ఎక్కడ నా ప్రాణం...(నవల)

 

                                                                           ఎక్కడ నా ప్రాణం                                                                                                                                                               (నవల)

దివ్యాకి రాత్రంతా నిద్ర పట్టలేదు.ఆందోళన ఆమె మనసును చెదలా తింటున్నది. దొర్లి దొర్లి పడుకుంటూ, ఆలొచిస్తూ ఉన్నది.

రేపు ఆమె ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అర్జున్ అమెరికా నుండి వచ్చేస్తాడు.

అతను వస్తున్నాడన్న సంతోషం కూడా ఆమె మనసులో ఇమడటం లేదు? దీనికి కారణం ఎవరో కాదు? ఆమె తండ్రి డాక్టర్.విఠల్ రావ్!

ఆయన క్రితం రాత్రి నుండి కనబడటం లేదు. ఏం చేయాలో తెలియని దివ్యాకి తండ్రి ముందు రొజు కారణమే లేకుండా చెప్పిన మాటలే గుర్తుకు వస్తున్నాయి. 

చెడిపోయే వాడే చెడు ఆలొచిస్తాడు. అపూర్వమైన విషయాలన్నీ అపూర్వమైన మనుష్యులకే దొరుకుతుంది. అందరికీ దొరకదు. దొరికితే దాన్ని తప్పైన విషయంకోసం వాడటం మొదలుపెడతారు. కొన్ని రహస్యాలు రహస్యాలుగానే ఉండాలి. అలా జరగలేదనుకో--దాని వలన ఊరికి, ప్రపంచానికీ ఆపద.

మనసును ఎప్పుడూ జారవిడుచుకోకూడదు. చివరిదాకా నమ్మకాన్ని వదలి పెట్టనే కూడదు. ఏం జరిగినా పరవాలేదని పట్టుదలగా ఉండి పోరాడి ధైర్యంగా కొండ శిఖరాన్ని అయినా ఎక్కాలి.

ఏం జరిగినా సరే....ధైర్యవంతులకి నిద్ర ఉండదు అని పెద్దలు చెబుతారు. నువు కూడా ఏం జరిగినా సరే ధైర్యంగా ఉండాలి. అప్పుడు భయము, దిగులు మరు క్షణమే మాయమైపోతుంది--మనసులో ప్రశాంతత, చిన్న తృప్తి తల ఎత్తుతుంది

ఆయన ఎందుకలా చెప్పాడు? ఆయన కనబడకుండా పోవటానికీ ఆయన చెప్పిన దానికీ ఏదైనా లింక్ ఉందా? కనబడకుండా పోయిన దివ్యా తండ్రి తిరిగి వచ్చాడా? లేక దివ్యానే ఆయనను వెతికి కనుక్కోగలిగిందా? ఆయన కనబడకుండా పోవటానికి కారణం ఏమై ఉంటుంది?.....వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవటానికి త్రిల్లింగ్ నవలను చదవండి.

*****************************************************************************************************

                                                                               PART-1

దివ్యాకి రాత్రంతా నిద్ర పట్టలేదు.

ఆందోళన ఆమె మనసును చెదలా తింటున్నది.

దొర్లి దొర్లి పడుకుంటూ, ఆలొచిస్తూ ఉన్నది.

రేపు అర్జున్ అమెరికా నుండి వచ్చేస్తాడు.

అతను వస్తున్నాడన్న సంతోషం కూడా ఆమె మనసులో ఇమడటంలేదే? దీనికి ఎవరు కారణం?

ఆమె తండ్రి విఠల్ రావ్!

విజయవాడ సిటీకి పక్కనున్న మంగళగిరిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చీఫ్ డాక్టర్ గా  పనిచేస్తున్నారు ఆమె తండ్రి విఠల్ రావ్. ఎందుకోనో, తెలియదు నిన్న రాత్రి ఆయన ఇంటికి తిరిగి రాలేదు.

చుట్టు పక్క ప్రదేశాలలో 'హస్త వాసి గల డాక్టర్ అనే పేరు సంపాదించాడు. తన ఇంటి ముందు ఒక చిన్న గది కట్టి అందులో క్లీనిక్ ఒకటి నడుపుతున్నాడు.

దివ్యాను కంటికి రెప్పలాగా--ప్రేమగా చూసుకుంటాడు. నాలుగు సంవత్సరాలకు ముందు ఆమె తల్లి త్రిపురాంబ చనిపోయింది.

తల్లిని పోగొట్టుకున్న దుఃఖం మరిచిపోయే విధంగా ప్రేమ వర్షాన్ని కురిపించి తల్లి స్థానమును కూడా ఆయనే పూర్తి చేశాడు. ఆయనకు భక్తి ఎక్కువ. ఇరవై నాలుగు గంటలూ ఆయన నుదిటి మీద విబూది  మెరుస్తూ ఉంటుంది.

రెస్టు దొరికిన సమయంలో ధ్యానం, యోగాసనాలూ లాంటి వాటిలో తనని తాను ఈడుపఱుచుకుని తనని తాను బిజీగా ఉంచుకుంటాడు. భగవద్గీతను అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటాడు.

మూడు నెలలకు ఒకసారి లంబసింగి అటవీ ప్రాంతంలోని ఒక కొండకు వెళ్ళిరావటం అలవాటుగా పెట్టుకున్నారు.

లంబసింగి లోని జలపాతంలో స్నానం చేసుకుని, అక్కడున్న ఒక వినాయకుడి గుడిని దర్శించుకుని, తరువాత ప్రాంతంలోని కొండపైన ఉన్న ఒక శివలింగాన్ని కళ్ళార చూసుకుంటేనే ఆయనకు చాలా తృప్తిగానూ, సంతోషంగానూ, ఉత్సాహంగానూ ఉంటుంది.

మూడు రోజులు కూతుర్ని వదిలిపెట్టి వెళ్ళటానికి ముందు---ఆయన మనసు విపరీతమైన క్షోభకు గురవుతుంది.

"అమ్మా దివ్యా! పక్కింటి బామ్మ దగ్గర చెప్పేసి వెలుతున్నాను. వయసులో ఉన్న కూతుర్ని ఇలా ఒంటిరిగా వదిలిపెట్టి వెళ్ళటం తప్పే. కానీ, మూడు నెలలకు ఒకసారి  అక్కడికి వెళ్ళివస్తేనే నా మనసు ప్రశాంతంగా ఉంటోంది. ఏదో రీచార్జ్ ఎక్కించుకున్నట్టు, ఎనర్జిటిక్ గా ఉన్నట్టు అనిపిస్తుందిఅంటూ తటపటాయిస్తూ నిలబడ్డాడు.

