ప్రేమ సుడిగుండం...(పూర్తి నవల)
ప్రేమ సుడిగుండం (పూర్తి నవల)
'ప్రేమ' అనే రెండక్షరాల మాట చాలా ప్రమాదకరమైనది. అది సుడిగుండం లాంటిది. ప్రేమలో పడ్డవారు ఎవరైనా సరే ప్రేమ సృష్టించే సుడిగుండంలో చిక్కుకోక తప్పదు. ప్రేమ అనే సుడిగుండం లో చిక్కుకుని తప్పించుకున్న వారు చాలా తక్కువ మంది. ఈ నవలలో ప్రేమించుకున్న హీరో, హీరోయిన్లు హీరో తల్లికి ఎంతో ప్రీతిమంతులు, బంధువులు, కావలసిన వాళ్ళూ అయినా వాళ్ళు కూడా ప్రేమ సుడిగుండంలో చిక్కుకున్నారు. ఎందుకు ప్రేమ సుడిగుండంలో చిక్కుకున్నారు, ఆ ప్రేమ సుడిగుండం నుండి ఎలా బయట పడ్డారు? వారి ప్రేమ సుడిగుండంలో వారిద్దరూ ఎదుర్కొన్న సమస్య ఏమిటో మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.
PART-1
కళ్ళు తెరిచిన వెంటనే కిరణ్ జ్ఞాపకాలే వచ్చినై ప్రతిమకు.
ప్రతిమ కిటికీలో నుండి కనబడుతున్న మామిడి చెట్టును చూసింది. పదేళ్ళ కిరణ్ జారిపోతున్న నిక్కర్ను పైకి లాక్కుంటూ ఆ మామిడి చెట్టును ఎక్కుతున్నట్టు ప్రతిమ అంతరంగ కళ్ళకు కనబడింది...చిరునవ్వుతో లేచింది ప్రతిమ.
ఆ రోజు కిరణ్ జన్మ నక్షత్రం. క్రింద వంటింట్లో ప్రతిమ మేనత్త రామలక్ష్మి పాయసం రెడీ చేస్తోంది. అమెరికాలో మొదటి సంవత్సరం చదువు ముగించుకుని కిరణ్ ఇండియాకి తిరిగి వస్తున్నాడు. ఇంకో మూడు గంటలలో అతను వచ్చే విమానం హైదరాబాద్ నేలను తాకుతుంది. ఆ తరువాత మరో గంటలో అతని కారు ఆ ఇంటి పోర్టికోలోకి వచ్చి ఆగుతుంది.
వచ్చిన వెంటనే ఏం చేస్తాడు? అమ్మతో అరగంట సేపు మాట్లాడి, హడావిడి పడుతూ మేడమీదకు వచ్చి ప్రతిమతో గొడవపడతాడు. ఆమెను ఏడిపించకపోతే అతనికి రోజులు గడవవు.
అమెరికా వెళ్ళే ముందు కూడా ఆమెను ఏడిపించాడు.
"వారానికి రెండు సార్లు ఫోన్ చెసి మాట్లాడు కిరణ్"
"ఎందుకమ్మా...ఫోనులో కూడా నీ సుత్తి వినాలనా? నీ దగ్గర నుండి తప్పించుకోవటానికే కదా సముద్రాలు దాటి దూరంగా వెడుతున్నాను. ‘నో...ఫోన్’, ‘నో...ఈమైల్’!"
"ఉత్తుత్తి మాటలు చెప్పకు. నాతో మాట్లాడకుండా నువ్వు ఉండలేవు"
“ఇక్కడున్నప్పుడు వేరే నాధి లేక నీతో మాట్లాడి ఉండొచ్చు. కానీ, ఇకమీదట అలా జరగుతుందా? అయ్యగారు ఎక్కడికి వెడుతున్నారో తెలుసుగా? అమెరికా! నీకంటే స్మార్టుగా ఉండే అమ్మాయులు నా చుట్టూ తిరుగుతారు. వాళ్ళతో మాట్లాడటానికే సమయం చాలదట. అవన్నీ వదులుకుని పనిగట్టుకుని పాత మనిషితో ఫోన్ చేసి మాట్లాడాలా?"
"ఎవర్ని చూసి పాత మనిషి అంటున్నావు?"
"నిన్ను చూసే!"
"నువ్వెలా అమెరికా వెల్తావో చూస్తాను!"
"ఫ్లయిట్ లోనే వెల్తాను. టెర్రస్ పైకి వెళ్ళి చూడు. వీలైతే పై నుండి చేతులూపుతా"
"నిన్నూ..." అంటూ చెయి పైకెత్తి ముద్దుగా కిరణ్ చేతిపై ఒక దెబ్బ వేసింది ప్రతిమ.
"ఈ జిడ్డు మొహాన్ని ఎవరు పెళ్ళి చేసుకుంటారు? నాకు వద్దు బాబూ! నువ్వు కావాలంటే చూడు ప్రతిమా....అమెరికా నుండి తిరిగి వచ్చేటప్పుడు జాలీగా ఆ ఊరి అమ్మాయితో వస్తాను”
“అక్కర్లేకపోతే పోవయ్యా! ఈ జిడ్డు మొహానికి కూడా ఒకడు దొరుకుతాడు"
"దొరుకుతాడంటావా! నాకు నమ్మకం లేదు! అలా ఎవరూ దొరకకపోతే చెప్పు...పోతేపోనీ పాపం అనుకుని ఒకళ్ళకి ఇద్దరుగా నేనే నిన్ను చేసుకుంటా. నా అంతఃపురంలో చిన్న మహారాణిగా ఉండిపో!"
ప్రతిమ మొహం ఎరుపెక్కి కళ్ళల్లో నీరు కారింది...గబుక్కున లేచి పరుగుతీసింది. ఆమె వెనుకే నవ్వుతూ వెంటపడ్డాడు కిరణ్.
ఆ రోజు ప్రతిమ కిరణ్ తోపాటు ఏర్ పోర్టుకు కూడా వెళ్ళలేదు. అంత కోపం. అతనూ రమ్మని పిలువలేదు. అత్తయ్య, ఆమె పెద్ద కొడుకు వరుణ్ ఎక్కిన తరువాత కారు వేగంగా బయలుదేరింది. మేడ మీదున్న కిటిలో నుండి ఏడుపు,
బాధతో చూస్తూ ఉండిపోయింది ప్రతిమ. వాళ్ళు తిరిగి వచ్చేంతవరకు కిటికీని విడిచిపెట్టి రాలేదు.
"ప్రతిమా..." వరుణ్ గొంతు వినబడగానే వెనక్కి తిరిగింది ప్రతిమ.
"కిరణ్ దీన్ని నీ దగ్గర ఇమ్మని చెప్పాడు" అంటూ చిన్న పార్సల్ ను ప్రతిమ ముందుకు జాపాడు.
"ఏమిటిది?"
"నాకెలా తెలుస్తుంది?"
వరుణ్ పార్సల్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు.
తలుపుకు గొళ్ళేం పెట్టి ఆదుర్దాపడుతూ పార్సల్ విప్పింది. అందులో నుండి కాగితాలు మాత్రమే వస్తున్నాయి. కాగితాలు పూర్తిగా తీసిన తరువాత అక్కడొక చిన్న పెట్టె ఉన్నది. పెట్టె తెరిస్తే అందులో చిన్న ఆముదం బాటిల్ ఉన్నది. దాని క్రింద ఒక కాగితంలో ప్రేమతో అని రాసుంది.
ప్రతిమ కడుపు పట్టుకుని నోరు నొప్పి పుట్టేంతవరకు నవ్వుకుంది. పొలమారి కళ్ళల్లో నీళ్ళు తిరిగినై.
రెండు రోజుల తరువాత కిరణ్ దగ్గర నుండి ఈ-మైల్ వచ్చింది.
"హాయ్...నా జిడ్డు మొహమా!" అని మొదలుపెట్టి “ఎవరైనా ఒక అమెరికా అమ్మాయిని పట్టుకుందామని చూస్తే, ఎవరి మొహం చూసినా వాళ్ళలో నీ మొహం కనబడి తగలడుతోందే...ఏం చేయను?
ఇక్కడికీ వస్తోందే ఈ జిడ్డు మొహం...ఎందుకు అని ఆలొచించాను? ‘నీ మనసులో ఉన్నది...నీతోనే ఉంటుంది’ అని ఎవరో చెబుతున్న ఫీలింగ్…సరే కానీ అని వదిలేశా. నా తలరాత నువ్వే. ఏం చేయగలను?"
మరు క్షణమే సమాధానం పంపింది ప్రతిమ.
"దెబ్బతిన్న టొమేటో లాంటి నీ ముఖానికి ఈ జిడ్డు మొహం దొరకటమే పెద్ద అదృష్టం. జిడ్డు కారుతున్న నూనె వెల ఎంతో తెలుసా? తెలియకుండా గేలి చేయకు! పిచ్చి పిచ్చి ఆలొచనలు మాని చదువు మీద ధ్యాస పెట్టి చదువు ముగించి, ఊరికి వచ్చే దారి చూడు. మన పెళ్ళి జరగనీ. ఆ తరువాత తెలుస్తుంది ఈ జిడ్డు మొహం మహాత్యం!"
ఆ తరువాత పరీక్షలూ, క్లాసులూ అంటూ ఆమెతో మాట్లాడలేకపోయాడు కిరణ్!
PART-2
"ప్రతిమా..."
కింద నుండి అత్తయ్య పిలుస్తున్న కేక వినబడింది...తన జ్ఞాపకాలను చెరుపుకుని హడావిడిగా క్రిందకు వెళ్ళింది.
"మేడ మీద ఏంచేస్తున్నావు? వంటలొ నాకు కొంచం సహాయపడకూడదా? ఈ కొబ్బరిని మిక్సీలో వేసి పాలు తీసివ్వు. ఈ రోజు కిరణ్ వస్తాడని తెలియదా? మరెందుకు అంతసేపు నిద్ర?"
ప్రతిమ కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసి, మిక్సీ ఆన్ చేసింది. కిరణ్ కి ఇష్టమైన వంటకాలు తయారవుతున్నాయి.
