రెండు ధృవాలు…(పూర్తి నవల)


                                                                            రెండు ధృవాలు                                                                                                                                                           (పూర్తి నవల) 

పరిపూర్ణంగా కథా పాత్రల గుణగణాల ఆంశంతో రాయబడ్డ నవల! సరాసరి గుణాలు ఉన్న మనుష్యులు కూడా, స్వార్ధం లేని ప్రేమ పక్కకు వస్తే, మనుష్యులుగా మారటానికి ఛాన్స్ ఉంది అనేది చెప్పే ఎమోషనల్ నవల.

కొన్ని సమయాలలో హద్దు మీరటం, సరిహద్దులు దాటటం మనిషి జీవితంలో జరుగుతుంది! అది విధి! కాలం కాలంగా ఇది జరుగుతోంది. కొన్ని బంధాలను విధిలించి పారేయలేము! ఆ కష్టాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది. మనకి ఏది కరెక్టు, ఏది తప్పు, తెలియని ఒక మత్తు వస్తుంది. సమయం గడిచిన తరువాత తెలిసినప్పుడు, చేయి దాటిపోయుంటుంది.

తల్లి స్పర్ష ప్రేమ!  భార్య స్పర్ష కామం! అవసరమైన సమయాలలో  కొడుకూ, కూతురి స్పర్షలు ఆనందం! వాళ్ళు ముట్టుకునే స్పర్ష దుఃఖాన్ని దూరం చేసి, శరీరానికి కొత్త ఉత్సాహం ఇస్తుంది! కావలించుకున్నప్పుడు హృదయం చోటు మారుతుంది!

***************************************************************************************************

                                                                                             PART-1

బలం అనేది దెబ్బతీసేది కాదు...ఉండిపోయేది!

చివరి క్షణాలలో పెద్దాయన.

గత ఆరు నెలలుగానే పద్మనాభం గారికి ఆరొగ్యం సరిగ్గా లేదు! ఇప్పటికే రెండుసార్లు హార్ట్ అటాక్ వచ్చి, అన్ని రకాల ట్రీట్మెంట్లూ తీసుకుని, ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకోనున్న మనిషి.

అన్ని రకాల వ్యాధులూ ఆయన శరీరంలో ఉన్నాయి.

ఆహారం కంటే కూడా మందులే ఎక్కువగా ఆయన శరీరంలో చోటు పట్టుకోనుంది.

వయసు యాభైనాలుగు సంవత్సరాలే! ప్రైవేట్ కంపెనీలో పనిచేశారు--కొంచం పెద్ద కంపెనీనే. పెద్ద పోస్టు మాత్రం కాదు. జస్ట్ సూపర్ వైజర్.

ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయలు. కష్టపడి ముగ్గురినీ చదివించారు. అబ్బాయి డిగ్రీ పూర్తి చేసి, ఒక చోట పనికి చేరి, ఉద్యోగం చేస్తూనే ఎం.బి.. ముగించి, తన ప్రతిభతో ఒక పెద్ద కంపెనీలో పని సంపాదించుకున్నాడు. అతి మేధావి! స్కూలు చదువుకుంటున్నప్పట్నుంచి తండ్రికి మాత్రం డబ్బు ఖర్చు పెట్ట నివ్వకుండా, స్కాలర్ షిప్ తెచ్చుకుని తన చదువును ముగించాడు. తానుగానే ఉద్యోగం వెతుక్కున్నాడు.

మనోజ్ కుమార్ ఎక్కువగా మాట్లాడాడు. కోపం చూపించడు. ఇష్టా అయిష్టాలను  చూపించడు.

ఏరా? నువ్వేమన్నా యంత్రమా? ఇంట్లో ఎవరిదగ్గర ఏదీ చెప్పవా - ఇంట్లో వాళ్ళ దగ్గరే మిత భాషిగా ఎలారా ఇలా ఉంటున్నావు?”

తరువాత చెల్లెలు కల్యాణీ అతన్ని గొడవకు ఈడుస్తుంది. ఆమె వాగుడుకాయ. ముక్కోపి. పట్టుదల మనిషి! ఎప్పుడూ ఏదో ఒక గొడవ తీసుకుని వచ్చి  నిలబడుతుంది.

స్కూలు చదువు ముగించి, కాలేజీలో చేరటానికి ఆమె చేసిన గోల అంతా ఇంతా కాదు. తనకు నచ్చిన కాలేజీ తాముంటున్న ఊర్లో లేదని చెప్పి, ఇంకో ఊరి కాలేజీకి దరఖాస్తు చేసి, సీటు దొరకటంతో, హాస్టల్లో ఉండాల్సిన అనివార్యం ఏర్పడింది. దానికీ చేర్చీ డబ్బు కట్టింది! రెండు ఖర్చులు!

తల్లి సరోజ కోపగించుకుంది.

ఏమే! నీకు కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజు, భోజనం ఖర్చు అంటూ చాలా ఖర్చు అవుతుంది. నాన్న ఎక్కడ్నుంచి తెస్తారే అంత డబ్బు? మన ఊరి కాలేజీలో చదివి బాగుపడిన పిల్లలు లేరా?”

ఆవేశం ఎక్కువవగా, గొడవ బలం పుంజుకుంది.

ఏం...నాన్న, మనోజ్ అన్నయ్య ఇద్దరూ సంపాదిస్తున్నారు కదా?”

మనోజ్ కు ఇప్పుడే ఉద్యోగం దొరికింది! నాన్న ఒకరి సంపాదనతో ముగ్గుర్నీ చదివించి, ఐదుగురికి భోజనం, ఇంటద్దె! ఎక్కడ్నుంచి తెస్తారే? పదిపైసలు సేవింగ్స్ లేవు. నెలాఖరుకి చేతిలో డబ్బు చాలక టెన్షన్ వస్తోంది! మీ ఇద్దరికీ పెళ్ళిచేయటానికి మా దగ్గర డబ్బులు లేవు!

కన్న తరువాత, చేసే తీరాలి

ఎవరి దగ్గరుంది?”

అప్పు చెయ్యి! అందరూ చేతులో ఉంచుకునా చేస్తున్నారు?”

మనోజ్! ఇటు రా!

ఏంటమ్మా?”

నువ్వూ ఇంట్లో పుట్టిన వాడివే కదా?”

దేనికోసం ప్రశ్న?”

దేంట్లోనూ కలిగించుకోవా! అది బయట ఊర్లో చదువుకుంటుందట! ఖర్చు తట్టుకోలేము...కుదరదూ అని చెప్పరా

అమ్మా! నేను జీతం డబ్బును తీసుకుని నీ చేతికి ఇచ్చేసి, కూరగాయలకు కూడా నీ దగ్గరే తీసుకుని వెళ్తున్నాను! ఇలాంటి వాటిలో నేను తల దూర్చనమ్మా!

రెండో చెల్లెలు చప్పట్లు కొట్టింది.

ఎందుకే చప్పట్లు కొడుతున్నావు?”

మనోజ్ అన్నయ్య ఇంత పొడవైన వాక్యం మాట్లాడి నేను ఇప్పుడే వింటున్నాను

కల్యాణీ కూడా నవ్వ,

సరోజ కోపం తలకెక్కింది.

కన్నవారి కష్టాలు, కుక్కకైనా ఇక్కడ తెలుస్తోందా?”

పద్మనాభం లోపలకు దూరారు.

వదులు సరోజా. అడ్జస్ట్ చేసుకుందాం. చదువుకోవటానికి ఆశ పడుతోంది. అది సెలెక్టు చేసిన కాలేజీ మంచి కాలేజీ. బాగా చదివితే, అక్కడే క్యాంపస్ ఇంటర్వ్యూ లో ఉద్యోగం వస్తుంది! ఖర్చులు అడ్జస్ట్ చేసుకుందాం. చేతులో ఉంచుకుని మన ఇంట్లో ఏది జరిగింది చెప్పు. అప్పు తీసుకుందాం

ఊరంతా అప్పు. ఇంట్లో దూరి కొట్టబోతారుగొణిగింది సరోజ.

కల్యాణీ గెలిచి, బయట ఊరి కాలేజీలో చేరింది.

అప్పుడు పద్మనాభం గారే కాలేజీకి తీసుకు వెళ్ళి విడిచిపెట్టారు.

తరువాతది పద్మజా. పదోక్లాసు చదువుతోంది! ఇదే కుటుంబ పరిస్థితి. సరోజా కూడా ఖాలీగా ఉండదు.పచ్చళ్ళు, అప్పడాలు, చిప్స్ లాంటివి తయారు చేసి, కొంతమంది రెగులర్ కస్టమర్స్ ను పెట్టుకుని నెలకు ఒక చిన్న సంపాదన తన వంతుగా సంపాదిస్తున్నది!

అక్కడ మనోజ్ కుమార్ కష్టపడి ఏం.బి.. ముగించి కొంచం పెద్ద కంపెనీలో చేరాడు. మంచి జీతం రావటం మొదలయ్యింది.

తండ్రి కంటిన్యూగా రెండు షిఫ్టులు పనిచేసి, రెస్టు లేకుండా పనిచేసినందువలన నలభైతొమ్మిది సంవత్సరాల వయసులో జ్వరం, తలతిరగటం, వాంతి వచ్చి హాస్పిటల్లో చేరాడు.

అన్ని పరీక్షలూ జరిపారు.

పరిశుభ్రం లేని ఫ్యాక్టరీలో దుమ్ము, తుమ్ములతో, కంటిన్యూగా పనిచేయటం వలన, ఆయనకు అదే ఒక అంటువ్యాధిలాగా అయిపోయి, ఆయన ఆరొగ్యాన్ని బాధించింది.

ఒక వారం రోజులు ఉండి, ఇంటికి వచ్చారు.

అలా ఆయనకి మొదటి జబ్బు మొదలయ్యింది. ఆడపిల్లలు పెద్దపిల్లలవుతూ రావటంతో, వాళ్ళను తీరానికి చేర్చాలే! సొంతంగా ఒక ఇల్లు కూడా లేదే అన్న కలత ఆయన్ని మరింత బాధపెట్టింది.

 సరోజాకు భర్త మదనపడటం అర్ధమయ్యింది.

