ని తీసి భావిలో పడేద్దాం. హత్యకు కారణమైన సింహాద్రి కే స్థలాన్ని అమ్మి డబ్బు తీసుకుందాం. అది అతను కట్టబోయే అపరాధము. ఇకపోతే మనిషిని మీ నాన్న ఎలా దండిచాలో అలా దండిస్తారు..." అన్నాడు విజయ్.

తులసి కూడా మనసులో ధైర్యం తెచ్చుకుని రెడీ అయ్యింది.   

విశాలపురం గ్రామం

ఒక పౌర్ణమి రోజు తన స్థలంలోనే గొయ్యి తవ్వి విగ్రహాన్ని పూడ్చి పెట్టాడు అశోక వర్మ...అప్పుడే స్థలం చుట్టూ ముళ్ల కంచె వేశాసారు. ఒక విధంగా సమస్య అణిగి పోయింది. కొందరు కొంతకాలం విగ్రహం గురించి మాట్లాడారు. తరువాత   విగ్రహం గురించిన మాటేలేదు. విగ్రహాన్ని ఒక  దుష్ట శక్తి లాగా అనుకోవడం వలన ఆవులనూ, మేకలనూ  కూడా మేయడానికి స్థలం వైపు వెళ్లకుండా చూసుకున్నారు.

కానీ, అశోక వర్మకు  తానొక పిరికి పందలాగా నడుచుకున్నానే నన్న బాధ మనసును పీడ్చుకు తిన్నది. శేషమాంబను కూడా 'నమస్కరించుకోవలసిన దేవతను ఇలా శవంలాగా పూడ్చి పెట్టేమే' నన్న బాధ మానసికంగా కుంగదీసింది.

అశోక వర్మ తన మన్సులోని బాధనంతా ఒక పుస్తకంలో రాసుకున్నారు. ఒక రోజు పొలం గట్టు నుండి నడిచి వస్తుంటే, పాము కరిచి అక్కడే నురుగు కక్కుకుని ప్రాణం వదిలారు. కొన్ని నేలల వ్యవధిలో శేషమాంబ కూడా విష జ్వరంతో మరణించింది. వీళ్ళిద్దరి చావుకూ విగ్రహమే కారణం అని మాట్లాడుకున్నారు.

విగ్రహం అరుదైన లోహాలతో తయారు చేయబడ్డదని ఊరి సరిహద్దులో ఉన్న కొండపై నివాసముంటున్న ఆత్మానంద శ్వామీజీకి, చనిపోయిన అశోక వర్మకు మాత్రమే తెలుసు. తరువాత ముత్తాతలు రాసి ఉంచిన పుస్తకాలను చదివిన పరమేష్వర్ గారు తెలుసుకున్నారు.

ఇక్కడ పరమేశ్వర్ గారు తెలుసుకున్నట్లే అక్కడ శ్వామిజీ ముక్తి చెందిన తరువాత ఆయన పీఠాన్ని ఇప్పుడు దక్కించుకున్న సర్వానంద శ్వామీజి, ఆత్మానంద శ్వామీజీ  రాసిన పుస్తకాలను చదివి విగ్రహం యొక్క శక్తి ఎటువంటిదో తెలుసుకున్నాడు.

విగ్రహాన్ని పెట్టుకుని సాహసాలు చేయవచ్చని, ఒక ఊరినే నేలపాలు చేయవచ్చని, విగ్రహాన్ని ఉపయోగించుకునే పద్దతితో మంచి-చెడు రెండూ జరపవచ్చు అని తెలుసుకోవటమే కాకుండా విగ్రహంలో ఉన్న అరుదైన లోహాలతో కొన్ని కోట్లు సంపదించుకోవచ్చని  తెలుసుకున్న సర్వానంద శ్వామీజి ఎలాగైనా ఆవిగ్రహాన్ని చేజిక్కించుకోవాలని ఆశపడ్డాడు.

                     *******************************PART-12**********************************

విశాలపురం టౌన్  

మధ్య రాత్రి పన్నెండు గంటలు.

ఇంట్లోని గోడ గడియారంలోని పెండ్యులం శబ్ధం స్పష్టంగా వినబడి ఆగిపోయింది. తలుపులు తెరుచుకుని తులసి బయటకు వచ్చి చూసింది. ఎప్పుడూ ఏడుస్తూ మందమైన కాంతితో వెలిగే వీధి దీపాలు రోజు అలా కూడా వెలుగా కుండా ఆరిపోయున్నాయి.