"అరెరే...ముఖ్యమైనది కొనడం మర్చిపోయాను... వరుణ్ని పిలవ్వా ఒక్క నిమిషం!"
ప్రతిమ వరుణ్ని తీసుకు వచ్చింది.
"అప్పడాలు, చిప్స్ మర్చిపోయాను వరుణ్. వెళ్ళి కొనుకొచ్చేస్తావా"
వరుణ్ కొట్టుకు బయలుదేరాడు. రెండు రోజులుగా అతన్ని మాటిమాటికీ మార్కెట్టుకు పంపించింది అత్తయ్య.
పాపం వరుణ్! మరిచిపోయి కూడా తన తల్లిని ఎదిరించి మాట్లాడడు. తల్లి అంటే 'భయమా…మర్యాదా?' అనేది అతనికి మాత్రమే తెలుసు.
‘వరుణ్ కి అంతగా సామర్థ్యం చాలదు!' అనేది అత్తయ్య నమ్మకం. ఒక బి.ఏ డిగ్రీ చదవటానికి అతను ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. చదువులో అంతంతమాత్రమే! మామయ్య నాంపల్లి లో ఒక ‘రెడీ మేడ్’ బట్టల కొట్టు నడుపుతున్నారు. ఆ కొట్టును ఇప్పుడు వరుణ్ చూసుకుంటున్నాడు. మూడు వందల రూపాయలు ఖరీదైన డ్రస్సును ఎవరైనా రెండు వందలకు అడిగితే...పాపం అనుకుని ఇచ్చేసి తండ్రి దగ్గర తిట్లు తింటాడు. అందుకని అతన్ని నమ్మి షాపును అతని ఒక్కడిపైన వదిలిపెట్టడు అతని తండ్రి.
"నువ్వు క్యాష్ లో ఉండు...చాలు. వ్యాపారానికి ఇద్దరు పనివాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు చూసుకుంటారు..." అని చెప్పేశారు.
షాపుకు కావలసిన స్టాకు కొనడానికే ఆయనకు సమయం సరిపోతుంది. వరుణ్ కు రుచిగా తినడం తెలుసు. అది వదిలితే షాపు చూసుకోవటం, లెక్కలు చూడటం. రాత్రి లేటుగానే ఇంటికి వస్తాడు. వచ్చిన వెంటనే స్నానం, భోజనం, నిద్ర. ఇదే అతని జీవిత చక్రం. గత రెండు రోజులుగా భర్తను షాపును చూసుకోవటానికి పంపించి, కొడుకు వరుణ్ని ఇంట్లో పనులకు వాడుకుంటోంది అత్తయ్య. ఆమె ఎన్ని సార్లు మార్కెట్టుకు పంపించినా విసుక్కోకుండా వెళ్ళొస్తాడు వరుణ్.
కిరణ్, వరుణ్ కి పూర్తి విరుద్దం. చదువు,
'గలగల’ మని మాట్లాడటం, గట్టి నిర్ణయాలు, సరదా గుణం, చిలిపితనం, ఎత్తు-రంగు-గంభీరం అన్నిట్లోనూ కొంచం ఎక్కువే! అత్తయ యొక్క ముద్దుల బిడ్డ. ప్రతిమ యొక్క ప్రియమైన ప్రేమికుడు. 'కంప్యూటర్ ఇంజనీర్’. దానికి తగిన పెద్ద చదువుకోసమే అమెరికా వెళ్ళాడు. వరుణ్ కి సంబంధాలు చూడమని అమ్మ దగ్గర సనుగుతూ ఉంటాడు కిరణ్.
"రాను రానూ నీ వంట బాగుండటం లేదమ్మా. ఒక వదిన వచ్చి వండితే మార్పుగా ఉంటుందమ్మా...?"
అమ్మను గేలి చేస్తూ...ఆమె ముఖంలో మార్పు తెప్పిస్తాడు.
"వదిన కావాలా వదిన..." కళ్ళు పెద్దవి చేసి కిరణ్ ని కోపంగా చూసింది ప్రతిమ.
"అలా కోపంగా చూడకు. అప్పుడే కదా మన 'లైను క్లియర్’ అవుతుంది. నేను అమెరికా వెళ్ళి వచ్చిన వెంటనే మన పెళ్ళే. అ తరువాత చూడు ఈ జిడ్డు మొహాన్ని ఎన్ని కష్టాలు పెడతానో..."
ప్రతిమ తనలో తానే నవ్వుకుంది.
ప్రతిమ తల్లితండ్రులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఎనిమిది ఏళ్ళ వయసులోనే అనాధాగా నిలబడ్డ ప్రతిమను తీసుకు వచ్చి పెంచింది ఈ మేనత్త. ఈ రోజు వరకు ప్రతిమకు ఎటువంటి లోటూ చేయలేదు. ప్రతిమ డిగ్రీ పూర్తి చేసి నెల రోజులు అవుతోంది. రిజల్ట్స్ రావాలి.
"కిరణ్ అమెరికా నుండి వచ్చిన వెంటనే ఇద్దరి కొడుకులకూ పెళ్ళిళ్ళు చేశేయాలి" అని ఒక రోజు మామయ్యతో చెబుతున్నది అత్తయ్య. మామయ్య ప్రతిమను "కోడలు పిల్లా..." అనే పిలుస్తున్నారు.
ఆయన అలా పిలుస్తుంటే ప్రతిమకు చాలా సంతోషంగా ఉండేది. దాని గురించి కిరణ్ కి వెంటనే తెలియపరిచింది. సమాధానంగా మామూలుగా ఎప్పుడూ ప్రతిమను ఏడిపిస్తూ పంపేలాగానే ఒక ఈ-మైల్ పంపించాడు.
“నిన్ను కోడలు పిల్లా అని నాన్న పిలవటం నాకు సంతోషంగానే ఉన్నది. సినిమాలలో హీరోయిన్ ను దూరంచేసుకున్న హీరో,
ఆమెను బొమ్మగా గీసి పాడుతాడే...అదేలాగా నేను నిన్ను బొమ్మగా గీశాను. ఆశ్చర్యపోయాను. నీ మొహం అంత న్యాచురల్ గా వచ్చింది. ఈ ఈ-మైల్ చివర్లో నేను గీసిన నీ బొమ్మను ఇమేజ్ గా పెట్టాను. ఎలా ఉన్నదో చెప్పు”
వెంటనే ప్రతిమ ఆ ఈ-మైల్ చివరికి వెళ్ళి చూసింది. అక్కడ పళ్ళు ఇకిలిస్తూ ఒక కోతి బొమ్మ గీసుండటం చూడటంతో...పళ్ళు కొరుక్కుంది ప్రతిమ.
‘నేను కోతి లాగా ఉన్నానా?’......ఆ మరు క్షణం కిరణ్ కి ప్రత్యుత్తరం పంపింది.
'నువ్వు గీసేవని చెబుతూ పంపిన బొమ్మను చూశాను. చాలా బాగుంది. కానీ,
అందులో ఒక చిన్న తప్పు చేశావు. బొమ్మలో నా మొహం గీయటానికి బదులు నీ మొహం గీసుకున్నావు. వాళ్ళ మొహం వాళ్ళు గీసుకోవటం కష్టమైన పనే. అది నువ్వు చాలా ఈజీగా చేశావు. కంగ్రాట్స్"
'మార్చి మార్చి ఇద్దరం ఒకరి మీద ఒకరు వ్యంగ్యంగా గేలి చేసుకోవటం ఆనందంగానే ఉన్నది. పెళ్ళి తరువాత కూడా ఇలా గేలి చేసుకుంటే అంతే! సమయమంతా దీనికే సరిపోతుంది’ ప్రతిమ తనలో తానే నవ్వుకుంది.
అత్తయ్య వంట ముగించుకుని మళ్ళీ స్నానానికి వెళ్ళింది. 'ఏర్ పోర్టుకు వెళ్ళాలే! నేనూ మీతో రానా అత్తయ్యా?' అని అడగాలని ప్రతిమ ఆశపడుతున్నా, 'నువ్వెందుకు?' అని అత్తయ్య వద్దని చెబితే అసహ్యంగా ఉంటుంది కనుక అడగలేదు. 'రమ్మని పిలిస్తే వెల్దాం' అని అనుకున్నది. కానీ, రమ్మని పిలవలేదు. ఎప్పుడూలాగానే వరుణ్ కారు తొలగా అత్తయ మాత్రం వెళ్ళింది.
"మామయ్యకు 'ఫోన్’ చేసి మధ్యాహ్నము కొట్టు మూసేసి వచ్చేయమని చెప్పానని చెప్పు..." అని వెళ్ళేటప్పుడు ప్రతిమకు ఆర్డర్ వేశేసి వెళ్ళింది.
PART-3
విమానం గంట ఆలశ్యంగా రావటం వలన అందరూ ఇంటికి వచ్చి చేరేటప్పటికి మధ్యాహ్నము మూడు గంటలు అయ్యింది.
ఒక సంవత్సరం ఎలా గడిచిందో తెలియలేదు కానీ,
ఈ కొన్ని గంటలు ఒక్కొక్క యుగంలా గడిచినై. ప్రతిమకి 'చ...'అనిపించింది. వాకిటి వైపు చూసి చూసి కళ్ళు కాయలు కాచాయి. హారతి కలిపి ఉంచుకుని విసుగ్గా కూర్చుంది. కొంత సమయం తరువాత కారు శబ్ధం వినబడగా...లోపల నుండి పరిగెతుకుని వచ్చింది.
కారులో నుండి దిగేటప్పుడే ఎవరికీ తెలియకుండా ఆమెను చూసి గబుక్కున కన్నుకొట్టాడు కిరణ్. 'అరె బాబోయ్...మనిషి ఎంతగా మారిపోయాడు!ఇంతకు ముందే మంచి రంగు. ఒక సంవత్సరం అమెరికాలో ఉండటంతో ఇంకొచం ఎరుపెక్కి, వొళ్ళు చేసి, బుగ్గలు పెరిగి, పెదవుల మీద చిలిపితనం మాత్రం తగ్గనే లేదు.
