చిక్కుముడి జీవితాలు...(పూర్తి నవల)

 

                                                                         చిక్కుముడి జీవితాలు                                                                                                                                                     (పూర్తి నవల)

జీవితంఅనేది సుఖాలు మాత్రమే ఉన్నది కాదు...! అందులోనూ కొందరికి జీవితంముళ్ళ పడకలాగా గుచ్చుకుంటునట్టు ఉండి ప్రశాంతమైన నిద్రని ఇవ్వకుండా వాళ్ళనే చుడుతూ ఉంటుంది. చుట్టూ ఆపదలు చుట్టుకోనున్నా, వృక్ష శిఖర కొమ్మ నుండి పడుతున్న ఒక చుక్క తేనె కోసం నాలిక చాచుకుని కాచుకోనుంటాం మనలో కొందరం.

తేనె రుచితోనే కష్టాలు మరిచిపోయే పరిస్థితితో పలువురికి రోజులు గడుస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితులలోనే ఇక్కడ ఇద్దరు జీవించాలని నిర్ణయించుకుంటారు. ఒళ్ళంతా చుట్టుకోనున్న చిక్కుముడి లాంటి బంధుత్వ గొలుసులో నుండి విడిపించుకోవటం కుదరక, అంత కష్టాలలోనూ జీవిత రుచిని అనుభవించాలని నిర్ణయించుకున్న వారిద్దరి కథే చిక్కుముడి జీవితాలు’.

మీ అభిప్రాయాలను మనసార తెలియపరచండి...వినడానికి తయారుగా ఉన్నాము.  

                                                                                                  కథాకాలక్షేపం టీమ్.

*****************************************************************************************************

                                                                                                PART-1

ఒక చిన్న బొద్దింక వలనే వాళ్ళిదరికీ పరిచయం ఏర్పడింది. కొత్తపేటలోని ఒక పాత బిల్డింగు యొక్క మెట్లు దిగి బయటకు వచ్చినామె హఠాత్తుగా అదిరిపడి అరుస్తూ గంతులు వేసింది. తన భుజాలపై తగిలించుకున్న హ్యాండ్ బ్యాగును, దాంతో పాటూ దుప్పటానూ విదిలించి పారేసింది. దుప్పటా ఎగిరొచ్చి అతని కాళ్ళ దగ్గర పడగా...హడావిడిగా వెనక్కి తిరిగి చూశాడు.

అనాధలాగా పడున్న హ్యాండ్ బ్యాగును బెదురు ముఖంతో చూస్తూ నిలబడింది. అతను...దగ్గరకు వచ్చి ఆమెనూ, ఆమె హ్యాండ్ బ్యాగునూ మళ్ళీ మళ్ళీ చూస్తూ, దుప్పటాను తీసి ఆమె దగ్గర ఇచ్చాడు.

ఏమైంది?”

బో...బొద్దింక...?”

ఎక్కడ?”

బ్యాగులో...

బ్యాగును తీసి అతను తెరవగా...అది బయటకు రావటంతో...ఆమె మళ్ళీ అరిచింది.

అతను బొద్దింకను వీధి అంచుకు తీసుకు వెళ్ళి విదిలించ... బొద్దింకను కాకి ఒకటి ముక్కుతో కరుచుకుని పోయింది. బ్యాగును మూసేసి ఆమె దగ్గరకు వచ్చి చాచాడు.

థాంక్స్...! మెట్లు దిగుతుంటే ఎక్కడ్నుంచో ఎగురుతూ వచ్చింది

మీరు వేసిన గంతులకు భయపడి బ్యాగు లోపలకు దూరింది...

అతను చెప్పటం ముగించి, ఆమెను పైకీ, కిందకూ ఒకసారి చూశాడు.

ఇంటర్వ్యూకు వచ్చారా?”

ఆమె వెళ్ళి వచ్చిన బిల్డింగును చూస్తూ అడిగాడు.

అవును...! కానీ, అక్కడ ఎవరూ లేరు. అలాంటి కంపనీనే లేదు అంటున్నారు. దీన్ని నమ్ముకుని మచిలీపట్నం నుండి వచ్చాను

హంబగ్ కంపనీ కంతా అప్లికేషన్వేస్తే ఇంతే!

మీరూ ఇక్కడికే వచ్చారా?”

లేదు...! కానీ, ఇదే బిల్డింగులోనే పని చేస్తున్నాను. ఇక మీదట అప్లికేషన్ వేసే ముందు మంచి కంపనీయేనాఅని కనుక్కుని వేయండి. అలా బేల చూపులు చూస్తూ నిలబడకుండా జాగ్రత్తగా నెక్స్ట్ బస్సు పుచ్చుకుని ఊరు వెళ్ళి చేరండి

ఆమె మొహం అదోలాగా అయ్యిందిఏడ్చేస్తుందేమో అన్నట్లుంది.

ఏమిటీ...ఏదైనా సమస్యా? ఇంట్లో తిడతారని భయమా?”

ప్చ్...ఉద్యోగం దొరుకుతుందనే నమ్మకంతో చాలా కష్టంలో ఉన్నా, అమ్మ దగ్గర ఉన్న కొంచం డబ్బునూ అడిగి తీసుకొచ్చాను. నాన్న, హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు అమ్మ మొహాన్ని ఎలా చూడాలి అనేది అర్ధం కావటం లేదు

ఆమె బాగా పరిచయమున్నట్టు తన సమస్యను టపటప మని చెప్పగా...అతను ఆమెను జాలిగా చూశాడు.

దానికి మీరేం చేయగలరు? అమ్మ దగ్గర జరిగిన విషయాన్ని చెప్పండి. ఎవరో మొసగించిన దానికి మీరేం చేయగలరు?”

అమ్మ ఏమీ చెప్పదు. నాకే కష్టంగా ఉన్నది అన్న ఆమె...ఏదో ఆలొచనతో సంశయిస్తూ అతన్ని చూసింది.

మీరు ఊరే కదా?”

అవును. ఎందుకు అడుగుతున్నావు?”

మీకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరైనా చెప్పి నాకు ఒక ఉద్యోగం ఇప్పించిగలరా?”

నాకు ఎవరినీ... --చేదు నవ్వు నవ్వాడు.

నీ పేరేంటి?”

అర్చనా...

అందమైన పేరు. నా పేరు ఆనంద మురళి. నేను ఎప్పుడూ ఆనందంగా ఉండాలని అనుకుని తల్లి-తండ్రులు ఇలా పేరు పెట్టుంటారు. కానీ, ‘ఆనందం అంటే...కిలో ఎంత?’ అని అడిగే జీవితం నాది. అందుకే నేను నా పూర్తిపేరును  ఎప్పుడూ ఎవరికీ చెప్పాను. మురళి అని మాత్రమే చెబుతాను. నాకే ఇంకా మంచి ఉద్యోగం ఒకటి వెతుక్కోలేక పోతున్నాను. నేనెలా మీకు ఉద్యోగం ఇప్పించ గలను?”

ఆమె మొహం వాడిపోయింది.