రాత్రి చీకటికే సొంతమైన కొన్ని కీటకాల శబ్ధం.

ఇద్దరూ ఒక టార్చ్ లైటు, గడ్డపలుగు, ఒక చిన్న పళ్లెం తీసుకుని రోడ్డుకు వచ్చారు. కొంచం దూరం నడిచి వెళ్ళిన విజయ్ వెనక్కు తిరిగి ఇంటికి వచ్చాడు. పరమేశ్వర్ గారు వాడుతున్న 'మొపేడ్' కనబడింది.

అర్ధం చేసుకున్న తులసి "ఏమిటి విజయ్...బండిమీద వెళ్దామా?" అని అడిగింది.

"అవును తులసీ... విగ్రహాన్ని తీసుకుని మనిద్దరం నడవగలమో...లేమో?"

"అయితే సరి...బండి తీయ్" అని చెప్పిన తులసి ఇంట్లోపలకు వెళ్ళి బండి తాళంచెవిని తీసుకు వచ్చింది.

విజయ్ బండిని స్టార్ట్ చేయకుండా తోసుకుంటూ నడిచాడు. కొంచం దూరం వెళ్ళిన తరువాత 'స్టార్ట్' చేశాడు.

తులసి వెనుక కూర్చుంది.  

ఆమె ఒక చేతిలో గడ్డపలుగు పట్టుకుంది.

ఎవరైనా చూస్తే విపరీతంగానే అనుకుంటారు. అయినా కానీ నాన్న ఆత్మ ఖచ్చితంగా తోడు వస్తుంది అనే నమ్మకం వాళ్ళను నడిపిస్తోంది.

ఒకచోట ఒక వీధి కుక్క కనబడింది. వీళ్ళను చూసి పెద్దగా అరవడం మొదలుపెట్టింది. కుక్క అరుపుతో వీధిలోని వారందరూ మేలుకోంటారేమో నని తులసి భయపడ్డది. సడన్ గా కుక్క అరవటం మానేసి వేనక్కు తిరిగి ఎదురు దిక్కుగా పరిగెత్తింది.  

"ఏమిటి విజయ్ ఇది...మనల్ని చూసి అరుస్తున్న కుక్క అరుపు ఆపేసి ఎదురు దిశలో వెడుతోంది"

" కుక్క వలన మనకు ఆటంకం రాకుండా ఉండటానికి దాన్ని మీ నాన్న లాక్కుని వెడుతున్నారు సంధ్యా..."

"అలాగైతే మనతోపాటూ నాన్న వస్తున్నారా?"

"కుక్కలకు ఆత్మలను చూసే శక్తి ఉన్నదని చదువలేదా?"

విజయ్ ఇచ్చిన వివరణ తులసిని మళ్ళీ ఏడిపించింది.

"తులసీ...ఇది ఎమోషనల్ అయ్యే తరుణం కాదు. నాన్న చెప్పిన రహస్యాన్ని చేసి చూపడమే తరుణంలో ముఖ్యం...కమాన్ బీ బ్రేవ్!"

వాళ్ళ మూడు ఎకరాల స్థలం, రాత్రి పిడిలో నల్లగా కాటుక పూసుకున్నట్టు ఉన్నది. అంత పెద్ద స్థలంలో విగ్రహాన్ని ఎక్కడ పూడ్చిపెట్టారో ఎలా తెలుసుకోవటం?

విజయ్ కంచెకు ముందు మోపేడ్ ను ఆపి తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు ఆకాశాన్ని మేఘం కప్పేసింది. వర్షం వచ్చే సూచన తెలుస్తోంది.

మెరుపు ఒకటి 'డ్రాగన్ఆకారంలో వంకరటింకరగా తిరుగుతూ ఆకాశంలో పెద్ద వెలుగునిచ్చింది. వెలుగులో కొంత స్థలం కనబడింది.

తులసికి అంతా అయోమయంగా ఉన్నది.

"విజయ్... వెలుతురులో విగ్రహాన్ని పూడ్చిపెట్టిన చోటు ఏదో తెలియలేదు కదా?"

"అవును తులసీ...కానీ ఇంతదూరం దారిచూపిన మీ నాన్న ఇక్కడ దారిచూపరా ఏమిటి?" విజయ్ నమ్మకంగా చెప్పింది వృధా అవలేదు

రోడ్డు మీద వచ్చేటప్పుడు ఎదురు దిక్కు వైపు అరుచుకుంటూ పరిగెత్తిన కుక్క,అక్కడా కనబడ్డది. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అప్పుడప్పుడు అరుస్తున్న కుక్క కంచేను దాటుకుని స్థలంలోకి పరిగెత్తింది.