ప్రతిమ ఒక్క నిమిషం కళ్ళార్పకుండా అతన్నే చూసింది. అత్తయ్య హారతి తీసి, ఇంటి ముందు వేసిన ముగ్గులో పోయడానికి వెళ్ళింది. వరుణ్ 'లగేజీ’లను లోపలకు తీసుకు వచ్చి ఉంచాడు.
"ఏయ్ జిడ్డు మొహమా...నన్ను మింగేయకు? కొంచం వదిలి పెట్టుంచు..."
కిరణ్ చిన్నగా చెప్పి చటుక్కున ప్రతిమ భుజాల దగ్గర గిల్లి లోపలకు వెళ్ళాడు. ప్రతిమ మొహం సిగ్గుతో ఎర్రబడగా నవ్వుకుంటూ భుజాన్ని రాసుకుంటూ అతని వెనుకే వెళ్ళింది.
ప్రయాణ బడలిక తీరటంకోసం అతను స్నానం చేసి వచ్చే లోపు అత్తయ్యా, ప్రతిమ...చల్లారిపోయిన వంటకాలను వేడి చేసి భోజనం కంచాలు పెట్టారు.
అమెరికా నివాసం గురించి అతను కథలు కథలుగా చెబుతుంటే...అది వింటూ భొజనం చేశారు.
"అది సరేనమ్మా...ఇక్కడెంటమ్మా విశేషం? అన్నయ్యకి పెళ్ళి సంబంధం చూశారా...లేదా?"
"వాడికీ చూశేశాను; నీకూ చూశేశాను. రేపు మనిషిని రమ్మన్నాను...ముహూర్తం రోజులు చూడాలని"
కిరణ్ ఓరకంటితో ప్రతిమను చూసి ఎవరికీ తెలియ కుండా నవ్వాడు.
"నేను వదినని చూడొద్దా?"
"నువ్వు చూస్తావురా! నిశ్చయ తాంబూళాలకు ముహూర్తం రోజు ఖాయం చేసుకుని చెబుతాను. తరువాత చూద్దువుగాని...ఇద్దరు కోడళ్ల గురించి అంతవరకు సస్పెన్స్ గా ఉండనీ"
అత్తయ్య నవ్వుతూ లేచి చేతులు కడుక్కోవటానికి వెళ్ళింది!
నిద్ర రాకపోవడంతో ఏదో ఒక పుస్తకం చదువుకుంటోంది ప్రతిమ. వచ్చిన దగ్గర నుండి కిరణ్ తో ఒంటరిగా మాట్లాడలేకపోయింది. మారి మారి అతని గదిలో ఎవరో ఒకరు అతనితో ఉంటూనే ఉన్నారు. అతనైనా ఏదైన సాకుబోకు పెట్టుకుని ఆమెతో మాట్లాడతాడని చూస్తే అతనూ రాలేదు. ప్రతిమకు విసుగు పుట్టింది.
పుస్తకాన్ని మూసేసి విసిరి క్రింద పడేసింది. లైటు ఆపేసి పడుకుంది. పొట్టమీద ఏదో పడటంతో...భయపడి చీర దులుపుకుంటూ హడావిడిగా లేచి లైటు వేసింది. చిన్న రాయి! కిటికీ బయట నవ్వుతో కిరణ్ నిలబడున్నాడు. వెంటనే ఆమె మొహం వికసించింది. గది తలుపు తెరిచింది. చెతిలో ఒక పార్సల్ తో లోపలకు వచ్చాడు అతను.
"ఏయ్ జిడ్డు మొహమా...ఇంకా నిద్రపోలేదా?"
"లేదు కొతి మొహమా"
"దెబ్బలు తింటావు!"
"దెబ్బ కొట్టు..." అంటూ చెంప చూపించింది ప్రతిమ. ముద్దు పెట్టుకోవటానికి ముందుకు వచ్చాడు కిరణ్.
"అదే కదా చూశాను!"-గబుక్కున వెనక్కి జరిగింది.
"ఇదేమిటి పార్సల్?"
"నీకొసమే! అమ్మకి తెలిసి కొన్నది రెండు చీరలు. తెలియకుండా కొన్నది ఇవన్నీ..."
"ఏవన్నీ...?"
"విప్పి చూడు"
ప్రతిమ పార్సల్ తీసుకుని విప్పింది...లోపల ముత్యం, పగడాలు అమర్చిన అందమైన హారం సెట్టు. సెంటు బాటిల్....ఫేస్ క్రీమ్, పౌడర్, సోపు!
"జిడ్డు మొహానికి ఇవన్నీ ఎందుకు?" అడిగింది ప్రతిమ.
"జిడ్డు వాసనను కప్పి పుచ్చటానికే. లేకపోతే దగ్గరకు రాగలమా?"
"చీచీ...పో! నిన్ను దగ్గరకు రమ్మని ఎవరు పిలిచారు?"
"ఇదిగో చూడూ! ఇకమీదట నన్ను 'నిన్ను…నువ్వూ...రా...పో...'అని అనకూడదు. నేను నీ భర్త కాబోతున్నాను. తాలి కట్టేవాడిని గౌరవించాలి.
'ఏమండి...రండి...వెళ్ళండి’ అనే పిలవాలి. లేకపోతే నోటిని లాగిపెట్టి కుట్టేస్తాను"
“అలాగాండీ? సరే...వెళ్ళండి. నేను నిద్ర పోవాలి"
ప్రతిమ అతన్ని పట్టుకుని తోసింది.
"నేను కూడా నిద్ర పోవాలి. నువ్వొస్తే ఇద్దరం కలిసే నిద్రపోవచ్చు" అన్నాడు.
"ఓ...కలిసే నిద్రపోవచ్చే! ఒక్క నిమిషం...ఎందుకైనా మంచిది అత్తయ్య దగ్గర ఒక మాట చెప్పి నిద్రపోదాం"
"భయపెడుతున్నావ్ నువ్వు! ఉండు ఉండు...పెళ్ళైన తరువాత నాతో కలిసి నిద్ర పోవటానికి అమ్మే నిన్ను పంపిస్తుంది చూడు,
అప్పుడు చూసుకుంటా నీ సంగతి!’ చూపుడు వేలును ఆడిస్తూ చెప్పి వెళ్ళిపోయాడు కిరణ్. ప్రతిమ నవ్వుతూ గది తలుపు మూసి గొళ్ళేం పెట్టింది. అతను ఇచ్చిన వస్తువులను ఆశగా మరొసారి చూసి, బీరువాలో పెట్టి తాళం వేసింది.
మరుసటి రోజు ప్రొద్దున. ప్రతిమ కిందకు దిగి వస్తున్నప్పుడు, ప్రతిమ అత్తయ్య ఎవరితోనో 'టెలి ఫోను'లో మాట్లాడుతోంది.
"అవును...ఈ రోజు నాలుగు నుంచి ఐదు గంటల లోపు వచ్చేస్తాం. ఆ ఆ...అబ్బాయి వచ్చాశాడు. సరే...మిగిలినవన్నీ తరువాత మాట్లాడుకుందాం"
ప్రతిమ అత్తయ్య రిసివర్ పెట్టేసి, సోఫాలో కూర్చోనున్న భర్త దగ్గరకు వచ్చి కూర్చుంది.
"అమ్మాయిని చూసుకోవటానికి ఈ రోజే వస్తామని చెప్పేశాను"
“వాళ్ళ దగ్గర చెప్పింది అలా ఉంచు. అబ్బాయి దగ్గర చెప్పావా?"
"ఇప్పుడే చెబుతానండి… అయినా వాడేమన్నా వద్దని చెబుతాడా ఏమిటి?
నా కొడుకు గురించి నాకు తెలియదా?"
"సరే...అయితే పువ్వులూ, పళ్ళూ,
తొమలపాకులు-వక్క కొని రెడీగా ఉంచుకో. సరిగ్గా మూడింటికి ఇక్కడ్నుంచి బయలుదేరుదాం. నేను కొట్టుకు వెళ్ళి రెండింటికల్లా వచ్చేస్తాను"
ప్రతిమ మామయ్య కొట్టుకు బయలుదేరారు. ప్రతిమ మళ్ళీ మేడపైకి వెళ్ళింది. శబ్ధం చేయకుండా కిరణ్ రూములోకి దూరింది. 'షేవింగ్' చేసుకుని సువాసనతో స్నానం చేయడానికి వెడుతున్న అతను, ఆమెను చూసిన వెంటనే చిన్నగా ఈల వేసి నిలబడ్డాడు.
"రావే నా దొండపండూ! ఏమిటి విషయం?"
"నాకు జోస్యం చూడటం వచ్చని నీకు తెలుసా?"
"ఇది ఎండాకాలం కూడా కాదు. ఏమైంది నీకు...?"
"కావాలంటే ఒక విషయం చెబుతాను...నిజమో కాదో చూస్తావా?"
"ఏమిటది?"
"నువ్వు ఈ రోజు నాలుగు గంటలకు ఒక చోటుకు వెళ్ళబోతున్నావు! నీ జాతకం ప్రకారం నీకు చిన్న ప్రయాణం ఉన్నది చూస్తావా?"
"ఎక్కడికి వెళ్ళబోతానో చెప్పవా ప్లీజ్"
"నీకు వదిన రాబోతోంది. ఆమెను చూడటానికి వెళ్ళబోతున్నావు!"
కిరణ్ ప్రతిమను చిరునవ్వుతో చూసి "నాకూ జోస్యం చూడటం తెలుసు" అన్నాడు.
"అవునా?"
కిరణ్ని ఆశ్చర్యంతో చూసింది ప్రతిమ.
"ఇప్పుడు టైమెంత?"
"ఎనిమిదిన్నర"
"సరే! నా జాతక చక్రం ప్రకారం...ఇదిగో సరిగ్గా ఎనిమిదిన్నర గంటలకు ఒక కన్నె పిల్లను గట్టిగా పట్టుకుని నూట ఎనిమిది ముద్దులు ఇస్తానని ఉన్నది. ఎంత కరెక్టుగా ఉందో! సరిగ్గా ఎనిమిదిన్నరకు నువ్వొచ్చి నిలబడ్డావు! ఒకటి...రెండూ...మూడూ లెక్క పెట్టటం వచ్చా?