సారీ...నేనొస్తానండి -- తిరిగి నడవసాగింది.

ఒక్క నిమిషం -- అతను సడన్ గా పిలవటంతో, కొంచం దూరం వెళ్ళిన ఆమె ఆగి ఆశగా అతన్ని చూసింది.

బయోడాటాతో పాటూ నీ అడ్రస్సు కూడా ఇచ్చెళ్ళు...ఏదైనా ఉద్యోగం ఉంటే తెలియజేస్తాను

ఆమె తన హ్యాండ్ బ్యాగ్ తెరిచి చిన్న పేపర్ ముక్కపై తన అడ్రస్రాసి బయోడాటాజెరాక్స్ కాపీ తీసి ఇచ్చింది.

ప్లీజ్...మరిచిపోకుండా సహాయం చేయండి

ఖచ్చితంగా! -- అతను తన పర్సు తెరిచి, తన ఆఫీసు విసిటింగ్ కార్డును తీసి ఆమెకు ఇచ్చాడు.

లోపు నీకు మంచి ఉద్యోగం దొరికితే నాకు తెలియజేయి

తప్పకుండా...నేనొస్తాను

నవ్వుతూ తల ఊపాడు.

ఆమె రోడ్డు దాటి వెళ్ళేంత వరకు నిలబడి చూశాడు. ఏదో బొద్దింక కారణంగా ఒక అమ్మాయి పరిచయమనేదే రోజు దినఫలమో? పాపం! చూస్తే మంచి అమ్మాయిలాగే కనబడుతోంది. ఛఛ...మీ నాన్న అనారోగ్యం ఏమిటి? అని అడగటం మరిచిపోయేనే! అది సరే, ఐదు నిమిషాల పరిచయంలో అంత ఇంటరెస్టు ఎందుకు?’

నీకున్న సమస్యలను మొదట గమనించు. తరువాత ఉరికి సహాయ పడవచ్చు!’ -- లోపల ఒక స్వరం చెప్పగా... మురళి చిరు నవ్వుతో తన ఆఫీసు వైపుకు నడిచాడు.

ఎక్కడికి వెళ్ళావు మురళి? నీకు ఫోను వచ్చింది

ఎవరు?”

మీ ఇంటి నుండే

ఏం చెప్పారు?”

నా దగ్గర ఎలా చెబుతారు? అరగంట తరువాత మళ్ళీ చేయండి అన్నాను

ఎవరు మాట్లాడింది?”

మీ అక్కయ్యఅనుకుంటా

మురళి తన కుర్చీలో కూర్చున్నాడు. రోజు పంపవలసిన డెలివరీ చెలాన్లు టేబుల్ మీద పేరుకు పోయున్నాయి. అన్నిటినీ చెక్ చేసి స్టోర్స్ కు పంపాలి. మనుషులు లేరు కనుక అతనే తీసుకువెళ్ళి, వస్తువులు పంపించి రావాలి. ఇప్పుడు బయలుదేరుతేనే కరెక్టుగా ఉంటుంది.

ఇక్కడి నుండి అరగంటలో వెళ్ళగలిగేంత దూరంలోనే ఉంది గోడౌన్. ఇక సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళాలి.

అక్కయ్య దేనికి ఫోన్చేసుంటుంది అనేది తెలియలేదు. వెయిట్ చేసి చూడాలా లేక బయలుదేరాలా? ఏమంత పెద్ద విషయం అయ్యుంటుంది...డబ్బు సమస్య తప్ప? ఇంటికి వెళ్ళి అడిగితే చాలు!

మురళి చలాన్లను సర్దుకుని, తీసుకుని బయలుదేరాడు.

మెట్లు దిగి కిందకు వచ్చినప్పుడు, పైన ఫోన్ మోగుతున్న శబ్ధం వినబడింది.

నిలబడ్డాడు.

ఫోన్ నీకే మురళి

పైనుండి పిలుపు వినబడటంతో గబగబమని పైకెక్కి వచ్చాడు. ఫోన్ తీసుకుని మాట్లాడాడు.

ఏంటక్కా విషయం?”

సారీ...నేను మీ అక్కయ్యను కాదు! అర్చనాను"

అవతల నుండి చెప్పగా...మొహం వంకర్లు పోయింది.

సారీ...మా అక్కయ్య అనుకున్నాను. ఏమిటి విషయం?”

నా పర్స్ఎవడో కొట్టాసాడు

అయ్యో...! జాగ్రత్తగా ఉండచ్చు కదా?”

మీ ఊరు చాలా డేంజర్! బ్లేడుతో హ్యాండ్ బ్యాగు కొసేసి తిసేసాడు. నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఉన్న చిల్లరతో మీకు ఫోన్ చేసాను. ఊర్లో ఇప్పటికి మిమ్మల్ని తప్ప నాకు ఇంకెవర్నీ తెలియదు. దయచేసి వెంటనే వచ్చి నాకు అప్పుగా యాభై రూపాయలు ఇస్తే, ఊరికి వెళ్ళిన వెంటనే మీకు పంపిస్తాను

యాభై రూపాయలా?’--అతని మొహం కరెంటు షాక్ తగిలినట్లు ముడుచుకు పోయింది. ఇదేమిట్రా కష్టకాలం? ఒక బొద్దింకను తరిమి కాకికి ఏరగా వేసిన పాపానికి శని దోషంపట్టుకుందా?’

ఈమె ఎవరు? హక్కుతో ఐదే నిమిషాల పరిచయంతో సహాయం అడుగుతోంది? అవసరమా ఇది? నా దగ్గర డబ్బుళ్ళేవని చెప్పి... పెట్టేద్దామా? నన్ను చూసుండకపోతే ఏం చేసేదిట? అది చెయ్యనీ!

హలో...వచ్చేస్తారు కదా?”

అతను అని ఒక అక్షరంతో జవాబు చెప్పి, రిసీవర్ను పేట్టాడు.

అర్చనా, ఫోన్ డబ్బులు ఇచ్చేసి కొంచం దూరంగా జరిగి నిలబడింది.

పర్స్ లో ఎంత డబ్బు ఉన్నది?” షాపులో కూర్చోనున్న యువకుడు అడిగాడు.

డెబ్బై రూపాయలు

నేను యాభై రూపాయలు ఇవ్వనా సారి వచ్చినప్పుడు ఇచ్చేయండి

వద్దు. నాకు తెలిసిన ఆయన దగ్గర అడిగాను. ఇప్పుడు వస్తారు

నేనూ అక్కా-చెళ్ళెల్లతో పుట్టిన వాడినే. తప్పుడు ఆలొచనతో ఇవ్వనా అని అడగలేదు. మచీలీపట్నం బస్సు వస్తోంది చూడండి. బస్సు వదిలేస్తే ఇంకో అరగంటసేపు నిలబడాలి

ఆమె బస్సునూ, ‘మురళి వస్తున్నాడా?’ అని రోడ్డు వైపు పరితపింపుతో చూసింది.

యువకుడు టేబుల్ డ్రా తెరిచి యాభై రూపాయలు తీసాడు.

