మానవత్వం...(పూర్తి నవల)
మానవత్వం (పూర్తి నవల)
PART-1
ఆఫీసు పనిలో లీనమైపోయిన యామిని, ఆరవసారిగా తల్లి దగ్గర నుండి వచ్చిన సెల్ ఫోన్ ఆహ్వానం వలన, అవసరవసరంగా టేబుల్ మీదున్న ఫైళ్ళను మూసేసి, ఫైళ్ళను టేబుల్ సొరుగులో పెట్టి, సొరుగుకు తాళం వేసి, తాళం చెవిని హాండ్ బ్యాగులో వేసుకుని లేచింది.
సహ ఉద్యోగి నలిని యామినిని ఆశ్చర్యంగా చూసింది.
"ఏమిటి యామిని...ఈ రోజు త్వరగా బయలుదేరావు?"
"దివాకర్ వాళ్ళింట్లో నుండి వస్తున్నారు"
"పెళ్ళి చూపులకా?"
"ఆలాంటిదే" చిన్నగా నవ్వుతూ అన్నది యామిని.
యామినిని కోపంగా చూస్తూ "నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే?" అన్నది నలిని.
"ఊష్! గట్టిగా మాట్లాడకు...'ప్లీజ్'. ….. అసలు వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలుసా? వాళ్ళకు నేను, మా కుటుంబం నచ్చాలట. మా కుటుంబంలోని వారికి వాళ్ళు నచ్చాలి. దాని తరువాతే మిగిలిన విషయాలన్నీ. అందుకే...అంతవరకు ఎవరిదగ్గరా చెప్పకూడదని ఆగాను"
"నువ్వు చాలా మొండిదానివే!?"
"చెప్పకూడదని అనుకోలేదు నలిని. అన్నీ ఓ.కే. అయిన తరువాత చెబుదామని ఆగాను "
"అర్ధమైంది. ఏది ఏమైనా...నీకు నా శుభకాంక్షలు..."
"థాంక్యూ! నేను బయలుదేరుతాను"
నవ్వుతూ సహ ఉద్యోగిని దగ్గర సెలవుతీసుకుని, మేనేజర్ రూముకు వెళ్ళి అనుమతి తీసుకుని నడకలో వేగం పెంచి మెట్రో రైలు స్టేషన్ కు వచ్చి చేరింది యామిని.
చేతి గడియారంలో టైము చూసింది. సాయంత్రం నాలుగు అయ్యింది.
'ఆరు గంటలకే కదా వస్తానని చెప్పాడు దివాకర్….ఒక గంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చు’ మనసులోనే అనుకుని ఒకసారి చుట్టూ చూసింది యామిని. ప్లాట్ ఫారం మీద అక్కడక్కడా జనం నిలబడున్నారు. ‘ఇంకొంచం సేపట్లో జనం ఎక్కువ అవుతారు. ఆ లోపు రైలు వచ్చేస్తే పరవాలేదు’ అనుకుంటూ రైలు వచ్చే మార్గాన్నే చూస్తోంది. దూరంగా రైలు రావడం కనబడింది.
ప్రయాణీకులు ప్లాట్ ఫారం చివరకు వచ్చి నిలబడ్డారు. పెద్ద మోతతో ఆ విద్యుత్ రైలు వచ్చి ఆగింది.
లేడీస్ పెట్టెలోకి ఎక్కి కూర్చుంది. తనని రిలాక్స్ చేసుకుని, బ్యాగ్ తెరిచి సెల్ ఫోన్ తీసి చూసింది.
పన్నెండు మిస్డ్ కాల్స్. 'ఓ గాడ్' అనుకుంటూ వాటిని చెక్ చేసింది. అమ్మ మరియు దివాకర్...మారి మారి కాల్ చేశారు. మొదట తల్లికి ఫోన్ చేసింది. రింగ్ కొట్టిన వెంటనే 'ఫోన్’ తీసి కోపంగా మాట్లాడింది యామిని తల్లి సరోజ.
"ఏమిటే...ఫోన్ చేస్తే తీయవా?"
"సైలెంటులో పెట్టుంచాను...ఇప్పుడే తీసి చూశాను"
"అంటే ఇంకా ఆఫీసులోనే ఉన్నావా?"
"లేదమ్మా...బయలుదేరాను.వస్తున్నాను"
"బయలుదేరేవా! త్వరగారావే. ఇక్కడ అందరూ చాలాసేపటి నుంచి కాచుకోనున్నారు"
“అందరూ అంటే ఎవరమ్మా?"
"పెళ్ళికొడుకు తరఫు వాళ్ళు"
"ఏమిటీ!?"- సీటులో వేనక్కి జరిగి నిటారుగా కూర్చుంది యామిని.
"మూడు గంటలకే వచ్చాశారు. నువ్వు త్వరగా వచ్చి చేరు. పెళ్ళికొడుకు తల్లికి మొహమే మారిపోయింది. గొణుగుతూనే ఉన్నది. అందుకే 'లీవ్' పెట్టు...'లీవ్' పెట్టు అని మొత్తుకున్నాను. విన్నావా?"
"అమ్మా... ఆరు గంటలకు కదా వాళ్ళు వస్తామని చెప్పింది? మూడింటికే ఎందుకు వచ్చారట?"
“ఆరు గంటలకు ఒక ఫంక్షన్ కు వెళ్ళాలట. ఈరోజు ప్రొద్దునే చెప్పారట. అందుకే 'మూడింటికే వచ్చేస్తాం' అని మధ్యాహ్నమే ఇంటికి ఫోన్ చేసి చెప్పారు. నేనూ పదిసార్లు నీకు ఫోన్ చేశాను. ఫోన్ తీయలేనంత ముఖ్యమైన పనేమిటే?”
"సరేనమ్మా...గొణగకు. నేను వచ్చేస్తాను"
"సరే...స్టేషన్ నుండి నడిచి రాకు! 'ఆటో' చేసుకురా"
'సరే" అంటూ ఫోన్ కట్ చేసింది యామిని.
'ఛఛ! ఈరోజే పని ఎక్కువ రావాలా! 'ఫోన్’ అయినా గమనించి ఉండాలి. దివాకర్ తల్లితండ్రులు మొట్టమొదటిసారి నన్ను చూడటానికి వచ్చినప్పుడు నేను ఇలా నలిగిపోయిన చీర, వాడిపోయిన జిడ్డు మొహం వేసుకుని వాళ్ళ ముందు నిలబడాల్సి వచ్చిందే! ఇంతసేపు వాళ్ళను కాచుకోనిచ్చానే? వెళ్ళిన వెంటనే క్షమించమని అడగాలి’--అనుకుంటున్నప్పుడు తాను దిగాల్సిన స్టేషన్ వచ్చింది.
హడావిడిగా దిగింది. వేగంగా నడిచి స్టేషన్ బయటకు వచ్చి, ఆటో స్టాండు వైపుకు వెళ్ళింది. ఆటో స్టాండ్ దగ్గర చాలామంది గుమికూడి ఉన్నారు.
'ఏమీటీ గుంపు? ఎందుకని దారికి అడ్డంగా గుమి కూడి ఉన్నారు?' కొంచం విసుగ్గా గుంపును తోసుకుంటూ ముందుకు కదులు తుండగా...చెవిని తొలుస్తునట్టు ఒక శబ్ధం. సన్నని గొంతు నుండి వస్తున్న ఏడుపు. అది మామూలు ఏడుపు కాదు. గొంతు ఎండిపోతున్నా ఆపుకోలేని బాధతో కూడిన ఏడుపు. ఆ ఏడుపు విన్న వెంటనే యామిని పాదాలు సడన్ గా ఆగినై. గుంపును తోసుకుంటూ, ఏడుపు వస్తున్న వైపు వేగంగా వెళ్ళి ఆగింది. అక్కడ చూసిన దృశ్యం ఆమె గుండెను పిండేసింది.
పుట్టి కొన్ని గంటలే అయిన ఒక పసి గుడ్డు, పేగు కూడా పూర్తిగా కోయబడని స్థితిలో...మురికి కాలువ దగ్గరగా 'పాలీతిన్’ సంచీతొ చుట్టబడి పడుంది. కాళ్ళూ, చేతులూ ఎగరేసుకుంటూ గొంతు చించుకుని ఏడవటం వలన 'పాలితిన్’ సంచీ నుండి కొంచంగా బయటకు వచ్చిన ఆ పసిగుడ్డు, మట్టి నేల మీద ఉండగా... యామిని వొల్లు కంపిస్తూ, మనసు కొట్టుకుంటుంటే పరిగెత్తుకునెళ్ళి ఆ పసిబిడ్డను ఎత్తుకుంది.
"అయ్యో! ఎంత దారుణం ఇది? ఏమ్మా ఇంతమంది గుమికూడి ఉన్నారే...ఎవరైనా ఒక్కరు ఈ పసిబిడ్డను నేలపై నుండి తీసుండకూడదా? గొంతు చించుకునేల ఏడిపించి, వేడుక చూస్తూ నిలబడ్డారే...? మీకందరికీ హృదయం ఉండాల్సిన చోట రాయి పెట్టేశాడా ఆ దేవుడు?" ఆవేశంగానూ, కోపంగానూ అడుగుతూ పసిబిడ్డ చుట్టూ ఉన్న పోలితిన్ సంచీని తీసి అవతల పారేసింది.