ఏమండీ... మనోజ్ పైకొచ్చాడు కదా! ఇప్పుడు పెద్ద జీతమే కదా వస్తోంది! విదేశాలకు వెళ్లే ఛాన్స్ కూడా వస్తుంది. మీవల్ల కాకపోతే కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకోండి?”

లేదు సరోజా! అమ్మాయిల పెళ్ళిల్లు అయ్యేంతవరకూ నేను కష్టపడే తీరాలి.  పూర్తి బాధ్యత మనోజ్ మీద వెయ్యకూడదు 

మీవల్ల పనిచేయటం కుదరటం లేదే! మీ నాన్నకు  నువ్వు చెప్పరా మనోజ్!

నువ్వు చెబుతున్నావు కదమ్మా!

కొడుకు నోటి ద్వారా వింటే ఆయన మనసుకు ఒక ధైర్యం వస్తుంది

అప్పుడు కూడా మనోజ్ మాట్లాడలేదు.

మంచికొడుకు. ఎటువంటి చెడు అలవాటూ లేదు. జీతం పూర్తిగా ఇచ్చేస్తాడు. అదంతా ఓకే. కానీ, ఓదార్పు మాటలు చెప్పి ప్రేమ చూపించడు. కానీ, కుటుంబీకులంటే ఎనలేని ప్రేమ. కానీ కలవడు. నీళ్ళల్లో తామారాకులాగా అంటీ అంటనట్టు నిలబడతాడు.

చుట్టుపక్కలున్న పిల్లలందరూ తల్లికి సన్నిహితంగా ఉండటం, తల్లులు నా పిల్లాడిలాగా ఎవరూ ఉండరూఅని డప్పు వాయించుకుంటూ ఉంటే సరోజాకు మనసు నొప్పిగా ఉంటుంది.

తట్టుకోలేక గొణుక్కునేది.

దేవకీ కొడుకుకు 25 సంవత్సరాలు! ఇప్పుడు కూడా వాడికి ముద్దలు పెడుతుంది దేవకీ. ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకుంటున్నారు పిల్లలు. ఇక్కడ అలాంటిది ఒక్కరోజైనా జరిగిందా?

దానికీ సమాధానం లేదు!

వదులు సరోజా! సైలెంటు గా ఉండటం వాడి న్యాచర్! ఇంట్లో వాళ్లతో ప్రేమతో ఉండటాన్ని మాటల్లోనూ, చేష్టలలోనూ చూపించాలా? అలా చూపించటం మనవాడికి తెలియదు!

తల్లి ఒకరోజు బాగలేదని పడుకుంది.

ప్రేమగా అమ్మను చేరుకుని, ముట్టుకుని చూడటం, ఒక చిన్న స్పర్శ...వాత్సల్య చూపు...ఆదరణగా ఇప్పుడెలాగుందమ్మాఅని నాలుగు మాటలు ఏదీ లేదు.

తట్టుకోలేక సరోజ అడిగినప్పుడు,

నిన్ను నాన్న ఆసుపత్రికి తీసుకువెళ్ళి చూపించి, మందులు రాయించుకుని, కొనిచ్చారే. డాక్టర్ చూసి పెద్ద సమస్య ఏమీ లేదుఅని చెప్పారు కదా. తరువాత ఏమిటమ్మా?

తల్లి వంటను పొగడటం, తప్పు పట్టడం లాంటి నాలుగు మాటలు చెప్పడు.

తన నోటికి రుచిగా ఇది చెయ్యి...అది చెయ్యిఅని అడగడు.

షాపుకు రాడు.

పండుగలు, విశేషాల సమయంలో కూడా ఇంట్లో ఎవరి దగ్గర నవ్వుతూ, సంతోషంగా గడపడు.

మొహాన నవ్వే ఉండదు.

ఉండబట్టలేక ఒకరోజు సరోజ భర్తతో చెప్పింది!

మనోజ్ ఎందుకు ఇలా ఉన్నాడో తెలుసా? దానికి కారణం మీరే?

నేనా

మనకు పెళ్ళి జరిగి మీ ఇంటికి వచ్చినప్పుడు...మీ అమ్మా, చెల్లెళ్ళు, వదినా అంటూ ఒకటే కుటుంబంగా, ఉమ్మడి కుటుంబంగా జీవించేమే. మర్కెట్టులోలాగా ఎప్పుడూ చూడు కిక్కిరిసి

దానికీ, మనోజ్ యొక్క గుణానికీ ఏమిటే సంబంధం?

మనకు ఎలుకల బోను లాంటి ఒక రూము. తిరిగి పడుకుంటే గోడ తగులుతుంది. పాత ఫ్యాను. దాని శబ్ధం ఘోరంగా ఉంటుంది. దోమల బెడద. మురికి కాలవ వాసన. సగం రోజులు పవర్ కట్

దానికి?

మన దాంపత్యం ఆనందంగా గడవలేదు. ఏదో పడుకున్నాం, లేచాము అని యంత్రంలాగా అన్నీ జరిగినందువలన వాడిని కడుపుతో ఉన్నాను. అది కూడా ఏదో ఒకరోజు జరిగే బుర్ర కథ!

ఉమ్మడి కుటుంబం అంటేనే అంతేనే!

కడుపులో బిడ్డను మోస్తున్న కాలంలో మీ ఆదరణ, ప్రేమ దొరకలేదు. మీ ఇంటి ఆడవాళ్ల టార్చర్. ఎప్పుడు చూడూ సంతలో లాగా గుంపు. గర్భిణీకి రెస్టు ఇద్దామనే ఉద్దేశమే మీ ఇంట్లో వాళ్ళకు లేదు. నేనూ సంతోషంగా మోయలేదు. ఒక మంచి సంగీతం, రుచికరమైన భోజనం...ప్రేమగల భర్త, ఏదీ దొరకక, నాకు నొప్పులు వచ్చి వీడు పుట్టాడు. యంత్రం లాంటి పరిస్థితుల్లో మొలచి, ఆర్ద్రత మనో పరిస్థితిలో మోసి, చేదుతో రోజులు గడిపి, ఒక స్త్రీ నవ్వును మర్చిపోతే, పుట్టబోయే బిడ్డ ఎలా నవ్వుతుంది. ఎలా ఉత్సాహంగా ఉంటుంది. మనోజ్ ఇలా ఉండటానికి కారణం ఇదే

పద్మనాభం మౌనం వహించాడు.

ఇలా చూడు! నువ్వు చెప్పేదే నిజం అని పెట్టుకున్నా! దానికి ఇప్పుడేం చేయగలం?

ఇదేం ప్రశ్న

 వాడు తానుగా ఏ నిర్ణయం తీసుకోడు. ఇంట్లో వాళ్ళెవరినీ ఎప్పుడూ నొప్పించ లేదు. కోపగించుకోలేదు. చేతి నిండా సంపాదిస్తూ, ఆ సంపాదన మొత్తం ఇంటికే ఇస్తున్నాడు. ఈ రోజు వాడి వలనే ఈ కుటుంబం సుభిక్షంగా ఉంది! దీనికంటే ఏం కావాలే. పక్కింటి దేవకీ కొడుకు అమ్మ ఒడిలో పడుకుని బ్రతిమిలాడుతున్నాడు. కానీ ఏ పనీ చేయకుండా ఊరంతా ఆంబోతులాగా తిరుగుతున్నాడు. వాడి వల్ల ఆ ఇంటికి ఒక్క పైసాకూడా ప్రయోజనం లేదు. ఎదురింటి మాణిక్యం ఉత్త తాగుబోతు! ఈ వీధిలో క్రమశిక్షణ గల పిల్లాడు మన మనోజ్ మాత్రమేనే. దానికి సంతోషించు

సమాధాన పరుస్తున్నారా?

 ఏమే జీవితంలో ఉన్న కష్టాల కంటే, సుఖాలను పెద్దవి చేసి మాట్లాడుతున్నావు. ఎప్పుడూ సంతోషంగా ఉండు. జీవితం కూడా సంతోషంగా ఉంటుంది

అలా చెప్పిన పద్మనాభం గారికే దెబ్బపై దెబ్బ, శరీరంపైన మరియు మనసులోనూ పడింది.

*************************************************PART-2*******************************************

మనోజ్ కుమార్ వలన ఇంటి యొక్క ఆర్ధిక పరిస్థితి మెరుగుపడింది. కొత్త వస్తువులు ఇంటిని నింపి, జీవనోపాధి పెరగ పెరగ, తండ్రికి ఆరొగ్య పరిస్థితి క్షీణిస్తూ రావటం మొదలయ్యింది.

మొదటి అటాక్ వచ్చినప్పుడు, కుటుంబం బెంబేలెత్తి పోయింది. కొంతమేరకు పెద్ద అటాకే!

చిన్నదిగా ఒక ఆపరేషన్ కూడా చెయ్యాలి అన్నారు. ఆంజియో - అదీ,ఇదీ అంటూ టెస్టుల లిస్టు రాసారు.

ఒక లక్ష రూపాయలవరకు అవుతుందని చెప్పారు.

కుదురుతుందా మనోజ్?

ఏర్పాటు చేస్తాను

ఏం చేశేడో తెలియదు. డబ్బులు తీసుకు వచ్చి ఇచ్చాడు. అటూ, ఇటూగా పదిహేను రోజులు ఆసుపత్రిలో ఉండి, ఇంటికి తీసుకు వచ్చారు.

కనీసం మూడు నెలలు రెస్టు తీసుకోవాలని చెప్పారు.

జీతం కట్ అవుతుంది. పద్మనాభం గారు అది తలుచుకుని క్షోభ పడ్డారు.

నేను చూసుకుంటానని చెప్పరా! అప్పుడే ఆయన మనసుకు ధైర్యం వస్తుంది మనోజ్!

నేనే కదమ్మా చెయ్యాలి. అది ఆయనకు బాగా తెలుసు. ఈ నోటి మాటలూ...నాటకమూ ఎందుకు? నేను చూసుకుంటాను కదా?

సరోజకు చురుక్కుమన్నది.

నేనే కదమ్మా చేయాలి

'ఇది ఎత్తి పొడుపా? విచారమా? అహంకారమా?'