అర్చనా, యువకుడు జాపిన రూపాయలను తీసుకుంది.  

మీ పేరూ, అడ్రస్సు చెప్పండి. ఊరికి వెళ్ళిన వెంటనే పంపిస్తాను

బస్సు మెల్లగా బయలుదేరటం మొదలు పెట్టటం చూసిన యువకుడు తరువాత వచ్చినప్పుడు ఇస్తే చాలు. నేను ఎక్కడికీ వెళ్ళను. బస్సు బయలుదేరుతోంది...వెళ్ళి ఎక్కండి

నన్ను వెతుక్కుని మురళి అని ఒకరు వస్తారు. ఆయన దగ్గర విషయం చెప్పేస్తారా?”

ఆమె పరిగెత్తుకు వెళ్ళి బస్సులోకి ఎక్కింది.

బస్సు వేగం పుంజుకుని బయలుదేరి వెళ్ళింది.

***************************************************PART-2*****************************************

ఎమర్జన్సీ వార్డుకు బయట కుటుంబమంతా కన్నీరు కారుస్తూ నిలబడున్నారు. ఏడ్చి ఏడ్చి అక్కయ్య మొహం గుమ్మడి కాయలాగా వాచిపోయుంది.

అమ్మ అంతకంటే శోఖంగా ఉంది. తండ్రి దగ్గర నుండి సారా వాసన వస్తున్నది. మురళి మండిపడుతున్నట్టు చూశాడు.

మేము ఇంతమంది ఇక్కడ ఉన్నాము కదా? మందు కొట్టొచ్చి, నువ్వు కూడా ఇక్కడ నిలబడాలా? మొదట ఇక్కడ్నుంచి వెళ్ళు

నన్ను తిట్టకు సన్’! పాపం నా గ్రాండ్ సన్’, తాతయ్య ఎక్కడ అని అడిగి ఏడుస్తాడు. నేను ఇక్కడే ఉంటాను...?”

మురళి తల్లి దగ్గరకు వచ్చాడు. నీ భర్త ఇప్పుడు బయలుదేరి వెళ్ళకపోతే, నేను వెళ్ళిపోతాను. ఆయన్నే అన్నీ చూసుకోమని చెప్పు

తల్లి వేగంగా లేచింది. భర్త దగ్గరకు వచ్చి బయలుదేరి వెళ్ళమని బ్రతిమిలాడింది.

ఒక యాభై రూపాయలు ఇవ్వు...వెళ్ళిపోతా

బగవంతుడా! మేమే నరక వేదనలో ఉన్నాము. మీరు మారనే మారరా? డబ్బులు అడిగి ఇలా పీక్కుతింటున్నారే!

నా దగ్గరుంటే నేనెందుకే అడుగుతాను?”

నా దగ్గర మాత్రం ఎక్కడుంది! మీ అబ్బాయి దగ్గర అడగండి. వాడిస్తే తీసుకుని బయలుదేరండి

ఏమిటిట?” -- మురళి కడుపు మంటతో అడిగాడు.

డబ్బు కావాలట!

రాస్కెల్...! పళ్ళు కొరుక్కున్నాడు. ఊర్లో ఎంతోమందికి చావు వస్తోంది. నీ భర్తకు ఎందుకు రానంటోంది?”

తల్లి నోరు నొక్కుకుని ఏడ్చింది.

ఆమె వలన అదొక్కటే కుదురుతుంది!

మురళి తన చొక్కా జేబులో నుండి ముప్పై రూపాయలు తీశాడు. సారా వాసనతో ఆయన ఉండటంతో పరువు పోతుందనే భయంతో డబ్బులిచ్చి పంపించేయటం ఉత్తమం అని అనుకున్నాడు. డబ్బులు విసిరి పారేసాడు. తండ్రి వెకిలి నవ్వుతో డబ్బును ఏరుకుని యాభై రూపాయలు కదా అడిగాను?” అన్నారు.

నాన్న అని కూడా చూడను. లాగి లెంపకాయతో పళ్ళు పగులగొడుతాను. మర్యాదగా వెళ్ళిపో

ఆయన అదే వెకిలి నవ్వుతో నడిచారు.

నా మనవుడ్ని చూసుకో సన్’! నేను పొద్దున్నే వస్తాను అని ఒక సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు.

మురళికి తండ్రి మీద కంటే తల్లి మీదే ఎక్కువ కోపం వచ్చింది. ఇలాంటి ఎందుకూ పనికిరాని వాడ్ని నమ్మి వరుసగా నలుగురు పిల్లలను కన్నదే?’ అని. అమ్మ దగ్గర ఆడగలేడు. ఆమె బిందెలు  బిందెలుగా కన్నీరు కారుస్తుంది.

మొత్తానికి ఇరవై ఐదు ఏళ్ళ వయసులోనే జీవితం చేదు అనిపించింది అతనికి.

డాక్టర్ ఒకరు బయటకు రావటంతో...అక్కయ్య లేచి పరిగెత్తింది. మురళి కూడా దగ్గరకు వెళ్ళాడు.

పిల్లాడు ఎలా ఉన్నాడు...డాక్టర్?”

ఇంతకు ముందు ఇలా కళ్ళు తిరిగి పడిపోయాడా?”

లేదు డాక్టర్. ఇదే మొదటి సారి -- అక్కయ్య సమాధానం చెప్పింది.

మీ అబ్బాయి రక్తంలో సుగర్ఎక్కువగా ఉందమ్మా

భగవంతుడా...నాలుగేళ్ళ పిల్లాడికి సుగర్ వ్యాధా?”

ఎంతో మంది పిల్లలకు ఉందమ్మా. రోజూ ఇన్సులిన్వేయాలి. భయపడాల్సిన అవసరం లేదు. కానీ, పొరపాటున కూడా ఇకమీదట వాడికి స్వీటు ఇవ్వకూడదు...తెలిసిందా? సాయంత్ర డిస్చార్జ్చేస్తాం

డాక్టర్ వెళ్ళిపోయాడు. అక్క, గోడనానుకుని ఏడవటం మొదలు పెట్టింది. ప్రపంచంలో ఎంతోమంది పిల్లలకు వ్యాధి ఉంది అన్నా కూడా, నా బిడ్డకు అది ఎందుకు వచ్చింది?’

ఒక సరాసరి తల్లి బాధ ఆమెలో బయటపడింది.

మురళికి కూడా కష్టంగానే ఉన్నది. స్వీటు అంటే తరుణ్ కు చాలా ఇష్టం. తినాల్సిన వయసులో తిననివ్వకుండా నలభై సంవత్సరాల వయసుకు తరువాత  రావాల్సిన వ్యాధి నాలుగు ఏళ్ళకే రావటం ఘోరం. భగవంతుడు లెక్కతో మనుషులకు కష్ట-సుఖాలు ఇస్తున్నాడు అనేది అర్ధం కావటం లేదు. భోజనంలో కట్టుబాట్లు, రోజూ ఇన్సులిన్ సూది, స్వీటుకు నిషేధం...ఎలా మేనేజ్ చేయబోతాము?’ బాధ పడ్డాడు అతడు.