ఆ పసిబిడ్డ వొల్లంతా చీమలు తిరుగుతున్నాయి...వొణికిపోయింది యామిని.
"అయ్యో ఎన్ని చీమలో? ఎవరైనా మంచినీళ్ళు ఉంటే ఇవ్వండి"
"ఏమ్మా! ఇప్పుడే పుట్టిన బిడ్డ అది. నీళ్ళు పోయబోతావా?" గుంపులో ఉన్న ఒక ఆవిడ అడగగా కన్నీటితో ఆవిడవైపు చూసింది యామిని.
"బిడ్డ వొళ్ళంతా మట్టి, మురికిగా ఉన్నది. కడిగితే ఏమీ అవదు. 'ప్లీజ్'....ఎదురు కొట్టుకు వెళ్ళి ఒక బాటిల్ నీళ్ళు తీసుకురండి" ప్రాధేయపడింది.
"ఇదిగో చూడమ్మా...చూస్తే వయసులో ఉన్న అమ్మాయిలాగా కనబడుతున్నావు. నీకు అనుభవం చాలదు. చల్లటి నీళ్ళు పోస్తే వెంటనే జ్వరం వస్తుంది. ఆ జ్వరం వస్తే బిడ్డ బ్రతకదు. బిడ్డ చచ్చిపోతే నీతో పాటు నేనూ పోలీసులకు పట్టుబడతానే"
"ఏమిటీ...జ్వరం వస్తుందా"
"అవునమ్మా! ఇంతకుముందే బిడ్డ ఏడ్చి ఏడ్చి గుక్క తిప్పుకోలేకపోయింది. చూడు...ఛాతి కూడ ఎలా పైకీ కిందకూ వేగంగా ఆడుతున్నదో..."...ఆవిడ చెప్పిన తరువాత...పసిబిడ్డను పూర్తిగా చూసింది యామిని.
ఆ పసిగుడ్డు చాలాసేపటి నుండి ఏడుస్తూ ఉండుండాలి. నాలిక ఎండిపోయి, ముఖమంతా ఎర్రబడి...గొంతు సరిగ్గా రాక, ఏడవటానికి తత్తరబిత్తర పడుతోంది. గుండె గూడు వేగంగా కొట్టుకుంటోంది. గొంతు దగ్గర ఏర్పడిన లోతు, వెక్కిళ్ళు మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టటంతో... యామిని హృదయం తల్లడిల్లింది.
"అరె ఏమైంది...? పెద్దమ్మా కొంచం చూడమ్మా" భయంతో అడిగింది యామిని.
"ఇక బ్రతకదమ్మా..."
"రెండు గంటలుగా ఆపకుండా ఏడుస్తున్నది. ముఖమంతా రంగు మారింది. ఇక బ్రతకదు. సైలెంటుగా తీసిన చోటే పడేసి వచ్చేయమ్మా. చేతుల్లో ఉన్నప్పుడు ప్రాణం పోతే...మీమీదే పోలీసులు సందేహపడతారు. అందుకనే మేము దూరంగా నిలబడ్డాం. ఏమీ చేయకుండా మేమందరం ఎందుకు నిలబడున్నామో తెలుసుకోకుండా నువ్వెళ్ళి గబుక్కున బిడ్డను తీసుకున్నావే...?" గుంపులోని మరొక ఆవిడ యామినిని హెచ్చరించింది.
"మీరందరూ మానవ జన్మ ఎత్తిన వారేనా? మీ అందరికీ గుండెళ్ళో కొంత కూడా జాలి, దయ లేదా? రెండు గంటలుగా చీమలు, దోమలు కుట్టటం తో ఈ పసిగుడ్డు అల్లలాడిపోయుంటుందే. ఆ బిడ్డను కాపడదామనే ధ్యాస లేకుండా...'ఎప్పుడు చచ్చిపోతుంది?' అని కాళ్ళు నొప్పులుపుడుతున్నా నిలబడి వేడుక చూశారే. మీకందరికీ సిగ్గుగా లేదు? మీరందరూ పిల్లల్ను కన్న వాళ్ళే కదా? ఎలాగమ్మా ఇలా మనసులో జాలి లేకుండా నిలబడ్డారు...?”
"ఇలా చూడమ్మా...ఊరికే నోరు పారేసుకోకు! ఈ బిడ్డను కన్నదేవరో? ఏ సిగ్గుమాలిన పనివలన పుట్టిందో? కన్నదే ఎగరేసి విసిరేసి వెళ్ళింది...మాకేమిటి అవసరం?" గుంపులోని ఒకరు.
"అదే కదా...ఈ బిడ్డను తీసుకు వెళ్ళి మేమేమి చేసుకుంటాం?" గుంపులోని మరొకరు.
"ఎవరైనా 'ఆంబులాన్స్’ కు ఫోన్ చేయండయ్యా" గుంపులోని మొదటావిడ.
“చేస్తే పోలీస్ కేసు అవుతుంది” ఇంకో గొంతు.
“అవనివ్వండి …వాళ్ళే ఈ బిడ్డను ఏదైనా అనాధ శరణాలయంలో చేర్పిస్తారు" గుంపులోని మొదటావిడ.
"అంతవరకు ఆ బిడ్డ బ్రతికుంటుందా?”
గుమికూడిన గుంపులోని వారు దూరంగా నిలబడే మాట్లాడుతుంటే, వాళ్ళను కోపంతో చూసింది యామిని. తన చీర కొంగుతో బిడ్డ వొళ్ళంతా తుడిచి....గుండెలకు హత్తుకుని, అక్కడ నీలబడున్న ఆటోవైపుకు వెళ్ళింది.
"ఇదిగో అమ్మాయ్...బిడ్డను ఎక్కడికి తీసుకు వెడుతున్నావ్?" గుంపులో ఎవరో అరిచారు.
అక్కడ గుమికూడిని వాళ్ళెవరికీ సమాధనం చెప్పకుండా ఖాలీగా ఉన్న ఆటొలో ఎక్కి కూర్చుంది.
"అన్నా...బిడ్డ గుండె కొట్టుకోవటం తగ్గిపోతోంది. పక్కన ఏ ఆసుపత్రి ఉందో ఆ ఆసుపత్రికి వెళ్ళండి...త్వరగా" ఆటో డ్రైవర్ తో చెప్పింది యామిని.
"సరేనమ్మా..." స్పీడ్ పెంచాడు ఆటో డ్రైవర్. బిడ్డ చుట్టు తన చీర కొంగును కప్పింది.
ఆప్పుడు, పూర్తిగా ఏడుపు ఆగిపోయింది. గొంతు క్రింద పడే గుంట అతిమెల్లగా ఎగిసిపడుతోంది. మళ్ళీ యామిని కళ్ళు నీటితో నిండిపోగా, ఆ బిడ్డను గుండెలకు మరింత దగ్గరగా హత్తుకుంది.
"నీకు ఏమీకాదు. నిన్ను చనిపోనివ్వను. నేనున్నాను. నిన్ను కాపాడి, సంరక్షించే చోట నిన్ను చేరుస్తాను. నువ్వు బ్రతకాలి. "- బిడ్డ చెవిలో మాట్లాడుతూ వస్తుంటే....ఆసుపత్రి ఏంట్రన్స్ వచ్చింది. ఆటో ఆగింది.
తాను ఎందుకోసం పర్మిషన్ తీసుకుని ఆఫీసు నుండి త్వరగా బయలుదేరిందో… ఆ విషయమే మరిచిపోయి , ఆ బిడ్డను కాపాడటానికి ఆసుపత్రిలోకి పరిగెత్తింది యామిని.
*********************************************PART-2******************************************
"ఏమిట్రా ఇది...టైము ఆరు అవుతోంది. నాలుగు గంటలకే ట్రైన్ ఎక్కిందని చెప్పారు. ఇక్కడున్న హై టెక్ సిటీ నుండి యూసఫ్ గూడా రావటానికి రెండు గంటలా అవుతుంది?"
దివాకర్ తల్లి పార్వతి గట్టిగా అడగటంతో...చేతులు పిసుక్కుంది సరోజ. వాకిట్లోనే నిలబడి కూతురు రాకకోసం ఎదురుచూస్తున్న తండ్రి రామారావుకు దివాకర్ తల్లి మాటలు వినబడటంతో హడావిడిగా లోపలకు వచ్చాడు.
"కోపగించుకోకండి...'ట్రైన్’ లో ఏదైనా లోపం వచ్చుంటుంది. అబ్బాయిని పంపించాను. ఇప్పుడు వచ్చాస్తారు"
"ఈ మాటే ఒక గంట నుండి చెబుతున్నారు. కానీ, అమ్మాయీ రాలేదు...వెతకటానికి వెళ్ళిన అబ్బాయీ రాలేదు" రామారావును నిలదీసింది దివాకర్ తల్లి.
"సమస్య ఏమిటో తెలియలేదే… ఉండండి. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయమంటాను” దివాకర్ తల్లితో చెప్పి, భార్య వైపు తిరిగి “సరొజా... మళ్ళీ ఇంకొసారి 'ఫోన్’ చేసి చూడు"- తండ్రి రామారావు ఆదుర్దాగా చెప్పాడు.