"అవతలవారికి మనవలన చేయగలిగిన సహాయం చేయాలి. కానీ, వాళ్ళకు ఇబ్బంది కలిగేటట్టు ఒక్కరోజు కూడా నడుచుకోకూడదు అని మీరేగా చెప్పారు? అలాంటి మీరే పక్కింటి బామ్మను ఎందుకు ఇబ్బంది పెడతారు? నాకేమీ భయంగా లేదు. ఇళ్ళు మీరు ఎంతో బాగా డిజైన్ చేసి కట్టించారు. అది నాకు కావలసిన రక్షణ ఇస్తుంది. వెనుక ఉన్న గదిలో తోటమాలి కాపురం ఉంటున్నాడు. ఒక్క పిలుపుకు పరిగెత్తుకు వస్తాడు.

అన్నిటికీ మించి మన పెంపుడు కుక్క టైగర్. ఒక చిన్న పక్షిని కూడా మన ఇంటి గేటు మీద వాలనివ్వదు. వీధి మొత్తం హడలిపోయేలా అరుస్తుందని మీకు తెలుసు. చిన్న వయసు నుంచి నాకు ధైర్యాన్నీ, నమ్మకాన్ని పోసి పెంచారు.

నేనిప్పుడు చిన్న పిల్లను కాదు నాన్నా. ఎం.బి.బి.ఎస్ పూర్తి చేసిన డాక్టర్ను! ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాను. నా గురించి భయపడకుండా, ప్రశాంతంగా వెళ్ళిరండి..."  అని పోయిన సారి నాన్నకు ధైర్యం చెప్పి పంపించింది.

పోయిన సారి ఆయన తిరిగి వచ్చినప్పుడు..."అమ్మా దివ్యా... సారి తిరిగి రావటానికి నాకు మానసే రాలేదురా.చాలా స్వారస్యమైన విషయాల గురించి విన్నాను. నా కళ్ళతో ఒక అద్భుతమైన దృశ్యం ను చూశాను. ఎంతో అద్భుతం?" అన్నారు.

ఇంటికి తిరిగి వచ్చేందుకే మనస్కరించ లేదు అంటున్నారంటే ఖచ్చితంగా చాలా అద్భుతమైన దృశ్యమే మీ మనసును తాకుంటుంది. అదేమిటో నేను తెలుసుకోవచ్చా?” ఆసక్తిగా అడిగింది.

"తప్పకుండా. నువ్వు దృశ్యం గురించి తెలుసుకోవాలి. లంబసింగి లో నేను వెడుతున్న కొండ ప్రదేశం ఒక ప్రత్యేక శక్తి కలిగినదని చెబుతూంటాను కదా...అది శక్తివంతమైన ప్రదేశం మాత్రమే కాదు, ఒక పుణ్య భూమి అని సారి తెలుసుకున్నాను. సారి నేను చూసిన దృశ్యం నాకు భావాన్ని కలిగించింది"

అవును నాన్నా. మునులు, సన్యాసులు తపస్సు చేసిన గుహలు, వాళ్ళు సంతరించిన స్థలాలు అక్కడ  చాలా ఉన్నాయని చెప్పారు. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు వాళ్ళను కళ్ళార చూశానని చెప్పారు"

"అది మాత్రమే కాదురా. అద్భుతమైన ఔషధ శక్తి కలిగిన చెట్లు అక్కడ చాలా ఉన్నాయి. ఇంకెక్కడా దొరకని అరుదైన రకరకాల ఔషధ శక్తి కలిగిన చెట్లు కొండ ప్రదేశంలో ఉన్నాయి. అనేక రకాల వ్యాధులను గుణపరచగల మూలికలు చాలా ఉన్నాయి...ఇది నా ఆరు సంవత్సరాల పరిశోధనలో తెలిసింది"

"నిన్ను అర్జున్ చేతిలో అప్పగించి...మీ ఇద్దర్నీ పెళ్ళి దుస్తులలో చూసిన తరువాత నేను ప్రశాంతంగా కొండ ప్రదేశంలో ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకుంటూ, అక్కడున్న ఒక గుహలో ఉండిపోతాను. ఇప్పుడు కూడా నా బాధ్యత నెరవేర్చటానికి--అంటే నీకు పెళ్ళి చేయటానికోసమే తిరిగి వచ్చాను"

"...ఎందుకు నాన్నా అలా చెబుతున్నావు? మూడు నెలలకు ఒక సారి మీరు అక్కడికి వెల్తారు. మూడు రోజుల తరువాత మీరు తిరిగి వస్తున్నప్పుడు, కొత్త ఉత్సాహంతో తృప్తిగా వచ్చి దిగుతారు... సారి ఏమైంది మీకు? మీరింకా రిటైర్ అవలేదు. ఉన్నతమైన డాక్టర్ పనిని, ప్రాణంగా చూసుకుంటున్న కూతుర్ని వదిలేసి...అక్కడే ఉండిపోవాలనే నిర్ణయానికి రావడానికి అక్కడ ఏం జరిగింది?"

కొండ మీద పాడుపడిపోయిన శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు...అక్కడ గంగయ్య స్వామి అనే మూలిక వైద్యుడ్ని చూశాను. ఒకర్నొకరు పరిచయం చేసుకుని వైద్యం గురించి మాట్లాడుకున్నాము. ఆయన మూలిక వైద్యం గొప్పతనం గురించి చెప్పారు. అక్కడే మా ఇద్దరి మధ్యా స్నేహం ఏర్పడింది అనుకో..."

" మూలిక వైద్యుడు మీలాగానే శివలింగాన్ని దర్శించుకోవడానికి అప్పుడప్పుడు కొండకు వచ్చి వెల్తుంటారా?"

"శివలింగాన్ని దర్శించుకోవడానికి మాత్రమే కాదమ్మా, ఆక్కడు దొరికే ఔషధ మూలికలను తెచ్చుకోవటానికి వెలుతూ ఉంటారు....ఆయన కొండ క్రింద ఉన్న ప్రదేశంలో ఒక గుడారం వేసుకుని, అక్కడ నివసిస్తూ, ఆయన దగ్గరకు వచ్చే పేషంట్లకు వైద్యం చేస్తూ ఉంటారు.

