ప్రేమ కర్పూరం...(పూర్తి నవల)
ప్రేమ కర్పూరం (పూర్తి నవల)
కొన్ని సమయాలలో...కొంతమంది మనుష్యుల వలన...కొన్ని పరిస్థితుల వలన ఏర్పడే సమస్యలను చెప్పే నవల ఇది! ఎవరినైనా అర్ధం చేసుకోవటం వరం. ఎవరినీ అర్ధం చేసుకోవటానికి ఇష్టపడకపోవటం అనేది వైరాగ్యం.
ప్రేమ పుట్టటానికి ...కారణాలు వెతకరు. కానీ పెళ్ళిళ్ళు జరగటానికి పలు వందల కారణ కార్యాలను అన్వేషించేటప్పుడు...ప్రేమ ఎలా గాలిలో ఊగుతుంది అనేది ఇంపుగా చెప్పటానికి ప్రయత్నించాము.
వ్యర్ధాలు కాలితే గాలి చెడిపోతుంది. కర్పూరం కాలితే...గాలి సువాసన వేస్తుంది. అదేలాగా ప్రేమ వ్యర్ధంలా కాలిపోతే మనసులు చెడిపొతాయి. కానీ అదే ప్రేమ కర్పూరంలా వెలిగితే మనసులు సువాసనతో నిండిపోతాయి. ఆదే ప్రేమ కర్పూరం.
మీ అభిప్రాయలను మనసారా పంచుకోండి. తెలుసుకోవటానికి ఎదురు చూస్తున్నాము.
కథా కాలక్షేపం టీమ్
*****************************************************************************************************
PART-1
ఎక్కడ నుంచి
ఇన్ని మేఘాలు
గుమికూడి వచ్చినాయో
తెలియటం లేదు!
కొద్ది సేపటి
వరకు ప్రకాశవంతంగా
ఉన్న ఆకాశం...నిమిషంలో
మబ్బు రాసుకుని, చల్లటి
గాలి వేయటం
మొదలయ్యింది. హాయిగా
ఉన్న చల్లదనం, నేత్రా మనసులో
అర్ధంకాని సంతోషాన్ని
ఏర్పరిచింది. ఆమె
సంతోషానికి కారణం
ఇది మాత్రమే
కాదు...అమెరికా
నుండి ఆకాష్
వస్తున్నాడు.
అతన్ని విడిచిపెట్టి
ఉన్న ఈ
ఎనిమిదేళ్ళలో నేత్రా
ఎన్నో తుఫానల లో చిక్కుకుంది.
ఆకాష్! ఆమె
సొంత మేనత్త
కొడుకు. మావయ్య
హఠాత్తుగా మరణించిన
తరువాత అత్తయ్య, ఆకాష్
వీళ్ళ ఇంట్లో
ఆశ్రయం కోరి
వచ్చి దిగారు.
ఆ సమయంలోనే
ఆకాష్ కాలేజీ
చదువులోకి అడుగుపెట్టాడు.
తండ్రి అతన్ని
మరోసారి పరామర్శించి, ధైర్యం
చెప్పి లోపలికి
తీసుకు వెళ్ళారు...తల్లి, వాళ్ళిద్దర్నీ
చూసి మూతి
ముడుచుకుని, మూడు
వంకర్లుగా పెట్టి, మొహం
తిప్పుకుని వెళ్ళిపోయింది.
నేత్రాకి తల్లి
అలా చేయడం
కష్టం అనిపించింది.
కానీ తల్లి
స్వభావాన్ని ఎవరూ
మార్చలేరే?
బాగా బ్రతికిన
వాళ్ళు హఠాత్తుగా
ఏమీ లేని
వారు అయిపోతే
ఇలాగే ఉంటుంది.
బంధువుల మొహాలు
ముడుచుకుపోవటం!
అందులోనూ భర్త
వైపు వారైతే
మరింత ఎక్కువగా
ఉంటుంది. తల్లి
సరాసరి ఆడమనిషే.
ఎవరిని చూసినా, వాళ్ళు
కట్టుకున్న చీర
ఖరీదు ఎంతుంటుంది, వాళ్ళు
వేసుకున్న నగల
విలువ ఎంతుంటుంది
అని మనసులోనే
లెక్క వేసుకుంటుంది.
వాళ్ళు కారులో
వచ్చుంటే
చెప్పనే అక్కర్లేదు.
అదే సమయం
వచ్చిన వాళ్ళు
తన కంటే
డబ్బుగలవారుగా
ఉంటే మొహం
వాడిపోతుంది.
‘ఎక్కడా
ఉండని డైమండ్
నెక్లస్...పెద్ద
రంగూన్ డైమండా!
అది వేసుకుని
కులికితే చాలా? మాకు
డైమండ్ పడదని
చెప్పి వచ్చాసాను’ - తండ్రి
దగ్గరకు వచ్చి
సనుగుతుంది.
“జానకీ
నువ్వు సరైన
పిచ్చిదానివే... ‘డైమండ్
పడదు అంటూనే, దాన్ని
ఎందుకు చెవులకు
పెట్టుకున్నావు?’ అని
ఆ ఆంటీ
అడగలేదనుకుంటా?”
“అడుగుంటే...‘ఇది
ఇండియా డైమండ్’ అని
చెప్పుంటా. మేమంతా
‘బి
ఇండియన్...బై
ఇండియన్’. మాకు
రంగూన్ డైమండ్లు
పడవు అని
చెప్పుంటాను”
తండ్రీ, నేత్రా
నవ్వును ఆపుకుంటారు.
తల్లి స్వభావం
అటువంటిది. అలాంటి
అమె దగ్గరకు
ఆశ్రయం కోరి
అత్తయ్య వచ్చుండ
కూడదు. కానీ, వేరే
దారిలేక వచ్చేసింది.
అత్తయ్య కుటుంబం
కూడా అన్ని
వసతులతో ఉండే
డబ్బున్న కుటుంబమే!
మావయ్య ‘బిజినస్’ లో
బాగా సంపాదించారు.
సంవత్సరంలో సగం
రోజులు ఇంట్లోనే
ఉండరు. చనిపోయిన
తరువాతే ఆయన
యొక్క మరొక
ముఖం బయటకు
వచ్చింది. ఆయన
కాళ్ళ దగ్గర
అత్తయ్య ఒక్కతే
కూర్చుని ఏడవలేదు, మరో
మహిళ కూడా
ఏడుస్తున్నది. అది
చూసి బంధువులందరూ
ఆశ్చర్యపోయారు.
‘పదకుండు
సంవత్సరాలు అయ్యింది!