నూట ఎనిమిదికి ఎక్కువ వెళ్ళకూడదు. దగ్గరకు రా..."
కిరణ్ ప్రతిమను దగ్గరకు లాకున్నాడు….ప్రతిమ అతన్ని తొసేసి ఎరుపెక్కిన మొహంతో పరుగు తీసింది.
PART-4
సరిగ్గా నాలుగు గంటలకు అందరూ పెళ్ళి చూపుల ఇంటికి చేరుకున్నారు. అత్తయ్య అంతస్తుకు తగిన ఆస్తి పరుల ఇళ్ళే! అమ్మాయి చాలా అందంగా ఉన్నది. మంచి చదువు. నాగరీకంగా అందరితో గలగల మని మాట్లాడుతూ కలిసిమెలిసి పోయింది. అనవసరమైన సిగ్గును వదిలిపెట్టింది.
వరుణ్ అదృష్టవంతుడే!
"ఏరా...అమ్మాయి ఎలాగుంది?" అత్తయ్య అడిగింది.
"సూపర్!"
"అయితే ఓకే చెప్పేద్దామా?"
"అన్నయ్య దగ్గర అడిగావా?"
"వాడికేం తెలుసు?"
“మంచి కుటుంబమే...ఓకే చెప్పేయి" కిరణ్ చెప్పాడు...అత్తయ్య సంప్రదాయంగా తొమలపాకులు-వక్క మార్చుకుని బయలుదేరటానికి సిద్దమయ్యింది.
సంతోషంగా ఇంటికి బయలుదేరారు.
"ఇళ్ళు చాలా బాగుంది కదూ?"
"టిఫెను కూడా చాలా బాగుంది"-వరుణ్ అమాయకంగా చెప్పటంతో...కిరణ్, ప్రతిమ 'గొల్లు’ మని నవ్వారు.
"పెళ్ళివారింటి టిఫెను వరకు వెళ్ళిపోయావే! అవునమ్మా...వదిన పేరేమిటో చెప్పనేలేదే?"
"వదినా....?"
తల్లి మొహం చిట్లించి కిరణ్ ను చూసింది.
"మరి...అన్నయ్య పెళ్ళాం వదినే కదా?"
"ఏమిట్రా తెలివి తక్కువ ప్రశ్న ఇది? ఆ అమ్మాయిని చూసింది నీకు...వాడికి కాదు...! వదినను చూడాలని నీకు ఆశగా ఉంటే...వెనక్కి తిరిగి చూడు. ఇదిగో ఉన్నది...మీ వదిన"
అత్తయ్య ప్రతిమను చూపించగా...కిరణ్ అదిరిపడ్డాడు. ప్రతిమకు తల తిరిగింది. ఏదో పెద్ద శిఖరంపై నుండి తలకిందలుగా పడుతునట్టు అనిపించింది ప్రతిమకు.
"నా పెళ్ళి కోసం అమ్మాయిని చూడటానికి వెడుతున్నట్టు నాతో ఒక్క మాటకూడా చెప్పలేదేమ్మా? అన్నయ్య కోసం చూడటానికి వెడుతున్నామని అనుకున్నాను…..ఏం అన్నయ్యా నీకు తెలుసా ఈ అమ్మాయిని ఎవరికోసం చూడటానికి వెడుతున్నామో?"
"తెలియదురా! అమ్మ బయలుదేరు అన్నది. బయలుదేరాను"
"ఎందుకమ్మా మమ్మల్ని ఇలా ఇరకాటంలో పెడుతున్నావు?"
"ఇలా చూడరా కిరణ్. వాడికి ప్రతిమనే పెళ్ళాం అని మేము ఎప్పుడో నిర్ణయం చేశాశాం. సమయం వచ్చినప్పుడు చెపితే చాలు అనుకున్నాము. అయినా కూడా మీ నాన్న దాన్ని 'కోడలు పిల్లా...' అనే కదా పిలుస్తారు. అప్పుడే మీఇద్దరికీ ఇది అర్ధం అయ్యుంటుందని అనుకున్నాను"
"నాకు ఇప్పుడు పెళ్ళి వద్దమ్మా"......విసుగ్గా చెప్పాడు కిరణ్.
"ఏమిట్రా చెబుతున్నావు? ఆ అమ్మాయికి ఏం తక్కువ? నీకు తగిన పిల్లనే కదా చూశాము. జల్లెడ వేసి వెతికేము తెలుసా...ఈ అమ్మయిని కనుక్కోవటానికి? ఈ అమ్మాయి కంటే నీకు సరిపోయే ఇంకో అమ్మాయి ఈ బూమ్మీదే ఉండదు...చెప్పేశాను"
"నువ్వు ఏం చెప్పినా నాకు వద్దమ్మా?"
"ఎందుకని...అమెరికాలో ఏ అమ్మాయినైనా చూసి పెట్టుకున్నావా? 'ప్రేమా గీమా' అనే అసహ్యం ఏదైనా ఉన్నదా?"
"అలాంటిదేమీ లేదు!"
"మరైతే ఏమిటి నీ ప్రాబ్లం?"
"నా వల్ల కారణాలు చెప్పటం కుదరదు. పెళ్ళి వద్దంటే వద్దు...వదిలేయ్..."
"ఒప్పు తాంబూళాలు మార్చుకున్నాము కదరా కిరణ్. ఇప్పుడు కాదంటే...నా పరువు, మర్యాద అంతా పోతుంది"
"నా సంతోషం కంటే నీకు నీ పరువు, మర్యాదే ముఖ్యమా?"
"ఈ అమ్మాయిని పెళ్ళిచేసుకుంటే నీ సంతోషానికి భంగం వస్తుందని అనుకుంటున్నావంటే....నువ్వు ఈ పెళ్ళి వద్దూ అని చెప్పటానికి వేరే ఏదో అర్ధం ఉన్నది. ఎమిటది? నిజం చెప్పు!"
"ఒక్క పుచ్చు కారణం కూడా లేదు. మళ్ళీ అమెరికా వెళ్ళాలని అనుకుంటున్నా. అక్కడ నాకు ఉద్యోగం రెడీగా ఉన్నది. ఆ ఉద్యోగంలో చేరుదామా...వద్దా అనే కన్ ఫ్యూషన్ లో ఉన్నాను. రెండు రోజుల క్రితమే చేరుదాం అని నిర్ణయం తీసుకున్నాను. అప్లికేషన్ ఫారం కూడా పూర్తి చేసి ఇచ్చాశాను. ఈ టైములో పెళ్ళి ఎందుకని వద్దంటున్నాను"
“సరే...వాళ్ళ దగ్గర ఒక సంవత్సరం తరువాత పెళ్ళి పెట్టుకుందామని చెబితే సరిపోతుంది. ఆ అమ్మాయి కూడా న్యూ యార్కులో ఏదో పనికోసం ట్రై చేస్తోంది. చాలావరకు ఆ ఉద్యోగం దొరుకుతుందని చెబుతున్నారు. అలాంటప్పుడు ఇబ్బంది లేదు కదా"
"ఇలా చూడమ్మా...ఆ అమ్మాయిని నా వదినగా అనుకునే చూశాను. ఇక ఆ అమ్మాయిని నా భార్యగా అనుకొలేను. అలా కాదు, నా పరువు, మర్యాదా కాపాడుకోవలసిందే అని నువ్వనుకుంటే అన్నయ్యకి ఆ అమ్మాయిని కట్టిపెట్టు. నువ్వు చెప్పే వాటన్నిటికీ తల ఊపే వ్యక్తి వాడే"
కారు ఇంటి పోర్టికోలోకి వచ్చి ఆగింది.
కిరన్ గబగబా మేడ మీదకు వెళ్ళిపోగా...అక్కడ మౌనం చోటు చేసుకుంది.
అమ్మా, నాన్నలు ఒకర్ని ఒకరు చూసుకున్నారు!
PART-5
ప్రతిమ రాత్రంతా ఏడ్చింది.
అత్తయ్య ఇలాంటి నిర్ణయం తీసుకోనుంటుందని తను కలలో కూడా అనుకోలేదు. 'కోడలు పిల్లా...' అని మామయ్య పిలిచింది నన్ను వరుణ్ భార్యాగా నిర్ణయించుకునేనా? అనుకుంటున్నప్పుడే మంటల్లో కాలుతున్నట్లు అనిపించింది ప్రతిమకు. కిరణ్, 'పెళ్ళి’ వద్దు అని చెబితే మాత్రం ఈ సమస్య తీరిపోతుందా? అతను అతన్ని మాత్రం కాపాడుకుంటే సరిపోతుందా? ప్రతిమను కాపాడ వద్దా? అతను, ఆమె ఒకర్ని ఒకరు ఇష్టపడుతున్నారని చెప్పాలి కదా?
"ప్రతిమా..."
కిటికీ పక్క నుండి కిరణ్ గొంతు సన్నగా వినబడింది. ఉలిక్కిపడి చూసింది. అతన్ని చూసిన తరువాత కన్నీరు అధికమయ్యింది.
"తలుపు తెరు..."
తలుపు తెరిచిన వెంటనే గబుక్కున లోపలకు వచ్చి గొళ్ళేం పెట్టాడు.
"ఎందుకు ఏడుస్తున్నావు ప్రతిమా?"
"ఏడవక...నవ్వమంటావా? నువ్వు మాత్రం తప్పించుకుంటే చాలా? నన్ను కాపాడ వద్దా?"
"దాని గురించి మాట్లాడటానికే వచ్చాను. ఈ టైములో మన విషయం బయటకు తెలియటం మంచిది కాదని అనిపిస్తోంది. ఇప్పటికే అమ్మ చాలా కోపంగా ఉన్నది. ఇప్పుడు మన విషయం ఆవిడకు తెలిస్తే ఆవిడ కోపం చాలా ఎక్కువ అవుతుంది. ఆవిడ్ని గౌరవించని మనల్ని విడదీస్తేనే సంతోషం అనే విధంగా సాడిస్టుగా మార వచ్చు"
"అయితే నేను ఇప్పుడేం చేయను?"