దీర్ఘకాలిక వ్యాధులు, మరణ భయం పుట్టించే వ్యాధులకు ఆయన వైద్యం చేసి వాటిని గుణపరుస్తాడని చాలా మంది చెప్పటం నేను విన్నాను.

కొండ మీద ఒక శివలింగం ఉన్నట్టు ఎవరికీ తెలియదమ్మా. అక్కడ ఒక చిన్న గుడి కూడా లేదు. ఒక బహిరంగ ప్రదేశంలోనే ఉంటుంది శివలింగం. కొండ ప్రాంతానికి ఎవరైనా వెళ్ళొచ్చు. వెలితే శివలింగాన్ని చూడొచ్చు. కానీ అక్కడికి వెళ్ళటానికి దట్టమైన అడవిని దాటి వెళ్ళాలి. కృర ముగాలకు భయపడి ఎవరూ అటు వెళ్లటం లేదు. నాబోటి మొండి వాళ్ళు మాత్రమే వెడతారు. శివలింగాన్ని చూట్టూ ఉన్న ప్రదేశంలోనే ఔషధ గుణాలు కలిగిన మూలిక చెట్లు ఉన్నాయి.

నిజానికి మూలిక వైద్యుడ్ని కలిసి, మూలికల ఔషధ లక్షణాల గురించి తెలుసుకుని వాటిపై పరిశోధనలు చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ, వైద్యుడ్ని కలవటానికి అతని గుడారానికి ఎన్నిసార్లు వెళ్ళినా ఆయన్ని కలవలేకపోయాను. అలా ఒకసారి వెళ్ళినప్పుడు ఆయన అసిస్టంట్ ను కలిశాను. వాళ్ళ గురువు, అదేనమ్మా వైద్యుడు ,మూలికలకోసం కొండపైకి వెళ్ళారని చెప్పాడు. అప్పుడే నాకు కొండపైన మూలికలు దొరుకుతాయని తెలిసింది.

నేను ఆయన్ను కలవటానికి కొండపైకి వెళ్లినప్పుడు అక్కడ శివలింగాన్ని చూశాను. చూసిన మరు క్షణం నాలో ఏదో జరిగింది. శివలింగానికి మొక్కుకుని, శివలింగం చుట్టూ మూడు ప్రధక్షిణాలు చేసి, వెను తిరిగినప్పుడు నాకు మూలిక వైద్యుడు కనబడ్డాడు.

పోయిన సారి నేను ఆయన గుడారానికి వెళ్ళినప్పుడు...ఒక కుష్టు రోగిని చూశాను. మూలికలను, ఏవో ఆకులను పేస్టులాగా రుబ్బి అతని వొళ్లంతా పూసున్నారు. అతను నీరసంగా పడుకొని ఉన్నాడు.

ఇలా క్షీణించిపోతున్న వారిని మూలికల వైద్యంతో గుణపరచగలమా? అని అనుమానంగా అడిగాను. మూలికలతో గుణపరచలేని వ్యాధి-- లోకంలోనే లేదని చెప్పవచ్చు. మీరు సారి వచ్చినప్పుడు అతన్ని చూడండి. చూసి ఆశ్చర్యపోతారు నవ్వుతూ చెప్పాడు.

సారి ఆయన గుడారానికి వెళ్ళినప్పుడు ఆయన ధ్యానంలో ఉన్నాడు. ఆయన శిష్యుడొకడు రుబ్బురోలులో ఒక రాయితో ఏవో మూలికలను రుబ్బుతున్నాడు. కొండ ప్రాంతంలోని పువ్వులను బుట్టలో వేసుకుని అప్పుడు ఒక యువకుడు లోపలకు వచ్చాడు. కొబ్బరి నారతో వేగంగా వాటిని పూలమాలగా కట్టటం మొదలుపెట్టాడు. యువకుడ్ని ఎక్కడో చూసినట్టు అనిపించటంతో, ఎక్కడ చూశానా? అని ఆలొచిస్తున్నప్పుడు, గుడారంలో ఒక గొంతు వినబడింది.

ఏమిటి డాక్టర్.విఠల్ రావ్? ఇతను ఎవరో గుర్తుకు వస్తోందా...లేదా? కుష్టి రోగిగా ఉన్నతనే ఇతను. మూలికల మహిమతో పూర్తిగా మామూలు మనిషిగా అయిపోయాడు చూశారా?’ అని గంగయ్య స్వామి నవ్వుతూ చెప్పారు.

నేను ఆశ్చర్యంతో శిలలా నిలబడిపోయాను. అప్పుడు అక్కడ పచ్చటి ఆకులను రుబ్బుతున్న శిష్యుడు కుంటుకుంటూ నా దగ్గరకు వచ్చి 'పుట్టుకతోనే వికలాంగిగా పుట్టి, నడవటానికే కుదరని నన్ను - గంగయ్య స్వామి గారు గుణపరిచారు. రోజు కుంటుకుంటూ నడిచి మీ దగ్గరకు వచ్చి మాట్లాడగలుగుతున్నాను. తరువాత ఊరికి తిరిగి వెళ్ళటానికి మనసురాక సేవ చేసే భాగ్యం కల్పించడని అడిగితే...ఇక్కడే ఉండిపొమ్మన్నారు. ఇక్కడే ఉండిపోయానుఅన్నాడు.

"నాన్నా! వినేటప్పుడే మైమరిపిస్తోంది! నేరుగా చూసిన మీకు ఎలా ఉంటుందో నేను అర్ధం చేసుకోగలను. ఏది ఏమైనా మీరు నన్ను వదిలి నిరంతరంగా వెళ్ళిపోకండి. నేను తట్టుకోలేను. కాదూ, కూడదూ నిరంతరంగా వెళ్ళిపోవాల్సిందే అని మీరనుకుంటే మీతో పాటూ నన్ను కూడా తీసుకు వెళ్లండి"

తండ్రి చేతులు పట్టుకుని ఏడ్చింది.

"దివ్యా! ఏడవకు. నీ కళ్ళల్లో నుండి ఒక కన్నీటి బొట్టు వచ్చినా నేను తట్టుకోలేను. నిన్ను వదిలి నేను నిరంతరంగా వెళ్లగలనా?...వెళ్ళలేనమ్మా. ఇక విషయం గురించి మనం మాట్లాడొద్దు. సరేనా?!" అంటూ తండ్రి విఠల్ రావ్ రోజు మాట్లాడిన మాటలు -- మళ్ళీ మళ్ళీ ఆమె చెవులకు ప్రతిధ్వని లాగా వినబడుతోంది.