ఈయన నన్ను
పెళ్ళి చేసుకుని...బెంగళూరులో
కాపురం పెట్టారు.
ఈయన్ని నమ్మి
ఇద్దరు ఆడపిల్లలను
కన్నాను. ఇలా
మధ్యలోనే వదిలిపెట్టి
వెళ్ళిపోయారే...నేనేం
చేయను? ఎలా
కూతుర్లను అత్తారిళ్ళకు
పంపేది’ అని నెత్తి
బాదుకుంటూ ఆమె
ఏడ్చిన ఏడుపుతో, అత్తయ్య
ఏడుపు ఆగిపోయింది.
పూల మాలలతో
పడుకోనున్న భర్తను
ఛీదరింపుతో చూసింది.
తరువాత, లేచి
లోపలకు వెళ్ళి
ఆకాష్ ను
పిలిచింది.
“మీ
నాన్న మనల్ని
మోసం చేశారురా!
నేను ఆయనకు
ఏం తక్కువ
చేసానని ఇలా...”
“ఇలాంటి
ఒక ద్రోహం
చేసిన ఆయనకు, నేను
తలకొరివి పెట్టే
తీరాలా అమ్మా?”
“అది
అప్పు...అది
తీర్చేయి. దాంతో
అన్నిటికీ ఒక
ముగింపు పెట్టేద్దాం...ఏమంటావ్?”
“సరేనమ్మా!”
“అన్నిటికీ
అని చెప్పేనే,
దానికి నీకు
అర్ధం తెలుసా? ఈ
ఇల్లు, వాకిలి, డబ్బూ
అన్నిటికీ! ఇందులో
నీకు ఎటువంటి
బాధ లేదుగా? ఇక
ఈ మనిషి
డబ్బుతో తినడం
నాకు అవమానం...ఏమిట్రా, అమ్మ
ఇలా చెబుతోందే
అని అనుకుంటే
నువ్వు దారాళంగా
ఇక్కడే ఉండిపోవచ్చు.
నేను వెడతాను”
“లేదమ్మా...నాకు
నువ్వే కావాలి”…ఆకాష్
తీర్మానంగా చెప్పాడు.
పదమూడు రోజుల
కార్యాన్ని పళ్ళు
కొరుక్కుంటూ చేశాడు.
కార్యానికి వచ్చిన
తన తమ్ముడితో
మనసు విప్పి
మాట్లాడింది అత్తయ్య.
“రమణా, మీ
ఇంట్లో మాకు
ఆశ్రయం ఇస్తావారా? నాకు
ఉచితంగా తిండిపెట్టక్కర్లేదు.
అక్కడకొచ్చి అన్ని
పనులూ చేసి
పెడతాను. నా
కొడుకు కూడా
నీకు సహాయంగా
ఉంటాడు. రెండు
పూట్లా తిండి
పెడితే చాలు”
“ఏమిటక్కా
ఇలా మాట్లాడుతున్నావు...? అది
నీ ఇల్లు.
నిన్ను కాపాడవలసింది
నా బాధ్యత.
ఎప్పుడైనా నువ్వు
రావచ్చు. ఆకాష్
చదువు గురించి
నువ్వేమీ బెంగపెట్టుకోకు.
నేనున్నాను, చూసుకుంటాను”--నాన్న
అలా చెప్పి
వచ్చిన వెంటనే, ఆయన
మీద విరుచుకుపడ్డది
అమ్మ.
“మీకు
కొంచమైనా తెలివి
ఉందా? ఇక్కడేమన్నా
డబ్బులు చెట్లకు
కాస్తున్నాయా...అందరికీ
ఇష్టం వచ్చినట్టు
పెట్టటానికి! భర్త
తప్పు చేసి
వెళ్ళిపోయాడు. ఉన్న
ఆస్తిని అవతల
పారేసి వస్తుందట...అంత
రోషం దేనికి? ఊరంతా
తెలిసి కట్టుకున్న
భార్య వదిలేసి
వస్తుందట...దొంగతనంగా
తాలి కట్టించుకున్నది
మహారాణి లాగా
ఆ ఇంట్లో
దర్జాగా ఉంటుందట.
మీ అక్కయ్యకు
తెలివి లేకపోతే...మీకైనా
ఉండాలిగా?......ఈ
కాలంలో ఆస్తి, డబ్బు
లేకపోతే గాడిద
కూడా గౌరవించదు
అని చెప్పి...అక్కడే
ఉండమని చెప్పటం
వదిలేసి, ‘ఇక్కడకు
వచ్చేయండి’ అని
తాంబూలం ఇచ్చి
పిలిచేసొచ్చారు!”
రమణ ఆమెను
మౌనంగా చూశాడు!
మనుషుల యొక్క
మనసులోని భావాలను
అర్ధం చేసుకోలేని
వాళ్ళకు అన్నీ
తప్పుగానే కనబడతాయి.
“ఇలా
చూడు జానకీ, మా
అక్కయ్య ఇక్కడికి
రావటం వలన
ఇప్పుడు నువ్వు
అనుభవిస్తున్న
సౌకర్యాలు తగ్గిపోవు.
అలా తగ్గిపోయినట్లు
నీకు అనిపిస్తే
నన్ను అడుగు...చెప్పుతో
కొట్టు! ఈ
విషయాన్ని ఇంతటితో
వదిలేయి. మా
అక్కయ్య ఇక్కడికే
వస్తుంది...ఆమె
ఇక్కడకు రాకూడదని
చెబితే నేనూ
ఇక్కడ ఉండను.
వేరే ఒక
ఇల్లు తీసుకుని
అక్కయ్యతో పాటూ
అక్కడ ఉండిపోతాను”
నాన్న ఖచ్చితంగా
కఠినమైన ధ్వనితో
మాట్లాడ---అమ్మ
నోరు మెదపలేకపోయింది.
అత్తయ్య, ఆకాష్
ఆ తరువాతి
వారమే వచ్చారు.
చిన్న సూటుకేసు.
దాంట్లో వాళ్ళిద్దరి
బట్టలు మాత్రమే
వాళ్ళు తీసుకు
వచ్చిన వస్తువులు.
అది తప్ప
అక్కడి నుండి
ఒక్క బూజు
కూడా తీసుకు
రాలేదు.
వాళ్ళ ఇద్దరి
మొహాలు చూసిన
వెంటనే అమ్మ
మొహంలో, ఆవాలూ, జీలకర్ర
పేలినై. నాన్న
లేని సమయంలో
సర్వ సాధారణంగా
వాళ్ళకు అక్షింతలు
వేయటం చేసేది.