ఈలోపు దివాకర్ ముందుకు వచ్చి "నేనూ యామినికి 'ఫోన్’ ట్రై చేస్తునే ఉన్నా అంకుల్. ఏ సమాధానమూ లేదు"
"ఏమిటి బాబూ చెబుతున్నావు?" కంగారుగా అడిగాడు రామారావు.
"స్విచ్ ఆఫ్ చేసుకోనుంది" అని చెబుతున్నప్పుడు అతని గొంతు, ముఖమూ మారింది. రామారావు నీరసంగా భార్యను చూశాడు.
"ఒకవేల "ఫోన్’ లో 'చార్జ్' అయిపోయుంటుందేమో?" మెల్లగా చెప్పింది సరోజ.
"మనిషి మనిషికీ ఏదో ఒకటి చెబుతున్నారు. ఇదంతా నాకు సరి అనిపించటం లేదు. ఇది జరిగే పని కాదు. అందరూ లేవండి వెళ్దాం" కుర్చీలో నుండి లేస్తూ అన్నాడు దివాకర్ తండ్రి.
సరోజ గాబరా పడింది.
"కొ..కొంచం సేపు ఉండండి ఇప్పుడు వచ్చేస్తుంది..."
"ఏమ్మా... మాకు పనీ పాటా లేదనుకున్నారా? సాయంత్రం ఆరు గంటలకు నా మేనమామ మనుమురాలికి బారసాల ఫంక్షన్ ఉంది. అది వదిలేసి ఇక్కడే కూర్చుంటే....రేపు మా వాళ్ళ మొహాలు మేము చూడక్కర్లేదా?"
"అ... అదికాదండీ..."
"ఇలా చూడండి. ఏదో మా అబ్బాయి ఆశపడ్డాడు కదా అని ఇక్కడికి వచ్చాము…..కానీ, జరుగుతున్న తంతు చూస్తుంటే మీ అమ్మాయికి మా అబ్బాయి అంటే ఇష్టం లేదు లాగుందే?"
."అయ్యో...అలాగంతా లేదమ్మా"
"కాకపోతే ఏమిటమ్మా..? అమ్మాయిని చూడటానికి వస్తున్నాం అని మీకు తెలుసు. లీవు పెట్టి ఇంట్లో ఉండమని చెప్పుండాలి. మీరు చెప్పలేదు. సరే...ఫోన్ చేస్తే మాట్లాడుతుందీ అని అనుకుంటే ఫోను ఎత్తటమే లేదు. ఎలాగో ఆఫీసు నుండి బయలుదేరి, ట్రైన్ ఎక్కి వస్తోంది అని చెప్పేరు...మేమూ నమ్మాము. కానీ, ఇంతవరకు ఇంటికి వచ్చి చేరలేదు. 'ఫోన్’ ను 'స్విచ్' ఆఫ్ చేసిపెట్టింది. దీనికంతా ఏమిటి అర్ధం? మీ అమ్మాయికి ఈ సంబంధం ఇస్టంలేదని తెలుస్తోంది”
"అమ్మా" అంటూ నోరు తెరవబోయిన కొడుకును చూపులతోనే వారించింది దివాకర్ తల్లి.
"నువ్వు ఉరికే ఉండరా. ఉద్యోగానికి వెళ్ళే ఆడపిల్ల మనకు కరెక్టు కాదు. వద్దు అని చెప్పానా...విన్నావా? 'ఈ అమ్మాయే కావాలని ఒంటికాలుమీద నిలబడి మమ్మల్ని పిలుచుకొచ్చావు...ఇప్పుడేమైందో చూడు"
"అదికాదమ్మా! వచ్చే దారిలో ఏదైన సమస్య వచ్చుంటుంది...వచ్చిన తరువాత అడిగితేనే కదా నిజం తెలుస్తుంది?"
"నోరు ముయ్యరా! పెళ్ళి చూపులకే ఇంత ఆలశ్యంగా వచ్చే అమ్మాయి, రేపు మన ఇంటికి వచ్చిన తరువాత ఎలా ప్రవర్తిస్తుందో? ఇది మనకు సరిపడదు...బయలుదేరు"
"అమ్మా..."
"దివాకర్…. నీ ఇస్టాన్ని గౌరవించి మేము వచ్చాము. కానీ, ఆ అమ్మాయి మనల్ని గౌరవించటంలేదే? ఎందుకు ఆలశ్యమవుతోందో కనీసం ఫోనులో చెప్పచ్చు కదా. అదికూడా చేయలేని అమ్మాయి నీకెందుకురా? నీకేం తక్కువ...వేరే అమ్మాయి దొరకదా?" తండ్రి కూడా బయలుదేరటానికి సిద్దం అవగా...వేరు దారిలేక కుర్చీలోంచి లేచాడు దివాకర్.
రామారావు బాగా కలత చెందాడు.
"బాబూ...అవసరపడకండి. నా కూతురు ఇప్పుడు వచ్చేస్తుంది"
"ఇలా చూడండి. విదేశాలలొ పనిచేసే అల్లుడ్ని వదలకూడదని మీరు తహతహలాడుతున్నారు. కానీ, కుటుంబానికి తగిన అమ్మాయి మాకు కావాలికదా?" దివాకర్ తల్లి చెప్పింది.
సరోజకి కోపం వచ్చింది.
"ఇలా చూడండి...మగపెళ్ళి వాళ్ళు, ఇళ్ళు వెతుక్కుంటూ వచ్చేరే అని మిమ్మల్ని కూర్చోపెట్టి ఇంతసేపు మాట్లాడుతున్నాము. అంతేగానీ మీ అబ్బాయికోసమో...అతని విదేశీ ఉద్యోగం కోసమో కాదు"
"సరొజా"
"మీరు వూరుకోండి. బయటకు వెళ్ళిన అమ్మాయి ఇంటికిరావటానికి అటు ఇటూ అవుతుంది. ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నారే , రేపు అమ్మాయి వాళ్ళింటికి వెడితే ఇంకా ఏమేమి మాట్లాడతారో? ఈవిడ మాటలు మంచిగా లేవు. ఈ సంబంధం పోతే పోనివ్వండి"
"చూసావారా దివాకర్!...మనకు ఇది అవసరమా? అమ్మాయి మాత్రమే కాకుండా...తల్లి కూడా కలిసి మనల్ని అవమానిస్తున్నారు”
"ఇదిగో చూడండి... మర్యాదగా మాట్లాడితే అందరికీ మంచిది"
"సరొజా…...ప్రశాంతంగా ఉండు"
"ఎందుకు ప్రశాంతంగా ఉండాలి? రెండు గంటల ముందే ఆఫీసు నుండి ఇంటికి బయలుదేరిన అమ్మాయి ఇంకా ఇంటికి ఎందుకు రాలేదని మనం టెన్షన్ పడుతుంటే, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూశారా? ఆడపిల్లను కంటే అన్నిటికీ సర్ధుకుపోవాలా? వాళ్ళకే ఇంకో అమ్మాయి దొరుకుతున్నప్పుడు...మన అమ్మాయికి వెరే అబ్బాయి దొరకడా? మా అన్నయ్య కొడుకు ఉన్నాడు...దర్జాగా ఉంటాడు. బోలెడంత సంపాదిస్తున్నాడు"
"విన్నావారా దివాకర్ ...ఆల్ రెడీ పెళ్ళికొడుకు రెడీగా ఉన్నాడట. ఇక చాలు. ఇక ఒక క్షణం ఇక్కడ ఉండకూడదు. ఉంటే మన పరువు, మర్యాదలు తిసేస్తారు" అంటూ దివాకర్ తల్లి లేచి బయటకు వచ్చింది. ఆమె తరువాత దివాకర్, మిగిలిన వారు బయటకు వచ్చారు.
అప్పుడు అక్కడికి తన మోటార్ సైకిల్ మీద వచ్చాడు యామిని తమ్ముడు ప్రసాద్.
కొడుకును చూసిన వెంటనే పరిగెత్తుకొచ్చాడు రామారావు.
"ప్రసాద్, యామిని ఏదిరా?"
"అరగంట సేపు రైల్వే స్టేషన్ లో ‘వైట్’ చేసి చేశాను. రాలేదు నాన్నా. ‘ఫోన్’ చేసి చూశాను ‘లైన్’ దొరకలేదు"
"అయితే ఒకసారి ఆఫీసుకు వెళ్ళి చూసొస్తావా?"
"వెళ్ళేసే వస్తున్నాను. నాలుగు గంటలకు ముందే బయలుదేరిందట"
"అప్పుడు...నా కూతురు...ఎక్కడకి వెళ్ళుంటుంది?"
రామారావు, సరోజ తల్లడిల్లిపోగా...దివాకర్ తల్లి ఎగతాలిగా నవ్వింది.
"మంచి కుటుంబంరా ఇది. ఒక పెళ్ళికొడుకును రెడీగా ఉంచుకున్న విషయాన్ని దాచి, మనల్ని పిలిచి అమ్మాయిని చూసుకోమని చెప్పింది తల్లి . కానీ ఇప్పుడు కూతురు ఏ పెళ్ళికొడుకును వెతుక్కుంటూ వెళ్ళిందో తెలియటంలేదే?"