***************************************************PART-2*****************************************

దిగులు, భయం పోటా పోటీ వేసుకుని దివ్యాని గందరగోళానికి గురిచేస్తున్నాయి.

మొన్న జరిగిన సంఘటనను తలచుకుంటే నాన్న ఏదో ఒక చిక్కులో ఇరుక్కోనున్నట్టు అనిపించింది.

రోజు నాన్నతో పనిచేస్తున్న సహ ఉద్యోగి డాక్టర్ సుధీర్ ఇల్లు వెతుక్కుంటూ వచ్చేరే? రోజు సంఘటనులు గుర్తుకు తెచ్చుకుంటుంటే దివ్యాకు చెమటలు కారుతున్నాయి. ఆమె ఆలొచనలు వెనక్కు వెళ్ళినై.

రోజు ప్రొద్దున, స్టవ్ మీద మరుగుతున్న పులుసులో వేరుగా ఉడకబెట్టిన ములక్కాడ  ముక్కలను వేసి, దాంతో పాటు కొంచంగా ఇంగువ వేసి, గరిటతో బాగా కలిపి, గిన్నెను క్రిందకు దించి పెట్టినప్పుడు----తలకు తుండు చుట్టుకుని, తోటలో నుంచి లేత వంకాయలను కోసుకుని, నవ్వుతున్న ముఖంతో వంటింట్లోకి వచ్చారు నాన్న.

"పులుసు వాసన అధిరిపోయిందమ్మా. మీ అమ్మలాగానే నీకు మంచి చేతి పక్వం ఉందమ్మా. నంచుకోవటానికి ఏం చేశావు?"

"కొబ్బరి,సెనగపప్పు వేసి గోరు చిక్కుడు కూర నాన్నా..."

"తరువాత...?"

"పొండి నాన్నా! అక్కడేదో మీరు కడుపారా వేడి వేడిగా భోజనం చేసేటట్టు మాట్లాడుతున్నారు? మధ్య కొంతకాలంగా ఉప్పు, పులుపు ఏమీ లేకుండా ఉత్త పెరుగు అన్నం రెండు ముద్దలు తిని లేచేస్తున్నారు. రాను రానూ అన్నీ అనుభవించిన మునిలాగా అయిపోయారు"

"ఊహు!అలా చెప్పదమ్మా. అన్ని తెలిసిన మునిలాగా అయ్యుంటే, ఇంటికి తిరిగి వచ్చే వాడినే కాదు! కొండ మీదే ఉండి పోయేవాడిని? సరి...వదిలేయ్! నీకు వంకాయ పొడి వేసి చేస్తే బాగా ఇష్టం కదా...అది చెయ్యి" 

"మీకెందుకు నాన్నా శ్రమ? ఖాలీగా ఉంటే వంటచేస్తానని వంటింట్లోకి వచ్చేస్తారు. అదీ కాకుండా మీరు తోటకు వెళ్ళి కూరగాయలు కొయ్యాలా? తోటమాలిని కేకవేస్తే, అతను కోసి తీసుకురాడా?"

నా చేత్తో వంట చేసిన వంటకలాను రుచిగా ఉందని నువ్వు తింటున్నప్పుడు నా మనసుకు ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా? నా మనసు నీకెందుకు అర్ధమవుతుంది?”

నా వ్యవహారంలో అనవసరంగా జోక్యం చేసుకోకండి అని నువ్వే కదా నిబంధన వేశావు?  తోటలోని చెట్లకున్న కాయలను మన చేతులతోనే కోసి తీసుకువస్తే అందులో ఒక సుఖం ఉందమ్మా. అది తెలుసా నీకు"

"ఇలా మాట్లాడితే ఎలా నాన్నా? అన్నిటికీ ఒక కారణం చెప్పి నా నోరు మూసేస్తారు మీరు" చిరుకోపంతో తండ్రిని చూసింది.

"నువ్వు మాత్రం ఏం చేస్తున్నావ్...? తెల్లవారు జామునే లేచి, పూజకు కావలసిన పువ్వులను నీ చేత్తోనే కోసి మాలగా చేసి దేవుళ్ళ ఫోటోలకు వేస్తున్నావే? ఉద్యోగానికి వెల్తున్న అమ్మాయివి నువ్వు! ఎందుకమ్మా పనికట్టుకుని ఇవన్నీ చేస్తున్నావు అని నేనడిగితే...మనసుకు హాయిగా, రోజంతా కొత్త ఉత్సాహంతోనూ ఉంటుందని సమాధానం చెబుతావే? అదేలాగానే ఇది కూడా..."

నాన్న కూడా చిరుకోపంతో చూశాడు.

దివ్యా ఏదో చెప్పాలని నోరు తెరిచే ముందు వాకిట్లో కారు వచ్చి ఆగిన శబ్ధం వినబడింది.

వెంటనే కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు చూసింది.

"నాన్నా...మీతో పాటు పనిచేస్తున్న డాక్టర్. సుధీర్ గారు వస్తున్నారు"

"డాక్టర్. సుధీరా? ఆయన ఎందుకు ఇంత ప్రొద్దున్నే ఇళ్ళు వెతుక్కుంటూ వస్తున్నాడో తెలియటం లేదే?"

ఆలొచనతో ముందుకు కదలగా, ముందు గదిలోకి వచ్చాడు విఠల్ రావ్.

పళ్ళరసం నిండిన గాజు గ్లాసులను పళ్లెంలో పట్టుకొచ్చి ఆయన ముందు జాపి "రండు అంకుల్...బాగున్నారా?" అని స్వాగతం పలికి మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోయింది దివ్యా.

నాన్నకు స్నేహితులెవరూ లేరు. తాను, తన పని అనే ఒక చక్రంలో జీవించే తత్వం కలిగిన మనిషి.

ఎప్పుడైనా అరుదుగా ఎవరైనా ఆయన్ని వెతుక్కుని వస్తే, మర్యాద కోసం రమ్మని చెప్పి నాజూకుగా మాట్లాడి, తన గదిలోకి వెళ్ళిపోతుంది దివ్యా.

వచ్చిన వ్యక్తి తిరిగి వెళ్ళిన తరువాత, తండ్రి దగ్గర నుండి పిలుపు వస్తేనే తన గదిలో నుండి వస్తుంది.  

రోజు కూడా అలాగే. తడి గుడ్డతో గ్యాసు పొయ్యిని తుడుస్తున్న దివ్యాకి ఆవేశమైన వాదనతో అతీతమైన శబ్ధం వినబడటంతో వంటింటి గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడి వాళ్ళ వాదనను వినడం మొదలుపెట్టింది.