ఆ కాలంలో
కథలలో వచ్చే
గయ్యాలి కథాపాత్ర
లాగానే కొంచం
కూడా మార్పులేకుండా
నడుచుకునేది.
అత్తయ్యతో చాలా
పనులు చేయించుకునేది!
చదువుకోవటానికి
కూర్చునే ఆకాష్
ను -- షాపులకు,రేషన్
కు అని
అటూ ఇటూ
తరిమి పంపించటంలో
అంతులేని ఆనందం
పొందేది. అయినా
కానీ, అత్తయ్య
గాని, ఆకాష్ గాని
కొంచం కూడా
తమ దుఃఖాన్ని
బయటకు కనబడనిచ్చేవారు
కాదు.
అమ్మ నిద్ర
పోతున్నప్పుడు
ఆకాష్ ప్రశాంతంగా
చదువుకుంటాడు. అమ్మకు
నిద్రా భంగం
కలుగకూడదని నేత్రా
వేడుకుంటుంది. చదువు
కుంటున్న ఆకాష్
కు టీ
కలుపుకెళ్ళి ఇస్తుంది.
అత్తయ్య ఆమెను
కావలించుకుని కళ్ళ
నీళ్ళు పెట్టుకుంటుంది.
“రమణకు
లాగానే నీకూ
మంచి మనసు!”
“అవును
అత్తయ్యా! నాన్న
కూడా అంటారు.
‘నేను
ఆయన లాగా, రవి
అన్నయ్య...అమ్మలాగా’ అని”
“రవి
సెలవులకు వస్తాడా?”
“వస్తాడు.
వస్తే...అమ్మకు
తలా తోక
అర్ధం కాదు.
వాడు వేసే
రాగాలన్నిటికీ
నాట్యం చేస్తుంది.
దీని కోసమే, వాడు
ఇక్కడుండి తల్లి
లాగా తయారవకూడదని, నాన్న
వాడిని వేలూరు
మెడికల్ కాలేజీలో
చేర్చారు”
“రవి
డాక్టర్ అయితే, నువ్వు
ఏం అవుతావు?”
“నేను
కలక్టర్ అవుతాను.
ఆకాష్...నువ్వు
ఏమౌదామనుకుంటున్నావు?”
“వంట
వాడు అవుతాడు” అమ్మ స్వరం
వెనకాల నుండి
వినబడింది.
నేత్రా భయపడి
లేచింది.
“ఏమిటే
అక్కడ బాతాకానీ?”
“నేత్రా
మాట్లాడలేదు జానకీ...నేనే
మాట్లాడించాను”
“తప్పు
చేసిన వాళ్ళకు
దండన ఇచ్చే
అలవాటు మీకు
లేనే లేదే!
అందుకే దాన్ని
తిడుతున్నా...మిమ్మల్ని
తిట్టలేక” తల్లి
పొడిచినట్టు మాట్లాడింది.
‘భర్తను
దండించలేక, పిల్లాడ్ని
పనికిరాకుండా చేస్తోంది’ అని
చెప్పకుండా చెప్పిన
అమ్మ మాటలు
అర్ధమైనా, అత్తయ్య
విసుక్కోకుండా
-- శపించకుండా దాన్ని
మౌనంగా మింగేసింది.
ఆకాష్ డిగ్రీ
చివరి సంవత్సరం
చదువులో ఉన్నప్పుడు...
నేత్రా వయసుకు
వచ్చింది. ఆ
తరువాత సమస్య
పెద్దదయ్యింది.
“వయసుకు
వచ్చిన అమ్మాయిని
ఉంచుకుని, ఈ
బండాడిని ఒకే
ఇంట్లో ఉంచుకోవటం
నాకు మంచిగా
అనిపించటం లేదు”
“ఏమిటి
జానకీ నువ్వు...
ఆకాష్ మనింటి
కుర్రాడు. ఎందుకు
వాడిని వేరు
మనిషిగా చూస్తావు? అమ్మాయల
దగ్గర మాట్లాడటానికి
కూడా సంకోచిస్తాడే”
“అదంతా
నాకు తెలియదు.
వాడు ఈ
ఇంట్లో ఉండ
కూడదు. ఈ
సారి నా
మాట వినకపోతే, నేను
ఇల్లు వదిలి
వెళ్ళిపోతాను. నాతో
పాటూ నేత్రాను
కూడా తీసుకు
వెడతాను...”
అమ్మ బెదిరించ...తండ్రి
కొంచం కంగు
తిన్నాడు. రెండు
తలల చీమలాగా
అయ్యారు. ఆయన
యొక్క క్లిష్ట
పరిస్థితిని అర్ధం
చేసుకున్న అత్తయ్య, తానే
ఆ సమస్యను
ముగించింది.
నాన్న దగ్గరకు
వచ్చి మాట్లాడింది.
“మా
ఇద్దరికీ కలిపి
ఒక గది
దొరికినా చాలురా
రమణ. అందులోనే
ఒక మూలగా
వండుకు తింటాము.
మమ్మల్ని పంపించేయి.
చాలు...నా
వలన నువ్వు
పడ్డ శ్రమ, ఏదో
రెండు సంవత్సరాలు
ఆశ్రయం ఇచ్చావు...దానికే
ఇంకా పలు
జన్మలకు నేను
నీకు రుణపడి
ఉన్నాను. ఆకాష్
కు ఇది
చివరి సంవత్సరం.
చదువు ముగిసేంతవరకు
మాత్రం సహాయం
చెయ్యి. ఆ
తరువాత వాడి
భుజాలు బలపడతాయి, ఈ
భారాన్ని మోయగలడు” --- అత్తయ్య
కన్నీటితో చేతులు
జోడించింది.
వేరే దారిలేక
నాన్న నాలుగైదు
వీధుల తరువాత, రెండే
గదులున్న ఒక
‘పోర్షన్’ లోవాళ్ళను
ఉంచాడు. తానే
అడ్వాన్స్ ఇచ్చారు.
నెల నెలా
అద్దె కూడా
ఇచ్చి పంపుతానని
చెప్పారు. నెలకు
సరిపడ వంట
సరకులు వెళ్ళి
దిగటానికి ఏర్పాటు
చేశారు. అమ్మ
దగ్గర...అద్దె
మాత్రమే ఇస్తున్నట్టు
అబద్ధం చెప్పారు.
సమయం దొరికినప్పుడల్లా
అక్కయ్యను వెళ్ళి
చూసొచ్చేవారు.