మరో మెరుపు వెలుతురులో అది కనబడ్డది

"తులసీ! కుక్కను వెంబడించి వెళ్ళాలి..." అంటూ, చేతిలోని టార్చ్ లైటును ఆన్ చేసుకుని కుక్క వెళ్ళిన వైపుకు వెళ్ళాడు. కంచెలో నుండి దూరటానికి తులసి ప్రయత్నించినప్పుడు ఆమె దుప్పటా కంచేలో చిక్కుకుని ఆమెకు అడ్డుపడింది...టార్చ్ లైట్ వెలుతురులో దుప్పటాను తీయడానికి చాలా శ్రమపడ్డాడు విజయ్. అప్పుడు ఎవరో కంచెను పెద్దది చేసి దుప్పటాను తీశారు.

"నాన్నా..." అంటూ అక్కడే వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది తులసి. అప్పుడు ఆమె ముఖంపైన టార్చ్ లైట్ వేశాడు విజయ్. అది చూసి విజయ్ వైపుకు పరిగెత్తింది తులసి. అక్కడ కనబడ్డ కుక్క మళ్ళీ పరిగెత్తిందిఒక చోటుకు వెళ్ళి అక్కడ  తన కాళ్ళతో మట్టిని లాగుతోంది.

"తులసీ... చోటే! చూడు కుక్కే తవ్వి చూపిస్తోంది"

----తులసి చేతికి టార్చ్ లైట్ ఇచ్చి, అక్కడకు వెళ్ళి తవ్వటం మొదలుపెట్టాడు. గబ గబ తవ్వుతుంటే అక్కడ గుంట పడింది. ఐదడుగుల లోతుకు తవ్వినా విజయ్ దగ్గర టయర్డ్ నెస్ కనబడలేదు. కుక్క కూడా ఆదుర్దాగా గుంటలోకే చూస్తోంది. తులసి దానినే తన తండ్రి అనుకుంటూ కూర్చుని దాన్ని ప్రేమగా తడిమింది. దానికీ హాయిగా ఉన్నది.

మరో నాలుగు అడుగులు తవ్వినప్పుడు రాయి ఏదో తగిలినట్లు 'టంగ్' అనే శబ్ధం వినబడింది. విగ్రహం దొరికినట్లు అనిపించింది! విజయ్ 'టార్చ్ లైటూ ను వేసి గుంతలోకి చూశాడు. తులసి కూడా చూసింది. అది విగ్రహమే! ఇద్దరి ముఖాలలోనూ ఆనందం. నేల మీద పడుకుని గుంతలో నుండి విగ్రహాన్ని తీసి బయటపెట్టాడు.

మరుక్షణం చిటపట మంటూ వాన చినుకులు మొదలయ్యాయి. కొద్ది నిమిషాలలోనే పెద్ద వర్షంగా పెరిగింది. విగ్రహాన్ని అభిషేకం చేసింది. వానాభిషేకం తరువాత విగ్రహం పైన ఉన్న మట్టి తొలగిపోయింది. విగ్రహం పరిపూర్ణంగా కనబడింది.

తులసి భక్తితో చేతులెత్తి నమస్కరించింది.

విజయ్ ఒక్కసారిగా విగ్రహాన్నీ ఎత్తి భుజం మీద పెట్టుకున్నాడు. దగ్గర దగ్గర యాబై, అరవై కిలోల బరువు ఉండొచ్చు. బరువు భుజాన్ని నొక్కుతుంటే...విజయ్ నడవడం మొదలుపెట్టాడు. కంచె దాటి బయటకు వచ్చి విగ్రహాన్ని మొపేడ్ వెనుక సీటుపై ఉంచాడు.

వర్షం పెద్ద దయ్యి జోరుగా కురుస్తోంది.

అదీ మంచికే!

వీధులలో మనుష్య సంచారమే ఉండదు. గాలికోసం బయట పడుకున్న వాళ్ళు సైతం లేచి ఇంటిలోపలకు వెళ్ళిపోతారు.

స్థలంలో....తవ్వితీసిన మట్టిని వర్షపు నీరు కరిగించి గుంతను మూసేసింది.

మొపేడ్ పైన పెట్టిన విగ్రహాన్ని తులసి పట్టుకుంది...విజయ్ మోపేడును తోయడం మొదలుపెట్టాడు.