"ఏమిటి విఠల్ నువ్వు? ఇలా అర్ధం చేసుకోకుండా మాట్లాడుతున్నావే? మందుల కొండ గురించి మాట్లాడటమే పాపం అనే విధంగా భయపడి చస్తున్నావే? నిన్న రాత్రి టీవీ ప్రోగ్రం చూసుంటే ఇలా మాట్లాడుండవు"

డాక్టర్ సుధీర్ మాటల శ్వరంలో చిరాకు, కోపమూ ఎగిసిపడుతుండటం తెలుస్తోంది.

"మందుల కొండకు, టీవీ చూడటానికీ ఏమిటీ సంబంధం? టీవీ లో నేను చూసే ప్రోగ్రాం ఒకటే. న్యూస్. టీవీలో నేను చూసేది అదొక్కటే"

"అందుకనే నీకు విషయమే తెలియలేదు.మందు కొండలో జరుగుతున్న అద్భుతాల గురించి నిన్న టీవీలో చూపించారు తెలుసా?.

నయం చేయలేని వ్యాధులకు కూడా మూలికలు నిండియున్న అద్భుత కొండట కదా అది?

గంగయ్య స్వామి అనే వైద్యుని గురించి చాలా చెప్పారు. కానీ, టీవీలో కనబడటానికి తనకి ఇష్టంలేదని చెప్పి...గుడారం నుండి బయటకు రావటానికి నిరాకరించారట ఆ వైద్యుడు.

ఇంకో అద్భుతమైన విషయం గురించి కూడా చెప్పారు. వినడానికే చాలా ఆశ్చర్యం వేసింది. నువ్వు మాటిమాటికీ ఆ కొండ ప్రదేశానికి వెళ్ళివస్తుంటావు కదా...దాని గురించి నా దగ్గర చిన్న మాట కూడా చెప్పలేదేమిటి?"

"అక్కడ చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. నువ్వు ఇప్పుడు ఏ అద్భుతం గురించి అడుగుతున్నావు?"

చిన్న స్వరంతో ప్రశ్నించాడు డాక్టర్ విఠల్ రావ్.

"ఎవరో ఒక దంపతులట...పలు సంవత్సరాల నుండే భార్యా-భర్తలుగా పక్క పక్క గుహల్లో తపస్సు చేస్తున్నారట? ఒక పెద్దాయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయనకు వయసు ఎనభై ఉంటుందని చెబుతున్నారు. అది విన్న వెంటనే నేను షాక్ తిన్నాను"

"ఆ పెద్దాయన షాక్ ఏర్పడేంత విషయం ఏం చెప్పారు?"

చిన్నగా అడిగాడు.

"ఒక్కొక్క పౌర్ణమి రోజున సీతమ్మ అనే ఒక ఒకావిడ, తన భర్తతో మధ్యరాత్రి సమయంలో అక్కడకొచ్చి అక్కడున్న శివలింగాన్ని దర్శనం చేసుకుంటారట. నిజానికి వాళ్ళిద్దరికీ వయసు నూట యాబై సంవత్సరాలకు పైనే ఉంటుందట. అప్పుడు గంగయ్య స్వామి వైద్యుడి దగ్గర కొంచం సేపు మాట్లాడతారట. వాళ్ళను చూడటానికి చాలా మంది వస్తారట"

"అదృష్టం ఉన్నవారు మాత్రం వాళ్లకు దగ్గరగా వెళ్ళి దర్శనం చేసుకుంటారుట. అలా వాళ్ళ దగ్గరకు వెళ్ళిన వారి నుదిటి మీద విబూది అద్ది, నడినెత్తిన చేతులు పెట్టి ఆశీర్వదిస్తారట.

తీరని వ్యాదులు కూడా త్వరగా తగ్గుతాయట. ఆ దంపతుల దర్శనం కోసం, వాళ్ళ ఆశీర్వచనం కోసం చాలామంది పోటీ పడుతూ కాచుకోనుంటారట.

సీతమ్మ మనసు పెట్టి...గుంపులో ఉన్న వాళ్ళను చూస్తూ ఏదో ఒక పేరు చెప్పి పిలుస్తుందట. పేరున్న వ్యక్తికే వాళ్ళ దగ్గరకు వెళ్ళే అపూర్వ సంధర్భం దొరుకుతుంది.

తరువాత కొంచం సేపు కూడా అక్కడ ఉండకుండా వాళ్ళిద్దరూ, కొండకు అవతలివైపుకు వెళ్ళి కిందకు దిగుతారట. చీకట్లో కొండ లోయలోకి దిగటం అంత సులభం కాదుట.

సీతమ్మ తన గుహలోకి వెళ్ళిపోతే...మళ్ళీ తరువాత పౌర్ణమికే బయటకు వస్తుందట.

డాక్టర్ విఠల్... పెద్దాయన టీవీలో కొండ గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్య అంచులకే వెళ్ళిపోయాను. మూలికల మహిమ వలనే నూట యాబై సంవత్సరాలకు పైనే వయసున్న ఆ సీతమ్మ దంపతులు యౌవనముతోనే ఉన్నారు. మరణాన్ని వాయిదా వేయగల మూలిక వాళ్ళు తినుంటారు అని నాకు అనిపిస్తోంది. దీని గురించి నా దగ్గర నువ్వేందుకు చెప్పలేదు? నువ్వు కొండకు అప్పుడప్పుడు వెళ్ళి వస్తున్న వాడివి కదా? నీకు కచ్చితంగా దీని గురించి తెలిసుంటుంది కదా?"

"అవును నాకు తెలుసు...కానీ, చెప్పాలని నాకు అనిపించలేదు. అదే నిజం. నా కూతురు దగ్గరే నేను విషయాన్ని చెప్పలేదు తెలుసా? ఏవో ఒకటి, రెండు విషయాలు మాత్రమే ఆమె దగ్గర చెప్పాను. దేవుని లీలతో జరుగుతున్న అద్భుతాలను బయటకు చెప్పటానికి నాకు మనసు రాలేదు. చాలా?"

"అదిసరే! నేను తిన్నగా విషయానికే వస్తాను. నువ్వు మనసు పెడితే, వైద్య రంగంలో అతిపెద్ద విప్లవం సృష్టించవచ్చు. ప్రపంచమే వెనక్కు తిరిగి మన సాధనను చూసి ఆశ్చర్యపోతుంది"

"అర్ధంకాలేదు డాక్టర్ సుధీర్! అనవసరమైన బిల్డ్ అప్ ఇవ్వకుండా తిన్నగా విషయానికి వచ్చేయ్..." డాక్టర్ విఠల్ రావ్ మాటల్లో విసుగు ఎక్కువగా ఉన్నది.