అక్క జీవితంలో ఇది మరో పరీక్ష. అతనికి కూడా!

ఆమె భర్తను విడిచి పెట్టి వచ్చి రెండు సంవత్సరాలు అవుతోంది. మంచి భర్త దొరకటానికి పూర్వ జన్మ పుణ్యం ఉండాలి. అక్కయ్యకు అది లేదో, ఏమో. స్త్రీ లోలుడు. ఊరికొక సెటప్పు! ఉన్న ఊర్లోనే ముగ్గురు భార్యలు. ఓర్చుకుని చూసింది. ఒక రోజు ఓర్పు నసించి, అతని మొహాన ఉమ్మేసి బయలుదేరి వచ్చేసింది.

మగవాడంటే కాస్త అలా, ఇలా ఉంటాడు. అడ్జస్ట్చేసుకుని, వాడే అంతా అనుకుని ఉండేదే స్త్రీ! -- తండ్రి ఉపదేశం చేసాడు.

ఆయనా అదే జాతే కదా! తోడేలుకు, నక్క ఎలా ఆదరణ ఇవ్వకుండా ఉంటుంది?’

తండ్రి ఉపదేశం చిరాకు పుట్టించింది... మురళి అక్కయ్యకు సపోర్ట్ చేస్తూ తండ్రి మీద విరుచుకు పడ్డాడు.

అది తిరిగి వెళ్ళదు...ఇక్కడే ఉంటుంది

ఇక్కడ ఉండటానికా దానికి పెళ్ళి చేసింది?”

చాలు...నువ్వు అల్లుడ్ని చూసిన లక్షణం! వెతికి వెతికి నీలాంటి పనికిరాని వాడిని దానికి కట్టబెట్టి పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నావు

నాలిక చీరేస్తాను రాస్కెల్! కన్న తండ్రి దగ్గర మాట్లాడుతున్నానే అనేది జ్ఞాపకం ఉంచుకో

కనడం తప్ప నువ్వు ఇంకేం చేసేవని నిన్ను జ్ఞాపకం పెట్టుకోవాలి?”

ఏరా...అంత ఖర్చు చేసి దాన్ని ఒకడికి కట్టబడితే, ఇప్పుడు భర్తే వద్దుఅని వచ్చి నిలబడితే...అభినందనలు తెలిపి స్వాగతిస్తావా? దీన్ని, దీని పిల్లాడిని, కడుపులో ఉన్న బిడ్డనూ జీవితాంతం ఉంచుకుని తిండి పెట్టి పోషించటానికి ఎవరి దగ్గర సొమ్మున్నది?”

ఓయబ్బో! అందరికీ ఈయనే తిండి పెడుతున్నట్టు మాటలు చూడు. నువ్వు తింటున్నదే నేను పెడుతున్న తిండి అనేది జ్ఞాపకం ఉండనీ. తాగుతున్న సారా, వేసుకుంటున్న బట్టలు, బీడీలు అన్నీ నా శ్రమ. నువ్వు నోరు మూసుకో

తండ్రి మొహం వాడిపోయింది. కోపం చూపించటానికి కూడా ఒక యోగ్యత కావాలి. యోగ్యత ఆయనకు లేదు. అయినా కూడా భుజాల మీద వేసుకున్న తుండు గుడ్డని విసిరేసి, వేగంగా బయటకు వెళ్ళిన ఆయన...రెండు రోజులు ఇంటికే రాలేదు. ఏదో ఒక కారణంతో వెళ్ళిపోయాడు నా తండ్రిఅని మురళి ఎగతాలిగా సంతోషపడ్డాడు. అల్ప ఆయుష్యు తో సంతోషం ముగింపుకు వచ్చింది. మూడో రోజు సారా వాసన, ఒళ్ళంతా చెమటతో, వెక్కిరింత నవ్వుతో వాకిలి మెట్లపైన ఆనుకుని కూర్చున్నారు. తల్లి జాలిగా మురళిని చూసింది. ఎంతైనా నా భర్త అనే తల్లి చూపు! ఛీ..పో అనేలాగా మురళి లేచి వెళ్ళిపోయాడు. తల్లి ఆయన్ని తీసుకు వెళ్ళి స్నానం చేయించి భోజనం పెట్టింది. ఆయన భోజనం చేసే శబ్ధం వాకిటి వరకు వినబడ... మురళి భోజనం చేయకుండానే ఆఫీసుకు వెళ్ళిపోయాడు.

రోజు నుండి అక్కయ్య ఇక్కడే ఉంటోంది. ఆమెకు సపోర్టుగా మాట్లాడినందు వలన ఆమె భారాన్ని అతను అతని నెత్తిన వేసుకోవలసి వచ్చింది. ఆమె భవిష్యత్తు ఏమిటి...ఎన్ని రోజులు ఆమెను తాను కాపాడగలడు?’ అనేదంతా ఆలొచించటం కుదరలేదు. ఒక రోజు కాకపోతే ఒకరోజు ఆమె భర్త మనసు మారి వచ్చి ఆమెను తీసుకు వెళ్తాడు అనే అల్ప ఆశ ఉన్నందువలన విడాకులకు అమ్మ ఒప్పుకోలేదు. తొందరపడకు!అని అమ్మ ఆపేసింది.

పెళ్ళికి ఇంకా ఇద్దరు చెల్లెల్లు ఉండగా...పెళ్ళైన అక్కయ్య భారాన్ని కూడా తీసుకున్నాడు. తెలిసిన వారి మూలంగా పిల్లల శరణాలయంలో అక్కయ్యకు ఉద్యోగం ఇప్పించాడు మురళి. రోజంతా పని. జీతం తక్కువే. అయినా అక్కయ్య ఉద్యోగానికి వెళ్ళి వచ్చేది. ఆమె ఇద్దరి పిల్లలనూ తల్లి చూసుకుంటుంది. ఒక్క సమస్యే ఇంకా తీరని పరిస్థితిలో, నాలుగేళ్ళ పిల్లాడికి సుగర్ వ్యాధిఅనే మరొక సమస్య. రోజూ ఇన్సులిన్...నొప్పికి నొప్పి...ఖర్చుకు ఖర్చు. అక్కయ్య తనకొచ్చే జీతంతో ఏం చేయగలదు? మురళి నిట్టూర్పు విడిచాడు.

ఇప్పటికే ఉన్న ఖర్చులు చాలవని కొత్త ఖర్చు వచ్చింది. ఎలా మేనేజ్ చెయ్యబోతామో?’ ఆందోళనగా ఉన్నది అతనికి.

రోజు సాయంత్రం తరుణ్ని డిస్చార్జ్ చేసారు. పిల్లాడు గెంతులేసుకుంటూ, పరిగెత్తుకు వచ్చి మావయ్య గొంతుకు చుట్టుకుని కావలించుకున్నాడు.

చాక్లెట్లు కొనిస్తావా మావయ్యా?”-- ఆ చిన్న గొంతుక అడుగ, మురళి ఇబ్బంది పడుతూ వాడి తలను వంచి హత్తుకున్నాడు.