'ఇక్కడ నిజాన్ని ఎత్తి చూపితే, చాలా మంది జీర్ణించుకోలేరు! కోపం వస్తుంది!'

'ఓదార్పు అనేది అవసరమే. ఒక విధంగా అది కూడా కుంటి సమాధానమే'

'అయ్యో, నా దగ్గర లేదే. నేనేం చేయగలను? అని ఏడిస్తే వదిలిపెడతారా?'

'నువ్వే చెయ్యాలిఅని చట్టం వేస్తారు. గొడవకు పూనుకుంటారు. బాధ్యతలు స్వీకరించాలి అని ఉపదేశం చేస్తారు.

'శబ్ధమే రాకుండా చేసినా, దానినీ తప్పు పడతారు

పూర్తిగా అతనే భరించాలి అనే అనివార్యం వచ్చేసింది.

దానికోసం అతను ఏం ఆలొచిస్తున్నాడు అనేది అతని మొహంలో కొంచం గూడ కనిపించలేదు.

కానీ మేనేజ్ చేశాడు.

కల్యాణీ మూడో సంవత్సరం. కాలేజీ ఫీజు, హాస్టల్ ఖర్చు అంటూ దానికి కూడా మనోజే. పద్మజాకు ఇంటర్మీడియట్ క్లాసుకు కావలసిన ఖర్చులు.

మూడు నెలలు గడిచి, డాక్టర్ అనుమతించిన తరువాత, తండ్రి ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టారు.

కానీ, ఇంతకు ముందులాగా ఉత్సాహంగా ఉండలేక పోతున్నారు. ఆయన దగ్గర అలసట, నీరసమే కాకుండా ఒక నేర భావన అదనంగా ఉన్నది.

ఆ సమయం మరో దెబ్బ బలంగా పడింది.

ఆదేమిటో?

పద్మజా ఒక కుర్రాడితో తిరుగుతున్నట్టు, తల్లికి సమాచారం రాగా, మొదట ఆమె  నమ్మలేదు.

ఒకరికి నలుగురుగా అదే సమాచారాన్ని చెప్పటంతో నిజమని నమ్మింది. సరోజ ఆందోళన చెందింది.

మనోజ్ ను మాత్రం పిలిచి ఒంటరిగా కలిసి చెప్పింది.

రేయ్ మనోజ్! పద్మజా ఎవరో ఒక కుర్రాడితో సినిమా, మార్కెట్టు, హోటల్ అంటూ తిరుగుతోందట. చాలామంది చెబుతున్నారు

అతను మాట్లాడలేదు......

రేయ్, నాన్నకు ఒక అటాక్ వచ్చి సరి అయ్యి, ఆఫీసుకు వెళ్ళటం మొదలుపెట్టారు. ఇది ఆయన చెవులుకు వినబడితే, మొదటికే మోసం! అది కొంచం విచారించరా

నువ్వు పద్మజాను పిలిచి అడిగావా?

ఆధారం లేకుండా నేరం మోపకూడదు కదా?

సరే. దాని నడవడికలను నోట్ చేసావా?

 ప్రొద్దున ఐదున్నరకే ట్యూషన్ కు వెళుతోంది! అక్కడ్నుంచి వచ్చి స్నానం చేసి, భోజనం చేసి, స్కూలుకు వెళుతోంది. సాయంత్రం క్లాసులు అయిపోగానే రెండు ట్యూషన్లకు వెళ్ళి, ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి రాత్రి ఎనిమిది అవుతోంది

అక్కడే సమస్య!

ఏమిట్రా సమస్య...ఇంటర్ సెకెండ్ ఇయర్ చదువుతోందని మూడు ట్యూషన్లు పెట్టాము. అప్పుడే కదా మంచి మార్కులు తెచ్చుకుని కాలేజీకి వెళ్ళగలదు

ట్యూషన్ కు నువ్వు తోడు వెళతావా?

నేనెలా వెళ్ళగలను. అది సైకిల్లో వెళుతోంది...?

సరే వదులు. నేను చూసుకుంటా

రేయ్! ఏమిట్రా జరుగుతోంది. నాకు కడుపులో తిప్పుతోంది

 అమ్మా! నేను ప్రొద్దున ఏడుగంటలకు బయలుదేరి, రాత్రి రావటానికి పది అవుతోంది. నాన్నకు ఆరొగ్యం బాగాలేదు. కల్యాణీ బయట ఊరిలో. నువ్వే గమనించాలి! మిగతా వాళ్ళ దగ్గర మూలిగితే లాభం లేదు

వెంటనే చూడరా!

మరుసటి రోజు ప్రొద్దున పద్మజా ట్యూషన్ కు బయలుదేరుతుంటే,

నేను నిన్ను డ్రాప్ చేస్తాను పద్మజా

ఈ రోజేంటి కొత్తగా? సరే రా!

వదిలిపెట్టి దూరంగా నిలబడ్డాడు. ఆమె కరెక్టుగా క్లాసు ముగించుకుని బయలుదేరింది.

ప్రొద్దున ట్యూషన్లో సమస్య లేదు.

ఆ రోజు మనోజ్ లీవు తీసుకుని మిగిలిన బయిటి పనులను ముగించుకుని సాయంత్రం నాలుగు గంటలకు స్కూలు వాకిటి దగ్గర దాక్కోగా, పద్మజా పుస్తకాలతో బయటకు వచ్చింది. సైకిలు తీసింది.

మనోజ్ ఆమె వెనుకే వెళ్ళాడు.

ఒక చోట సైకిల్ను ఆపి కాచుకోనుంది.

ఒక యువకుడు బైకు మీద వచ్చాడు. పద్మజా అతని బైకులో ఎక్కింది. బైకు బయలుదేరింది.

కాస్త దూరంగా ఉంటూ మనోజ్ తన బైకులో వాళ్ళను వెంబడించాడు. ఆ బైకు ఒక హోటల్ ముందు ఆగింది. హై క్లాస్ నాన్-వెజిటేరియన్ హోటల్.

ఇద్దరూ లోపలకు వెళ్లారు. మనోజ్ వాళ్ళ వెనుకే వెళ్ళాడు. వీళ్ళ కుటుంబం  ప్యూర్ వెజిటేరియన్. గుడ్డు కూడా తినరు. ఇది నాన్-వెజిటేరియన్ హోటల్.

ఇద్దరూ 'ఏ.సీ' హాలులోకి వెళ్లారు. మనోజ్ మొహానికి హ్యాండ్ కర్చీఫ్ కట్టుకుని ఆ ఏ.సీ. హాలులోకి వెళ్ళి వాళ్ళిద్దరికీ కనిపించకుండా వాళ్ళ వెనుక కుర్చీలో కూర్చున్నారు.

నీకేం కావాలి?

ఫిష్ ఫ్రై!" పద్మజా చెప్ప, అతను చికెన్ బిరియానీ ఆర్డర్ చేశాడు.

మనోజ్ అదిరిపడ్డాడు.

'చేప వేపుడా? పద్మజానా ఇది?'

చెప్పు పద్మజా

 ప్రొద్దున అన్నయ్య ట్యూషన్ కు తీసుకు వచ్చి దింపాడు. ఇది చాలా కొత్తగా ఉంది డేవిడ్

డేవిడ్?' మనోజ్ కి మరో షాక్.

దానికి?

ఈజీగా అడుగుతున్నావు? ఏదో అనుమానం వచ్చింది? అన్నయ్యకు దీనికంతా టైము లేదు. అమ్మ చెప్పుంటుంది! ఆమె నెమ్మదిగా ఉండదు

సరే! ఏం చేద్దాం?

సమస్య ఇప్పుడు అది కాదు. నాకు పీరియడ్ రోజులు నాలుగు రోజులు డిలే అయ్యింది డేవిడ్...!

మనోజ్ కు తలపై పిడుగు పడినట్టు అనిపించింది.

ఎ...ఎలా?అడిగాడు డేవిడ్.

పోయిన నెల రెండు రోజులు స్కూలుకు వెళ్ళకుండా...బీచ్ రిసార్టులో నువ్వు రూము తీసుకున్నావే! దాని ఫలితమే

 అంతే కదా?

ఏమిట్రా వాగుతున్నావు. సమస్య నాకురా. ఇక చెప్పేద్దామని అనిపిస్తోంది"

నాకు అమెరికా వెళ్ళటానికి వీసా వచ్చేస్తుంది

అయితే?

వచ్చే నెల నేను వెలితే, తిరిగి రావటానికి రెండు సంవత్సరాలు అవుతుంది పద్మజా

సో

అబార్షన్ చేయించుకో! మొదట ఖాయపరచుకుని అబార్షన్ చేయించుకో. ఒకే రోజులో అయిపోతుంది

ఆ మాటకు ఆమె షాకైనట్లు తెలియలేదు.

ఏమిట్రా చెబుతున్నావు నువ్వు?

లుక్! జీవితాన్ని ప్రాక్టిల్ గా చూడు పద్మజా! నేను పైకెదగాలి. నువ్వూ స్కూలు దాటి కాలేజీ వెళ్ళి బాగు పడాలి. ఇప్పుడే ఇద్దరి ఇళ్ళల్లోనూ ఈ విషయం చెబితే సమస్య టైమ్ బాంబులాగా పేలుతుంది. ఈ మధ్యే మీ నాన్న ఒక అటాక్ నుండి తప్పించుకున్నాడు. ఈ విషయం చెప్పి ఆయన్ని చంపాలా? చెప్పు పద్మజా? 

ఆమె మౌనంగా ఉండిపోయింది.

మనోజ్ కి నెత్తురు వేడెక్కటం మొదలయ్యింది.

సహజంగా మనోజ్ నెమ్మదిగా ఉండే వ్యక్తి. దేనికీ ఆందోళన చెందడు. ఏ సమస్య వచ్చినా, దాన్ని వాళ్ళ, వాళ్ళ ద్రుష్టితో చూసి అర్ధం చేసుకుని పక్వంగా ఉంటాడు. గబుక్కున మాట జారడు.

ఇది చెల్లెలి పర్శనల్ వ్యవహారం.

లేచి ఆ డేవిడ్ చొక్కా పుచ్చుకోవాలని ఆవేశం వచ్చింది.