కుక్క ముందు పరిగెత్తింది....కొంచం కూడా కన్ ఫ్యూజనో, భయమో, లేకుండా మోపేడ్ బండిని తోసుకుంటూ నడిచాడు. విగ్రహం రాత్రి వేల ఊరును చూసుకుంటూ వాళ్ళతో వెడుతోంది.

                                               ****************************************

శివాలయం!

కుంబవృష్టి వర్షం...గుడి కాపలదారున్ని లేపి గుడి వాకిలిని తెరిచి లోపల మండపంలోకి వెళ్ళేటట్టు చేసింది. ఇదే సాకుగా తీసుకుని కరెంటు కూడా కట్టవటంతో...వర్షం ఆగేంతవరకు వేచి చూద్దాం అనుకుని మండపంలోనే దుప్పటి కప్పుకుని ఉండిపోయాడు కాపలాదారు.

మోపేడ్లో గుడి వాకిలి వరకు వచ్చిన విజయ్ కు,తులసికి గుడి తలుపులు తెరిచి ఉండటంతో కొత్త ఉత్సాహం వచ్చింది. అలాగే లోపలకు దూరారు.

పెద్ద కాంతితో బలమైన మెరుపు!

బావి ఉండే చోటును క్షణంలో చూపించింది. విజయ్ మోపేడ్ ను ఆటు వైపుకు తిప్పాడు. బావి దగ్గరకు చేరుకున్నాడు. కష్టపడి విగ్రహాన్ని మళ్ళీ భుజానికి ఎత్తుకున్నాడు. అప్పుడు ఆకాశంలో పెద్ద పిడుగు శబ్ధం. అది అతనిలో అదుర్లను కలిగించింది... అదుర్ల వలన విజయ్ భుజంపై ఉన్న విగ్రహం జారి బావిలోకి పడిపోయింది. ‘దబేల్మన్న శబ్ధం బావిలో నుండి వినబడటం మరో పెద్ద పిడుగు శబ్ధంతో కలిసిపోయింది.

అన్నీ ప్లాన్ చేసిన విధంగా జరగిపోవటం ఆశ్చర్య పరిచింది. ఇక అక్కడ ఉండకూడదు అనుకుని మొపేడ్ తో మెల్లగా బయటకు వచ్చి, దాన్ని నడుపుతూ ఇంటి వాకిటికి రావటం....కరెంటు రావటం ఒకేసారి జరిగింది. వర్షం తగ్గుముఖం పట్టింది.

మొపేడ్ ను దాని స్థలంలో ఉంచి లోపలకు వెళ్ళిన ఇద్దరూ నీళ్ళు కారుతున్న బట్టలతోనే పరమేశ్వర్ గారి ఫోటో ముందు నిలబడ్డారు.

జరిగింది-జరిగి ముగిసింది అంతా ఒక కలలాగా ఉన్నది.

ఎక్కడో ఉంటున్న విజయ్ రావటం, వచ్చి తులసి జీవితానికి తోడుగా ఉండిపోవటం జరిగింది. ఆమెకు ఒక తోడు అవసరమనిపించి చనిపోయినా తన బాధ్యతను పరమేశ్వర్ గారు నిర్వర్తించడాన్ని ఏమని చెప్పగలం

                                  ************************************************

శుక్రవారం!

సింహాద్రి కారు, ఇంటి ముందు వచ్చి నిలబడింది.

పరమేశ్వర్ గారి ఫోటోకు నమస్కరించుకుని బయలుదేరారు విజయ్ మరియు తులసి.

కారు రిజిస్ట్రేషన్ ఆఫీసు వైపుకు వెడుతోంది. దారిలో క్రిష్ణారావును, కోటేశ్వరరావును సాక్షి సంతకాల కోసం కార్లో ఎక్కించుకున్నారు. విజయ్ ను వింత జంతువును చూసినట్లు చూశాడు కోటేశ్వరరావు.

"మీ అమ్మే కదా ఇంట్లోంచి పారిపోయింది?" తనకే సొంతమైన బాణిలో అడిగాడు.

"ప్రాణాలతో ఉన్నంతవరకు వచ్చి చూడలేకపోయావు. పరమేశ్వర్ గారు చనిపోవటంతో తులసి దగ్గరకు చేరావా?" అంటూ మాటలతొనే కష్టపెట్టాడు కోటేశ్వరరావు.

ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు.