నువ్వు మూడు నెలలకొకసారి మందుల కొండకు వెళ్ళటం వలన, వైద్యుడు గంగయ్య స్వామి దగ్గర బాగా సన్నిహితంగా ఉంటున్నావని నాతో ఇంతకు ముందే చెప్పావు. ఆయనకు అన్ని రకాల మూలికల గురించి తెలుసుకదా? యౌవనమును కాపాడుకోవటానికీ, మరణాన్ని వాయిదా వేయటానికి కారణంగా ఉండే మూలికల గురించి ఆయన దగ్గర అడిగి తెలుసుకుందాం"

"తెలుసుకుని ఏం చెయ్యబోతావు? టీవీలో చూసావు కదా? ఆయన వ్యాపార ప్రచార ప్రకటనకు ఇష్టపడరు. తన మొహం టీవీలో రాకూడదని, నివసిస్తున్న గుడారాన్ని విడిచి బయటకు రానేలేదని చెప్పావే? నువ్వూ, నేనూ వెళ్ళి అడిగితే...మూలికల గురించి వివరంగా చెబుతారా? ఇది నీకే మూర్ఖత్వంగా అనిపించటం లేదూ?"

"లేదు విఠల్...నాకు నమ్మకం ఉన్నది. నువ్వు మనసు పెడితే అది జరుగుతుంది. నీకోసం గంగయ్య స్వామి ఏదైనా చేస్తారని నా మనసుకు అనిపిస్తోంది" 

"లేదు... విషయంలో నాకు కొంచం కూడా ఇష్టం లేదు. ఆయన్ని ఏమీ అడగటం నా వల్ల కుదరదు. అడగను కూడా"

డాక్టర్ విఠల్ రావ్ మాటల్లో మొండితనం, పట్టుదల ధోరణి కనబడింది.

"ఒక్క నిమిషం...నేను చెప్పేది విను విఠల్. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఉంటున్న నా స్నేహితుడు డాక్టర్. డేవిడ్ దగ్గర దీని గురించి చెప్పాను. ప్రత్యేకమైన మూలికలు మనకి దొరికితే గనుక, వాటిని ఉపయోగించుకుని కోటానుకోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చని చెప్పాడు"

"యౌవనం తగ్గకుండా ఉండటానికి, మరణాన్ని వాయిదా వేయటానికి మందు దొరికితే, అది ఎంత ఖరీదైనా కొనుక్కుని డబ్బు ఖర్చుపెట్టటానికి ఎవరూ వెనుకాడరు అన్నాడు.

అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు, డబ్బు, అంతస్తు దొరుకుతుందే? ఆలొచించి చూడు. నీ కూతురుకి ఇంకా పెళ్ళి కాలేదు. ఇది మాత్రం జరిగితే, ఆమెకు కిలోల లెక్కన బంగారు నగలు వేసి ఆనందించవచ్చు. ఏమంటావు?"

"మనిద్దరం కలిసి ఒకే చోట ఉద్యోగం చేస్తున్నామనే ఒకే ఒక కారణం వలన ఇంతవరకు నిన్ను కూర్చోబెట్టి, నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతూ వచ్చాను. దయచేసి ఇక ఒక్క మాట కూడా మాట్లాడకుండా లేచి వెళ్ళిపో.

మూలికలు మన దేశ నిధులు. దానికి బేరం మాట్లాడి, విదేశాలలో ఉన్న నీ స్నేహితుడితో కలిసి డబ్బు సంపాదించాలని చూస్తున్నావే...ఇది నీకు దేశ ద్రోహం అనిపించటం లేదా?

కొండ మీద జరుగుతున్న అద్భుతాలన్నీ దేవుని లీలలు! ఋషుల కోరికల వలన జరుగుతున్నాయని ఒక పక్క నేను చెబుతుంటే, నువ్వేమిటి మూర్ఖుడులాగా మాట్లాడుతూనే ఉన్నావు?

చెడు ఆలొచనతో  మూలికలకోసం మందుల కొండకు వెడితే ఏం జరుగుతుందో తెలుసా? సర్వ నాశనం అయిపోతాం.

'వినాశకాలే విపరీత బుద్ధి' అని మన పెద్దలు సరదాగానా చెప్పారు? దీనితో విషయానికి పులిస్టాప్ పెట్టు సుధీర్ " - ఉగ్రంగా అరిచాడు డాక్టర్ విఠల్ రావ్.

"మంచి ఆలొచన చెప్పటానికి వచ్చిన స్నేహితుడ్ని అవమానించి పంపుతున్నావు. ఇలా మాట్లాడినందుకు తరువాత చాలా బాధ పడతావు విఠల్ "

అవమానంతోనూ, కోపంతోనూ ఆవేశపడుతూ ఉద్రేకంగా చూస్తూ బయటకు వెళ్ళిపోయాడు డాక్టర్ సుధీర్.

పరిస్థితుల్లోనే రాత్రి డ్యూటీకి వెళ్ళిన డాక్టర్ విఠల్ రావ్ ఇంటికి తిరిగి రాలేదు.

'డ్యూటి ముగించుకుని ఎనిమిదిన్నరకల్లా కరెక్టుగా ఇంటికి వచ్చే నాన్న, తొమ్మిదైనా ఇంకా రాలేదే? ఆయన సెల్ ఫోనుకు ఫోన్ చేసి చూద్దామా?' అని దివ్యా ఆలొచిస్తున్న సమయంలో దివ్యా చేతిలో ఉన్న సెల్ ఫోన్ మోగింది.

సెల్ ఫోన్ ఆన్ చేసింది. అవతలవైపు తన తండ్రే!

"హలో దివ్యా...ముఖ్యమైన పనిమీద నేను బయట ఊరు వెడుతున్నానమ్మా. తిరిగి రావటానికి కొన్ని రోజులు పడుతుంది"

"ఏమిటి నాన్నా ఇంత సడన్ గా...ఇంత సడన్ గా ఎక్కడికి వెడుతున్నారు?"

"నేను తిరిగి వచ్చిన తరువాత చెబుతానమ్మా. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా"

మరు క్షణమే ఫోన్ కట్ అయ్యింది.