ఆలస్యం చెయ్యద్దు పద్మజా! రేపు ప్రొద్దున్నే త్వరగా వచ్చేయి. ఈ రోజే నేను క్లీనిక్ లో ఏర్పాట్లు చేసి ఉంచుతాను. తెలిసిన క్లీనిక్కే. సమస్య ఏమీ రాదు. బయటకు తెలియకుండా అబార్షన్ చేయించుకోవచ్చు

కష్టంగా ఉంది డేవిడ్

సరే వద్దు. ఇంకేదన్నా దారి ఉంటే చెప్పు? నేను వింటాను

దారి నేను చెప్పనా డేవిడ్? ఎక్కడ్నుంచో ఒక గొంతు వినబడ, మనోజ్ కు మరో షాక్.

'అదేవరు?' అనుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు మనోజ్.

వాళ్ళున్న చోటుకి మరో యువకుడు వచ్చాడు.

రేయ్ వినోద్! నువ్వా? నువ్వెలా ఇక్కడ?

కుర్చీని లాక్కుని వినోద్ వాళ్ళతో కలిసి కూర్చోగా, డేవిడ్ వంకర్లు తిరిగాడు.

వినోద్! నువ్వు బయలుదేరు. మనం తరువాత మాట్లాడదాం!  

ఇతనెవరు డేవిడ్?

 పద్మజా అడగ,

వినోద్ నువ్వు బయలుదేరు. ఇక్కడ మేము పర్సనల్ మ్యాటర్ మాట్లాడుకుంటున్నాము. నువ్వు మా మధ్యకు వచ్చింది అనాగరీకం

మీరిద్దరూ కలిసి తిరుగుతున్నది రెండు మూడు సార్లు చూశాను. ఇప్పుడు మీరు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను. పోయిన నెల రిసార్టులో రూము తీసుకుని, ఆమెతో పాటూ నువ్వు అక్కడున్నది కూడా... ముందే తెలుసుంటే, మిమ్మల్ని వెళ్ళ నివ్వకుండా అడ్డుకోనుంటాను

వినోద్!

ఏమిట్రా ఈ ద్రోహం? అబార్షన్ అంటున్నావే? నీకు పీరియడ్ డిలే అయ్యి ఎన్ని రోజులయ్యింది అమ్మాయ్?

అది అడగటానికి మీరెవరు? పద్మజా కోపంగా అడగ,

పల్లు రాలగొడతాను! స్కూల్లో చదువుతున్న అమ్మాయివి? చిన్న పిల్లవిమంచి కుటుంబంలో పుట్టి, ఇంటికి తెలియకుండా వీడితో పాటూ తిరిగి రోజులు డిలే చేసుకున్నావే. వీడు అబార్షన్ చేసుకోమని చెప్పి అమెరికా వెళ్ళిపోతాడు. నువ్వు ఇంతకు ముందులాగా ఏదీ తెలియని దానిలాగ, ఏదీ జరగని దానిలాగా చదువుకోవటానికి వెళతావా? ఇది నేనడిగితే...'మీరెవరు?' అని నన్నే ప్రశ్నిస్తావా?

అతని స్వరం పెద్ద దయ్యింది.

మనోజ్ కు మరో బలమైన షాక్.  

అన్నయ్యను, నేను అడగాల్సిన ప్రశ్నలు ఎవడో ఒకడు అడుగుతున్నాడు. ఎవరతను?'

ఇదిగో చూడు డేవిడ్. నువ్వు తప్పు చేసి తప్పించుకుని పారిపోదామని చూస్తున్నావా...కుదురుతుందా? మీ నాన్న చెవికి అందిస్తే నిన్ను చంపేస్తారు. వరంగల్ కమాండర్ బెంజమిన్ అని చెబితే తమిళదేశానికే తెలుసు. చెప్పనా?

ఆ డేవిడ్ వణికిపోయాడు!

నువ్వు అమెరికా వెళ్ళిపోతావా? వీసా తీసుకోగలవా?

వినోద్! అరవకు

ఈయన ఎవరు డేవిడ్?అడిగింది పద్మజా.

ఏమ్మా! నిన్ను నాశనం చేసేసి పారిపోతున్నాడు! వాడ్ని చొక్కా పుచ్చుకుని ప్రశ్నించక, అబార్షన్ కు రెడీగా ఉన్నావా? చెప్పు

ఇది మా సమస్య. మీరెవరు?

అయ్యో పద్మజా! మాట్లాడకు. ఆయనకు పలుకుబడి ఎక్కువ. ఆయన తలుచుకుంటే ఏమైనా చెయ్యగలరు. మా నాన్నతో, వాళ్ళ అమ్మ కుటుంబ రీతిగా బాగా సన్నిహితం...నువ్వు మాట్లాడకు!

ఆ భయం ఉంది కదా?

అందుకని... వినోద్...నేను...ఇప్పుడు...?

ఆమె మెడలో తాళి కట్టు! చర్చీలో ఉంగరం మార్చు! రెండు ఇళ్ళకూ వివరాలు తెలియాలి

అయ్యో!

మీ నాన్న నిన్ను కట్టేసి తోలు వొలుస్తారు! తట్టుకో! ఆయన నిన్ను చంపకుండా నేను చూసుకుంటాను! ఇదిగో చూడమ్మాయ్! నువ్వేమీ మాట్లాడొద్దు. వీడిని పెళ్ళి చేసుకో! క్రిస్టియన్ ఇంట్లో మంచిగా జీవిస్తావా?

అయ్యో మా నాన్న!

ఈ తెలివి ఆలస్యంగా వస్తోందా? ఒక అటాక్ వచ్చినాయనకు ఎలాంటి గతి పడుతుందో నిదానంగా ఆలొచన వస్తోందా? మంచిగా ఉండే బుద్ది, చదువుతున్నప్పుడు రాకుండా...చెడు ఆలోచన, ఇల్లు దాటి వెళ్ళిన తరువాత, మిగిలిన వాళ్ళను ప్రశ్నలడగమంటోందా?

డేవిడ్ దయ్యం పట్టిన వాడిలాగా చూశాడు!

అన్నిటినీ నేను చూసుకుంటాను! మీరిద్దరూ ఇప్పుడేమీ మాట్లాడకండి. ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా ఉండండి. నోరు జారకండి...అర్ధమయ్యిందా? అబార్షన్ చేయించుకుందామని తీర్మానించుకుంటే చంపేస్తాను! బయలుదేరండి. మీ సొంత పనులు చూడండి. మీ ఇద్దరి కుటుంబాలతో నేను మాట్లాడి నిర్ణయం తీసుకునేంతవరకు మీరిద్దరూ కలుసుకోకూడదు. అర్ధమయ్యిందా? ఏమడిగావు? నేనెవరినా! నీకొక అన్నయ్య ఉంటే, చూస్తూ ఉరుకుంటాడా?

ఆ మాట విన్న వెంటనే ఇటుపక్క ఉన్న మనోజ్ కి చురుక్కుమన్నది.

'అన్నయ్యగా నేను ఇక్కడున్నా, మాట్లాడలేని పరిస్థితిలో నిలబడ...ఎవరో ఒక వినోద్ అని ఒకతను అన్నయ్య అంటూ దూరి, అన్నయ్య స్థానాన్ని చేతిలోకి తీసుకుని జరగబోయిన ఒక ఘోరమైన సంఘటనను ఆపబోతున్నాడు

'ఏం చేస్తాడు?'

'ఈ విషయాన్ని సంబంధిత కుటుంబాలకు ఎలా తీసుకు వెళ్ళి జేరుస్తాడు

'నా తండ్రికి ఇది తెలిస్తే, అది పెద్ద బాధింపు కలిగిస్తుందే'

'ఎలా ఆయన తట్టుకుంటారు?' 

'వరంగల్ కమాండర్ బెంజమిన్ దీన్ని ఎలా తీసుకోబోతారు?'

'కులం దాటి కాదు...మతం దాటి ప్రేమ!'

'ప్రేమను మించిన కామం!'

'ఈ మనిషి ఏం చేసి రెండు కుటుంబాలనూ మామూలు స్థితికి తీసుకు వస్తాడు!'

మనోజ్ కు ఆందోళనగా ఉంది!

*************************************************PART-3*******************************************

రెండు రోజులు ఇంట్లో మామూలుగానే గడిచింది.

తల్లి మాత్రం మనోజ్ ను కెలికింది.

ఏంటయ్యా మనోజ్! ఏదైనా చేశావా? రోజూ ప్రొద్దున్నే పద్మజాను స్కూలుకు తీసుకు వెళ్ళి దింపుతున్నావు? సాయంత్రం తీసుకువస్తున్నావు. దాని దగ్గర మాట్లాడావా?

లేదు

నిజంగానే అతను మాట్లాడలేదు...ఏదీ అడగలేదు.

రేయ్ మనోజ్! ఎందుకురా ఇలా ఉన్నావు?

నాకు ఏదీ తప్పుగా కనబడలేదమ్మా. ఏదైనా బయటపడితేనే కదా అడగగలను... తప్పు ఏదైనా ఉంటే బయటపడే తీరుతుంది. నువ్వు కంగారు పడకు అర్ధమయ్యిందా?

తల్లి ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది.

ఉద్యోగానికి వెళ్ళే తండ్రి, గత మూడు రోజులుగా ప్రొద్దున తొందరగానే వెళ్ళి, రాత్రి తొమ్మిదింటికి వస్తున్నారు. మూడు రోజులుగా ఇదే జరుగుతోంది.

ఇంటికి వచ్చేటప్పుడు బాగా అలసిపోయి, నీరసంగా వస్తున్నారు. ఆయన మొహమంతా వాడిపోయి ఉంది.

ఏమండీ మీ మొహం చూడటానికి చాలా డల్ గా ఉంది! మీరు సరిగ్గా తినటమూ లేదు

ఆకలి లేదు...పనీ ఎక్కువగా ఉంది!

వద్దండీ...మీరు ఆఫీసుకు వెళ్ళలేక పోతున్నారు! వద్దు! లీవు పెట్టండి. జీతం పోతే పోయింది! మనోజ్ సంపాదిస్తున్నాడుగా! మీరు ఉద్యోగం చెయ్యలేకపోతే ఉద్యోగం మానేయండి

లేదు సరోజా! అన్ని బాధ్యతలూ వాడి తల మీద నేను మోపకూడదు

మనోజ్! నువ్వు చెప్పరా...