కొన్ని సంధర్భాలలో
అమ్మకు తెలియకుండా
నేత్రా కూడా
ఆయనతో వెళ్ళి
వచ్చేది. తమ
బంగళా కంటే, ఆ
ఇరుకు చోటు
నేత్రా మనసును
ఎక్కువ సంతోషపరిచింది.
పెద్ద కాంపౌండ్
లో ఒక
మూలగా ఉన్న
‘అవుట్
హౌస్’ను
మూడు పోర్షన్లుగా
చేసుంచారు.
‘అవుట్
హౌస్’ చుట్టూ
చాలా చెట్లు, మొక్కలు
ఉన్నాయి. ఒక
పెద్ద చెట్టు
క్రింద నవారు
మంచం వేసుకుని
చదువుకుంటూ ఉంటాడు
ఆకాష్. ‘ఒక
గ్లాసుడు గంజి
అయినా స్వతంత్రంగా
తాగాలి!’ అనే
మాటలు నిజమే.
వేరుగా వచ్చిన
రెండు నెలలలో
ఆకాష్ ఆకారం
కొంచం మారింది.
శరీరం ఒక
చుట్టు పెరిగి, కాస్త
తల తల
మని మెరుస్తోంది.
భుజాలు పెరిగి, ఛాతి
వెడల్పు అయ్యి, చేతులు
లావయ్యి, మీసాలు
ఒత్తుగా పెరగటంతో...తెల్లటి
శరీర రంగుతో
‘సినిమా
హీరో’ లాగా
ఉన్నాడు. ముందులాగా
అతనితో మాట్లాడలేని
ఏదో సిగ్గు
నేత్రా ను ఆడ్డుకుంటొంది.
నాన్న, ఆకాష్
తో అతని
చదువు గురించి
మాట్లాడతుంటే...
నేత్రా అత్తయ్యను
చుట్టి చుట్టి
వస్తుంది. మధ్య
మధ్యలో ఆమెకే
తెలియక ఆమె
చూపులు ఆకాష్
వైపుకు వెడతాయి.
ఆమె చూసేటప్పుడు
అతను కూడా
చూస్తే...చటుక్కున
రెప్పలు మూసుకుంటాయి.
గుండె వేగంగా
కొట్టుకుంటుంది.
ఒకరోజు ఇంటికి
వెళ్ళినప్పుడు
అత్తయ్య ఆమెతో, ‘స్కూలు’ వదిలి
ఇంటికి వెళ్ళే
దారిలో ఒకసారి
ఇటు వచ్చి
వెడతావా నేత్రా’ అన్నది.
“ఎందుకు
అత్తయ్య?”
“ఈ
రోజు ఆకాష్
పుట్టిన రోజు.
సాయంత్రం గారెలు, పాయసం
తినేసి వెళ్దువుగాని...అందుకే”
“సరే
అత్తయ్యా...ఏం
పాయసం?”
“నీకు
ఏది ఇష్టం...చెప్పు”
“మీ
అబ్బాయి పుట్టిన
రోజు కదా...ఆయనకు
నచ్చిందే చేయండి”
“వాడికి
సేమియా-పాలు
పాయసం అంటే
ప్రాణం”
“నాకూ
అదే ఇష్టం”
“సరే...అప్పుడు
వచ్చేస్తావుగా”
మరుసటి రోజు
తండ్రి లేకుండా
మొట్ట మొదటిసారిగా
అత్తయ్య ఇంటికి
వెళ్ళింది. అప్పుడు
ఆకాష్ మాత్రమే
ఇంట్లో ఉన్నాడు.
అత్తయ్య కనబడలేదు.
‘అత్తయ్య
ఎక్కడ?’ అని
అడగటానికి సిగ్గుపడింది.
నాలిక చుట్టుకుంది.
మొహం నిండా
ముత్యాలు లాగా
చెమట బిందువులు
వెలిసినై. ఆకాష్
ఆమెను చూసి
లేచి వచ్చాడు.
“లోపలికి
రా...”
“అత్తయ్య...”
“రేషన్
కు వెళ్ళింది!
నువ్వొస్తే గారె, పాయసం
ఇవ్వమని చెప్పింది.
లోపలకొచ్చి కూర్చో.
ఎందుకు నీకలా
చెమటలు పడుతున్నాయి?”
“లేదు...నేను
వెళతాను. తరువాత...అత్తయ్య
వచ్చిన తరువాత
వస్తాను”
ఆకాష్ గబుక్కున
ఆమె ముందుకు
వచ్చి ఆపాడు.
“నన్ను
చూస్తే భయంగా
ఉందా? లోపలకు
రా...నేనేమీ
నిన్ను కొరుక్కు
తినను. నువ్వు
వచ్చి వెళ్ళింది
తెలిస్తే, ‘ఎందుకురా
తినటానికి ఏమీ
ఇవ్వకుండా పంపించావు?’ అని
అమ్మ నా
మీద కోపగించుకుంటుంది”
“నేను
తరువాత నాన్నతో
వస్తానే?”
“నువ్వు
ఇప్పుడు లోపలకు
రాకపోతే ఈడ్చుకు
వెడతాను. పరవాలేదా?”
“వద్దు...వద్దు!”
“అయితే
నువ్వే లోపలకు
రా”
చిన్న వణుకుతో
లోపలకు వచ్చింది.
“ఇలా
కూర్చో...నేను
గారె, పాయసం
తీసుకువస్తాను” అంటూనే లోపలకు
వెళ్ళి, ఒక
ప్లెటులో నాలుగు
గారెలు -- ఒక
గ్లాసు నిండా
పాయసం తీసుకు
వచ్చాడు.
“తిను” అని ఆమె
ముందు జాపాడు.
ఆమెకు ఎదురుగా
ఒక ‘స్టూలు’ వేసుకుని
కూర్చున్నాడు. ఎదురుగా
కూర్చుని ఒక
విధమైన నవ్వుతో
తననే చూస్తున్న
అతని ముందు...తినలేక
తడబడింది నేత్రా.
తల వంచుకుని
కూర్చుంది.
“నిన్ను
చూస్తే డబ్బున్న
ఇంటి అమ్మాయిలాగా
తెలియటం లేదే?”
“ఎందుకని?”
“ఇంతగా
సిగ్గు పడుతున్నావు.
నీలాగా ఉన్న
వాళ్ళంతా ‘బాయ్
ఫ్రెండ్స్’ తో
‘డిస్కోత్’ అదీ, ఇదీ
అంటూ తిరుగుతూ ఉన్నారు.
నువ్వేమిట్రా అంటే
గారె, పాయసం
తినటానికి కూడా
సిగ్గు పడుతున్నావు”
“ఇలా
ఎదురుకుండా కూర్చుంటే, ఎలా
తినగలను?”