వెళ్దామారా?” -- అక్కయ్య, అమ్మ వెనుక వచ్చారు.

మీరు ఒక ఆటోలో వెళ్ళిపొండి. నేను కొంచం ఆఫీసు వరకు వెళ్ళొస్తాను -- మురళి జేబులో చెయ్యి పెట్టి డబ్బు తీయబోతుంటే...డబ్బుతో పాటూ అర్చనా అడ్రస్సు కాగితం కలిసి రావటంతో చురుక్కుమని జ్ఞాపకం వచ్చింది. అయ్యో రామా! అమ్మాయికి డబ్బులు ఇస్తానని చెప్పి వెళ్ళనే లేదే

 ‘ఇంతలో అక్కయ్య పిలుపు వచ్చింది. పిల్లాడు కళ్ళు తిరిగి పడిపోయాడు.  హాస్పిటల్లో చేర్పించాము. త్వరగా రారా మురళి. నాకు భయంగా ఉంది’ -- అంటూ అక్కయ్య ఆందోళన అతనికి సోకిన వేగంలో... అర్చనా జ్ఞాపకం పూర్తిగా మర్చిపోయాడు. అదే ఆందోళనతో హాస్పిటల్ కు వెళ్ళినతనికి ఇప్పుడే మళ్ళీ అర్చనా  జ్ఞాపకం వచ్చింది.   

పాపం...తెలియని ఊరు! పర్సును పోగొట్టుకుని, ఎలా ఊరు వెళ్ళి చేరిందో? సహాయం చేసే ఆలొచన నాకు లేదు అని తప్పుగా అనుకోనుంటుంది. నిజం చెప్పినా కూడా నమ్ముతుందో...నమ్మదో? అసలు ఎందుకు వెళ్ళాలి? ఆమె ఏమనుకుంటే నాకేంటి? ఆమెకు మాత్రమే కష్టమా...నాకు లేదా? ఏమైనా అనుకోని.

ఒక మనసు నిర్లక్ష్యం చేసినానూ...దాన్ని మించి ఇంకో మనసులో గందరగోళం ఏర్పడింది.

వివరణ చెప్పి క్షమించమని అడిగి ఉత్తరం రాసి పోస్టు చేస్తే?.

వెయ్యచ్చు...! కానీ, అదే ఆమెకు పెద్ద సమస్య ఏర్పరిస్తే? ఆమె కుటుంబం ఎటువంటిదో? ఒక వేళ కఠినమైన వారు గానూ, అనుమానపు మనుషులుగానూ ఉండి ఆమెను ప్రశ్నకు పైన ప్రశ్న వేసి వేధిస్తే? వద్దు...అది తప్పు. మళ్ళీ ఎప్పుడైనా ఇంకొకప్పుడు కలిసినప్పుడు, జరిగింది చెప్పి క్షమించమని అడిగితే సరిపోతుంది!

అతను పనిలో శ్రద్ద వహించటానికి పూనుకున్నాడు.

                                                                           ******************

మెల్లగా...! -- అర్చనా తండ్రిని చేతులతో పుచ్చుకుని ఇంటిలోపలకు తీసుకు వచ్చింది. మంచంపైన పడుకోబెట్టింది. ఇక ఈయన ఉండబోయేది మంచంలోనే! తీవ్రమైన పక్షవాతం. పాపం...నాన్న ఎక్కువగా శ్రమ పడ్డారు. సంపాదించిన డబ్బు ఏదీ నిలబడలేదు. ఐదు రూపాయలు వస్తే పది రూపాయలకు ఖర్చు వచ్చేది.

తన ఇద్దరు చెల్లెల్లకూ పెళ్ళి చేయాల్సిన బాధ్యతతో తన తోడబుట్టిన వారికీ కలిపి శ్రమ పడాల్సిన పరిస్థితి. రోజు వరకూ పెళ్ళిచేసి పంపిన తన చెల్లెల్లకు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఒకరి తరువాత ఒకరి కాన్పు, బారసాల, వెడ్డింగ్ యాన్వర్సరీ, చెవులు కుట్టించటం అని బోలెడు ఖర్చులు. ఒక అప్పు తీరేలోపు ఇంకో అప్పు. తండ్రి యొక్క కష్టం తెలియక అక్క, అన్నయ్య ఆయనతో పోట్లాడేవారు.

మాకు ఎంత ఆస్తి చేర్చి పెట్టావు?’ అని ప్రశ్నించేవారు. అత్తయ్యలకే ఖర్చు పెట్టాలనుకునే వారు, ఎందుకు పెళ్ళి చేసుకుని పిల్లల్ను కని వాళ్ళని నాశనం చేయాలి?’ అని గొణిగే వాళ్ళు. నాన్న వాళ్ళకు సమాధానం ఇవ్వలేక పోయేవారు. గట్టిగానూ మాట్లాడలేకపోయేవారు.

తనకొసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోవటానికి ఆలొచిస్తారు. ఆయన దగ్గరున్న ఆస్తి అని చెప్పాలంటే...మూడు ప్యాంట్లు, అరడజన్ చొక్కాలు, నాలుగు పంచెలు, పాతకాలం ఇంకు పెన్ను, ఒక పాత పర్సు. పండుగులకు కూడా మిగిలిన వారికి బట్టలు కొంటారే తప్ప తనకోసం ఏమీ తీసుకోరు. ఉన్న డ్రస్సుచిరగనీ, చూసుకుందాం అంటారు.

తన అవసరాలు...ఆశలూ అన్నిటినీ కుదించుకుని కుటుంబం కోసం చెప్పుల్లా అరిగే ఆయన దగ్గర, జాలి అనేదే చూపకుండా గొడవ పెట్టుకోవటం అక్కయ్యకు, అన్నయ్యకు ఎలా మనసు వస్తోందో? ఇంతకీ అన్నయ్య కంప్యూటర్చదువుకు నాన్న అప్పు తీసుకుని ముప్పై వేలు కట్టున్నారు. అక్కయ్యకు కొంచం కొంచం చేర్చిపెట్టి కొంచంగా నగలు కొని ఉంచారు. ఆమె పెళ్ళికొసం డబ్బు చేర్చి పెడుతూనే ఉన్నారు.

నాకోసం నువ్వు ఏం చేశావు?’ అని అడిగిన మరునాడు నాన్న...ఆమెకోసం చేర్చి పెట్టిన డబ్బును ఆమె పేరుతోనే బ్యాంకు అకౌంట్ ఒపెన్ చేసి అందులో వేసి ఇచ్చారు. నేనేమీ ఖాలీగా ఉండలేదు!అని నోటితో చెప్పక, చేతులతో చూపించారు. అదే ఆయన చేసిన తప్పు. తరువాతి నెల అక్కయ్య తన హఠాత్తు ప్రేమికుడితో నగలూ-డబ్బూ అన్నీ తీసుకుని కనబడకుండా పోయింది. అప్పుడు మంచాన పడిన ఆయనే నాన్న.