నాన్నా! మీవల్ల కాకపోతే ఉద్యోగం వదిలేయండి. నేను చూసుకుంటాను

లేదబ్బాయ్! నేను చెయ్యాల్సింది చాలా ఉంది! రేపు నేను వెళితే, బయటి ఊర్లో నాలుగురోజులు పనుంది! వారం చివర్లోనే వస్తాను

వద్దు! ఇప్పుడు మీకున్న ఆరోగ్య పరిస్థితికి మిమ్మల్ని నేను బయటి ఊరికి పంపను

నాన్నా! నేనూ మీతో రానా

వద్దు మనోజ్! ఆఫీసు స్టాఫ్ వస్తున్నారు. నేను వెళితేనే కొన్ని నిర్ణయాలు  తీసుకోగలుగుతాం

మరుసటి రోజు కొన్ని దుస్తులు తీసుకుని బయలుదేరి వెళ్ళారు!...అమ్మ గాబరాపడింది.

మనోజ్ కి, పద్మజా వ్యవహారం అయోమయంగానే ఉంది. పద్మజా సమస్యను ఎలా డీల్ చేయాలో అతనికి అర్ధం కావటం లేదు.

రెండు రోజుల తరువాత తండ్రి యొక్క ఆఫీసు స్నేహితుడు ఒకర్ని మనోజ్ చూశాడు. మామూలుగా మాట్లాడాడు.

నాన్నగారు ఎలా ఉన్నారు?

ఇప్పుడేమీ సమస్య లేదు సార్

ఆఫీసుకు నాలుగు రోజులు సెలవు పెట్టేరే! అందుకే అడిగాను!

మనోజ్ కు చురుక్కుమన్నది.

'నాన్న ఆఫీసు పని మీద బయట ఊరు వెళ్తున్నట్టు, ఇంకా కొంతమంది ఆఫీసు స్టాఫ్ కూడా వస్తున్నారని చెప్పారే'

ఈయనకే తెలియని ఆఫీసు రహస్య పనా! నేను నోరు జారకూడదు!

వేరుగా వచ్చి తండ్రికి ఫోన్ చేశాడు మనోజ్. 

చెప్పు మనోజ్!

ఏ ఊర్లో ఉన్నారు నాన్నా!

చెన్నైలో ఉన్నానయ్యా! నాకు ఏ సమస్యా లేదు...నువ్వు ధైర్యంగా ఉండు!

'ఫోనులో మాట్లాడేటప్పుడు తెలుగు మాటలు వినబడ్డాయి. చెన్నై అంటే తమిళ మాటలే కదా వినబడాలి!'

'అబద్దం చెబుతున్నారా! దేనికీ అబద్దం! ఈ ఆరొగ్య పరిస్థితిలో నాలుగు రోజులు ఇల్లు వదిలి దూరంగా ఎందుకు వెళ్ళాలి?'

సహించుకున్నాడు. తల్లి దగ్గర ఏమీ చెప్పలేదు.

వారం చివర్లో నాన్న వచ్చాశారు.

సరోజా! నా స్నేహితుడు ఒకడు తన భార్యతో ఈ రోజు మనింటికి వస్తున్నారు. టిఫిన్ రెడీ చెయ్యి

సరేనండి!

మనోజ్...నువ్వూ ఉండు. పద్మజా నువ్వూ స్కూలుకు వెళ్ళకు

పిల్లలు ఎందుకు?

ప్రశ్నలు అడగకు సరోజా! చెప్పింది చెయ్యి!

ప్రొద్దున తొమ్మిదింటికి ఇంటి వాకిలిలో ఒక కారు వచ్చి ఆగింది! నాన్న వయసులో ఒక మనిషి. నల్లగా, మీసాలూ, రౌడీ మొహంతో ఉన్నారు. ఆయనతో ఆయన భార్య. వాళ్ళతో పాటూ ఒక యువకుడు!

రండి బెంజమిన్

మనోజ్ కు చురుక్కుమన్నది!

'బెంజమిన్!? ఆ డేవిడ్ తండ్రి పేరు బెంజమిన్ అనే కదా చెప్పారు...ఈయనేనా?'

రండమ్మా! తమ్ముడూ రా!

ముగ్గురూ లోపలకు వచ్చి కూర్చోగా,

సరోజా! తాగటానికి మంచి నీళ్ళు తీసుకురా!

ఉండనీ పద్మనాభం!

లోపలకు వచ్చింది అమ్మ! మనోజ్ ను సైగచేసి పిలిచింది!

ఏరా? నాకు తెలిసి నాన్నకు క్రిస్తువ స్నేహితులు ఎవరూ లేరే?”

తల్లి మంచి నీళ్ళు ఇవ్వ,

మనోజ్, పద్మజాను రమ్మని చెప్పు!

మనోజ్ వచ్చాడు!

వీడు నా కొడుకు మనోజ్ కుమార్. పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. ఈమె నా భార్య  సరోజా! పద్మజాను పిలు!

పద్మజా వచ్చింది. శరీరంలో ఒక వణుకు ఉన్నది! వచ్చిన వాళ్ళు పద్మజాను పైకీ, కిందకూ చూసారు. 

సరోజా! ఈయన బెంజమిన్! ఈవిడ ఆయన భార్య ఏంజలికా!

అతను వాళ్ళ కొడుకా?”

లేదు వాళ్ల అబ్బాయ్ స్నేహితుడు వినోద్ -- వినోద్ చక్రవర్తి!

పేరు విన్న వెంటనే మనోజ్ కరెంటు తీగను తొక్కిన వాడిలా అధిరిపడ్డాడు.

రోజు హోటల్లో మాట్లాడింది వినోద్! అతను నమస్తే చెప్పాడు. అదే గొంతు.

అడ్డు గోడకు అవతలపక్క ఉన్నందువలన, మనోజ్ ఎవరి మొహాన్నీ హోటల్లో చూడలేదు. తనని పద్మజా చూడకూడదని దాక్కున్నాడు. 

డేవిడ్ రాలేదు.

వినోద్ ఏర్పాటు చేసి, డేవిడ్ తల్లి-తండ్రులను తీసుకు వచ్చాడు. ఇందులో నాన్న ఎలా?

నాలుగు రోజులు బయట ఊరి ప్రయాణం అని చెప్పిన అబద్దం దీనికా?’

నాన్నకు అంతా తెలిసిపోయిందా?’

ఒక హార్ట్ పేషంట్ దీన్ని ఎలా తట్టుకో గలుగుతున్నారు!

ఇలా రామ్మా! ఏంజలికా పద్మజాను పిలవ, ఆమె అక్కడే నిలబడింది!

రామ్మా!

మళ్ళీ ఒళ్ళంతా వణుకు.

తండ్రి లేచి వచ్చారు.

పో...వాళ్ళు పిలుస్తున్నారు కదా...పో!

తల్లి సరోజాకు ఏమీ అర్ధం కాలేదు!

ఏమిటి భయమా?  అన్ని తప్పులూ చేసేసి ఇప్పుడెందుకు భయం? నువ్వు అన్నిటికీ తెగించిన దానివే కదా? భయపడుతున్నట్టు నాటకం ఆడుతున్నావా? చెప్పేవే!

కొట్టటానికి చేతులెత్తారు.

ఏమండీ! మూడో మనుషుల ముందు సొంత కూతుర్ని కొట్టటానికి చెయ్యి ఎత్తుతున్నారే...అయ్యో! ఇక్కడేం జరుగుతున్నది?” సరోజా గాబరాపడ్డది.

నాన్నా! మీరు ఎమోషన్ అవకూడదు! మనోజ్ కుమార్ వచ్చి ఆయన్ని పట్టుకున్నాడు.

వినోద్ కూడా లేచి వచ్చాడు. ఇద్దరూ కలిసి ఆయన్ని పట్టుకుని కూర్చోబెట్టారు.

అమ్మా కొంచం వేడి నీళ్ళల్లో అల్లం, తేనె కలిపి వెంటనే తీసుకురండి

ఆయన మొహం, గొంతుకకు పట్టిన చెమటలను వినోద్ తుడిచాడు. నీళ్ళు వచ్చినై. ఆయనకిచ్చి తాగించాడు.

బెంజమిన్ దగ్గరకు వచ్చారు.

పద్మనాభం గారు! భవానీ గారు నా దగ్గర మాట్లాడిన తరువాతే నేను మిమ్మల్ని కలిసాను. నేనే ఒక మొరటోడ్ని. కత్తితో నరికేంత, తట్టుకోలేనంత కోపం వస్తుంది. అలాంటి నేను భవానీ గారి మాటలకు కట్టుబడి మౌనంగా ఉన్నాను 

మీరూ నన్ను కలుసుకుని, ముప్పై రోజులూ పూర్తిగా మాట్లాడి, నిర్ణయాలు  తీసుకున్నాము. తరువాత కూడా ఎమోషనల్ అవచ్చా! మీరు టెన్షన్ పడకూడదని వినోద్ పడుతున్న పాట్లు కొంచమా చెప్పండి! ఏమిటి పద్మనాభం గారు ఇది?”

వినోద్ ఆయన దగ్గర కూర్చుని ఛాతిమీద, వీపుమీద రాస్తున్నాడు.

మనోజ్! ఇక్కడ ఏమిట్రా జరుగుతోంది? నాకు తల తిరుగుతోంది!

వినోద్ లేచాడు. సరోజా దగ్గరకు వచ్చాడు.

అమ్మా!  నేను చెబుతాను. వీళ్ళబ్బాయి డేవిడ్, మీ కూతురు పద్మజా ప్రేమించుకుంటున్నారు!

సరోజా గబుక్కున తిరిగింది.

మతం మారిన ప్రేమా?”

అది మాత్రం కాదే! పద్మనాభం ఆవేశంగా లేవ,

మీరు కూర్చోండి. నేను అమ్మతో మాట్లాడతాను! వినోద్ ఆయన్ని కూర్చోబెట్టి సరోజావైపు తిరిగాడు.