“ఎందుకని.
నా ఎదురుగా
తిన్నదే లేదా? నాతో
మాట్లాడిందే లేదా? కొత్తగా
ఎందుకు ఇప్పుడు
ఇంత సంకోచం”
నవ్వుతూనే అతను
అడుగ...
నేత్రా జవాబు
చెప్పకుండా తల
వంచుకుని నిలబడింది.
“నేనంటే
నీకు ఇష్టం
లేదా?”
“అదంతా
ఏమీ లేదు”
“అయితే
ఏదైనా మాట్లాడు”
“ఏం
మాట్లాడను?”
“ఎన్నో
విషయాలున్నాయి!
ఏదో ఒకటి
మాట్లాడు. జెనరల్
గా ఏమీ
తెలియకపోతే...న్యూటన్
సూత్రం గురించి
మాట్లాడు”
ఆమె గబుక్కున
నవ్వింది!
“ఏమిటి
నవ్వుతున్నావు? సీరియస్
గా మాట్లాడదాం...న్యూటన్
సూత్రం గురించి!”
తలెత్తి అతన్ని
చూసింది.
“ఇప్పుడు
ఒక వస్తువును
పై నుండి
పడేస్తే, అది
భూమి వల్ల
లాగబడి కిందకు
వచ్చేస్తోంది. దాన్ని
‘భూ
ఆకర్షణ శక్తి’ అని
చెబుతున్నాము. ఆ
ఆకర్షణ శక్తి
కేవలం బౌతిక
వస్తువులకు మాత్రమే
అనుకుంటే అది
తప్పు. కళ్ళకు
తెలియని వేరే
విషయం కూడా
ఇలా ఆకర్షించ
బడటం జరుగుతోంది.
అదేమిటో చెప్పు
చూద్దాం?”
“తెలియటం
లేదు”
“ఆలొచించు!
ఆలొచించి చెప్పు...”
“ఆలొచించినా
తెలియదు! మీరే
చెప్పండి”
“చెబుతా!
రేపురా. లేకపోతే
నాలుగు వారాలు
గడిచిన తరువాత
వచ్చినా చాలు.
చాలా యధార్ధమైన
విషయమే. అదేమిటో
వివరంగా చెబుతాను.
గారెలు తినేశావా...ఇంకా
లేదా? సరే...కావాలంటే
నేను అటుపక్కకు
తిరిగి కూచుంటాను.
నువ్వు తిను”
ఆకాష్ లేచి
వెళ్ళాడు.
రెండు గారెల
కంటే ఎక్కువ
తినలేక పోయింది.
పాయసం మాత్రం
పూర్తిగా తాగింది.
గ్లాసును ఆమె
కింద పెట్టిన
వెంటనే ఆకాష్
లోపలకు వచ్చాడు.
“అన్నీ
ఓకే! నాకు
జన్మదిన శుభాకాంక్షలు
చెప్పావా నువ్వు? పాయసం
మాత్రం లోట్టలేసుకుంటూ
తాగాసావు”
“సారీ...మెనీ,మెనీ
హ్యాపీ రిటర్న్స్”
“ఇలా
చెబితే చాలదు”
“వేరే
ఎలా చెప్పాలి?”
“షేక్
హ్యాండ్ ఇస్తూ
చెప్పాలి” -- ఆకాష్
తన చేతులను
ముందుకు జాప...ఒక్క
నిమిషం ఆలొచించింది.
తరువాత ఆమె
కూడా చెయ్యి
జాపి అతని
చేతులు పుచ్చుకుని
షేక్ హ్యాండ్
ఇచ్చింది. ఆకాష్
గబుక్కున తన
చేతులను బిగించాడు.
ఆశ్చర్యంతో అతన్ని
చూసింది. చటుక్కున
అతను చేతులు
వెనక్కి తీసుకుని
నవ్వాడు.
“కారణం
ఉండబట్టే చేతులు
బిగించాను. సరే
‘న్యూటన్
సూత్రం’ గురించి
మాట్లాడటానికి
ఎప్పుడు వస్తావు?”
“ఊహూ...నేను
రాను”
“ఖచ్చితంగా
వస్తావు”
“రాను”
“చూద్దాం...వెళ్ళిరా”
పరుగున పరిగెత్తుకుని
వచ్చేసింది! దారి
పొడుగునా గుండె
టపటప కొట్టుకుంది.
అరిచేతిని మళ్ళీ
మళ్ళీ చూడాలనిపించింది.
అతను ఇచ్చిన
ఆ బిగింపు
భావన ఇంకా
అరిచేతిలోనే ఉంది.
గబుక్కున చేతిని
బిగించిన ఆ
క్షణం, నడి
నెత్తి వరకు
షాక్ వేవ్
పాకటం గురించి
ఆలొచించి చూసింది. ఆలొచిస్తే
అది హాయిగా అనిపించింది.
అరిచేతిలో ఉన్నదేదో
కనిపించ కుండా
పోయినట్లు అనిపించింది.
‘ఎంత
పొగరు, ‘ఖచ్చితంగా
నువ్వు వస్తావు’ అని
ఎంత నమ్మకంగా
చెబుతున్నాడు. వెళ్ళకుండా
ఉండిపోతే? అదే
కరెక్టు...ఎవరికి
కావాలి ‘న్యూటన్
సూత్రం’? ఇక
అతని ఎదురుగా
వెళ్తానా చూద్దాం’
ఇంట్లోకి వెళ్ళేటప్పుడు
మళ్ళీ ఒకసారి
అరిచేతిని చూసినప్పుడు
ఆమెకు నవ్వు
వచ్చింది!
*************************************************PART-2*********************************************
‘వెళ్ళ
కూడదు’ అని
రోజూ తనలో తానే చెప్పుకుంటున్నా... నేత్రా మనస్సు, ఆకాష్
ఆమె చేతిని
బిగించిన క్షణంలోనే
మత్తెక్కి నిలబడింది.
ఆమె ఆలొచనలు
అతన్నే చుట్టి
చుట్టి వచ్చినై.
‘ఒక
మగవాడి స్పర్శ, ఆడదాని
మనసులో ఇంత
రసాయన మార్పులను
ఏర్పరుస్తుందా?’ అని
ఆశ్చర్యంలో ఉన్నది.
‘వద్దు...వద్దు’ అనుకుంటున్నా
కూడా శుక్రవారం
అయితే చాలు, ఆమె
కాళ్ళు ఆమెను అత్తయ్య
ఇంటికి లాక్కుని
వెళ్ళాయి.