గత యాభై సంవత్సరాలు శక్తికి మించిన శ్రమపడిన మానవ యంత్రం చెడిపోయింది. ఆయన తరువాత బాధ్యతలు తీసుకోవలసిన అన్నయ్య ఇంటి గురించి కొంచం కూడా బాధపడలేదు. కలత చెందలేదు.

మనిషి నాకు ఏం చేసి చించాడని నేను ఆయన కోసం విచార పడాలి? మాటి మాటికి ఇంటికి వచ్చి  దోచుకు వెళ్ళారు కదా...ఆయన తోడ బుట్టిన వాళ్ళు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి సహాయం కావాలని అడగమను...వాళ్ళను బాధ్యత తీసుకోమని చెప్పమను. మూటలు కట్టుకుని వెళ్ళారుగా...ఇప్పుడు తీసుకు వచ్చి కుమ్మరించమను!

దెబ్బకు దెబ్బ కొట్టి తీరాలని తీర్మానించుకున్న వాడిలా అన్నయ్య నడుచుకున్నాడు...అత్తయ్యలు మోసలి కన్నీరు వదిలి ఒకటి రెండు సార్లు వచ్చి  కుశల ప్రశ్నలు అడిగి వెళ్ళటంతో సరిపుచ్చారు తరువాత తొంగి కూడా చూడలేదు. వాళ్ళను ఏమి అడగటమూ కుదరదు. మెట్టినింట్లో వాళ్ళ హక్కులకు మించి వాళ్ళ దగ్గర ఎదురు చూడటం కూడా తప్పు.

మిగిలిన వారిలాగా కన్నవారిని పట్టించుకోకుండా ఉండలేకపోయింది అర్చన. చిన్న వయసు నుండే తండ్రి దగ్గర ఆమెకు చనువు ఎక్కువ. తప్పే చేసున్నా కూడా ఛీఛీఅని ఆయన అన్నట్టు ఆమెకు గుర్తు లేదు. ఆయన ఎవరినీ ఖండించి  మాట్లాడింది చూడలేదు. అక్క, అన్నయ్య మాట్లాడినప్పుడు కూడా మౌనంగా భరించేరే తప్ప కొంచం కూడా కోపమో-ఆవేశమో పడలేదు.

అర్చనానే ఆయనకోసం మనసారా ఏడ్చింది. అక్కయ్య పారిపోయిన రోజు ఆయన్ని సమాధానపరిచింది కూడా ఆమే. బయటకు చూపించలేని అన్ని బాధలూ మనసులో గట్టిగా పేలటంతో, ఆయన్ని మంచంలో పడేసింది.

ఇల్లు ఉన్న పరిస్థితికి అర్చనాకు ఇప్పుడు వెంటనే ఒక ఉద్యోగం కావాలి. ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కొన్న దిన పత్రికలను రాత్రి పూట అడిగి తీసుకు వచ్చుకుని, ఏడు చోట్ల అప్లికేషన్లు వేస్తే, ఒకే ఒక చోటు నుండి మాత్రమే ఇంటర్వ్యూ పిలుపు వచ్చింది.

అనుభవం లేకపోయినా...ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో, నమ్మకంతో బయలుదేరి వెళ్ళిన ఆమెకు నిరాశే దొరికింది. అదికూడా ఒక ఫ్రాడు కంపెనీ’.  రోజే మురళిని కూడా కలిసింది. అతని జ్ఞాపకం వచ్చింది.

పాపం...డబ్బుతో వచ్చి నిరాశపడి తిరిగి వెళ్ళుంటాడే? సహాయం అడిగి ఇలా నిర్లక్ష్యం చేసేనే అని తప్పుగా అనుకోనుంటాడో?’

వివరంగా ఒక ఉత్తరం రాసి క్షమించమని అడుగుదామో? అవును...అదే సరి. రేపు మొదటి పనిగా అతనికి ఉత్తరం రాసిన తరువాతే మరోపని పెట్టుకోవాలి.

***************************************************PART-3*****************************************

తరుణ్ ఏడుపు ఆకాశాన్ని తాకింది. అక్కయ్య వాడ్ని ఎత్తుకుని మురళి దగ్గరకు వచ్చింది.

ఎందుకే వాడ్ని అలా ఏడిపిస్తున్నావు?”

నేనా ఏడిపించాను? చాక్లెట్ కావాలట. ఏం చేద్దాం చెప్పు. నా ప్రాణం తీస్తున్నాడు. నా వల్ల కావటం లేదురా మురళీ. ఏం చెప్పి వాడ్ని సముదాయించేది? ఎందుకురా ఇలాంటి ఒక పరీక్ష?”

పిల్లాడితో పాటూ అక్కయ్య కూడా ఏడ్చింది.

తల్లి ఏడవటం చూసిన తరుణ్ బెదిరిపోయి, తన ఏడుపు ఆపాడు.

ఇటు రా -- మురళీ వాడ్ని పిలిచి తన వొళ్ళో కూర్చోబెట్టుకున్నాడు.

చాకెట్లన్నీ పాడైపోయాయట. యాక్..! మనకు వద్దు?”

రోజు మాత్రం కొనిచ్చావు...?”

తరుణ్... రోజు చాక్లెట్ తిన్నందువలనే నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు! డాక్టర్ ఇంజెక్షన్ కూడా వేసేరా లేదా? ఇంజెక్షన్ వేస్తే నొప్పి పుడుతుంది కదా? అందుకని చాక్లెట్లు వద్దు...ఏం?”

అవును...చాక్లెట్లు వద్దు!

గుడ్ బాయ్! మావయ్య సాయంత్రం వచ్చేటప్పుడు నువ్వడిగిన గన్తీసుకు వస్తాను. ఇప్పుడు మంచిగా స్కూలుకుబయలుదేరాలి

పెద్ద గన్కావాలి! ఇంత...పెద్దది -- చేతులు పెద్దవిగా విరిచి చూపించాడు.

ఖచ్చితంగా తీసుకు వస్తాను

మురళీ వాడ్ని పంపించి...సేవింగ్ సెట్టు తీసాడు.

కొద్ది సేపట్లోనే తరుణ్ ఏడుపు మళ్ళీ వినిపించింది. అక్కయ్య వాడ్ని కొడుతున్న శబ్ధం వినబడటంతో...రేజర్ను పెట్టేసి బయటకు వచ్చాడు.

ఇప్పుడేమిటి సమస్య?”

ఇడ్లీ లోకి నంచుకోవటానికి చక్కెర కావాలట

చెప్పలేక పోయాడు. చెప్పినా అర్ధం చేసుకునే వయసూ లేదు. ఇదొక పెద్ద సమస్యే! ఎలా మేనేజ్ చెయ్యబోతామో? పిల్లాడి కొసమే మిగిలిన వాళ్ళు కూడా స్వీట్లుతినడం తగ్గించారు. ఇంట్లో కూడా తీపి పదార్ధమూ చేయటం లేదు. అయినా కానీ వాడ్ని సముదాయించే దారి కనబడలేదు.