అమ్మా! ఆవేశపడటం వలన లాభం లేదు. ప్రేమ ఏడెనిమిది నెలలు కొనసాగి... డేవిడ్, చెల్లెమ్మ ఇద్దరూ కలిసి అన్ని కట్టుబాట్లనూ వదిలేశారు. ఓర్పుగా వినండి! చెల్లెమ్మకు ఇప్పుడు నలభై ఐదు రోజులు దాటిపోయింది

సరోజా అగ్నిపర్వతంలాగా తిరిగింది.

ఏమిటి రోజులు దాటిపోయినైయా?”

సరోజా, పద్మజాను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టి నా కడుపులో పుట్టిన అమ్మాయా నువ్వు? డీసెంటుగా ఉన్న మా ఇద్దరికీ నువ్వు ఎలా వచ్చి పుట్టావు?”

పద్మనాభం తల వొంచుకోనుండ,

నిన్ను ఇప్పుడే నరికిపారేస్తాను. నువ్వు ప్రాణాలతో ఉంటే కుటుంబానికే అసహ్యం. పాపి! ఇది తట్టుకుని ఆయన ఇంకా ప్రాణాలతో ఉన్నారే. నా మాంగళ్యాన్ని తెంపకుండా నువ్వు ఉండవనుకుంటా?”

గోల చేస్తూనే కూతుర్ని కొట్ట... వినోద్ పరిగెత్తుకు వచ్చి అడ్డుపడ్డాడు.

వదలండి తమ్ముడూ, కన్నవారికే తెలుస్తుంది నొప్పి!

అమ్మా! తప్పులేదు. మీకోపం న్యాయమైనదే. కానీ, ఆమె కడుపులో ఒక ప్రాణం  పెరుగుతోంది. ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికీలేదు. ఆవేశపడకుండా, మాట్లాడకుండా ఉండండి

బెంజమిన్ లేచారు.

దీనికి కారణమైన నా కొడుకు డేవిడ్ను నేను చంపబోయేను, భవానీ అమ్మగారే అడ్డుపడింది!

ఎవరా భవానీ అమ్మగారు?” మనోజ్ అడగ,

వినోద్ తల్లి!

వినోద్ మీకేమవుతాడు?”

నేను చెబుతాను తమ్ముడూ! ఏంజలికా లేచింది.

డేవిడ్ మరియు వినోద్ స్నేహితులు. నా భర్త...బెంజమిన్ కు ఆరు సంవత్సరాలకు ముందు రెండి కిడ్నీలూ  పాడైపోయి, ఈయన్ని మేము కోల్పోయే ఘట్టానికి వచ్చినప్పుడు, తన కిడ్నీలలో ఒక కిడ్నీ ఇచ్చి, డబ్బూ ఖర్చుపెట్టి, ఈయన్నీ కాపాడి, మా కుటుంబాన్ని నిలబెట్టిన దేవతే భవానీ అమ్మగారు! వినోద్ తల్లి. అప్పట్నుంచి భవానీ అమ్మగారు ఏం చెప్పినా మాకు అది బైబుల్ లోని వాక్యంలాగా! ఆమె కన్న రత్నం వినోద్. డేవిడ్ ను చంపేయాలన్న ఈయన ఆవేశాన్ని ఆపగలిగింది వాళ్లే 

పద్మనాభం కళ్ళు తడిసుండ,

డేవిడ్, మీ అమ్మాయీ ఒకరినొకరు ఇష్టపడేది వినోద్ కు తెలిసిపోయింది. వాడు మధ్యలో దూరి వాళ్ళ ప్రేమను అడ్డుకునే లోపల అంతా జరిగిపోయింది. తరువాతే, వినోద్ అతని తల్లి భవానీ అమ్మగారుని లోపలకు తీసుకు వచ్చాడు

వినోద్ తిరిగాడు.

అమ్మా! డేవిడ్ విదేశాలకు వెళ్తున్నాడు. అందువల్ల అబార్షన్   చేయించుకోవటానికి ఇద్దరూ తయారయ్యారు! అప్పుడే నేనూ అన్నీ తెలుసుకున్నాను. ఇక మీదట ఆలస్యం చేయకుండా వాళ్ళిద్దరికీ వెంటనే పెళ్ళిచేసి, పద్మజాను వాళ్ళింటికి పంపండి

బెంజమిన్ లేచాడు.

పద్మనాభం గారు! ఆందోళన చెంది లాభం లేదు. నేను మతం మీద ఎక్కువగా నమ్మకం ఉన్నవాడిని! అందుకని మీ అమ్మాయిని మతం మారమని చెప్పటం లేదు! చర్చూ వద్దు...మీ ఆలయాలూ అవసరం లేదు. సింపుల్ గా ఒక హాలు తీసుకుని, తాలికట్టి, ఉంగరాలు మార్చుకుని, వెంటనే పెళ్ళిని రిజిస్టర్ చేసేద్దాం. ఏమంటారు?”

ఆయన తల ఎత్తారు. ఆయన చూపులు వినోద్ మొహం మీద పడ్డాయి. అతను దగ్గరకు వచ్చాడు.

దేనికీ అంగీకరించని, విపరీతమైన కోపం ఉన్న బెంజమిన్ అంకుల్ అబ్బాయిని కన్నాయన. ఇప్పుడు కూడా ఆయనకేమీ నష్టం లేదు. ఆడపిల్లను కన్న మనకే నష్టం! అవమానమూ మనకే! వాళ్ళు చెప్పినట్టు చేసేద్దామా?”

ఇందులో నేను చెప్పటానికి ఏమీలేదు వినోద్! మాట్లాడే హక్కూ నాకు లేదు. నేనిక తల ఎత్తుకుని నడిచే అవకాశం లేదు

అలా జరగకూడనిది ఏదీ జరగలేదు. కాలంలో ప్రేమ, జాతి, మతాన్ని దాటి నిలబడటం, హద్దులు మీరి పోవటం మనకు కొత్తగా ఉండొచ్చు. యాభై సంవత్సరాలుగా ఇవన్నీ జరగలేదని చెప్పగలమా?”

పద్మనాభం గారి మొహంలో ఎమోషనే లేదు.

అమ్మా! మీరు చెప్పండి... వినోద్ సరోజాను అడగ,

నేనేం చెప్పగలను తమ్ముడూ? ఒక తల్లిగా తలవంచుకుని మాత్రమే నిలబడగలను! జరగనీ

మనోజ్ దగ్గరకు వచ్చాడు వినోద్.

మీరేమీ మాట్లాడలేదే మనోజ్! ఆమెకు అన్నయ్య మీరు!

సారీ అండీ. అది నేను కాదు...మీరే వినోద్!

పద్మనాభం గారు చటుక్కున తిరిగారు.

మీరూ అన్నయ్యే మనోజ్!

నాకు అర్హతలేదు. తోడబుట్టిన వారి నడవడికలను గమనించాల్సిన బాధ్యత ఒక సహోదరుడికి ఖచ్చితంగా ఉంది. తోడ బుట్టని మీరు చూపించిన శ్రద్ద నేను చూపించలేదు! మాట్లాడే అర్హత నాకు లేదు

అరెరే! నేర భావన, కుంగుదల చాలు! వెంటనే మాట్లాడి పెళ్ళి జరిపేద్దాం. పద్మజాను విదేశాలకు పంపటానికి మేము ఏర్పాటు చేస్తాం

ఏంజలికా సరోజా దగ్గరకు వచ్చింది.

ఇలా చూడండి! జరగకూడనది జరిగిపోయింది. మీ కూతుర్ని మా కూతురుగా చూసుకుంటాం

సరోజా బోరున ఏడ్చింది. ఒక్క క్షణం తరువాత కళ్ళు తుడుచుకుని ఏంజలికా యొక్క రెండు చేతులు పుచ్చుకుని చాలా థ్యాంక్సండీ...! అన్నది సరోజా.

థ్యాంక్సును భవానీ అమ్మగారికి చెప్పండి

పద్మనాభం గారు వెంటనే తిరిగారు.

ఆవిడ వచ్చి వాదించి, ఈయన్ని కన్విన్స్ చేసింది! ఈయనకు ప్రాణమిచ్చిన భవానీ అమ్మగారి మాటలు తీసేయగలమా? కోపం తగ్గి ఆయనే మాట్లాడటానికి ఇక్కడకు వచ్చారు. మేమే పెళ్ళి ఏర్పాట్లు చేస్తాం

సరి! టిఫిన్ రెడీ చేస్తాను!

వద్దండీ

ఆంటీ భోజనం చేసే వెళదాం! వినోద్ చెప్పగా, సరోజా లోపలకు వెళ్ళ, ఏంజలికా పద్మజా దగ్గరకు వచ్చింది.

లోపలకు రా మాట్లాడదాం

మొదట్లో ఆందోళనతో ఉన్న పద్మజా, అది తగ్గి మామూలు పరిస్థికి రాగా,

ఏంజలికా భవ్యంగా మాట్లాడ,

అత్తగారితో పద్మజా బాగా కలిసిపోయింది!

ఇంకో రెండు రోజుల్లో డేవిడ్ తో వస్తాం! మా మనవుడు పదిలంగా ఉన్నాడా? నా కొడుకుకు ఎంత అవసరమో!

హాలులో బెంజమిన్ మౌనంగా ఉండ, పద్మనాభం గారు వాకిట్లోకి వచ్చారు. ఆయన మొహాన అదే సోకం. చెప్పలేని నొప్పి.

వినోద్ ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన భుజం మీద చెయ్యి వేశాడు.  

పద్మనాభం గారు అతని మీద తలవాల్చి ఏడ్చాడు.

ఆయన్ని సమాధానపరచి, కన్నీరు తుడిచి, కూర్చోబెట్టి, వీపు మీద రాస్తున్నాడు.

మనోజ్ ఇదంతా చూస్తున్నాడు.

ఎలా దయ చూపుతున్నాడు! నా తండ్రంటే అతనికి ఎందుకంత ప్రేమ!

కన్న కొడుకును -- నేను ఒక రోజు కూడా తండ్రి దగ్గర ఇలా నడుచుకున్నదే లేదే?’