"నువ్వు కూడా పెళ్ళి వద్దు అని మొండిగా పట్టుపట్టు, ఏడు. కారణం చెప్పకు! పై చదువులు చదవబోతానని చెప్పు. ఏది ఏమైనా 'వరుణ్ ని నచ్చలేదు’ అని పొరపాటున కూడా చెప్పకు! అలా చెబితే కనుక, వాడికి నిన్ను కట్టపెట్టిన తరువాతే ఇంకోపని చూస్తుంది మా అమ్మ. జాగ్రత్త! ఎలాగైనా తప్పుంచుకోవాటానికి ప్రయత్నించు. ఎప్పుడూ నీ పక్కన నేను ఉండలేను కాబట్టి ఇక్కడ నీ తెలివితేటలే ఉపయోగించాలి. నువ్వూ పెళ్ళికి ఒప్పుకోకపోతే వేరే దారిలేక తన గౌరవాన్ని కాపాడుకోవటానికొసం ఆ అమ్మాయిని వరుణ్ కు ఇచ్చి పెళ్ళిచేయటానికి ప్రయత్నిస్తుంది"
“అమ్మాయి వాళ్ళింట్లో వాళ్ళు వరుణ్ ను ఒప్పుకోవద్దా? మిమ్మల్నే కదా వాళ్ళు అల్లుడిగా చూశారు. వాళ్ళకు మీ జాతకమే వెళ్ళుంటుంది"
"దాని గురించి మనకెందుకు? వాళ్ళు ఒప్పుకోకపోతే వరుణ్ కి వేరే సంబంధం చూడనీ! మన సమస్య తీరిందా..దాంతో వదిలేయి"
“నాకు భయంగా ఉన్నది కిరణ్. నువ్వు మళ్ళీ అమెరికా వెళతానన్నది నిజమా?"
"నిజమే! అక్కడ నాకొక ఉద్యోగం దొరికింది. మన పెళ్ళి జరిగిన తరువాత అందులో చేరుదామని అనుకున్నా. కానీ, ఇప్పుడు ముందే చేరబోతాను. నువ్వు ఆందోళన చెందకు! ఇంకొక సంవత్సరం ఎలాగైనా కాలం గడుపు. ఈలోపు నేను అమ్మని ఎలాగైనా 'కన్ విన్స్’ చేసి మన పెళ్ళికి ఒప్పుకునేటట్టు చేస్తాను"
ప్రతిమ మౌనంగా ఉన్నది.
“నిన్ను ఈ ఇంటి కోడలుగా చేసుకోవటానికి వాళ్ళకు ఇష్టమే. కానీ, ఎవరి భార్యగా అనే విషయంలోనే చిన్న సమస్య. ఆ సమస్యను త్వరలోనే తీరుద్దాం...సరేనా? కళ్ళు, మొహం తుడుచుకుని ప్రశాంతంగా నిద్రపో. నువ్వు ఏడ్చిన ఏడుపులో మొహంలోని జిడ్డంతా పోయి మొహం మెరిసిపోతోంది చూడు"
ఈ పరిస్తితులలోనూ అతను ఏడిపించగా...ఆమె ఏడుస్తూనే నవ్వింది. "చి చీ పోరా..." అంటూ అతని ఎద మీద కొట్టింది.
ఇళ్ళు నిశ్శబ్ధంగా ఉన్నది. ఎవరూ ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఏదైనా మాట్లాడితే పెద్ద గొడవ అవుతుందేమో అని భయపడుతున్నట్టు అందరూ మౌనం పాటిస్తున్నారు. అందులోనూ తల్లి మౌనం మరీ భయంగా ఉన్నది. ఆ మౌనానికి కింద ఎటువంటి ప్రణాళిక సిద్దం అవుతోందో అని కిరణ్ కు, ప్రతిమకు భయంగా ఉన్నది.
ఆడ పెళ్ళివారింటికి ఏదో ఒక సమాధానం చెప్పి పంపించాలి కదా! అత్తయ్య ఏం సమాధానం చెప్పి తప్పించుకోబోతోందో అనేది తెలియటం లేదు ప్రతిమకు. అత్తయ ఎదురుగా వెళ్ళటానికే శరీరం వణుకుతోంది. కిరణ్ అరిచిన తరువాత అత్తయ్య ‘పెళ్ళి’ విషయం గురించి మాట్లాడనే లేదు. ఆమె ఏదైన మాట్లాడితేనే కదా కిరణ్ చెప్పినట్టు...'పెళ్ళి వద్దు' అని మొండికేయవచ్చు?
దానికి సమయమే రాలేదు. అత్తయ్య ఎందుకు మౌనంగా ఉన్నదో అర్ధం కావటం లేదు. వరుణ్ ఎప్పటి లాగానే మామూలుగా వెళ్ళటం, రావటం చేస్తున్నాడు. అతను తన జీవితం గురించి ఆలొచించేవాడే కాదు. అమ్మ దగ్గర తన జీవితాన్ని అప్పగించినట్లు ఏటువంటి అలజడి లేకుండా ఉన్నాడు.
మనసులో ప్రేమ భారంగా ఉన్న వాళ్ళకే అలజడి, ఆందోళన. దసరధ మహారాజుకు శ్రీరాముడు ఎలాగో అత్తయ్యకు వరుణ్ అలాగు. వరుణ్ కే ప్రతిమ అని అత్తయ్య చెప్పిన తరువాత అతని ముందుకు కూడా వెళ్ళటానికి భయపడ్డది ప్రతిమ. ముందులాగా మాట్లాడలేకపోయింది.
తల్లి యొక్క నిర్ణయం గురించి వరుణ్ ముఖంలో ఎటువంటి ఉత్సాహమూ, మార్పూ లేదు. అత్తయ నిర్ణయం అతనికి ఇష్టమేనా...ఇష్టం లేదా? ఏదీ అర్ధం కాలేదు! ఎప్పుడూలాగానే భోజనం చేస్తున్నాడు..షాపుకు వెల్తున్నాడు...వస్తున్నాడు. పడుకున్న వెంటనే నిద్ర పోతాడు. ఇలా ఎలా ఉండగలుగుతున్నాడో అర్ధం కావటం లేదు!
వరుణ్ అలా ఉంటే...కిరణ్ ఏమో మళ్ళీ అమెరికా వెళ్ళటానికి కావలసిన ఏర్పాట్లను దిగులుపడకుండా చేసుకుంటున్నాడు. 'అత్తయ్య మళ్ళీ ఎప్పుడు ఏ బాంబు పడేస్తుందో?' అనే భయంతో తిరగవలసిన తలరాత ప్రతిమకు మాత్రమే పట్టింది!
PART-6
సరిగ్గా ఒక వారం రోజుల తరువాత ప్రతిమ అత్తయ్య కిరణ్ తో మళ్ళీ పెళ్ళి మాటలు మొదలుపెట్టింది.
"నువ్వు పెళ్ళి చేసుకోకపోతే పోరా. వరుణ్ పెళ్ళికైనా ఉంటావా...?"
"పెళ్ళి ఎప్పుడు?"
"ఇంకా తారీఖు నిర్ణయించలేదు!"
“కానీ, 'నాకు టికెట్టు కన్ ఫర్మ్' అయ్యింది. ఎల్లుండి విమానం. మళ్ళీ నేను తిరిగి రావటానికి ఒక సంవత్సరమో, రెండు సంవత్సరాలో అవొచ్చు. దాని తరువాత పెళ్ళి పెట్టుకో. పెళ్ళికి తప్పక వస్తాను"
తల్లి అతన్ని కోపంగా చూసింది. తరువాత ఏమీ మాట్లాడకుండా ముఖం తిప్పుకుని తిరిగి వెళ్ళిపోయింది. హాలులోకి వచ్చి సోఫాలో కూర్చుంది. తల్లి వెనుకే నడిచి వెళ్ళిన కిరణ్ సోఫాలో కూర్చున్న తల్లి ముందు నిలబడి "అమ్మా..." అని పిలిచాడు.
ఆమె తల పక్కకు తిప్పుకుంది.
“నువ్వు మాట్లాడకపోయినా నేను చెప్పాల్సింది చెప్పేసి వెళతాను” అన్నాడు కిరణ్.
"నీకు నా మీద కోపం ఉండొచ్చమ్మా. నువ్వు చెప్పి నేను వినలేదు అనే కలత ఉండొచ్చు. ఈ ఒక్క విషయం మనసులో పెట్టుకుని నేను నీకు మర్యాద, గౌరవం ఇవ్వటం లేదనే నిర్ణయానికి రాకు! పెళ్ళనేది ఇంకొకరికోసం చేసుకో లేము. నీకొసం నేనెలా తినలేనో, నిద్రపోలేనో, స్నానం చేయలేనో, అదేలాగానే...పెళ్ళి కూడా చేసుకోలేను. నీ అకలికి నువ్వే తినాలి. నీ శరీరం శుభ్రంగా ఉండాలంటే నువ్వే స్నానం చేయాలి. నీకు నిద్ర వస్తే నువ్వే నిద్రపోవాలి. నేను వెళ్ళిన తరువాత వీటి గురించి ఆలొచించి చూడమ్మా. నా మనసు నీకు అర్ధం అవుతుంది"
కిరణ్ వెళ్ళిపోయాడు. అత్తయ్య మొహం ఎరుపెక్కింది....అతను వెళ్ళిపోయిన వైపే చూస్తూ నిలబడింది. ఆ తరువాత భర్త వైపుకు తిరిగింది.
"మీ కొడుకు ఏం చెప్పి వెడుతున్నాడో విన్నారా? నా ఆకలికి నేనే తినాలట. నా మురికి పోవాలంటే నేనే స్నానం చేయాలట. మాతృత్వానికి ఎక్కడుంది తత్వం? మిగిలిన వాళ్ళకు కావాలంటే ఇది సరిపోవచ్చు. తల్లికి ఎలా సరిపోతుంది? నా అకలికి వాడు తినలేడు. కానీ, వాడి అకలికి వాడు తింటేనే నా కడుపు నిండిపోతుందే!