"హలో మర్యాదగా మాట్లాడండి" కోపంతో అరిచాడు ప్రసాద్.
"మర్యాదా? అదేమిటో మీకు తెలుసా? అమ్మాయిని సరిగ్గా పెంచటం చేతకానివాళ్ళు...మర్యాద గురించి మాట్లాడటమా?"
జవాబుగా మీనాక్షి కోపంగా అరవగా…
సమస్య పెద్దదై వీధిలోని వాళ్ళంతా గుమికూడి వేడుకగా చూస్తుంటే...ఆటోలో వచ్చి దిగింది యామిని.
"అమ్మా.... యామిని వచ్చేసింది"
దివాకర్ అరుపుతో అందరూ మౌనంగా వెనక్కి తిరిగి చూశారు. సరోజ అధిరిపడ్డది. చేతిలో ఒక బిడ్డతో వచ్చి దిగిన కూతుర్ను చూసిన మిగిలినవారు ఆశ్చర్యపోయారు. దివాకర్ తల్లి కళ్ళు పెద్దవి చేసుకుంది.
"దివాకర్ ఏమిట్రా ఇది....ఈమె పెళ్ళికూతురా?"
"అవునమ్మా"
"ఏమిటి...బిడ్డతో వచ్చింది?"
“అది తెలియదమ్మా...! యామినీ ఏమిటిది? ఎవరీ బిడ్డ? ఇంతసేపు ఎక్కడికెళ్ళావు?"
"దివాకర్ ఈ...ఈ బి"
"దాని బిడ్డే అయ్యుంటుంది"
"అ...మ్మా" అన్నాడు దివాకర్.
"ఈ కుటుంబంలో ఏదీ సరిలేదురా. ఏదో మన మంచి టైము...తాంబూళాలు పుచ్చుకోక ముందే అన్నీ బయటపడ్డాయ్. మనకు ఈ అసహ్యమంతా వద్దు….నువ్వు కార్లోకి ఎక్కు"
దివాకర్ బలవంతంగా కారులోకి ఎక్కాడు. మిగిలినవాళ్లంతా ఎక్కిన తరువాత కారు బయలుదేరింది.
యామిని ఏమీ అర్ధం కాక నిలబడ్డది.
కొన్ని క్షణాల తరువాత దివాకర్ తల్లి చెప్పిన మాటలను అర్ధం చేసుకున్న యామిని ఆశ్చర్య పడుతూ తల్లివైపుకు తిరిగి.
"అమ్మా! వాళ్లెందుకు అలా మాట్లాడి వెడుతున్నారు?"
"ఏయ్...ఏమిటే ఇది... ఎవరే ఈ బిడ్డ?"
"అమ్మా...నేను రైలు దిగి వచ్చేటప్పుడు..." అని చెబుతున్న కూతుర్ని హడావిడిగా ఇంటిలోపలకు లాక్కొచ్చాడు రామారావు
వీధిలో అంతవరకు వేడుక చూస్తున్న గుంపు, చెదరి వెళ్ళిపోయింది.
ఇంటిలోపలకు వెళ్ళి వెక్కివెక్కి ఏడుస్తోంది సరోజ.
"ఎవరి బిడ్డే ఇది?" కూతుర్ని అడిగాడు తండ్రి రామారావు.
విషయం చెప్పింది యామిని.
"ఏమే! నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎవరో బిడ్డను విసిరిపారేస్తే నీకేమొచ్చింది? ఆ పీడను ఇక్కడికెందుకు తీసుకువచ్చావు?” ఉగ్రంగా లేచింది తల్లి సరోజ.
"అమ్మా...?"--తల్లిమాటలతో అదిరిపోయింది యామిని.
"ఏమిటే అమ్మా? ఏమీ లేకుండానే దివాకర్ వాళ్ళ అమ్మ వెయ్యి మాటలు మాట్లాడి వెళ్ళింది. ఇప్పుడు చేతిలో బిడ్డతో వచ్చి నిలబడ్డావు. బుద్దిలేదా నీకు? పెళ్ళీడుకు వచ్చిన ఆడపిల్ల ఇలా చెతిలో ఒక బిడ్డతో వచ్చి నిలబడితే ఊరు ఏం చెబుతుంది?"
"ఇందులో ఊరు చెప్పేందుకు ఏముందమ్మా? నేను ఏం తప్పుచేశాను? ఈ బిడ్డ పాపం అమ్మా. మురికి కాలవ పక్కన ఒక కవర్ లో అనాధగా...చీమలు పాకుతూ...ఎలా ఏడుస్తూ పడుందో తెలుసా? ఆ నిమిషం ఆ బిడ్డను ఎలాగైనా కాపాడాలని అనిపించింది. అందుకే ఆసుపత్రికి ఎత్తుకు పరిగెత్తాను. ఇది తప్పా?"
"అది తప్పు కాదమ్మా. ఆసుపత్రిలో చేర్చిన తరువాత పోలీసులకు చెప్పి, వాళ్ళకు అప్పగించేసుండాలి. అక్కడితో మన బాద్యత ముగిసిపోతుంది. కానీ, నువ్వేం చేసేవు...ఆ బిడ్డను ఇక్కడికి తీసుకు వచ్చావు. అదే తప్పు....కాబట్టి, ఆ బిడ్డను ఇటివ్వు. నేనూ, అన్నయ్య పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఇచ్చేసి వస్తాం"...తండ్రి రామారావు చెయ్యి చాచాడు...ఇవ్వనన్నట్టు తల ఊపింది యామిని.
"వద్దు నాన్నా"
"వద్దా!??"
"ఇప్పుడు వద్దు నాన్నా! ఇప్పటికే ఈ బిడ్డ చావుతో పోరాడి, 'ఆక్సిజన్’ ఇవ్వబడి బ్రతికి వచ్చింది. డాక్టర్ మందులు ఇచ్చాడు. గంట గంటకూ మందూ, అరగంటకు ఒకసారి చలార్చిన పాలు ఇవ్వాలి. రేపు కూడా ఆసుపత్రికి తీసుకురమ్మన్నారు"
"వొసేయ్! నీకు నిజంగానే పిచ్చి పట్టింది. మాట్లాడకుండా ఆ బిడ్డను నాన్న దగ్గర ఇచ్చి పంపించు" అదమాయించింది తల్లి సరోజ.
"లేదమ్మా...ఇప్పటికే రాత్రి అయ్యింది. ఈ టైములో తీసుకు వెళ్ళి ఇస్తే వాళ్ళు ఎప్పుడు శరణాలయంలో చేరుస్తారో? ఒక వేల రాత్రంతా 'స్టేషన్’ లోనే ఉండిపోతే? ఈ బిడ్డకు ఇవ్వాల్సిన మందు, పాలూ టైము టైముకు ఎవరిస్తారు?"
"దాని గురించి నీకెందుకే బాధ?"
"అమ్మా... ఒక తల్లిగా ఉన్న నువ్వు ఇలా మాట్లడొచ్చా? బిడ్డకు ఆకలేస్తుంది. పాల 'పౌడర్’ కొనుక్కొచ్చాను. కాచి ఇచ్చి, మందు పోయాలి. దానికి ముందు వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయించాలి"
"యామినీ..."
"ప్లీజ్ నాన్నా! కష్టపడి కాపాడి, మనకెందుకులే అని వదల లేక పోతున్నాన్ను. రెండు రోజులు ఉంచుకుని...ఆరొగ్యం సరైన తరువాత వెళ్ళి వదిలేసి వద్దాం"
"బుద్ది లేనిదానా! ఉరి గురించి తెలియని అయోమయంగా ఉన్నావు కదే...ఊళ్ళో జనం నాలిక మీద నరాలు లేకుండా మాట్లాడతారే?"
"ఉరు ఇంకేం చేస్తుందమ్మా? ఈ బిడ్డను ఈగలు, చీమలు, దోమలు మూగుతున్నప్పుడు వేడుక కదా చూసింది. 'ఎవరు కన్న బిడ్డో...ఎలా కన్నదో?' అంటూ నోట్లో నాలిక లేకుండా మాట్లాడుతూ నిలబడ్డది. ఇంకేం చేసింది?"
"అయ్యో...భగవంతుడా! దీని బుద్ది ఎందుకు ఇలా పోతోంది? ప్రశాద్...మొదట ఈ పీడను తీసుకు వెళ్ళి బయట ఎక్కడన్నా విడిచిపెట్టి రారా"
"అమ్మా..." యామిని ఆవేశంగా అరిచింది.
"ఏమే నేను చెప్పినదాంట్లో ఏమిటే తప్పు?"
"తప్పమ్మా! ఎవరో ఇద్దరు అవసరపడి, కోరికలు అణుచుకోలేక చేసిన తప్పుకు ఈ బిడ్డ ఏంచేస్తుంది? దేవుడూ, పిల్లలూ ఒకటే అని చెప్పిన నీ నోటితో ఈ బిడ్డను 'పీడ’ అని ఎలా చెబుతున్నావు?"
"యామినీ?"