ఆమెను చూడగానే
అతని కళ్ళు
వెక్కిరింతగా మారి
నవ్వుతున్నాయి.
“ఏమిటి
నవ్వు...నేను
వెళ్ళిపోతాను”
“సరే...వెళ్ళు”
“ఛీఛీ...అత్తయ్యకు
ఇలాంటి ఒక
కొడుకా?”
“మామయ్యకు
ఇలాంటి ఒక
కూతురు ఉన్నప్పుడు...అత్తయ్యకు
ఇలాంటి ఒక
కొడుకు ఉండటంలో
తప్పేముంది?”
“ఆటలు
చాలు! అదేమిటి...న్యూటన్
సూత్రం?”
“ఇన్ని
రోజులలో నువ్వుగానే
అర్ధం చేసుకుంటావని
అనుకున్నాను?”
“నాకు
మట్టి బుర్ర
కదా...! అన్నీ
వివరంగా చెబితేనే
అర్ధమవుతుంది”
“చెబుతాను!
దానికి ముందు
కొంచం టీ
పెడతావా! నీ
చేతులతో టీ
తీసుకుని తాగి
చాలా రోజులయ్యింది”
అతను అలా
చెప్పటంతో ఆమె
మనసు పొంగిపోయి
మరో మాట
మాట్లాడకుండా వంట
గదిలోకి వెళ్ళింది.
కాచిన పాలు
స్టవ్వు మీద
ఉన్నాయి. టీ
తయారు చేయటంలో
బిజీ అయ్యింది.
అప్పుడు వంట
గది తలుపుల
దగ్గరకు వచ్చి, తలుపుకు
ఆనుకుని నిలబడ్డాడు
ఆకాష్.
“రాను...రాను
అని చెప్పేసి, ఇప్పుడు
ఏది నిన్ను
ఇక్కడికి లాక్కు
వచ్చింది?”
“అదంతా
నాకు తెలియదు...రాకూడదనే
అనుకున్నాను. సరే...పోతే
పోనీ అని
వచ్చాను”
“అబద్దం...!
నేను చెప్పనా
నువ్వు ఎందుకు
వచ్చావని?”
“ఎందుకట?”
“అదే
న్యూటన్ సూత్రం”
అతను నవ్వాడు.
“ప్చ్...అర్ధం
కాలేదు”
“ఏదో
ఒకటి నిన్ను
ఇక్కడికి లాగుతోంది.
ఐమీన్ నీ
మనసును. మనసును
లాగుతున్న చోటుకు
శరీరం తానుగా
వచ్చి పడుతుంది...కరెక్టేనా?”
అతను చెప్పగా...దాని
అర్ధం గ్రహించిన
క్షణంలో, మొహం
గబుక్కున ఎర్ర
బడింది. గుండె
దఢను దాటి
ఒక ఆందోళన
ఏర్పడింది.
“అదంతా
లేదు...”
“అబద్ధం...ఈ
వారం రోజులుగా
నన్నే తలుచుకుంటూ
ఉన్నావు!”
“లేనే
లేదు...”
“అరిచేతిలో
నేను కనబడుంటానే?”
“మీరు
చాలా మోసం!
నేను వెళ్తాను”
ఆమె లేచిందే
తప్ప వెళ్ళ
లేదు.
“వెళ్ళొచ్చు
కదా...?” --- అతను
వేళాకోళంగా ఆడుగగా...తన
లోతైన మనసు
అతనికి అర్ధమయ్యిందనే
ఆశ్చర్యంలో, అబద్ధమైన
కోపంతో చేతిలో
ఉన్న పుస్తకాన్ని
అతని మీద
విసిరింది. ఆకాష్
నవ్వాడు.
‘భగవంతుడా...నాకు
ఏమయ్యింది? ఎందుకు
ఇంకా నేను
ఇక్కడ్నుంచి వెళ్ళలేక
పోతున్నాను?’
మెల్లగా సనిగిన
ఆమె కళ్ళు
మెల్లగా తడి
అవటం మొదలవగా...
ఆకాష్ దగ్గరకు
వచ్చాడు.
రెండు చేతులతోనూ
ఆమె మొహం
పుచ్చుకుని పైకెత్తాడు.
తధేకంగా చూశాడు.
“ఒక
వారం రోజులుగా
నన్ను చదువుకోనివ్వకుండా
చేసావుగా నేత్రా...న్యాయమేనా?”
“నేనా! మీరే
నన్ను చదువుకోనివ్వలేదు” -- గబుక్కున
ఆమె చెప్పగా
...అతను పెద్దగా
నవ్వాడు.
“నిజం
బయటకు వచ్చింది
చూసావా? నన్ను
తలచుకోనే లేదని
కాసేపటి క్రితం
ప్రామిస్ చేసావు”
“ఇలా
ముట్టుకుని మాట్లాడితే...?”
“ఓహో...ముట్టుకుని
మాట్లాడితేనే నిజం
చెబుతారో?”
“ఛీ...వదలండి...”
మొహం కందిపోయినట్టు
ఎర్ర బడింది.
అతని దగ్గర
నుండి విడిపించుకుని
పరిగెత్తింది.
“ఏయ్...ఏయ్...
నేత్రా! ఒక్క
నిమిషం ఆగు, ముఖ్యమైన
విషయం”
“ఏమిటది?”
“ఇక్కడకు
రా...చెబుతాను”
“రాను!
మళ్ళీ మొహాన్ని
పట్టుకుంటారు”
“పట్టుకోను.
రా...”
“ఈ
విషయాన్ని మీ
అమ్మ అంగీకరిస్తుందా?”
“ఏ
విషయాన్ని?”
“అదే
మన విషయాన్ని...న్యూటన్
సూత్రం?”
“నీకు
ధైర్యం ఉంటే
అడుగు”
“సరే...నేను
మా అమ్మ
దగ్గర అడుగుతాను.
నువ్వు మీ
అమ్మ దగ్గర
అడిగి చెప్పు”
“అడిగితే
పోతుంది”
“అవును...అడిగితే
పోతుంది. అన్నీ
దాంతోనే పోతాయి”
ఆకాష్ నవ్వుతూ
గారాబంగా ఆమె
చెవిని మెలిపెడుతున్న
అదే సమయం...వాకిట్లో
అత్తయ్య రూపం.
ఆ దృశ్యాన్ని
చూసి అదిరిపోయి
నిలబడింది నేత్రా.
ఆమెను చూసి
భయపడిన నేత్రా
ఏమీ మాట్లాడకుండా
పరిగెత్త...
ఆకాష్ తప్పు
చేసిన భావనతో
తలవంచుకు నిలబడ్డాడు.