వాడి అకలికి నేను తినలేను. కానీ వాడు ఆకలితో పస్తుంటే నావల్ల తినటం కుదరదే! వాడికోసం నేను స్నానం చేయలేనట? ఎనిమిదేళ్ళప్పుడు వాడికి ఆట్లమ్మ పొసినప్పుడు ఒకరోజుకు మూడుసార్లు వాడికోసం నేను స్నానం చేసి ప్రతి గుడి మెట్టూ ఎక్కొచ్చానే. పదేళ్ళప్పుడు వాడికి ఆగకుండా విరోచనాలు అయినప్పుడు ఆసుపత్రిలో చేరిస్తే...అటూ ఇటూ కదలలేక, ఐదు రోజులు స్నానం చేయలేక వీడితోపాటూ నేనూ కంపుతో ఉండిపోయానే.
వీటన్నిటికీ ఏం తత్వం చెప్పగలడు వాడు? అమెరికా వెళ్ళి చదువుకున్నాడనే గర్వంతో మాట్లాడుతున్నాడు...పొతే పోనీ. వాడి ఆకలికి వాడే తినని. వాడికి కావాలంటే స్నానం చేసుకోనీ, నిద్రపోనీ, పెళ్ళి కూడా చేసుకోనీ...ఎలా పోయినా పరవలేదు. నేనేమీ బాధపడను.
కన్న పేగు కోసినప్పుడే అన్నీ బంధాలనూ కోసేయటం తెలిసుంటే ఈ రోజు ఇలా పిచ్చిదానిలా నాలో నేనే మాట్లాడుకునే దానిని కాదు. తెలియలేదే! భగవంతుడు దేహం మొత్తం ప్రేమను పెట్టాశాడు...ఏం చేయగలను? అభిమానం, ప్రేమ అన్నీ ఒన్ వే ట్రాఫిక్కులాగా అయిన తరువాత ఎవరిని ఎవరు కట్టడి చేయగలరు?"
ప్రతిమ అత్తయ్య శరీరం అంతా ఊగిపోయింది. మామయ్య భయపడిపోయారు.
"రామలక్ష్మీ...నువిప్పుడు ఎందుకు టెన్షన్ పడతావు? అన్నీ సర్ధుకుంటాయి. ఎవరైనా ఒకరు విడిచిపెడితేనే జీవితం. వాడికి ఇష్టం లేకపోతే వదిలేయి"
"ఎలా వదిలి పెట్టగలను? వాడి మీద నాకు శ్రద్ద ఉండకూడదా? ఆశ ఉండకూడదా? ఎంతో కస్టపడి వెతికి వెతికి అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయికి ఎం తక్కువని వద్దంటున్నాడు?"
"ఎవరికి తెలుసు? ఇప్పుడు దాని గురించి మాట్లాడితో మనకేమొస్తుంది? వదిలిపారేయి. ఇక మీదట జరగవలసిన దాని గురించి ఆలొచిద్దాం"
"ఇంకా ఏం జరగాలట...నా కర్మకాండలు తప్ప"
"అమ్మా...ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు?".....వరుణ్ అమ్మను చూసి గట్టిగా అడిగాడు.
"ఇప్పుడు ఏం జరిగిందని అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఏది చెప్పినా వినటానికి నేను రెడీగా ఉన్నాను. నాకు ఆజ్ఞ ఇవ్వు. వాడిని వాడి దారిలో పోనివ్వు. వాడి గుణం నీకు తెలియదా? ఈ ఒక్క విషయం పట్టుకుని నువ్వు వాడ్ని తిట్టటం సరికాదు"
"వాడి గురించి ఇంక మాట్లాడకురా! భుజాలకుపైన పెరిగిన తరువాత కూడా పిల్లాడు అని అనుకున్నా చూడు...నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. సరే...నువ్వైనా నా మాట వింటావా...లేకపోతే నువ్వూ...?"
"నేను ఇందాకే చెప్పను కదమ్మా. బావిలో దూకు అని చెప్పు...దూకటానికి రెడీగా ఉన్నాను"
"అలాగైతే ప్రతిమను పెళ్ళి చేసుకోవటం నీకు ఇష్టమేనా"
"ఇష్టమేనమ్మా!"
నిప్పులను తొక్కు తున్నట్టు ప్రతిమ వాళ్ళను చూసింది.
"హూ...అలా ఒక కొడుకు; ఇలా ఒక కొడుకు! ప్రతిమా ఇక్కడికి రా"
ఆమె వణుకుతూ అత్తయ్య ముందుకు వచ్చి నిలబడింది. అత్తయ్య ప్రతిమను పైకీ కిందకూ ఒకసారి చూసింది.
"జ్ఞాపకముందా ప్రతిమా...అప్పుడు నీకు ఎనిమిదేళ్ళు. నా తమ్ముడూ, అతని భార్య అంత చిన్న వయసులో చనిపోతారని ఎవరన్నా అనుకున్నారా? అమ్మా, నాన్నల శవాలను చూసి పెద్దగా ఏడుస్తున్న నిన్ను అమాంతం కౌగలించుకున్నాను.
‘నేనున్నానమ్మా నీకోసం...’ అని చెప్పి నిన్ను నా గుండెలమీద వేసుకుని, ఇక్కడికి పిలుచుకు వచ్చాను. ఇదిగో ఈ నిమిషం వరకు నా గుండెళ్ళోనే ఉంచుకున్నాను. నా పిల్లలిద్దరి కంటే నిన్నే ఎక్కువగా గమనించాను. మీ అమ్మ జ్ఞాపకం నీకు రాకుండా ఉండాలని ప్రేమంతా కుమ్మరించి ఆ జ్ఞాపకాన్ని తుడిచేశాను.
కిరణ్ కి ఆట్లమ్మ పోసి వాడికి తలకు స్నానం చేయించిన నాలుగోరోజు నీకు ఆట్లమ్మ పోసింది. విమరీతమైన జ్వరం. నాలుగు రోజులు నువ్వు కళ్ళు తెరవకుండా పడుకున్నావు. రోజూ గుడికి వెళ్ళటం, వేడుకోవటం, వచ్చి నీకు కావలసింది చూసుకోవటం...ఇదే నా పని. నిప్పుల్లో నడుస్తానని వేడుకున్నాన్ను. ఆట్లమ్మ నిన్ను విడిచిపెట్టింది. నీకు పూర్తిగా తగ్గిన తరువాత నిప్పులు తొక్కడానికి మన ఊరి గుడికి వెళ్ళాను. ‘వద్దు అత్తయ్యా....కాళ్ళు కాల్తాయి’ అంటూ నా కాళ్ళను చుట్టుకున్నావు. ‘ఇది నిప్పు కాదరా నాన్నా....పువ్వులాంటిదిరా’ అని నిన్ను సమాధాన పరిచి నేను నిప్పుల్లో నడిచాను.
నువ్వు చెప్పి నేను వినలేదని నువ్వు నాతో మూడురోజులు మాట్లాడలేదు. ఆ మూడు రోజులూ నేను వ్రతం. 'నువ్వు మాట్లాడితేనే నేను తింటాను’ అని చెప్పాను. నేను సరదాగా చెబుతున్నాను అనుకుని మొదట్లో నువ్వు మాట్లాడనే లేదు. మూడో రోజు నేను నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయాను. అది చూసి నువ్వు భయపడి నాతో మాట్లాడావు! నీ చిన్నారి చేతులతో నాకు అన్నం కలిపి పెట్టావు. ‘ఇక మీదట నీతో మాట్లాడకుండా ఉండను అత్తయ్యా’ అని ఏడ్చావు!"
ప్రతిమ కన్నీరుతో అత్తయ్యను చూసింది.
"ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెబుతున్నానో అని నువ్వు అనుకోవచ్చు! ఇంత కష్టపడి నిన్ను పెంచానని చెప్పటానికి మాత్రం కాదు. పది నెలలు మోసి కని పెంచిన వాడే...పది నిమిషాల్లో 'నీ ఆకలికి నువ్వు తిను’ అని విదిలించుకుని వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఎవరి మీద నేను అధికారం చేయగలను? ఎవరి దగ్గర నేను ఏమిటి ఎదురు చూడ....?"
ఆ మాట ముగించేలోపు రామలక్ష్మీ సడన్ గా గుండె పట్టుకుంది. నుదురు, గొంతు గబుక్కున చెమటతో నిండిపోయంది. కింద పడుతున్న ఆమెను ఒక్క గెంతుతో వరుణ్, ప్రతిమ చెరో పక్క పట్టుకున్నారు.
"ఎమైంది అత్తయ్యా"....ప్రతిమ టెన్షన్ పడి తల్లడిల్లిపోయింది.
డాక్టర్ కు అర్జెంటుగా ఫోన్ చేశారు మామయ్య!
PART-7
వెంటనే 'బై పాస్ సర్జరీ’ చేయాలని చెప్పాడు డాక్టర్. భయంతో మామయ్యను చూసింది ప్రతిమ.
"మేము ఆమెను చూడొచ్చా?"....డాక్టర్ను అడిగాడు మామయ్య.
"చూడండి...కానీ ఎక్కువగా మాట్లాడి ఆమెను ప్రయాస పెట్టకూడదు."
ఐ.సి.యూ అద్దాల తలుపులు తెరుచుకుని మామయ్య, ప్రతిమ, వరుణ్ లోపలకు వెళ్ళారు. అత్తయ్య బాగా నీరశంగా ఉన్నది. వాళ్ళను చూసిన వెంటనే కంట తడి పెట్టుకుంది. అతి శ్రమపడుతూ వస్తున్న ఏడుపును ఆపుకుని అత్తయ్య చేతులు పుచ్చుకుంది ప్రతిమ.
"నాకు పోవలసిన టైము వచ్చేసిందే ప్రతిమా"
"అలా మాట్లాడకండి అత్తయ్యా! మీకు ఏమీ లేదు. ఇప్పుడంతా 'బై పాస్’ సర్వ సాధారణం"
“దేవుడు తారీఖు 'కన్ ఫర్మ్' చేస్తే బై పాసూ లేదు...జై పాసూ లేదు. దేవుడు నా చివరి యాత్రకు పాస్ ఇచ్చాశాడు!”