దివ్యా మళ్ళీ తండ్రి సెల్ ఫోనుకు ఫోను చేసి చూసింది. ఫోను స్విచ్ ఆఫ్ చెయబడుంది.

'నాన్న ఎలాంటి పరిస్థితులలోనూ ఇలా నడుచుకోరే? డాక్టర్ సుధీర్ వలన నాన్నకు ఏదైనా ఆపద జరిగుంటుందా?

ఒక వేల కిడ్నాప్ చేయబడుంటారో?’

కళ్ళల్లో నుంచి వేడి నీరు ఆగకుండా వస్తోంది.

***************************************************PART-3*****************************************

సమయం చాలా నెమ్మదిగా కదులుతోంది. స్నానం ముగించుకుని తిన్నగా పూజ గదికి వెళ్ళింది దివ్యా.

పది నిమిషాలు కళ్ళు మూసుకుని ధ్యానం చేసి నిలబడప్పుడు మనసు నిలకడగా ఉన్నది.

'ట్రింగ్...ట్రింగ్...ట్రింగ్...'

టేబుల్ మీదున్న సెల్ ఫోన్ మళ్ళీ మొగటంతో వేగంగా వెళ్ళి ఫోన్ తీసుకుంది.

స్క్రీన్ మీద కనబడిన నెంబర్ను చూసింది.

అర్జున్!

"హలో దివ్యా...నీమీద పిచ్చి కోపంతో ఉన్నాను. విమానాశ్రయానికి వస్తావని ఎంత ఎదురు చూశాను తెలుసా...ఎందుక రాలేదు?"

"సారీ!...కుదరలేదు..."

"కుదరలేదా? తన్నులు తింటావు. ! ఆడపిల్లవేనా నువ్వు. నువ్వూ, నేనూ మనస్పూర్తిగా ఇష్టపడుతున్న ప్రేమికులం. అదన్నా జ్ఞాపకం ఉందా, లేదా నీకు? లేక...అదీ మర్చిపోయావా?"

"నేను ఏదీ మర్చిపోలేదు?" తడబడుతూ చెప్పింది.

మర్చిపోలేదా...పరవలేదు. నా తృప్తికోసం ఒకసారి జ్ఞాపకం చేసేస్తాను! మనిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం. నువ్వు నాకు జూనియర్. చదువులో నువ్వూ నా లాగే అన్నిట్లోనూ ఫస్ట్ ర్యాంకు తెచ్చుకోవటం చూసి నా మనసు పారేసుకుని, నీ దగ్గరకు వచ్చి 'నేను నిన్ను ప్రేమిస్తున్నా దివ్యా ' అని చెప్పాను.

' ప్రేమా, దొమా మీద నాకు నమ్మకం లేదు. ప్రతి అమ్మాయికీ ప్రేమ అనే భావం, పెళ్ళైన తరువాత తన భర్త మీదే రావాలని అనుకునే దాన్ని నేను.

మీ ప్రేమ నిజమైనదైతే -- మీ ఇంటి పెద్దలను తీసుకుని వచ్చి మా నాన్న దగ్గర సంప్రదాయ పద్దితిలో కూతుర్ను అడగండి  అని నువ్వు కచ్చితంగా చెప్పావు.

చదువు పూర్తి అవటానికి ఇంకా మూడు నెలలే ఉన్నాయని ఇంట్లో చెప్పి, వాళ్లను ఒప్పించి, మా పెద్ద వాళ్లను తీసుకుని మీ ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడాము. చివరగా మీ నాన్న కూడా ఒప్పుకున్నారు. విదేశాలకు వెళ్ళి  ఎం.ఎస్ చదవాలనుకుని ఆశపడ్డాను. చదువు ముగించుకు వచ్చి పెళ్ళి చేసుకుందామని తీర్మానించుకున్నాము.

తాంబూళాలు మార్చుకుని, నిశ్చయం చేసుకున్నారు. ఫోనులో నేనే ఎరువు వేసి ప్రేమను పెంచుకుంటూ వచ్చాను. నువ్వు మొండి దానివి! నీకు ఆత్మ గౌరవం ఎక్కువ. ఒక్క రోజైనా నువ్వుగా నాకు ఫోన్ చేసి ' అర్జున్, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని చెప్పావా?

ఇప్పుడు కూడా చూడు. రెండు సంవత్సరాల తరువాత ప్రేమికుడు వస్తున్నాడే? వాడ్ని విమానాశ్రయానికి వెళ్లి స్వాగతిద్దాం అనే ఆలొచన వచ్చిందా? నువ్వు నిజానికి రాతి గుండే దానివి!"

"అర్జున్...ప్లీజ్...మీ ధ్యాస మారిపోతుందేమో అన్న భయంతో నేను ఫోన్ చేయకుండా ఉన్నాను. రోజు విమానాశ్రయం రాకపోవడం తప్పే. కానీ దానికి ఒక కారణం ఉంది. మీరు తిన్నగా ఇక్కడకు రండి...చెబుతాను.

నేను ఉద్యోగానికి వెళ్ళలేదు. లీవు పెట్టాను. ఇంట్లోనే ఉన్నాను. త్వరగా రండి...మీతో మాట్లాడాల్సింది ఎక్కువ ఉన్నది"

ముంచుకొస్తున్న ఏడుపును అనగదొక్కుకుని మాట్లాడింది.

బేగం పేటలోనే అర్జున్ ఇల్లు. తల్లి, తండ్రి, కాలేజీలో చదువుకుంటున్న తమ్ముడు అని చిన్న అందమైన కుటుంబం.

పిల్లల ఇష్టాలకు, పెద్దలు ఏనాడూ అడ్డుచెప్పలేదు.

"రారా అర్జున్! బాగున్నావా? ఏమిట్రా ఇలా చిక్కిపొయావు? విమానాశ్రయానికే వచ్చుంటాం. నువ్వే మమ్మల్ని ఎవర్నీ రావద్దని చెప్పావే?" హారతి తిప్పుతూ చెప్పింది తల్లి కళావతి.

"మీకు అనవసరమైన శ్రమ ఎందుకని రావద్దని చెప్పాను"

"నిన్ను రిజీవ్ చేసుకోవటానికి వియ్యంకుడు, దివ్యా వచ్చారా?" అని తండ్రి చలం అడిగాడు.