"ఈ బిడ్డ తల్లి చేసిన అదే తప్పు నేను చేయను. బిడ్డను ఎవరికీ ఇవ్వను"- కన్న బిడ్డను తల్లి గుండెలకు హత్తుకున్నట్టు యామిని బిడ్డను హత్తుకుంటుంటే బెదిరిపోయి నిలబడ్డారు యామిని తల్లి తండ్రులు.
*********************************************PART-3*******************************************
"నీకు తెలుసుకదా తలపోయేంత పని ఉన్నా ఒక్క రోజు కూడా 'లీవు’ పెట్టదు. ఇప్పుడు ఎవత్తో కన్న బిడ్డకోసం రెండు రోజులుగా ఆఫీసుకు వెళ్ళకుండా ఇంట్లోనే వుంటూ ఏమేమి పనులు చేస్తోందో తెలుసా? దానికి స్నానం చేయించటం, బట్టలు మార్చటం, టైము టైముకు పాలు కాచి ఇవ్వటం...ఒక నిమిషం కూడా దాన్ని తన ఒడిలో నుండి కిందకు దింపలేదు. మరి ఆ ప్రేమ ఏమిటో"- టెలిఫోనులో పెద్ద కూతురి దగ్గర నిట్టూర్పుతో చెబుతున్న తల్లి మాటలను పట్టించుకోకుండా బిడ్డ వొంటిని గుడ్డతో సున్నితంగా తుడుస్తోంది యామిని.
ఆ పసి వొంటి మీద మడతలు మారినై. మృదువైన చర్మం మీద 'పౌడర్’ పూసి, నుదుటి మీద బొట్టు పెట్టింది. బిడ్డ కళ్ళు ఆమె ముఖాన్నే ఆశ్చర్యంగా చూస్తూ వుండగా ...మెల్లగా నవ్వింది.
"ఏమిట్రా నాన్నా....ఏమిటి చూస్తున్నారు? ఆకలేస్తోందా...పాలు తాగుదామా?"
"వెఱ్ఱి ముఖమా? దానికి ఆకలేస్తోందో లేదో, ఎపూడూ పాలు పడుతూనే ఉన్నావు! కన్న బిడ్డను కూడా ఇలా చూసుకోరు. ఆ పసిబిడ్డ 'బురదలో పుట్టిన తామర లాగా బాగానే ఉన్నది"
"రేయ్ బంగారం! నువ్వు తామరలాగా ఉన్నావట...మీ అమ్మమ్మ చెబుతోంది"
"ఏయ్... ఎవత్తో కన్న బిడ్డకు నేను అమ్మమ్మనా?"
"అమ్మా, ఒకటి నాతో మాట్లాడు...లేదంటే అక్కయ్యతో మాట్లాడు. అంతే కానీ ఇలా ఇద్దరి దగ్గరా మాట్లాడుతూ ఎందుకు ఫోన్ బిల్లు పెంచుతావు?"
"అన్నీ నాకు తెలుసు...నువ్వు నీ పనిచూసుకో"
"ఏమిట్రా బంగారం...అమ్మమ్మ ఎప్పుడూ చిటపటలాడుతూ ఉంటోంది అని ఆలోచిస్తున్నావా? ఆవిడకు ఈర్ష్య. నువ్వు ఆవిడ కంటే అందంగా ఉన్నావుగా...?"
"మా టైము ఎలా ఉందో చూసావా కుమారీ...నేను ఈ శనేస్వరాన్ని చూసి ఈర్ష్య పడుతున్నానట. అక్రమ సంబంధం వలన పుట్తిందని పారేసిందో...లేక ఆడపిల్లగా పుట్టిందని పారేసిందో...? దీన్ని చూసి ఈర్ష్య పడాలా?"----అన్న తల్లిని కోపంగా చూసింది యామిని.
"ఏమ్మా...తెల్లావారిన దగ్గర నుంచి రాత్రి పొద్దుపోయేదాకా అదే మాటలు, చెప్పిందే చెపుతావు? మీరు మాట్లాడేది ఈ పసిబిడ్డకి అర్ధమవుతుందా? ఈ పసిబిడ్డ తిరిగి మాట్లాడగలదా? మరెందుకు తప్పు తప్పుగా మాట్లాడుతూ మీ పాపాలను పెంచుకుంటారు?”
సరోజ కోపంగా ' ఫోన్’ పెట్టేసి యామిని దగ్గరకు వచ్చింది.
"ఇప్పుడు నేను తప్పుగా ఏం మాట్లాడేనే?"
"తప్పే...నువ్వు ఇలా మాట్లాడటం చాలా తప్పు"
"నువ్వు చేసేది మాత్రం కరెక్టా? బయట నేను తల ఎత్తుకు తిరగలేకపోతున్నాను"
"అంత పెద్ద పాపం నేనేం చేశాను?"
“ఎవత్తో విసిరి పారేసిన ‘పాపపు మూటను’ఇలా ఇంట్లోకి తీసుకొచ్చావే...ఇది పాపం కాదా?"
"ఏమ్మా...ఒక ప్రాణాన్ని కాపాడటం పాపమా?"
"బాగా కాపాడావులే! నీ మూలంగా మన కుటుంబ గౌరవం గాలిలో కలిసిపోయింది. ప్రశాద్ వాళ్ళ అత్తగారు ' ఫోన్’ లో మాట్లాడిన మాటలకు ఇంకొకరైతే దేంట్లోన్నా దూకి చస్తారు. నువ్వు దీన్ని ఎప్పుడు బయటకు పంపిస్తావో అప్పుడు వాళ్ళు మీ వదినని మనింటికి పంపిస్తారట"
"ఏమ్మా! వదిన మనింటికి రావటానికీ, ఈ పాపకూ ఏమిటమ్మా సంబంధం?"
"అదికూడా నేనే చెప్పాలా?...ఊరందరినీ పిలిచి అత్తగారింట్లో శ్రీమంతం చేసుకుని, పుట్టింటికి వెళ్ళి బిడ్డని కన్నది మీ వదిన. ఈ పాప ఏదైనా రాకూడని వ్యాధితో వచ్చుంటే?"
"అమ్మా..."
“ఈ పాప ఇక్కడుంటే, వదిన ఎలా తన బిడ్డను ఈ ఇంటికి తీసుకు వస్తుంది? నీకు నువ్వు చేసేదే కరెక్ట్. మిగిలినవాళ్ళ గురించి ఆలొచిస్తావా...ఆలొచించుంటే ఇలాంటి పని చేస్తావా?"--- సరోజ మాట్లాడుతుంటే యామినికి తల నొప్పిగా అనిపించింది.
రెండు రోజులుగా జరుగుతున్న వివాదంతో మనసు భారమై...సమాధానం చెప్పటానికి మనసు లేక...పాపను తీసుకుని తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. వేడినీళ్ళు పోసి పాలు కలిపింది.
"రారా బుజ్జీ...పాలు తాగేసి మీరు కాసేపు నిద్ర పొండి. నేను స్నానం చేసి వస్తాను...సరేనా?" అంటూ పాపను వొళ్ళో పడుకోబెట్టుకుని పాల బాటిల్ ను పాప నోటికి అందించింది.
యామిని ముఖాన్నే చూస్తూ బాటిల్ లొని పాలను తానుగా తాగటం మొదలుపెట్టింది పాప. యామిని పాపను చూసి నవ్వుతూ పాప తలమీదున్న పట్టు రంగు వెంట్రుకలను సరిచేస్తుంటే, దిండు క్రింద ఉన్న సెల్ ఫోన్ మోగింది.
ఫోన్ తీసింది.
దివాకర్!
మౌనంగా చెవి దగ్గర పెట్టుకుంది.
"హలో!"
“……..”
"నీతో కొంచం మాట్లాడాలి"
"మాట్లాడు"
"ఫోనులో కాదు. నేరుగా. లీవు చెప్పి రా. నేను టాంక్ బండ్ పార్కులో మనం ఎప్పుడూ కలుసుకునే చోట ఉంటాను. "
"ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను"
"ఎందుకని...అఫీసుకు వెళ్ళలేదా?"
"పాపను వదిలేసి ఎలా వెళ్ళటం? కాబట్టి లీవు పెట్టేను"
"పాపా...?" అది ఇంకా నీదగ్గరే ఉన్నదా?"
"అవును..."
"ఏం పని చేస్తున్నావు యామినీ?" ఫోన్లోనే కోపంగా అరిచాడు. యామినీ మొహం చిట్లించుకుంది.
"ఏమిటి దివాకర్....నువ్వు కూడా మా అమ్మలాగా మాట్లాడుతున్నావు?"
"ఇంకెలా మాట్లాడమంటావు? ఇక్కడ నేను నీకొసం మా అమ్మతో పొరాటం చేస్తున్నాను. నువ్వేంట్రా అంటే సమస్యను పక్కనే పెట్టుకున్నావు? ఎప్పుడు దాన్ని విసిరి పారేస్తావు?"
"ఏమిటి దివాకర్...పాపాలు పెరగను పేరగను...మంచి చేసేవాళ్ళందరూ పాపాత్ములుగా కనబడుతున్నారా? ఒక బిడ్డను కాపాడినందువలన అందరూ నేనేదో పాపం చేసినట్లు మాట్లాడుతున్నారు. ‘విసిరి పారేసై’ అని నిర్లక్ష్యంగా చెబుతున్నావు! అంటే...ఆ బిడ్డ యొక్క తల్లి చేసిన పాపాన్నే నన్నూ చేయమని చెబుతున్నావా?"