**********
మూడు రోజులు
ముగిసినై. అమ్మ
ఏదైనా అడుగుతుంది, కనీసం
తిట్టనైనా తిడుతుంది
అని ఎదురుచూసిన
ఆకాష్ ఆశ్చర్యపోయాడు.
అతని దగ్గర
ఒక మాట
కూడా మాట్లాడలేదు.
ఏదో మౌన
వ్రతం ఉన్నట్లు
తిరుగుతున్నది.
ఆ తల్లి
మొహం అతన్ని
కత్తితో గుచ్చి
చించినట్టుంది.
అదే శిక్ష
లాగా అనిపించింది.
నాలుగో రోజు
కూడా తల్లి
మౌనం కంటిన్యూ
అవుతుంటే, అతను
తట్టుకోలేకపోయాడు.
గబగబమని ఆమె
ముందుకు వచ్చి
నిలబడ్డాడు.
“దీనికంటే
నన్ను నాలుగు
దెబ్బలు కొట్టుండచ్చు.
లేదు గొంతు
పిసికి చంపేసుండచ్చు
నువ్వు” అన్నాడు.
తల్లి ఏమీ
మాట్లాడకుండా అతన్నే
చూసింది.
“నేను
చేసింది తప్పనుకుంటే...‘ఇది
తప్పు అని
చెప్పు’. అదే
సమయం ‘ఎందుకు
తప్పో’ కూడా
చెప్పు. నువ్వు
చెప్పే కారణం
న్యాయంగా ఉంటే, నన్ను
మార్చుకుంటాను.
దేనికీ సందర్భం
ఇవ్వకుండా ఇలా
మౌనంగా ఉండి
శిక్షిస్తే ఏమిటి
అర్ధం?”
“తప్పేరా...నువ్వు
చేసింది తప్పే!”
“ఎందుకని...ప్రేమించే
వయసు నాకింకా
రాలేదా?”
“ఎప్పుడో
వచ్చిందే! ఈ
వయసుకు ఏది
వస్తుందో రాదో
తెలియదు కానీ
ఇది మాత్రం
ముక్కు ముందుకు
పొడుచుకుని వస్తుంది”
“అది
మనిషికి దేవుడు
ప్రకృతిగా ఇచ్చిన
భావం. ప్రేమ, వంశవృద్ది
అన్ని ప్రాణులలోనూ
దాగి ఉంది.
దానికి కావలసిన
వయసు వచ్చినప్పుడు
పువ్వులాగా విచ్చుకుని
పైకొస్తుంది. దీన్ని
తప్పు అని
చెప్పటం తప్పు”
“ప్రేమను
తప్పు అని
చెప్పటం లేదురా...ప్రేమించే
వ్యక్తే తప్పు
అని చెబుతున్నా”
“ఏమ్మా... నేత్రాకు ఏం
తక్కువ?”
“ఆమె
దగ్గర ఏమీ
లోటు లేదురా.
నేత్రా ఇక్కడికి
వచ్చి తక్కువైపోకూడదనేదే
నా భయమంతా”
“ఏం
చెబుతున్నావు అమ్మా?”
“తప్పురా
ఆకాష్. నేత్రా
యొక్క తల్లి
స్థానంలో ఉండి
ఒక నిమిషం
ఆలొచించి చూడు.
నీలోనే నిన్ను
తప్పుకుని తీర్పు
చెప్పు.
ఆశ, ఆశగా
కూతుర్ని పెంచారు.
నేల మీద
కాలు పెడితే
పాదం కందిపోతుందని
ఇల్లు మొత్తం
రత్న కంబలి
పరిచి ఉంచారు.
ఆమె కోసం
ఇంటి చుట్టూ
ఒక నందన
వనమే అభివృద్ది
చేసి ఉంచారు.
బీరువా నిండా
నగలు, పట్టు
చీరలు కొని
ఉంచారు. తన
కూతురి పెళ్ళి
గురించి ఆమె
మనసులో వేలకొలది
కలలు ఉంటాయి.
ప్రతి తల్లికీ
తన కూతురు...
పుట్టింటి కంటే
మెట్టినింట్లోనే
ఆనందంగానూ, హాయిగానూ, ఆరొగ్యంగానూ
ఉండాలనుకుంటుంది.
అదే తల్లి
మనసు. మీ
అత్తయ్య కూడా
ఒక తల్లే
కదా? తన
కూతురికి అందం, అంతస్తు, పేరు
ప్రతిష్టలు ఉన్న
రాజ కుమారుడ్ని
పెళ్ళి చేసి
కళ్ళారా చూసుకోవాలనే
కల, ఆశ
ఆవిడకు మాత్రం
ఉండదా?
ఆమె కలలను
చెల్లా చెదురు
చేయటానికి మనకి
ఏం యోగ్యత
ఉంది. ఆమె
ఆశలను నిర్మూలన
చేయడానికి ఏం
హక్కు ఉంది.
కూతురు ఇక్కడకొచ్చి
మన కష్టాలను
పంచుకుంటే దాన్ని
ఆ తల్లి
మనసు ఎలా ఓర్చుకుంటుంది? ప్రేమించే
వాళ్ళకు మాత్రమేరా
ప్రేమ గొప్పది...మిగిలిన
వాళ్ళకు ప్రేమకంటే
యధార్ధమైన జీవిత
సౌకర్యాలే ముఖ్యం.
నీ వయసు
మరిచిపోయి ఒక
తండ్రి స్థానంలో
నిలబడి చూస్తేనే
అది నీకు
అర్ధమవుతుంది”
తల్లి మాట్లాడుతుంటే
స్థంభించి పోయాడు.
“ఇప్పుడు
నేనేం చేయనమ్మా"
అన్నాడు ఒక
నిర్ణయమైన స్వరంతో.
“వదిలేయరా...దీన్ని
ఇంతటితో వదిలిపెట్టు!
ఆ అమ్మాయి
మనసును చెడపొద్దు.
ఆమె సుఖంగా
జీవించాల్సిన అమ్మాయి.
మన దరిద్రం
ఆమెకెందుకు? రెండు
సంవత్సరాలు మనకు
ఆశ్రయం ఇచ్చి, భోజనం
పెడుతున్నాడు నా
తమ్ముడు. ఇంకా
ఈ రోజు
వరకు మనకోసం
డబ్బు ఖర్చు
పెడుతున్నాడు. ‘నా
కూతుర్ని నాశనం
చేయటానికా నేను
మీకు ఆశ్రయం
ఇచ్చి కాపాడింది?’ అని
అడిగితే...మనం
నాశనమైపోతామురా
ఆకాష్. వాడి
ఉప్పు తిని, వాడికి
కడుపు మంట
తెప్పిస్తే మనలాంటి
హీనమైన జీవులు
ఎవరూ ఉండరు”
“ప్లీజ్...చాలమ్మా” -- ఆకాష్
అర్ధం చేసుకుని, తల్లి
దగ్గర ప్రాధేయపడ్డాడు.