'ఎంత అభిమానం?’

నా చెల్లెలు కొసం వాదించి...అబార్షన్ అవాల్సిన బిడ్డను కాపాడి, చెడిపోయిన దాన్ని కాపాడి, పెళ్ళి వరకు తీసుకు వచ్చిన అతను వినోద్!

సొంత అన్నయ్య అయిన నేను దేంట్లోనూ కలుగజేసుకోక -- దూరంగా నిలబడున్నానే

బెంజమిన్ అంకుల్ కు అతని తల్లి భవానీ అమ్మగారు కిడ్నీ ఇచ్చి ప్రాణం కాపాడినందువలన, కుటుంబం వాళ్ళకు రుణపడి ఉండటం న్యాయమే!

మా కుటుంబం కోసం వీళ్లెందుకు వాదించాలి!

డేవిడ్ మరియు వినోద్ స్నేహితులు అయినందునా?’

అర్ధం కావటం లేదే

ఇలా చూడండి! ఇకమీదట టెన్షన్ పడకూడదు. ప్రశాంతంగా ఉండండి...అంతా నేను చూసుకుంటాను...సరేనా?”  వినోద్ చెప్పగా, నాన్న సరేనన్నట్టు తల ఊప,

టిఫిన్ రెడీ అని అమ్మ స్వరం వినబడ, అందరూ కూర్చోగా...అమ్మకు సహాయంగా వినోద్ తీసుకు వచ్చి వడ్డన చేశాడు. సరోజాకు అతనిపైన ఒక  అభిమానమే వచ్చేసింది.

మీరుండండి తమ్ముడూ! పద్మజా నువ్వు రా! వచ్చి వడ్డించు

ఉండనీయమ్మా! చెల్లెలు షాకులో నుండి పూర్తిగా బయటకు రాలేదు. నేనూ ఇంటి అబ్బాయినేనని నమ్మండి. రండి, పొండిఅనేది వద్దు. రారాఅని పిలవండి. సరేనా?”

సరేరా! అని సరోజా చెప్ప, అతను నవ్వాడు.

ఒకే సమయంలో రెండు కుటుంబ శభ్యులనూ సులభంగా తనవైపుకు  తిప్పుకున్నాడు వినోద్!

పద్మజా కూడా అతన్ని అన్నయ్యాఅని సంభోదిస్తూ అతనికి బాగా  దగ్గరయ్యింది.

మనోజ్ కు ఈర్ష్యగా ఉన్నది.

ఇన్ని రోజులు కుటుంబంలో జీవించి నేను సాధించలేనిది, ఇతను, వినోద్ ఎలా ఒకే రోజులో సాధించగలిగాడు?’

వినోద్ అందరికీ టిఫిన్ వడ్డించ,

వినోద్! నువ్వు కూడా తిను

నేనూ, మనోజ్ కలిసి తింటాము. మనోజ్! నువ్వు సంవత్సరం?”

సంవత్సరం తొంభై! నెల డిసెంబర్

నేనూ అదే సంవత్సరం జనవరీ! నీ కంటే పదినెలలు పెద్ద వాడిని

నీకూ అన్నయ్యనే. నువ్వు ఎక్కువగా మాట్లాడవా! అదీ మంచిదే. మాట్లాడితే, ఎప్పుడూ పగే. దానికోసం మాట్లాడకుండా ఉండగలమా? రా! ఇద్దరం ఒకటిగా తిందాం

తానే చెయ్యి పుచ్చుకుని కూర్చోబెట్టి, స్నేహాన్ని చూపించాడు.

టిఫిన్ రుచిగా ఉందండి! ఏంజలికా చెప్ప,

చెల్లెలికి వంట చేయటం వచ్చా?” వినోద్ అడగ,

తినటం మాత్రం తెలుసు తల్లి చెప్ప, అందరూ నవ్వ, పద్మజా ముఖం  వాడిపోయింది.

ఏంజలికా అడ్డుపడి, “పద్మజా చిన్న పిల్ల! వంట నేను నేర్పిస్తాను. ఆమె పై చదువులు  చదవటానికి డేవిడ్ ఏర్పాటు చేస్తాడు. బయటి దేశంలో  చదవకపోవచ్చు

అప్పుడే! మంచి రోజు చూసేశారు.

వచ్చే ఆదివారం చాలా మంచి రోజు ఏంజలికా చెప్పింది.

హాలు దొరుకుతుందా! సరోజా అడగ,

అంతా నేను ఏర్పాటు చేస్తానమ్మా, మీరు టెన్షన్ పడకండి వినోద్ చెప్ప,

తమ్ముడూ! దీనికంతటికీ కారణం మీ అమ్మ భవానీ అమ్మగారు! ఆమెను చూసి నేను కృతజ్ఞతలు చెప్పాలి. పెళ్ళిలో ముఖ్య అంగం ఆవిడే!

సరేమ్మా

తమ్ముడూ మీ నాన్న ఎక్కడున్నారు?” సరోజా అడగ,

విదేశాలలో ఉంటున్నారమ్మా!

ఆయన పెళ్ళికి వస్తారా?”

తెలియదమ్మా...పెళ్ళికి మూడు రోజులే ఉంది కదమ్మా

అవును...అదీ కష్టమే!

ఇక మేము బయలుదేరతాం!

వాకిలిదాకా వచ్చి సాగనంపారు! వర్షం కురిసి వెలిసినట్లు ఉన్నది.

*************************************************PART-4*******************************************

వినోద్ అన్ని ఏర్పాట్లూ చేసేశాడు. హాలు ఒకటి బుక్ చేసి, హోటల్లో విందుకు ఏర్పాటు చేసి, పెళ్ళి రిజిస్టర్ చేయటానికి కావలసిన పనులను సరిచేసుంచి -- అంతా రెడీ చేశాడు!

మొదట్లో మనోజ్ దేంట్లోనూ కలుగజేసుకోలేదు.

సరోజా అతన్ని పిలిచి కొపగించుకున్నది.

నువ్వే పద్మజాకు తోడ బుట్టిన అన్నయ్యవి! నువ్వు మౌనంగా ఉన్నావు! కానీ, వినోద్ అన్నిటినీ ముందు వేసుకుని పెళ్ళి పనులు చేస్తున్నాడు. నాన్నకు కుదరటం లేదు...ఇప్పుడు కూడా నువ్వు ఏమీ చేయకుండా ఉంటే న్యాయమా?”

మనోజ్ కి చురుక్కుమన్నది! 

కుటుంబమంతా వినోద్ వైపుకు చేరుకోగా, అంతకు ముందే మనోజ్ కి అతని మీద  ఒక  కోపం వచ్చింది. అది చేతకాని తనం కారణంగా వచ్చిన ఈర్ష్యా కోపం.

నాన్న దగ్గర అతని సానుభూతి -- తల్లి యొక్క ఒత్తిడి! పద్మజా 'అన్నయ్యా' అంటూ వినోద్ ను పిలవటం, అన్నీ కలిపి మనోజ్ ని కోపానికి బానిస చెయ్య, తల్లి దగ్గర విరుచుకుపడ్డాడు.

నన్నేం చేయమంటావు. పద్మజా విషయం అతనికి ఎలా తెలిసిందో, ఎవరు చెప్పి  అతను కలుగజేసుకుంటున్నాడో ఏదీ నాకు తెలియదు. అన్ని పనులు అతనే తన నెత్తిమీద వేసుకుని చేస్తున్నాడు. కనీసం నన్ను కలుపుకోవటం కూడా లేదు. నేనుగా విషయం ఎవరినీ అడగనని నీకు తెలుసు కదా...అవును నేను తెలియక అడుగుతున్నా, నిన్న వచ్చిన వినోద్ మీ అందరికీ హీరో అయిపోయాడా?నన్ను తక్కువగా చూస్తున్నారు

అలా ఎవర్రా చెప్పింది?”

ఇన్ని రోజులు కుటుంబాన్ని నేనే కదా చూస్తున్నాను. ఇప్పుడు కూడా నేనే చూసుకుంటున్నాను. నాన్న ఆరొగ్యానికి లక్షల లెక్కలో ఖర్చు అయినప్పుడు, నేనేమన్నా చెప్పానా?”

అది నీ బాధ్యత మనోజ్! వినోద్ బయటి మనిషి! అతను ఇంత ఇదిగా శ్రద్ద చూపిస్తుంటే నీకు సంతోషంగా లేదా?” 

అందుకని

అతను కలుగజేసుకోకపోతే దీని గతి ఏమిటి? అబార్షన్ చేయించుకోనుంటుంది. డేవిడ్ ఎగిరిపోయుంటాడు. రేపు ఇది జీవితం మొదలు పెట్టేటప్పుడు, చెడిపోయిన కథ బయటకు వస్తే, మనం కుటుంబం మంతా ఆత్మహత్య చేసుకోవాలి! అర్ధమయ్యిందా?”

నేనెందుకు చేసుకోవాలి...మీ పెంపకం సరిలేదు

పద్మనాభం గారు ఆందోళనతో చూడ,

అమ్మా! నేను బాగా చదువుకున్నాను. క్రమశిక్షణతో ఉన్నాను. నాకు నేనే ఉద్యోగం వెతుక్కున్నాను. రోజు కుటుంబ బాధ్యతనూ చేతిలోకి తీసుకున్నాను. కన్నవారిని వదిలిపెట్టలేదు. ఒక మధ్య తరగతి కుటుంబం పెద్ద కొడుకు ఏం చేయాలో, దానికంటే ఎక్కువే చేస్తున్నాను. చెడిపోయిన చెల్లెలికి కొత్తగా ఒక అన్నయ్య మొలకెత్తాడని, వాడిని నెత్తి మీద పెట్టుకుని ఆడుతున్నారా? ఒక మంచి కొడుకును నేను...ఇప్పుడు వాడికంటే తక్కువ అయిపోయానా? మీకందరికీ కృతజ్ఞతా భావమే లేదా?”

సరోజా! పద్మనాభం గారు వేసిన కేకతో ఇల్లే అదిరింది.

ఏమండీ! ఎందుకలా అరుస్తున్నారు. మీ ఆరొగ్యం తట్టుకుంటుందా?”