“అలా అంతా మాట్లాడకండి అత్తయ్యా! నన్ను వదిలి వెళ్ళిపోగలరా మీరు? మీరున్నారనే ధైర్యంతోనే మా అమ్మా-నాన్నలను తీసుకు వెళ్ళాడు ఆ దేవుడు. ఆయనకు తెలుసు. మిమ్మల్నీ కూడా పిలుచుకు వెడితే....నేను అనాధ అయిపోతానని. అలాగంతా ఆయన ఒకరోజూ చెయ్యడు"
"నాకు నమ్మకం లేదే ప్రతిమా. కొన్ని రోజులుగా నాలో ఏదో భయం...'చచ్చిపోతానేమో అని! అందుకనె మీ పెళ్ళి జరిపేద్దామని అవసరపడ్డాను. అంతలోపు అంతా గందరగోళంగా తయారైయ్యింది. కిరణ్ పోతే పోనీ. వాడు ఎలా పోతే నాకేమిటి. వాడిని నా కొడుకే కాదని అనుకుంటా.
నువ్వైనా నాకు ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటావా ప్రతిమా? నేను కోరుకున్నట్టు వరుణ్ ని పెళ్ళిచేసుకుంటావా? నువ్వు వయసుకు వచ్చిన రోజే నాకు అలాంటి ఆలొచన వచ్చింది. పోను, పోనూ అది ఆశగా మారింది. నిన్ను వాడికిచ్చి పెళ్ళి చేసి చివరి వరకు నాతోనే ఉంచుకోవాలనేది నా ఆశ! ఏమిటి...నా ఆశ నెరవేరుస్తావా?"
ప్రతిమ ఆశ్చర్యంగా అత్తయ్యను చూసింది. ‘భగవంతుడా... ఎందుకు నన్ను ఇంత ఇరకాటమైన పరిస్థితిలో ఉంచావు? అత్తయ్య ప్రశ్నకు ఏం సమాధానం చెప్పను? 'సరి’ అని చెప్పి ఆవిడ్ని సంతోషపరచాలా? 'కుదరదు’ అని చెప్పి ఆవిడ్ని చంపేయాలా? అత్తయ చావుకు నేను కారణమవటానికా ఆవిడ నన్ను పెంచింది? తల్లి కంటే ఎక్కువ ప్రేమ చూపించిందే?’
"ఏమిటే ఆలొచిస్తున్నావు...కిరణ్ లాగా నువ్వూ ఎవరినైనా?"
"లేదు అత్తయ్యా! లేనే లేదు"
"నువ్వైనా నా కోరికను తీర్చి నాకు ప్రశాంతత ఇచ్చావే! ఇక నేను చచ్చిపోయినా పరవాలేదు!"
"మీరు ఎక్కువ మాట్లాడ కూడదు అత్తయ్యా"
"వరుణ్ తో కలిసి ఒకసారి నిలబడు. నేను చూడాలి"
ఎటువంటి భావన లేకుండా వరుణ్ కి దగ్గరగా వెళ్ళి నిలబడింది ప్రతిమ.
"ఏమండీ...ఈడు-జోడు ఎలా ఉందో చెప్పండి? బ్రహ్మాండంగా ఉంది కదూ? ఉండదా మరి? చేర్చిందెవరు...నేను కదా?"
“రామలక్ష్మీ ఎందుకు అంతగా ఏమోషనై మాట్లాడ్తావు? నీకు వొళ్ళు బాగుండలేదు. ఐ.సి.యు లో ఉన్నావు! చాలు...ప్రతిమా రామ్మా పోదాం. లేకపోతే ఈవిడ మాట్లాడుతూనే ఉంటుంది.
మామయ్య వాళ్ళను బయటకు తీసుకు వచ్చాడు.
వరుణ్ కి దగ్గరగా నిలబడ్డ క్షణం నుండి ప్రతిమ తనలో ఏదో విరిగి తాను శిలలాగా అయిపోయినట్లు భావించింది. ఇక ఆ రాయికి స్పర్శ ఉంటుందని అనిపించటంలేదు. మరుసటి రోజు ప్రొద్దున అత్తయ్యను 'ఆపరేషన్ ధియేటర్’ కి తీసుకు వెళ్ళారు. ఐ.సి.యు నుండి బయలుదేరి ‘ఆపరేషన్ ధియేటర్’ వరకు అత్తయ్య స్టెక్చర్ తో ప్రతిమ నడిచింది. భయమూ, బాధతో మామయ్య, వరుణ్ కొంచం వెనుకగా వెళ్ళారు.
"వరుణ్ ఇంకా ఒక చిన్న పిల్లాడే ప్రతిమా. వాడిని ఇకపై నువ్వే చూసుకోవాలి. కౌశల్యకు రాముడు ఎలాగో వీడు నాకు అలాగు. వీడ్ని చూసుకోవే ప్రతిమా...నా బంగారు తల్లీ..."
'ఆపరేషన్ ధియేటర్’ తలుపులు మూసుకోవటంతో...ప్రతిమ బయట శిలలాగా నిలబడిపోయింది.
నాలుగు గంటలు జరిగింది ఆపరేషన్. అంతవరకు బయట నిలబడిన వాళ్ళు సగం ప్రాణం కోల్పోయారు. వరుణ్ పచ్చి మంచి నీళ్ళూ కూడా తాగకుండా కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. మామయ్య, 'తన శరీరంలో సగం పోతుందేమో?' అనే భయంలో కృంగిపోయి మోకాళ్ళపై తలపెట్టుకుని కూర్చున్నారు. ఎవరూ ఎవరికీ ధైర్యమో, అభయమో చెప్పలేని స్థితిలో ఉన్నారు. గడియారంలోని ముల్లులు మాత్రం వాటి భాద్యత అవి నిర్వహిస్తున్నై.
సరిగ్గా ఒంటి గంటకు 'ధియేటర్’ తలుపులు తెరుచుకున్నాయి...తలకు ఒక టోపి, ముక్కుకు ఒక మాస్క్ తో డాక్టర్ బయటకు వచ్చాడు. అందరూ గుండెలను గుప్పెట్లో పెట్టుకుని లేచారు.
"ఆపరేషన్ సక్సస్స్ మిస్టర్ వరుణ్. మీ అమ్మగారు బాగున్నారు. ఇంకో గంటలో ఐ.సి.యు లోకి సిఫ్ట్ చేస్తాము. అప్పుడు మీరు చూడొచ్చు"
'డాక్టరా....దేవుడా? దేవుడు లేడని ఎవరు చెప్పింది? ఇదిగో ఈ డాక్టర్లందరూ ఎవరట?'
వరుణ్ కన్నీటితో చేతులెత్తి డాక్టర్ కు దన్నం పెట్టాడు. డాక్టర్ చేతులు పట్టుకుని చిన్న పిల్లలాగా ఏడ్చింది ప్రతిమ.
గంట తరువాత ధియేటర్ తలుపులు తెరుచుకున్నాయి. ఎన్నో రకాల ట్యూబులు గుచ్చబడ్డ పరిస్థితిలో చక్రాల మంచంతో తీసుకురాబడ్డది అత్తయ్య. పునర్జన్మ ఎత్తి వస్తున్న ఆమెను ఆనందంతోనూ, ఆందొళనతోనూ చూశారు.
"ప్లీజ్...కొంచం దూరంగా జరగండి. ఇన్ ఫెక్షన్ ఏర్పడొచ్చు. మేము పిలిచిన తరువాత వస్తే చాలు"....చెప్పింది నర్స్.
అత్తయ్య ఐ.సి.యు లోకి తీసుకు వెళ్ళబడింది. డాక్టర్ల పరిశోధనలు మొదలయ్యాయి. నర్సులు వెళ్ళటం, రావటం జరిగింది.
ముప్పావు గంట తరువాత డాక్టర్లు పిలిచారు. ప్రత్యేకమైన సాక్స్, కోటు వేసుకుని ముగ్గురూ లోపలకు వెళ్ళారు.
అత్తయ్యకు కొంచంగా సృహ వచ్చింది. డాక్టర్ చాలా ప్రశ్నలు వేశాడు. ముగ్గుర్నీ చూపించి పేర్లు చెప్పమన్నారు. అత్తయ నీరసమైన గొంతుతో ముగ్గురి పేర్లూ చెప్పింది. "వెరీ గుడ్"...!- డాక్టర్ జరిగి వచ్చాడు.
“షీ ఈజ్ పర్ ఫెక్ట్ లీ ఆల్ రైట్ ! మూడు రోజులు ఐ.సి.యు లో ఉంచుతాము. నాలుగోరోజు వార్డుకు పంపిస్తాను. ఎనిమిదో రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సరేనా? మీరందరూ భోజనం చేశారా...లేకపోతే భొజనం చేసి రండి. చూడటానికి బాగా టయర్డ్ గా ఉన్నారు. ఇంకేముంది? బాగా తినండి"
డాక్టర్ ఉత్సాహాంగా చెప్పేసి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన వెంటనే ముగ్గురూ క్యాంటీన్ కు వెళ్ళారు.
PART-8
"ఏం తింటావ్ ప్రతిమా?" - అడిగాడు వరుణ్.
"నాకు కాఫీ మాత్రం చాలు!"
"నువ్వు తినకపోతే అమ్మ మమ్మల్నే తిడుతుంది. రెండు ఇడ్లీలైనా తిను"
వరుణ్ అందరికీ ఇడ్లీలు చెప్పాడు.
"మీ ఇద్దరూ కావాలంటే ఇంటికి వెళ్ళండి. నేను ఇక్కడ అత్తయ్య దగ్గర ఉంటాను" చెప్పింది ప్రతిమ.
"నీకేమీ భయం లేదే?"