ఇదిగో చూడు తరుణ్...డాక్టర్ నీ దగ్గర ఏం చెప్పాడు? ఇకమీదట స్వీటుఅదీ తినకూడదని చెప్పారా లేదా? నువ్వు పట్టుదల పడితే నిన్ను డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళి వదిలి పెట్టేస్తాను

స్కూల్లో పిల్లలందరూ తింటున్నారు. నేను మాత్రం ఎందుకు తినకూడదు?”

తరుణ్ యొక్క ఒంటికి స్వీటు పడదట. అందుకే

ఎందుకు నా ఒంటికి మాత్రం...?”   

తెలియదురా నాన్నా. దేవుడి దగ్గరే అడగాలి...పిల్లాడికి ఎందుకు ఇంత కష్టం ఇస్తున్నావు అని?’ నువ్వు పెరుగు నంచుకుని తింటావుట. నీకు గన్కావాలా...వద్దా?”

కావాలి!

అప్పుడు పెరుగు నంచుకు తిను

తుపాకీ కోసం...పిల్లాడు పెరుగు నంచుకుని తిన్నాడు. మురళీ మిగిలిన షేవింగ్ను ముగించుకుని స్నానాకి వెళ్ళాడు.

తినేటప్పుడు తల్లి అడిగింది.

సభాపతి మూడుసార్లు వచ్చాడు. వాళ్ళను ఎప్పుడు రమ్మని చెప్పచ్చు అని అడిగాడు. మనం ఏదైనా సమాధానం చెప్పాలిగా?”

మురళీ ఆలొచించాడు.

మన తాహతు ఏమిటో సభాపతి దగ్గర చెప్పావా?”

చెప్పకుండా ఉంటానా...? బృందాని వాళ్ళు ఒకటి, రెండు సార్లు చూసారట. చేయగలిగేదే చేయని. మాకు అమ్మాయి బాగా నచ్చిందిఅని చెప్పి పంపారు. కాలంలో డిమాండ్చేయకుండా...పిల్లనిస్తే చాలుఅని ఎవరు చెబుతున్నారు? అప్పో, గిప్పో చేసి సంబంధం ఖాయం చేసుకుంటే మనకి భారం తగ్గిపోతుందిరా...ఏమంటావు?”

ఎలా చూసినా కొంతడబ్బు అవసరం కదా? దానికి నేనేం చేయగలను? ఎక్కడ అడగగలను?”

డబ్బులు లేవని పెళ్ళి చేయకుండా ఇంట్లోనే ఉంచుకోగలమా? ఏదైనా చేసే కావాలి. ఏదో నావల్ల అయ్యింది...కడుపు మాడ్చుకుని, నోరు మాడ్చుకుని, నాలుగు కాసులు బంగారం కొనుంచాను. ఇంకో రెడు, మూడు కాసులకు నగలు కొని వేద్దాం. అది పనిచేసే షాపులోనే తక్కువ ధరకు చీరలు కొందాం. అది కూడా ఏదో కొంచం డబ్బు సేవ్ చేసుంచింది. ఎలాగైనా సంబంధం ఓకే చేసుకుని పెళ్ళి చేసేద్దాం. వదులుకుంటే ఇలాంటి సంబంధం మళ్ళీ దొరుకుతుందో, లేదో? ఇల్లు వెతుక్కుంటూ వచ్చి ఇంటి తలుపులు తడుతున్నప్పుడు వదిలేస్తే...మూర్ఖులు అని చెబుతారు

చూద్దాం...నాకు రెండు రోజులు టైము ఇవ్వు. ఆఫీసులో ఏదైనా లోను వేయగలనా అని చూస్తాను. ఎలా చూసినా ఆఫీసులో యాభై వేల కంటే ఎక్కువ రాదు. ఇంతకు ముందే అక్కయ్య పెళ్ళికి తీసుకున్న లోన్ డబ్బులే పూర్తిగా కట్టలేదు. తరువాత బృందా? అప్పుచేయటం దీనితో ఆగిపోతుందా? దీని తరువాత... శాంతీ వేరే ఉంది?”

నిన్ను పిండి పిప్పి చేస్తున్నాను...కదరా మురళీ? మారి మారి ఏదో ఒక ఖర్చు పెట్టిస్తునే ఉన్నాను కదా? నన్నేం చేయమంటావురా? మనిషిని నమ్మి వరుసగా కన్నది తప్పే! అంత బాధ్యతలేని మనిషిగా ఉంటాడని అనుకోలేదురా...

మురళీ మౌనం వహించాడు. ఏం మాట్లాడాలి? అమ్మను తిట్టగలనా? కుటుంబంలో మొదటి వాడిగా పుట్టి బాధ్యతలు మోయాలని నా నుదట రాసుంటే -- అది ఎవరి వలన మార్చటం కుదురుతుంది?’

మురళీ ఆఫీసుకు వచ్చిన వెంటనే, మొదటి పనిగా అకౌంట్ సెక్షన్ కు వెళ్ళి అప్పు గురించి మాట్లాడాడు. అకౌంటంట్ ఏదేదో లెక్కలు వేసి, అదీ ఇదీ  చెప్పి...ఎలాగైనా నలభై వేలుసాంక్షన్ చెయొచ్చు అన్నాడు. దొరికినంత చాలు!’ అనుకుంటూ లోన్ ఫారం తీసుకుని పూర్తి చేసి ఇచ్చాడు.

రోజు సాయంత్రమే పెళ్ళి కొడుకు ఇంటికి తల్లితో కలిసి వెళ్ళి మాట్లాడాడు. గొప్ప ఆస్తి పరులు అని చెప్పలేకపోయినా, వీళ్ళ కంటే వసతి గల వాళ్ళు అనేది అర్ధమయ్యింది. సొంత ఇల్లు, స్కూటర్ ఉంది. అబ్బాయికి ఏలూరులో ప్రభుత్వ ఉద్యోగం. ట్రాన్స్ ఫర్ కు ట్రై చేస్తున్నారట. సీనియారిటీ ప్రకారం ఒక సంవత్సరంలో దొరుకుతుందట.

మా శక్తి ఏమిటో చెప్పేస్తాం -- అమ్మ ప్రారంభించింది. మీ దగ్గర చెప్పటానికి ఏముంది. నా భర్త పేరుకు మాత్రమే ఇంట్లో ఉన్నారు. అది తప్ప, అన్ని బాధ్యతలూ వీడి తల మీదే. అప్పు చేసే మేము అన్నీ చేయాలి

మధ్యవర్తి సభాపతి అన్ని విషయాలూ చెప్పాడండి. మేమూ కష్టపడ్డ వాళ్ళమే.  అవతలి వారి కష్టాలు మాకూ తెలుసు. మీ వల్ల అయ్యింది చెయ్యండి. గుడిలో పెళ్ళి చేసినా కూడా పరవాలేదు. మా బంధువులందరినీ కలిపితే యాభై మంది ఉంటే ఎక్కువ. ఆఫీసువాళ్ళకు ఒక పూట విందు భోజనం మేమే ఏర్పాటు చూసుకుంటాం. పెళ్ళి ఖర్చులో సగం మేము పెట్టుకుంటాం. మాకు అమ్మయే ముఖ్యం...ఆడంబరం కాదు

పెళ్ళి కొడుకు తల్లి చెప్పగా... మురళీ తల్లి మొహం వికసించింది. మురళీని చూసింది.