కారుకు ముందు ఒక కుక్క పరిగెత్తుతున్నది..... కుక్క రాత్రి విజయ్, తులసీలకు దారి చూపిన కుక్క.

కుక్కనే చూస్తూ కూర్చున్నాడు విజయ్.

రిజిస్ట్రేషన్ ఆఫీసులోపలకు మొదట కుక్క వెళ్ళింది. దాని వెనుక కారు వెళ్ళింది. లోపల సింహాద్రి రెడీగా ఉన్నాడు. సింహాద్రి తో అక్కడ జీవానంద శ్వామీజీ ఉండటం ఆశ్చర్యపరిచింది

"మీ నాన్న గారికి ఇంటువంటి చావా రావాలి అని ఎంతో బాధపడ్డాను" తులసి దగ్గరకు వచ్చి రాని దుఃఖం ను తెప్పించుకుంటూ చెప్పాడు జీవానంద శ్వామీజీ.

డాక్యూమెంట్స్ రెడీగా ఉన్నాయి.

సింహాద్రి డబ్బు ఆఫీసులో ప్రతి ఒకర్నీ పనిచేయిస్తున్నది.

విజయ్, తులసి మౌనంగా కూర్చున్నారు. సంతకాలు పెట్టాల్సిన సమయం వచ్చింది.

సంతకం పెట్టారు.

తమ దగ్గర ఉన్న పేరంట్ డాక్యూమెంట్ లను వాళ్ళకు ఇచ్చారు. సింహాద్రి బాకీ డబ్బులను ఒక సంచీలో పెట్టి వాళ్ళకిచ్చాడు.

డబ్బులు మాత్రం తీసుకుని సంచీని సింహాద్రికి కి ఇచ్చేశారు.

పని అయిపోవటంతో బయలుదేరారు.

"కార్లొనే డ్రాప్ చేస్తానే..." అన్న సింహాద్రి మాటలను వినిపించు కోకుండా బయటకు వెళ్ళారు.

బయట ఆటో కనబడింది...దాంట్లో ఎక్కారు. కుక్క మాత్రం ఎక్కలేదు.

తులసి తిరిగి తిరిగి చూసింది.

"విజయ్... కుక్క..."

"అది కుక్క కాదు...నీకు నాన్న, నాకు మామయ్య! మన పని ముగిసింది. ఆయన పని ముగించొద్దా?" అన్నాడు

"నువ్వేం చెబుతున్నది సగం అర్ధమయ్యింది...సగం అర్ధం కాలేదు"

"అది పోను పోనే అందరికి అర్ధమవుతుంది" అని చెప్పేసి "తిన్నగా ఆసుపత్రికి వెళ్ళి అమ్మను చూద్దాం" అన్నాడు.

ఆసుపత్రి!

లోపలకు వెడుతూనే వాళ్ళకు ఆశ్చర్యం కాచుకోనుంది.

"మీ అమ్మగారు కళ్ళు తెరిచి చూశారు. ఇంకో పది పదిహేనురోజులలో మాట్లాడే అవకాశం ఉంది" చెప్పింది ఒక నర్స్.

అప్పుడు తులసి సెల్ ఫోనుకు ఫోన్ వచ్చింది.

ఫోన్ ఆన్ చేసి చెవిదగ్గర పెట్టుకున్న వెంటనే నిర్ఘాంతపోయింది.

"ఏమిటి తులసీ?"

"నువ్వు చెప్పినట్లే జరిగింది"

"వివరంగా చెప్పు"

సింహాద్రి రిజిస్ట్రేషన్ ఆఫీసు నుండి తన కారులో తిరిగి వస్తున్నప్పుడు కుక్క అడ్డు రావడంతో, డ్రైవర్ కారును పక్కకు తిప్పగా ఎదురుకుండా వచ్చిన లారీ 'ఢీ' కొన్నదట.

అంతకు మించి తులసి చెప్పలేకపోయింది.

విజయ్ కి అర్ధమైయ్యింది.

అతను అర్ధం చేసుకున్నది, ప్రమాదం ఎలా జరిగుంటుంది...ఎవరెవరు కారులో ఉండుంటారు అనేది మాత్రమే కాదుపరమేశ్వర్ అనే మనిషి ఆత్మ శక్తివంతమైనదే!

తులసి ఆనందంతో విజయ్ భుజంపై వాలిపోయింది. 

  *********************************** సమాప్తం*************************************       



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తొలిచూపు...(పూర్తి నవల)

జీవన పోరాటం…(పూర్తి నవల)

శతమానం భవతి…(పూర్తి నవల)