"ఎందుకు భయం...ఇక్కడ ఇంతమంది ఉన్నారే! అన్ని వసతులూ ఉన్నాయి. ఇంకేంకావాలి? వీలైతే రేపు వచ్చేటప్పుడు నాకు ఒక సెట్టు డ్రస్స్ తీసుకు రండి"
ఆ రోజు సాయంత్రం వరకు మామయ్యా, వరుణ్ ఉండి, ప్రతిమ దగ్గర ఆమె ఖర్చులకు డబ్బులు ఇచ్చి, అది కాకుండా ఆసుపత్రి ఖర్చులకు కొంత డబ్బు కూడా ఇచ్చి బయలుదేరారు.
"జాగ్రత్త ప్రతిమా...అమ్మకు ఎలాగున్నదో అప్పుడప్పుడు ఫోన్ చేసి చెప్పు. ప్రొద్దున్నే వస్తాము" అని చెప్పి వెళ్ళిపోయారు.
వాళ్ళు వెళ్ళిన తరువాత, ప్రతిమ ప్రశాంతంగా ఉన్న ఆసుపత్రి చోటులో మెల్లగా నడిచింది.
ఊరికి బయట ఉండటంతో పరిసుద్దమైన గాలి, పచ్చటి చెట్ల అందం, ప్రశాంతంగా కనబడింది ఆసుపత్రి. ఒక మూలగా ఉన్న బెంచి మీద కూర్చుని చుట్టూ ఉన్న అందాన్ని మౌనంగా చూసింది ప్రతిమ. మనసు గందరగోళంగా ఉండటంతో అందాన్ని చూసి ఆనందించలేకపోయింది.
‘ప్రేమ ఓటమి’ అనే మాటలను కథలలో చదివింది. సినిమాలలో విన్నది. అప్పుడంతా అది అంత పెద్ద విషయంగా అనిపించలేదు. చెప్పాలంటే ప్రేమలో విడిపోయి ఏడుస్తున్న నటీనటులను చూసి చప్పట్లు కొట్టి ఆనందించింది.
అలాంటి పరిస్థితి తనకే వస్తుందని ఒక్క రోజు కూడా తను అనుకోలేదు. తను చేసింది కరెక్టా...తప్పా? అనేది అర్ధం కాలేదు. వరుణ్ ని పెళ్ళి చేసుకోలేను అని చెబితే అది అత్తయ తనమీద చూపించిన అభిమానానికి ద్రోహం. సరే అంటే ప్రేమకూ, కిరణ్ కి చేసే నమ్మక ద్రొహం.
ఇందులో ఏ ద్రొహం పరవలేదు? అత్తయ తన మీద చూపే అభిమానం ముందు అన్నీ తుచ్చంగా కనబడుతున్న పరిస్థితిలో ప్రేమకు ద్రోహం చేయటానికి సాహసించిందనే చెప్పాలి. ఇది తెలిస్తే కిరణ్ ఏం చేస్తాడు? కోపంగా వస్తాడా...లేక ఓటమితో క్రుంగిపోయి వస్తాడా?
ఆలొచనలు ప్రతిమ మెదడులో వేధన పెడుతుంటే తలపట్టుకుని కూర్చుంది ప్రతిమ.
వారం రోజుల తరువాత ప్రతిమ అత్తయను డిస్ చార్జ్ చేసారు. నెలరోజుల్లో అత్తయ్య పూర్తిగా కోలుకుంది. ఆరొగ్యంగా ఉన్నది.
'సమయం వచ్చింది, దేవుడు టికెట్ ఇచ్చాడు’… లాంటి మాటలు చెప్పిన అత్తయ్య, పూర్తిగా ఆరొగ్యం చేకూర్చుకుని మళ్ళీ ఆ ఇంటిని ఏలే మంత్రిగా సోఫాలో కూర్చుంది!
వరుణ్ కి, ప్రతిమకు వెంటనే వివాహం చేశేయాలని ముహూర్తం రోజులకోసం అణ్వేషించడం మొదలుపెట్టింది.
శ్వాసనాళంలో ఏదో అడ్డుపడి హింసిస్తున్నట్టు అవస్తపడుతున్నది ప్రతిమ.
ఒక్కొక్కసారి, 'అత్తయ్యకు నిజం చెబితే ఏం జరుగుతుంది?' అని అనిపించిన ఆలొచన భయంతో సగంలోనే ఆగిపోయేది. 'నీకు వరుణే!' అని అత్తయ్య బల్లగుద్ది చెబితే ఏం చేయాలి? అనే భయం. తన ప్రేమకు జయం జరగదు అనే పరిస్థితిలో ప్రేమను బయటకు చెప్పి జీవితాన్ని చిక్కుముడిగా చేసుకోవటమంత బుద్ది తక్కువ పని ఇంకొకటి ఉందా!
ఎందుకు అందరి యొక్క సంతోషాన్నీ చెడపాలి? ఓటమో లేక మరణమో దగ్గర పడుతోంది అంటే...ఒకదాన్ని మనిషి పోరాడి గెలుస్తాడు. లేకపోతే, వేరు దారి లేదు అనేది తెలుసుకుని సకల భావాలూ వదులుకుని మౌనంగా తనని బలి ఇచ్చుకోవాలి.
ఒక్కొక్కసారి అనిపిస్తుంది, 'అత్తయ్య అభిమానానికి వెనుక ఏదో ఒక లెక్క ఉన్నది?' అని. చిన్న వయసులోనే కన్నవారిని పోగొట్టుకుని, అత్తయ్య దయా గుణంతో పెరిగిన అనాధను. ‘దీన్ని వేరే ఎవరికైనా ఇచ్చి పెళ్ళి చేయాలంటే చాలా ఖర్చు అవుతుందే. అదే సమయం వరుణ్ కి ఒక మంచి చోటు నుండి తన గౌరవానికీ, అంతస్తుకూ తగిన అమ్మాయి దొరుకుతుందనే నమ్మకం అత్తయ్యకు లేదేమో!’
'బయట నుండి ఒక సాధారణ అమ్మాయిని తీసుకురావటం కంటే ప్రతిమే మేలు!'అని అనిపించి ఉండవచ్చు. లేకపోతే ఏమిటి, కిరణ్ కి మాత్రం చదువుకున్న, అస్తి ఉన్న అమ్మాయిని చూసిందే? ఒక వేల ప్రతిమ, కిరణ్ ఇష్టపడుతున్నారని తెలుసుకుని...అది ఇష్టం లేక, ఇలాంటి ఏర్పాటు చేసిందా? 'నీ అనాధ మొహానికి నీకు కిరణ్ కావాల్సి వచ్చిందా?' అని మనసులో అనుకుని...'దీనికి వరుణ్ చాలు అని నిర్ణయించుకుని, కిరణ్ కి అర్జెంటుగా అమ్మాయిని చూశేసి రెండు పెళ్ళిళ్ళూ ఒకేసారి జరుపుదామని అనుకున్నదో?
ఏది నిజం? అత్తయ్య మనసులో ఏమున్నదో ఎవరికి తెలుసు? ఒకవేల కిరణ్ ప్రతిమను ఇస్టపడుతున్నాడని తెలిసి, అది ఇష్టం లేక ఇలాంటి ఏర్పాటు చేసిందనేదే నిజమైన కారణమైతే, ఇక అత్తయ్యతో ఏం చెప్పి ఏమి ప్రయోజనం? కాబట్టి తన సకల భావాలనూ చెరిపేసుకుంటేనే అందరికీ మంచిది అనే నిర్ణయానికి వచ్చింది ప్రతిమ. ఇలాంటి నిర్ణయానికి వచ్చినట్లు కిరణ్ కి ఒక ఈ-మైల్ పంపాలని తీర్మానించుకుంది ప్రతిమ.
PART-9
ఇంట్లో ఎవరూలేని సమయంలో కంప్యూటర్ ముందు కూర్చుంది ప్రతిమ.
“ఈ ఉత్తరం నీకు దిగ్భ్రాంతి, విస్మయము కలిగించవచ్చు కిరణ్. నామీద విరక్తి కూడా కలుగజేయవచ్చు. అందుకని విషయాన్ని నీకు తెలియ పరచకుండా దాచనూలేను. ఎలాగైనా చెప్పే తీరాలి. ఇక్కడ చాలా విషయాలు జరిగినై. అత్తయ్యకు 'హార్ట్ అటాక్’ వచ్చింది. వెంటనే 'బై పాస్’ సర్జరీ చేయటంతో ఆవిడ మరణ కోరలను తప్పించుకుని మళ్ళీ తిరిగి వచ్చింది. ఇంకా నీమీద కోపమూ,విరక్తి తగ్గలేదు. ఆమె చెప్పిందే వేద వాక్కుగా పాఠించే అలవాటున్న ఈ ఇంట్లో మొట్టమొదటిసారిగా ఒక ఎదిరింపు గొంతు వినబడిన బాధే ఆమె గుండె తట్టుకోలేక ‘హార్ట్ అటాక్’ కు కారణమయ్యింది అని అనుకుంటున్నారు.
ఆ పరిస్థితుల్లో ఆమెను ఎదిరించే శక్తి ఎవరికీ లేదు. ముఖ్యంగా నాకు! కారణం, నా తల్లి-తండ్రులు చనిపోయి నేను అనాధగా నిలబడ్డప్పుడు, నా మీద అనురాగము చూపి తనతో పాటూ తీసుకు వచ్చి, మిమ్మల్ని పెంచినట్లు నన్నూ పెంచటమే. అలాంటి ఆవిడకి నేను కృతజ్ఞత చూపవలసిన భాద్యత నాకుంది. అలా చేయకపోతే అత్తయ్యకు ద్రొహం చేసిన దానిని అవుతాను. అలా ద్రోహం చేసి ప్రేమలో గెలవాలా....లేక ప్రేమకు ద్రోహం చేసి అత్తయ్య ప్రాణం కాపాడనా? అనే పరిస్థితిలో నేనొక నిర్ణయానికి వచ్చాను.
మరణంతో పాటూ నన్నూ కూడా జయించింది అత్తయ్య. ఇంకొకరి ఆకలికి మనం తినలేము. ఇంకొకరి మురికి పోవటానికి మనం స్నానం చేయలేమనేది నిజమే! కానీ, మరొకరిని సంతోషపెట్టటం మన వల్ల అవుతుంది కాబట్టి అలా చేయటం