”పాపమో-పుణ్యమో...ఇప్పుడు మనకి మన జీవితమే ముఖ్యం. మొదట అది అర్ధంచేసుకో"
"సారీ... నేను నీలాగా స్వార్ధంగ ఆలొచించలేను"
"యామినీ?"
"నేనూ, స్వార్ధపరురాలిగా ఉండుంటే రెండు సంవత్సరాలకు ముందు దెబ్బలతో రోడ్డు మీద పడున్న నిన్ను కాపాడి ఆసుపత్రిలో చేర్పించే దానిని కాను. ‘ఎవరో పడున్నారు...నాకెందుకులే' అని వెళ్ళిపోయేదాన్ని. అలా వెళ్ళానా...? నిన్ను కాపాడలా...?"
"........................."
“అప్పుడు నీకు నా సహాయ గుణం నచ్చింది. ఇప్పుడెలా నచ్చకుండా పోయింది? ఉద్యోగంలో జేరి నాలుగు డబ్బులు వెనుక వేసుకునేటప్పటికి మానవత్వం చచ్చిపోయిందా?"
"మూర్ఖంగా మాట్లాడకు! సహాయం చేయటాన్ని తప్పు అని చెప్పటంలేదు. కానీ, ఇలా ఇంట్లోకి తీసుకు వచ్చి ఉంచుకున్నావే?"
“అది పువ్వు లాంటిది. పాపం. పుట్టిన వెంటనే తల్లిని విడిపోయింది. మరణం వరకు వెళ్ళి తిరిగి వచ్చింది. రెండు రోజులైనా ఆ బిడ్డను నా పరామర్శలో ఉంచుకుని కాపాడాలని అనుకున్నాను. అది తప్పా?"
"అర్ధం లేకుండా మాట్లాడకు! ఇప్పటికే మా అమ్మ నీమీద కోపంగా ఉన్నది. నేనే ఎంతో పోరాడి ఆమెను నమ్మించాను. ఇంకా నువ్వు..."
"నమ్మించావా?"
"అవును"
"ఏమని...?"
"ఆ బిడ్డ నీ బిడ్డ కాదని"
"వో! అప్పుడే....ఈ బిడ్డ నా బిడ్డే అని మీ అమ్మ తీర్మానించేసిందా?"
"అమ్మను ఎందుకు తప్పు పడతావు? నువ్వు చేసిన కార్యం అలాంటిది! పెళ్ళి చూపుల రోజున కూడా నువ్వు ఆఫీసుకు లీవు పెట్టలేవా?"
“ఆఫీసులో పని ఎక్కువ. నువ్వు హటాత్తుగా పెళ్ళిచూపులకు వస్తున్నావని చెప్పావు? హటాత్తుగా ఆఫీసుకు లీవు వేయగలనా? నా పనులన్నీ సగంలో ఆగిపోయున్నాయి"
"ఇప్పుడు మాత్రం ఎలా లీవు పెట్టగలిగావు?"
"అదోచ్చి..."
"అవును...నాకు తెలియక ఆడుగాతున్నాను. నీకెందుకు ఆ బిడ్డ మీద అంత ఇంటరెస్టు?"
"నాకూ హృదయం ఉంది. దాంట్లొ ఇంకా తడి ఉంది. కష్టపడుతున్న వాళ్ళకు సహాయపడాలనే జాలి ఉంది"
"అలాగైతే నీ హృదయంలో నేను లేనా?"
"వూరికే సినిమా డైలాగులు మాట్లాడకు! ప్రమాదంలో చిక్కుకున్న నిన్ను కాపాడినందుకు...నువ్వు నన్ను ఇష్టపడ్డావు. నీ నిజాయతి అప్ప్రోచ్ నాకు నిచ్చింది. 'పెద్దలు అమోదిస్తే' మనం పెళ్ళిచేసుకుందాం అని మాట్లాడుకుని నిర్ణయించుకున్నాం. నేను ఆ నిర్ణయంలో నుంచి మారలేదు. నువ్వూ, మీ వాళ్ళూ నన్ను అర్ధం చేసుకోకుండా కోపగించుకుని వెళ్ళిపోయారు"
"వెళ్ళీపోక...! నువ్వు ఏం కార్యం చేసుకొచ్చి నిలబడ్డావో నీకు అర్ధం కాలేదా?"
"నాకు అర్ధం కాలేదు. ఒక చిన్న ప్రాణాన్ని కాపాడినందుకు ఎందుకు ఒక హత్య చేసి వచ్చినట్లు ఆందోళన పడతావు?"
"వితండావాదం చేయకు. చివరగా ఏం చెప్పదలుచుకున్నావు?"
"చివరగా ఏం చెప్పదలచుకున్నానా?”
“అవును. నీకు ఆ బిడ్డ ముఖ్యమా? లేక...నేను ముఖ్యమా?"
"దివాకర్...!"
“ఆ బిడ్డే ముఖ్యమనుకుంటే నన్ను మర్చిపో. నేను కావలనుకుంటే...ఈ నిమిషం ఆ బిడ్డను ఎక్కడన్నా పారేసిరా. నీ నిర్ణయం వెంటనే తెలుసుకోవాలి" అతను ఖచ్చితంగా చెప్పేటప్పటికి, యామిని మనసు చెదిరింది. నోటి నుండి పాలు కారుతున్నా, అమాయకంగా పడుకోనున్న ఆ పాప ను చూసింది.
'ఆదరించబడ్డ చోట, ఆప్యాయమైన పరామర్శింపులో బద్రంగా ఉన్నాము’ అనుకుంటూ హాయిగా నిద్రపోతోంది. పాలు కారుతున్న బుగ్గలను మృధువుగా తుడిచింది. చిన్న బెదురుతో కళ్ళు తెరిచి చూసింది పాప. యామిని ముఖం కనబడగానే ప్రశాంతంగా మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయింది.
దూది లాంటి మెత్తని వేళ్ళతో తన వెళ్ళను పట్టుకున్న ఆ పాను చూసి యామిని హృదయం కరిగింది. మాతృత్వ భావము ఆమెలో కలిగింది. ఎడం చేత్తో పాపను హత్తుకుంటున్నప్పుడు దివాకర్ గొంతులో కఠినత్వం తెలిసింది.
"ఏయ్...లైన్లో ఉన్నావా...లేవా"
"ఉన్నాను...చెప్పు"
"నిర్ణయం నువ్వే చెప్పాలి"
"నేను కొంచం ఆలొచించుకోవాలి"
"ఎందుకు?"
"నువ్వు చెప్పినట్లు ఈ పాపను వెంటనే ఎక్కడా విడిచిపెట్టలేను. కొంచం..."
"అయితే...నీకు నేను అక్కర్లేదు?"
"నేను అలా చెప్పలేదు. ఎందుకు అవసరపడతావు?"
"నేను ఈ నెలే దుబాయ్ కి వెళ్ళితీరాలి. అంతలోపు మనం పెళ్ళిచేసుకోవాలి. ఆలొచించిటానికి టైము లేదు. ఇప్పుడే నిర్ణయం చెప్పు”
పెళ్ళి చేసుకున్న వెంటనే దుబాయ్ కి వెళ్ళాలా? కానీ...నాకు 'పాస్ పోర్ట్' అదీ లేదే?"
"నీకెందుకు 'పాస్ పోర్ట్'? అమ్మావాళ్ళతొనేగా నువ్వు ఉండబోయేది? నేను ఒక్కడ్నే దుబాయ్ వెల్తున్నాను. ఒక మూడు సంవత్సరాలు మాత్రమే. ఆ తరువాత ఇక్కడకొచ్చి వ్యాపారం మొదలుపెట్టాలి.నేను వచ్చేంతవరకూ నువ్వే నా కుటుంబాన్ని చూసుకోవాలి"
"ఓ...అన్ని నిర్ణయాలూ నువ్వే తీసేసుకున్నావా?"
"అవును! నువ్వు ఉద్యోగం మానేయి యామిని. ఇళ్ళు, అమ్మా-నాన్నలను చూసుకొవటానికే నీకు టైము చాలదు. అలాంటప్పుడు ఉద్యోగానికి ఎలా వెడతావు? ఇద్దరికీ కలిపి నేను సంపాదిస్తున్నాను కదా...?"
దివాకర్ మాట్లాడుతూ వెల్తుంటే... యామిని గట్టిగా కళ్ళు మూసుకుని ఆలొచించింది. కొద్ది నిమిషాల తరువాత చటుక్కున కళ్ళు తెరిచింది. దివాకర్ ఇంకా లైన్ లోనే ఉన్నాడు.
"సారీ...నా వల్ల కాదు"
"ఏది నీ వల్ల కాదు?"
"ఇప్పుడు చెప్పిన రెండింటినీ విడిచిపెట్టటం నా వల్ల కాదు"
"ఏ రెండూ...?"
"పాపనూ, ఉద్యోగాన్నీ రెండిటినీ విడిచిపెట్టలేను. నువ్వు నీ ఇష్టమొచ్చినట్లు ఏ నిర్ణయం తీసుకున్నా సరే. 'గుడ్ బై'!" అంటూ కచ్చితంగా చెప్పేసి ఫోన్ కట్ చేసింది.