"లేదు నాన్నా...వాళ్ళు రాలేదు"

"రెండు రోజులుగా వియ్యంకుడి సెల్ ఫోనుకు ట్రై చేశాను. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుంచారు. ఎందుకో తెలియటం లేదు. నిన్న రాత్రి దివ్యాతో మాట్లాడాను . ఆమె గొంతులో ఎప్పుడూ ఉండే ఉత్సాహం లేదు...శోకంగా మాట్లాడినట్లు అనిపించింది"

 "స్నానం చేసి, బ్రేక్ ఫాస్ట్ తిని, తిన్నగా దివ్యా వాళ్ళింటికే వెళ్లబోతాను. మామగారినీ, దివ్యాని స్వయంగా కలుసుకుని విషయమేమిటో అడిగొస్తాను. సరేనా నాన్నా?"

తరువాతి అరగంటలో తన ద్విచక్ర వాహనం తీసుకుని దివ్యా ఇంటికి వెళ్ళాడు.

బైకు ఆగిన శబ్ధం విని వాకిట్లోకి వచ్చి తొంగి చూసింది దివ్యా.

"రా...రండి అర్జున్! బాగున్నారా?"

శోకంగా పెట్టుకున్న మొహంతో స్వాగతం పలికిన దివ్యాను పైకీ, కిందకూ చూశాడు.

నిన్ను చూడటానికి ఎప్పుడు వచ్చినా అప్పుడే పూసిన రోజా పువ్వులాగా నిగనిగలాడుతూ అందమైన నవ్వుతో ఉత్సాహంగా ఉంటావే...ఇప్పుడలా లేవే? ఏమైంది నీకు? వొంట్లో బాగుండలేదా? మామయ్య ఎక్కడ? ఆయన సిన్సియర్ డాక్టర్ కదా? పని ఉన్నదని రోజు కూడా ఆసుపత్రికి వెళ్ళారా?"

ప్రశ్నలపైన ప్రశ్నలు అడుగుతూ హాలులో ఉన్న సోఫాలో కూర్చున్నాడు.

దూరంగా నిలబడి నేల చూపులు చూస్తున్న దివ్యా దగ్గరకు వెళ్ళి హక్కుగా ఆమె చెయ్యి పుచ్చుకుని లాక్కొచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు.

"నేను ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాను. సమాధానమే చెప్పకుండా ఉంటే ఏమనుకోవాలి? మామయ్య తన సెల్ ఫోన్ ను ఎందుకు స్విచ్ ఆఫ్ లోనే ఉంచారు?"

దివ్యా కళ్లల్లో నుండి కన్నీరు ధారగా కారింది...వెక్కి వెక్కి ఏడుస్తూ అతని భుజాలపై తలపెట్టుకుంది.

"ఏమైంది దివ్యా?"  

అతని స్వరంలో ఆదుర్దా తెలుస్తోంది.

మెల్లగా తనని తాను సమాధాన పరచుకుని జరిగిందంతా వివరించింది.

"నువ్వు చెప్పిన దానిని బట్టి చూస్తే... డాక్టర్ సుధీరే మామయ్యను  కిడ్నాప్ చేసుంటారని అనిపిస్తోంది. ఇంకేమీ ఆలొచించకుండా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేద్దామా?"

"వద్దు...పోలీసుకు వెడితే...కోపంతో అతను నాన్నను ఏదైనా చేసేస్తాడేమోనని భయంగా ఉన్నది"

"అది కూడా ఆలోచించాల్సిన విషయమే. పోలీస్ స్టేషన్ కు వద్దు. మనమే ఏదైనా చేద్దాం...సరే, అరుదైన మూలికల గురించి  తెలుసుకుని వాటిని చేజిక్కించుకోవాలనే వెర్రి కోరికతో డాక్టర్ సుధీర్ ఉండటం వలన, కచ్చితంగా మామయ్యను కిడ్నాప్ చేసి కొండకే తీసుకు వెళ్ళుంటాడు"

"అయ్యో అర్జున్! నాకు చాలా భయంగా ఉందినాన్నగారికి బాగా వైరాగ్యం ఉన్నది. డాక్టర్ సుధీర్ ఎన్ని చిత్రహింసలు పెట్టినా సరే, దేనికీ లోంగరు. కోపంలో నాన్న ప్రాణాలకు ఏదైనా హాని తలపెడతాడేమోనని కంగారుగా ఉంది. నాన్నకు మాత్రం ఏదైనా జరిగితే...అది నేను తట్టుకోలేను" 

ఏడుస్తూ చెప్పిన దివ్యాను తధేకంగా చూశాడు.

"మనసును దృడంగా ఉంచుకో దివ్యా! అప్పుడే ఎలాంటి సమస్య వచ్చినా సరే...మనం దానికి పరిష్కారం కనుక్కోగలం. కళ్ళు తుడుచుకో"

వీపు మీద అభయంగా చేతితో తట్టాడు.

"టైము వేస్టు చేయకుండా తిన్నగా మనమూ మందుల కొండకు  వెళ్ళాల్సిందే"

"ఏమంటున్నారు?".

"మందుకొండ- చుట్టుపక్కల కొండలలోకి వెళ్ళి మామయ్యను వెతుకుదాం అంటున్నాను"

"మనవల్ల అవుతుందా? నాన్నను కాపాడగలమా?"

"కాపాడగలం అని నమ్మాలి. నమ్మకమే జీవితం! మందుల కొండ  ఋషులు, మునులు తిరిగే అడవి ప్రాంతం  అని చెబుతున్నావు...అందువల్ల మామయ్యకు ఎటువంటి ఆపద రాదని నా మనసు చెబుతోంది.

మామయ్యను కాపాడటమే మన ప్రధాన లక్ష్యం అయినా.... కొండ మీద జరుగుతున్న అద్భుతాలను నీ నోట విన్న తరువాత, నాకు అక్కడకు వెళ్ళాలనే ఆసక్తి ఎక్కువ అయ్యింది దివ్యా!

నువ్వూ, మామయ్యా దూరపు బంధువుల పెళ్ళికి చిత్తూరు వెళ్లారని మా ఇంట్లో చెప్పేస్తాను.

తరువాత...నేను సొంతంగా నర్సింగ్ హోం మొదలుపెట్టాలి. దానికి సంబంధించిన ముఖ్యమైన ఆఫీసర్స్ ను నేరుగా కలిసి ఆలొచనలు జరపాల్సి ఉంది.అందుకోసం తిరుపతి వరకు వెళ్ళాలి అని ఇంట్లో చెప్పేసి వచ్చేస్తాను. వైజాగ వరకు విమానంలో వెల్దాం. అక్కడ్నుంచి కారు ఏర్పాటుచేసుకుందాం.

రెడిగా ఉండు.