వద్దే! నేను చచ్చిపోతాను

చూడరా! నాన్నకు చెమటలు పట్టి--కాళ్ళూ, చేతులూ వణుకుతున్నాయి

వినోద్ కు ఫోను చెయ్యి! అతనొచ్చి ఈయన్ని పట్టుకుంటే ఈయనకు సరి అయిపోతుంది

మనోజ్! అలా మాట్లాడకు! ఆయన స్వరంలో ఏడుపు!

ఎందుకురా అలా మాట్లాడతావు? ఏమండీ! మీరు టెన్షన్ పడకండి

తల్లి ఆయన్ని పట్టుకుని కూర్చోబెట్ట,

పెళ్ళి ఏర్పాట్ల గురించి చెప్పటానికి వినోద్ రాగా, ఇక్కడ కలహం.

అమ్మా! నాన్నకు ఏమయింది?”

...ఏమీ లేదు వినోద్

లేదే. ఎక్కువ చెమటలు పట్టున్నాయి! గుండెల్లో నొప్పి పుడుతోందా నాన్నా?”

అతను ఆయన్ని పట్టుకోగా, ఆయనకు కళ్ళు చీకట్లు కమ్మ,

మనోజ్ వచ్చి పట్టుకో! హాస్పిటల్ కు తీసుకు వెళదాం

వద్దు వినోద్! నాకేమీ లేదు. పెళ్ళి పూర్తి అయ్యెంత వరకు నేను ప్రాణాలతో ఉంటాను

ఏమండీ!

వినోద్ ఆయన మాట వినక, ఆయన్ని పట్టుకుని కారులో ఎక్కించ,

మనోజ్...రా! అమ్మా రండి!

పద్మజా కూడా వాళ్లతో వెళ్ల, వినోద్ కారు తీశాడు. పెద్ద హాస్పిటల్ కు వచ్చి నిలబడింది.

వినోద్ కు డాక్టర్లు పరిచయస్తులు. ఇంతకు ముందు అతనికే చికిత్స చేసిన ఆసుపత్రి.

పరిశోధించారు.

బీ.పీ ఎక్కువగా ఉంది! .సీ.జీ. చూసేద్దాం

ఒక గంట సమయంలో అన్ని పరీక్షలూ అయినై. మనోజ్ దూరంగా నిలబడ్డాడు.

డాక్టర్ పిలిచాడు. వినోద్ లోపలకు వెళ్లాడు.

ఇప్పుడు ఎటువంటి సమస్యా లేదు. ఏదైనా ఇంటి విషయాలలో టెన్షన్ పడ్డారా?”

అవును...చెల్లి పెళ్ళి దగ్గర పడుతోంది

సరే! ఈయన యొక్క హెల్త్ ముఖ్యం కాదా? విషయం చెప్పి, జాగ్రత్తగా చూసుకోండి! సాయంత్రం తీసుకు వెళ్ళొచ్చు

వినోద్ డబ్బులు కట్టటానికి వచ్చాడు!   

కట్టేశాను! మనోజ్ గొంతు వినబడింది.

నేను కడతాను కదా మనోజ్!

అదైనా నేను చేస్తానే. అది మాత్రమే నేను చెయ్యగలను. హక్కును నువ్వు నా దగ్గర నుండి లాక్కోకు

వినోద్ మొహం మాడిపోయింది.

నేను బయలుదేరతాను. నాకు పనుంది! ఇంటికి సాయంత్రం వచ్చేయండి

నువ్వు కూడా ఉండరా మనోజ్

పిలుచుకు వచ్చిన ఆయనకు, తీసుకువెళ్ళి వదిలిపెట్టటం చేతకాదా! నేనెందుకు? వస్తాను

అతను వేగంగా నడవ,

అమ్మా! వాడికి నా మీద కోపమా?”

లే...లేదయ్యా...!

అవునన్నయ్యా! సహాయం చేసే ఆయన దగ్గర ఎందుకమ్మా దాస్తావు?” లోపలకు వచ్చిన పద్మజా, జరిగిందంతా చెప్ప,

మన్నించయ్యా వినోద్! అమ్మ ఏడవ,

వినోద్ అన్నయ్యా! మీరు లేకపోతే నా జీవితమే నాశనం అయ్యుంటుంది. ఎక్కడ్నుంచో వచ్చి దాన్ని ఆపారు మీరు. మనోజ్ అన్నయ్యకు దానివలన కోపం లేదు. మీ మీద ఈర్ష్య. తాను చెయ్యాల్సిన పని మీరు చేసేరే అన్న ఈర్ష్య

నువ్వు ఉరుకోవే

ఏమ్మా! మంచి చేసేవాళ్ళను పొగడినా, వాళ్ల మీద అభిమానం చూపించినా అది తప్పా?”

పద్మజా! నువ్వు మాట్లేడేది తప్పు! మనోజ్ అన్నయే మీ కుటుంబాన్ని  మోస్తున్నాడు. ఇప్పుడొచ్చిన నన్ను మీరు ఓవర్ గా పొగడితే, వాడికి కోపం తప్పక వస్తుంది

వినోదన్నయ్యా! ఇంటి ఖర్చులకు డబ్బులు ఇచ్చినంత మాత్రానా ఒకడు కుటుంబ హెడ్ అవగలడా? దాన్ని దాటి ఎన్నున్నాయి! ఒక్క రోజు కూడా వాడు నా దగ్గర ప్రేమగా మాట్లాడిందే లేదు. యంత్రం లాగా ఉంటాడు. నవ్వు కూడా రాదు

అది అతని గుణంగా కూడా ఉండొచ్చు పద్మజా! తన బాధ్యతలను అతను విశ్మరించలేదే? అదే అన్నిటికంటే ముఖ్యం. మిగతా విషయాలలో అందరూ ఒకేలాగా ఉండగలరా?”

తప్పు చేసింది నేను! దాన్ని సరిచేయాలని చూస్తున్న మీ మీద కోపగించుకుంటే ఏమిటి లాభం?”

అమ్మ ఏడుస్తూ ఉంటే,

అమ్మా! మీరు స్ట్రాంగుగా ఉండాలి. అప్పుడే నాన్న టెన్షన్ పడకుండ ఉంటారు. పెళ్ళి జరిగేంత వరకు నేను పెళ్ళి పనులు చేసే తీరాలి. చెల్లెలు, డేవిడ్ ఇంటికి వెళ్ళిపోతే నేను తప్పుకుంటాను. తరువాత దేంట్లోనూ తల దూర్చను

సరోజా అదిరిపడ్డది.

లేదు వినోద్! తరువాత కూడా నువ్వు ఇక్కడికి రావాలి. నువ్వు మమ్మల్ని వదిలి ఒక్క రోజు కూడా వేరుగా ఉండకూడదు. నేను నిన్ను కనని తల్లిని! నేను చెబుతున్నా

సరేమ్మా!

నర్స్ వచ్చి పిలిచింది.

ముగ్గురూ లోపలకు వెళ్ళారు. నాన్న మేలుకోనున్నారు.

మనోజ్ ఎక్కడ?”

తల్లి ఏదో చెప్పాలని ప్రయత్నించ, వినోద్ అడ్డుపడ్డాడు.

ఆఫీసు నుండి ఫోను వచ్చింది! అర్జెంటుగా బయలుదేరి వెళ్ళాడు

వినోద్  ఇలారా!

ఏంటి  నాన్నా?”

మనోజ్ మాటలు నిన్ను గాయపరచి ఉంటే, నేను దాని కోసం క్షమాపణలు...  ఏడ్చారు.

నాన్నా! ...ఏమిటిది? అలా నేనేమన్నా చెప్పానా?”

నువ్వు చెప్పవయ్యా...మనసులోనే బాధపడతావు

నాన్నా! ఒక కుటుంబం అని వచ్చేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఉండే తీరుతాయి. మనోజ్ తప్పుగా ఏమీ మాట్లాడలేదు. అతని కోపం నన్ను ఎప్పుడూ బాధ పెట్టదు. మీరు దీనికి టెన్షన్ పడితే, మళ్ళీ మీకే కష్టం

విషయాన్ని ఆయనకు బాగా వివరించి చెప్పు వినోద్!

అమ్మా! నేను మాట్లాడతాను. మనోజ్ కూడా కష్టపడుతున్నాడు. అతని వల్లే అన్నీ జరుగుతున్నాయి. నేను ఇప్పుడు వచ్చిన వాడిన. దయచేసి వాడ్ని ఉంచుకుని నన్ను గొప్పగా మాట్లాడకండి. పద్మజా...ముఖ్యంగా నీకే   చెబుతున్నా!

అన్నయ్యా! నువ్వే...!

వదులమ్మా...చాలు! అలా మాట్లాడితే, ఎవరికైనా సరే కోపం వచ్చే తీరుతుంది. బంధుత్వాన్నీ మనం పోగొట్టుకోకూడదు. అర్ధం అయ్యిందా?”

పద్మనాభం గారి కళ్ళల్లో నీళ్ళు...... వినోద్ ఫోను మోగింది. తీసాడు.

చెప్పమ్మా! హాస్పిటల్లో ఉన్నాను. నాన్నకు...సారీ...సారీ... మనోజ్ వాళ్ళ నాన్నకు ఆరొగ్యం బాగాలేదు. అడ్మిట్ చేశాము

బయటకు వెళ్ళిపోయాడు.

పాపం! ఎంత మంచి కుర్రాడు? నా కడుపున పుట్టలేదే నని బాధగా ఉందండీ

పద్మనాభం గారు అదేకన్నీటితో....

మనోజ్ ఎందుకిప్పుడు కోపం? కుర్రాడు సమాధానపరుస్తున్నాడు!  అవమానంగా ఉంది

చాలు సరోజా! మనోజ్ ను నువ్వూ బాధపెట్టకు! బోసు చెప్పినట్టు నడుచుకో!  కల్యాణీకి విషయం చెప్పావా

రేపు ప్రొద్దున వస్తోంది

పెద్ద చెల్లెలు వస్తోందా?” అడుగుతూ లోపలకు వచ్చాడు వినోద్.

తమ్ముడూ ఫోనులో మీ  అమ్మగారా?”

అవును. వివరం చెప్పాను. గాబరా పడింది!