*********************************************PART-4*******************************************
ఇల్లు తుడిచి, సాంబ్రాణి పొగను వేసి ఇళ్ళంతా వ్యాపింప జేస్తున్న సరోజ, వాడిన మొహంతో వచ్చిన భర్తను, బిడ్డను గుండెలకు హత్తుకుని వచ్చిన కూతురుని చూసి బిత్తరపోయింది.
"ఏమండీ...ఏమైంది? బిడ్డను పోలీసులకు అప్పగించలేదా? ఏయ్...నువ్వెందుకే బిడ్డను నీతోనే తీసుకు వచ్చావు?"
"అమ్మా...పాప గుడ్డను తడిపింది. మార్చి తీసుకు వస్తాను "- - అంటూ మామూలుగా గదిలోకి వెళ్ళింది. తల్లి గందరగోళంగా చూడగా, రామారావు చిన్నబోయిన ముఖంతో వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.
"ఏమండీ...పోలీసు స్టేషన్ కు వెళ్ళలేదా?"
"వెళ్ళాము"
"మరెందుకు బిడ్డను ఇవ్వకుండా వచ్చారు?"
"సరోజా! వాళ్ళు...మేము చెప్పింది నమ్మలేదు".
"ఎందుకని?"
“మనం చెప్పేలాగా వాళ్ళకు ఎటువంటి ఫిర్యాదు రాలేదట. నిజంగానే ఈ బిడ్డ రోడ్డులో పడుందా అని గుచ్చి గుచ్చి అడిగారు"
"అయ్యో తరువాత...?"
"ఈ బిడ్డను అనాధ బిడ్డ అంటే నమ్మనంటున్నారు"
"ఎలా నమ్ముతారు...? ఇది ఆ బిడ్డకు స్నానం చేయించి, తల దువ్వి, పౌడర్ అద్ది, బుగ్గన చుక్క పెట్టి, మంచి డ్రెస్ వేసి, సింగారించి, పట్టుపరుపులాంటి గుడ్డలో తీసుకువెడితే ఎలా నమ్ముతారు?"
"నమ్మకపోయినా పరవాలేదు. తప్పు తప్పుగా మాట్లాడారు"
"ఏమని?"
"ఏమ్మా...నువ్వే బిడ్డను కనేసి, ఇప్పుడు అనాధ అని తీసుకువచ్చి వదుల్తావా? పెంచటానికి దారిలేని దానివి ఎందుకమ్మా కన్నావు? నీ అవసరానికి కనేసి...పరువు, మర్యాదకు భయపడి ఒక పసి బిడ్డను అనాధ చెయ్యబోతావా? నీలాంటి ఆడవాళ్ల వలనే అనాధశరణాలయాలు నిండి పొంగిపొతున్నాయి"
“ఆడ పిల్ల కదా! దాని భవిష్యుత్తు గురించి ఆలొచించావా? రేపు అది పెద్దదై నిలబడ్డప్పుడు, తల్లి తోడు లేక ఎంత కష్టపడుతుందో ఆలొచించావా? మీకు శరీర శుఖం మాత్రమే పెద్దగా తెలుస్తోందా?' అని అడుగుతున్నారు..."
"చాలండీ...చాలు"-- సరోజ చెవ్వులు మూసుకొన్నది.
"దీనికంటే ఎక్కువగా ఒక మహిళా పోలీసు సరోజా, ఆ మాటలు ...చెప్పటానికే నాకు వొళ్ళంతా గగుర్పుగా ఉన్నది"
"ఇది ఏమైనా సమాధానం చెప్పిందా?"
"ఆ...చెప్పిందిగా, 'క్షమించండి మేడం'. ఈ బిడ్డ నా బిడ్డే. నేనే పెంచుకుంటాను అని చెప్పి వచ్చేసింది"
"ఏమి కర్మమండీ ఇది?" తలమీద బాదుకుంటూ చెప్పింది సరోజ.
"నేను ఎంతో చెప్పి చూశాను. అది వినిపించుకోవటం లేదు"
"వినిపించుకోకపోతే అలా వదిలేయటమేనా? ఏది అది?"
"యామినీ... యామినీ..." అరుచుకుంటూ ఆవేశంగా కూతురి గదిలోకి వెళ్ళగానే, చూపుడు వేలును పెదవులమీద పెట్టుకుని "ఉష్" అంటూ తల్లి ఆవేశాన్నంతా అణిచివేసింది యామిని.
"ఉష్...శబ్ధం చేయకమ్మా. పిల్ల ఇప్పుడే నిద్రపోయింది"
"ఒసేయ్...పాపీ! నీకు బుర్రలో ఏమైనా ఉన్నదా? ఆ రోజే నెత్తీ నోరు కొట్టుకున్నానే! నా మాట విన్నావా?"
"ఎందుకమ్మా అలా కేకలేస్తున్నావు?"
"ఎందుకు అడగవే? పోలీసులు నమ్మకపోతే ఏమిటిప్పుడు? ఏదైనా అనాధ ఆశ్రమంలో తీసుకు వెళ్ళి పడేసి వచ్చుండొచ్చు కదా? ఇలా తిరిగి ఇంటికి తీసుకు వచ్చావే...?"
"అమ్మా...నీ మాట కోసమే తీసుకువెళ్లాను. కానీ, అక్కడ ఆ 'మేడం' చెప్పిన తరువాతే ఈ పాప ఇంకా ఎన్నికష్టాలు ఎదుర్కోవాలో అర్ధమయ్యింది. పాపం...ఆడపిల్లకు తల్లి యొక్క తోడు, సంరక్షణ ఎంత ముఖ్యమో నీకు తెలియదా అమ్మా?"
"ఒసేయ్...అది పాపను కన్న తల్లి ఆలొచించి ఉండాలి"
ఒకతికి రాయి లాంటి హృదయం ఉన్నదని, మనమూ అలాగే ఉండాలా?"
"ఓసేయ్..."
"ఇంకా కొన్నిరోజుల్లో అది పెరుగుతుంది. దానికి మంచి చెడు చెబుతూ పెంచాలి. చదివించాలి. వయసుకు వచ్చినప్పుడు రక్షణగానూ, పక్క బలంగానూ నిలబడాలి. అది ఇష్టపడ్డ చదువును చదివించాలి. సమాజంలో అందరూ గౌరవించే విధంగా దాన్ని ఎత్తులో ఉంచాలమ్మా.
తరువాత పెళ్ళి వయసు రాగానే అల్లుడిని వెతకాలి…పెళ్ళి, పదహారు రోజుల పండుగ, శ్రీమంతం, ప్రసవం, బారసాల అని ఎన్నో సంబరాలు ఉన్నాయమ్మా. అన్నిటికీ తల్లి కచ్చితంగా కావాలి. నేను దానితో ఉండే తీరాలి.
దుర్దృష్టకరంగా కొంతమంది అమ్మాయలకు తల్లి లేకుండా పోతుంది. తల్లి ప్రేమ, అభిమానం, సంరక్షణ దొరకక వాళ్ళు పడే కష్టాలు నా కళ్ళతో చూశానమ్మా. అలాంటి కష్టం ఈ పాపకు రాకూడదు"
"యామినీ..."
"పుట్టుకతో ఇది ఒక అనాధ అయ్యుండొచ్చు. కానీ, దీన్ని అనాధాగా పెరగనివ్వను. ఇక నేనే దీనికి అమ్మ. ఇదే దాని ఇళ్లు. ఈ తల్లి ఒడిలో, తాత-అమ్ముమ్మల ప్రేమలో నా బిడ్డ సంతోషంగా పెరగుతుంది..."
"నోరు మూసుకో!"….చాలా కఠినంగా చెప్పింది సరోజ.
"అమ్మా...?"
"పాప...పాప అంటూ దాని గురించే మాట్లాడుతున్నావే! నీ గురించి, నీ జీవితం గురించి, నిన్ను కన్నవాళ్ళను గురించి, వాళ్ళు ఎంత ఏడుస్తారో, వారి బాధ్యతలు, వాళ్ళ ఆశల గురించి, నీ కుటుంబం గురించి ఆలొచించావా...? కన్నవారి ఆశలను, కలలను తీర్చటం పిల్లల బాధ్యత. అది తీర్చకపోగా వాళ్ళ మనసుకు మరింత కష్టాలను తెచ్చిపెట్టట్టం న్యాయమా?"
"......................."
"ఇప్పటికే చుట్టుపక్కల వాళ్ళు, పిల్లను ఇచ్చిన ఇంట్లోని వాళ్ళూ, పిల్లను తెచ్చుకున్న ఇంట్లోని వాళ్ళూ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాం. రెండు రోజులకే ఇంత కష్టంగా ఉందంటే... నువ్వు జీవితాంతం ఉంచుకుంటాను అంటున్నావే! ఇది సాధ్యమేనా?"
“ఎందుకు సాధ్యపడదు? మనం ఉరుకొసం జీవించ కూడదు. మన కోసం జీవించాలి"
"ఊరుతో కలిసి జీవించటమేనే జీవితం. ఊరుతో విరోధం పెట్టుకోవచ్చు, బంధుమిత్రులతో విరోధం పెట్టుకోగలమా? మీ అక్కయ్య పరిస్థితిని ఆలొచించించి చూడు? దాని అత్తగారింట్లో ఏమేమి మాట్లాడతారో?"