అప్పుడైతే ఎప్పుడు పెళ్ళి చూపులకు వస్తారు?”

అమ్మాయిని నేను చూసాను. అది చాలు...తాంబూలాలకు ఏర్పాటుచేయండి

అయినా అబ్బాయి, అమ్మాయిని చూడద్దా?”

నేను చెబితే చాలండి వాడికి! ఏరా...చూడాలా?”

ఎందుకు...? నువ్వు చెబితే చాలమ్మా అబ్బాయి చెప్పగా... మురళీ ఆశ్చర్యపొయాడు. కాలంలో ఇలాంటి ఒక కొడుకా?’

అయితే మేము బయలుదేరతాం. పంతులు గారి దగ్గర అడిగి, మంచి రోజు చూసొచ్చి చెబుతాం

మురళీ లేచి చేతులు జోడించాడు. సంతోషంగా ఇంటికి వచ్చారు.

నాకిప్పుడు పెళ్ళి వద్దు -- బృందా పెద్ద బాంబు విసిరేసింది.

ఏమిటే చెబుతున్నావు?” -- అంటూ కూతుర్ని కొట్టటానికి చేయి ఎత్తిన తల్లిని మురళీ ఆపాడు.

ఎందుకు వద్దంటున్నావు బృందా?”

నాకు నచ్చలేదు

అదే ఎందుకు?”

బృందా మౌనంగా తల వంచుకుంది. మురళీ ఆమెను లోతుగా చూసాడు. దగ్గరకు వచ్చి వేలితో ఆమె మొహాన్ని పైకెత్తాడు. 

ప్రేమా-గీమా అని ఏదైనా అసహ్యం ఉందా?”

బృందా ఆశ్చర్యంతో అతన్ని చూసింది. లేదుఅని జవాబు చెప్పలేకపోవటం నుండి -- ఏదో ఉన్నది అనేది అర్ధమయ్యింది... మురళీ మళ్ళీ గుచ్చి గుచ్చి అదే ప్రశ్న అడిగాడు. చివరిలో ఒక విధంగా ఒప్పుకుంది. అతని ఊహ కరెక్టేనని నిరూపించింది. 

తల్లి నెత్తీ నోరూ బాదుకుంటూ ఏడ్చంది. తలమీద రాయి పడేశావు కదవే పాపిస్టిదానా అంటూ ఆమెను ఊపింది.

బృందా మొండిగా నిలబడటంతో ఆమె దేనికైనా తయారుగా ఉన్నదని అర్ధమయ్యింది మురళీకి.  

ఎవరతను...ఏం చేస్తున్నాడు?”

బి.ఆర్క్. చదువుతున్నాడు. చివారి సంవత్సరం

డబ్బు గల వాడా?”

అలా చెప్పలేము. కానీ, మనకంటే వసతిగల వారే

ఓక్కడే కొడుకా?”

ఒక చెల్లెలు ఉంది

అతను నిన్ను పెళ్ళి చేసుకుంటాడా?”

ఖచ్చితంగా పెళ్ళి చేసుకుంటాడు

వాళ్ళింట్లో వాళ్ళు ఒప్పుకుంటారా?”

అదంతా ఆయన చూసుకుంటారు

ఒక వేళ ఒప్పుకోకపోతే అతనేం చేస్తాడు?”

ఆమె సమాధానం చెప్పలేదు.

వాళ్ళు కట్నకానుకులు ఎక్కువగా అడిగితే...ఏం చేస్తావు? నేను చెయ్యలేను?”

ఆయన అలాంటివారు కాదు...

అతని చదువు పూర్తి అవకుండానే పెళ్ళి చేసుకుంటే...ఏం చేస్తారు?”

ఎవరిప్పుడు పెళ్ళికి తొందరపడుతున్నారు? చదువు ముగించి...ఆయనకు ఉద్యోగమూ దొరికిన తరువాతే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం

అతన్ని నమ్మి, ఇతన్ని వద్దంటున్నావు...చివరికి నీకు ఎవరూ లేకుండా పోతారు -- తల్లి అడ్డుపడి మాట్లాడింది.

మురళీ, తల్లిని కోపంగా చూసాడు.

మంచి మాటలే మాట్లాడమ్మా ఎప్పుడూ

ఇప్పుడు పెళ్ళి వారికి ఏం సమాధానం చెప్పబోతావురా?”

నిజం చెప్పాల్సిందే!

చాలా బాగుందిరా! ఇది బుద్దిలేక మాత్లాడుతోందని అనుకుంటే...నువ్వు కూడా దానికి తోడుగా డప్పు వాయిస్తున్నావే? అమ్మా తల్లీ, చదువుకున్న వాడు అంటున్నావు....రేపు మనకంటే డబ్బుగల అమ్మాయి దొరికితే...నిన్ను దుమ్ములాగా దులుపుకుంటాడు. అందువలన ప్రేమా--గీమా వదిలేసి, మేము చూసిన అబ్బాయిని పెళ్ళి చేసుకుని ఆనందంగా జీవితం గడపమని చెబుతావా?”

అమ్మ చెప్పింది విన్నావా బృందా? నీ మంచికే చెబుతున్నారు

నా వల్ల ఆయన్ని మరిచిపోవటం కుదరుదు అన్నయ్యా

మేము కుదరదు అంటే ఏం చేస్తావు?”

లేచి పోతా!

పాపిస్టి దానా!

చూసావా అమ్మా...మనం మంచి చెబితే ఇదే జరుగుతుంది. అందుకే పెళ్ళివారికి నిజం చెప్పేద్దాం. మనం ఏం చేయగలం? ఒకవేళ ఇది ప్రేమిస్తున్న వాడు మంచి అబ్బాయిగా ఉండి, దీన్ని బాగా చూసుకుంటూ, దాంపత్యం  చేస్తే?”

నాకెందుకో...ఇది సరి రాదు అనిపిస్తోంది

నేను వెళ్ళి పెళ్ళివారి దగ్గర నిజం చెప్పేసి వస్తాను. పాపం...మనం వస్తామని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు

అమ్మ ఏమీ మాట్లాడలేదు. ఎలాగైనా చావండి...అనేలాగా లేచి వెళ్ళిపోయింది.

మురళీ ఆఫీసుకు  వచ్చాడు. అబ్బాయి వాళ్ళింటో ఏం చెప్పి వాళ్ళను సమాధానపరచాలిఅని ఆలొచించాడు.

ఇదిగో మురళీ...నీకేదో ఉత్తరం వచ్చింది. రెండు రోజులుగా లెటర్ బాక్స్ లోనే ఉంది -- స్టాఫ్ ఒకాయన తీసుకు వచ్చి ఇచ్చాడు మురళీ ఆశ్చర్యంతో దాన్ని తీసుకుని చూసాడు.