"అమ్మా...నేనేమీ తప్పుడు మార్గంలో వెళ్ళి బిడ్డను కని రాలేదే! ఆదరణ లేని బిడ్డకు జీవితం ఇస్తున్నాను. న్యాయంగా చూస్తే నేను చేస్తున్న పనిని అందరూ మెచ్చుకోవాలి"
"మెచ్చుకుంటారు...మెచ్చుకుంటారు! నా భార్య అడుగుతున్న ప్రశ్నలకే సమాధానం చెప్పలేకపోతున్నాను" అంటూ లోపలకు వచ్చిన ప్రశాద్ ను చూసిన వెంటనే యామిని మొహం మారింది.
"అన్నయ్యా?"
"ఇలా చూడు...ఇలాంటి విప్లవాత్మక పనులన్నీ సినిమాలకు, కథలకు సరిపోతుంది. యధార్ధానికి సరిపోదు"
"ఇదేమీ విప్లవాత్మకమైన పనికాదు. మానవ స్వభావం. మనసులో దయ, జాలీ ఉన్న వాళ్ళు చేసే సాధారణ సహాయం"
"అది ఒంటరిగా ఉన్న మనిషి చెయ్యొచ్చు. లేకపోతే జీవితంలో అన్నీటినీ పోగొట్టుకొని ఒంటరి అయుపోయిన మనిషి చెయ్యొచ్చు. కానీ, నువ్వొ....నేనో చెయ్యలేము"
"ఎందుకు చెయ్యలేము?"
“మనమంతా ఒక కుటుంబం. బంధు మిత్రులనే వలలో చిక్కుకోనున్నాం యామిని. వాళ్ళను కాదని ఏమీ చెయ్యలేము"
"అందుకని...?"
"మాట్లాడకుండా నేను చెప్పేది విను. నువ్వు మామూలుగా పనికి వెళ్ళిపో...దీన్ని నేను చూసుకుంటాను"---అంటూ నిదానంగా చెప్పిన ప్రశాద్ మాటలకు కంగారు పడ్డది.
"అన్నయ్యా! ఏం చెయ్యబోతావు?"
"కంగారుపడకు....బిడ్డను చంపను. నేనూ పిల్లలను కన్న వాడినే"
"ఇంకేం చెయ్యబోతావు?"
"నాకు తెలిసిన ఒకాయన 'కారుణ్య గృహం' నడుపుతున్నాడు. అతని దగ్గర వదిలేద్దాం. అక్కడ ఇలాంటి పాపలు చాలా ఉన్నారు...వాళ్ళతోపాటు కలిసి ఇది కూడా పెరగనీ"
"నువ్వు...దీని వర్తమాన కాలం మాత్రమే చూస్తున్నావు అన్నయ్యా! నేను భవిష్యత్తు గురించి ఆలొచిస్తున్నాను”
"మొదట నీ భవిష్యత్తు గురించి ఆలొచించు...ఆ దివాకర్ ఫోన్ చేసినప్పుడు నువ్వు నిర్లక్ష్యంగా మాట్లాడావుటగా?"
"దివాకర్ ఒక స్వార్థపరుడు. ఆదిపత్య మనోభావం కలిగినవాడు. అతన్ని నా భవిష్యత్తుగా ఆలొచించటం మూర్ఖత్వం"
"అయితే రమేష్ ను పెళ్ళిచేసుకో! వాడికేం తక్కువ? సొంత మామయ్య కొడుకు...నీమీద చాలా ప్రేమగా ఉంటాడు"
"అమ్మా.....ఇప్పుడు సమస్య నాకు పెళ్ళిచేయడం గురించి కాదు. ఈ బిడ్డకు సంరక్షణ..."
"సమస్యే ఈ పాపే కదా! మొదట దాన్ని నా దగ్గర ఇవ్వు. ఈ రోజే వెళ్ళి విడిచిపెటి వచ్చేస్తాను"--... ప్రశాద్ గుడ్డ ఊయలలొ నిద్ర పోతున్న పాపను ఎత్తుకోగా, ఆ స్పర్శకు ఉలిక్కిపడిన పాపకు నిద్ర చెదిరిపోయింది.
"ఇవ్వు నా బిడ్డను...!”- ఆవేశంగా అతని దగ్గర నుండి పాపను లాక్కుని తన గుండెలకు హత్తుకుంది యామిని. గ్రద్ద దగ్గర నుండి తన పిల్లను కాపాడుకున్న కోడిలాగా చిరుత వేగంతో ఉన్న యామిని ని చూసి ప్రశాద్ మాత్రమే కాదు... సరోజ కూడా హడలిపోయింది.
*********************************************PART-5*******************************************
కుటుంబ శభ్యులందరూ కలిసి ఒక చోట కూడి ఎవరికి తోచిన సలహా వారు ఇస్తున్నా, వాటిని పట్టించుకోకుండా బయలుదేరటానికి సిద్దమయ్యింది యామిని. బట్టలను సూట్ కేసులో సర్ధుతున్న ఆమె భుజం పట్టుకుని ఆవేశంగా తనవైపు తిప్పాడు పెద్ద కొడుకు సుధాకర్.
"మేమందరం ఇంత దూరం చెబుతున్నా, ఏమీ పట్టించుకోకుండా నీపాటికి నువ్వు బయలుదేరటానికి అర్ధమేమిటే?"
"ఇంత జరిగిన తరువాత-ఈ ఇంట్లో ఉండలేను అనేదే అర్ధం"
"ఓహో...అంత దూరం వెళ్ళిపోయావా? ఎక్కడికి వెల్దామని నీ ఉద్దేశం?"
"ఎక్కడికో వెల్తాను! ఈ విశాలమైన ప్రపంచంలో ఏదో ఒక మూలలో నాకూ, నా బిడ్డకు చోటు లేకుండానా పోతుంది?"
"విన్నారా నాన్నా మీ కూతురు చెప్పేది?"
"వింటూనే ఉన్నాను. ఇంకా ఏమేమి వినాలని ఈ నుదుటి మీద రాసుందో?"
"ఇలా చెబితే ఎలా మామయ్యా? ఇంట్లో నుండి వెళ్ళేది ఇదొక్కత్తే కాదు...ఈ కుటుంబ పరువు, మర్యాద కూడా"
"అవి ఎప్పుడో పోయినై? ఇంకా ఏముంది పోవటానికి?" అన్నది చిన్న కోడలు.
"ఆడపిల్లకు ఎందుకింత పట్టుదల? ఎవరో కని పారేసిన బిడ్డ కోసం...మొత్త కుటుంబాన్నీ దులిపేసుకుని వెళ్ళేంత ధైర్యం ఎక్కడ్నుంచి వచ్చింది?"
"ఇంకెక్కడ నుండి వస్తుంది? చేతిలో చదువు ఉంది. మంచి ఉద్యోగం ఉంది. ఇవి ఉంటే ధైర్యం రాకుండా ఉంటుందా?"
"అదేమిటి...చదువుకుంటేనో, ఉద్యోగ్యం చేస్తేనో మాత్రమే మాకు ధైర్యం వస్తుందా? ఈ చదువు, ఉద్యోగం లేకపోయినా నా వల్ల ఈ బిడ్డను కాపాడటం కుదురుతుంది" చెప్పింది యామిని.
"ఎలా కాపాడుతావు?"
"ఉద్యోగానికి వెళ్ళే సంపాదించుకోవాలా? కూలీ పనిచేసుకుని కూడా సంపాదించుకోవచ్చు. బిడ్డ కొసం ఏ పనైనా చేస్తాను"
"నువ్వు చేస్తావే! సంపాదిస్తే మాత్రం చాలా? ఒక్కదానివే ఎలా జీవిస్తావే? అందులోనూ మెడలో తాలి లేకుండా చేతిలో ఒక బిడ్డతో వెళ్ళి నిలబడితే...ఎక్కడా నీకు ఇల్లు దొరకదు. ఒకవేల దొరికినా...ఈ సమాజం నిన్ను ప్రశాంతంగా వదులుతుందా...ప్రశ్నలు అడిగే చంపేస్తుంది"
"హూ...కన్నవాళ్ళూ--ఇన్ని సంవత్సరాలు నాతొనే పెరిగిన తోడబుట్టిన వాళ్ళూ...మీరే ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు, సమాజం అడగబోయే ప్రశ్నలకు బాధపడితే కుదురుతుందా?” ఎదురు ప్రశ్న వేసింది యామిని.
"నీ మీద మాకు ప్రేమాభిమానాలు ఉన్నందువలన... నిన్ను ప్రశ్నలు అడిగే హక్కు మాకు ఉంది”
"మీ ప్రేమాభిమానాలు నాకు అర్ధం కాక కాదు. అదే ప్రేమాభిమానాలు నా బిడ్డ మీద నాకు ఉన్నది"
"అదేమిటి నీ బిడ్డ...నిజంగా నువ్వే కన్నట్లున్నావే?" అంటూ అడిగిన ప్రశాద్ భార్య వైపు కోపంగా