“నేను
చేసింది తప్పే!
నా వయసుకు
నీలాగా ఆలొచించే
పక్వం లేదు.
ఇక మీదట
ఆమెను కలిసి
మాట్లాడటమో...స్నేహంగా
ఉండటమో చేయను.
దానికి అర్ధం
నేను నేత్రాను
మరిచిపోయినట్లు
కాదు. అది
కుదరను కూడా
కుదరదు. ప్రేమ
ఒకసారే వస్తుంది.
తప్పో, సరియో...అది
నాకు వచ్చేసింది.
కానీ, నువ్వు
చెప్పేదంతా నిజమే!
అందువలన ప్రస్తుతానికి
నా ప్రేమను
పూడ్చుకుంటాను.
నిన్ను ఒకే
ఒక ప్రశ్న
అడుగుతాను. ఒకవేళ
నేను బాగా
చదువుకుని పెద్ద
పదవిలో కూర్చుని
వాళ్ళకు సరిసమమైన
అంతస్తుకు మనమూ
ఎదిగిపోతే...అప్పుడు
నా కోసం
నేత్రాను నాకు
పెళ్ళి చేసి
ఇవ్వమని సంబంధం
మాట్లాడటానికి
వెళ్తారా? అప్పుడు
మా ప్రేమను
అంగీకరిస్తారా?
నేత్రాను మహారాణి
లాగా ఉంచుకునే
వాడే ఆమెను
పెళ్ళి చేసుకోవాలనేదే
మీ తీర్పు
అయితే...నేనూ
ఒక రాజ
కుమారుడ్ని అవ్వాలి.
అలా అయిపోతే
మీరే నాకు
పెళ్ళి చేసి
పెట్టాలి. దానికి
ప్రామిస్ చేసి
ఇవ్వగలరా? ”
కొడుకు మాటలకు
తల్లి ఆశ్చర్యపోయింది.
అతన్నే చూసింది.
“మీ
న్యాయానికి నేను
కట్టు పడేటట్టు...నా
న్యాయానికి మీరూ
కట్టు పడద్దా? అందుకే
ఈ ప్రామిస్...”
“సరే” అని తల
ఊపిన ఆమె
“ఆ
ఇంటికి పిల్లనివ్వమని
అడగటానికి నేను
వెళ్ళే ఆ
రోజు...కానీ
అప్పుడు కూడా
మీ అత్తయ్య
మనసు పెడితేనే
నీకు నేత్రా
దొరుకుతుంది. మీ
అత్తయ్య మనసు
పెట్టటానికీ, పెట్టకపోవటానికీ
నేను గ్యారంటీ
ఇవ్వలేను”
“ఖచ్చితంగా
అత్తయ్య మనసు
మారుతుంది. మార్చి
చూపిస్తా. నాకు
ఆ నమ్మకం
ఉంది”
“అత్తయ్య
మారి నేత్రాను
నీకిచ్చి పెళ్ళి
చేయటానికి ఒప్పుకుంటే
నాకేముంది అభ్యంతరం.
నా వరకు
మీ అత్తయ్యలో
మార్పు రాదు.
మనల్ని చూసి
ఆమె ‘కృతజ్ఞత
లేని కుక్కలు!’ అని
చెప్పకూడదు. అంతే”
“చెప్పరు!
ఇక మీదట
నా బుర్రను
దాని ఇష్టానికి
వదలను. నా
లక్ష్యం ఏమిటో
తీర్మానించుకున్నాను.
దాన్ని ఉద్దేశించే
నా బుర్ర
వెడుతుంది. దాన్ని
నెరవేర్చుకునే
వరకు, నా
సొంతం చేసుకునే
వరకు నాకు
రెస్టు లేదు.
నేను గెలవాలని
ఆశీర్వదించు అమ్మా”
ఆకాష్ కాళ్ళ మీద పడి నమస్కరించ -- కన్నీటితో అతన్ని ఆశీర్వదించింది తల్లి.
*************************************************PART-3*********************************************
అద్దంలో కనబడిన
తన ప్రతిబింబాన్ని
చూసుకుని కల్లార్పకుండా
చూసింది నేత్రా.
ఇన్ని రోజుల
వరకు ఆమె
తన అందాన్ని
తానే చూసుకున్నది
లేదు. దాని
గురించిన ఇంటరెస్ట్
ఆమెకు ఉండేది
కాదు.
ఆకాష్ ఆ
రోజు న్యూటన్
సూత్రం గురించి
చెప్పిన తరువాతే
తనని తాను
అద్దంలో చూసుకునే
అభిరుచి ఆమెకు
వచ్చింది.
‘నా
దగ్గర ఉన్నది
ఏది అతన్ని
ఆకర్షించి ఉంటుంది? న్యూటన్
సూత్రం ఏ
చోట గెలిచుంటుంది? న్యూటన్
ఇప్పుడుంటే నవ్వుతారో? ‘అరె
పాపిష్టోళ్ళా...మీరు
ప్రేమను చెప్పుకోవటానికా
నేను కష్టపడి
ఈ సూత్రాన్ని
కనిపెట్టాను? అంటారే!’ -- తలచుకున్నప్పుడల్లా
ఆమెకు నవ్వొస్తోంది.
‘ఏ
కారణం పెట్టుకుని
అత్తయ్య ఇంటికి
వెళ్ళేది?’ అని
ఆమె బుర్ర
ఆలొచించింది. అదే
సమయం అత్తయ్య
చేతికి అడ్డంగా
దొరికిపోయిన సంఘటన
గుర్తుకు వచ్చి
కలవరపెడుతోంది.
ఆ తరువాత
ఆ ఇంటి
పక్కకు వెళ్ళటానికి
బిడియంగా ఉండేది.
‘అత్తయ్య
దేనికోసం నన్ను
ఎదిరించబోతుంది...నన్ను
కోడలుగా చేసుకోవటానికి
ఒప్పుకోను అని
ఎందుకు చెబుతుంది.
ఆకాష్ నాకు
వరుసే కదా? ఇద్దరూ
మాట్లాడుకొవటంలో
తప్పేముంది? అత్తయ్య
మనసులోనూ లోలోపల
సంతోషంగానే ఉంటుంది.
నా మీద
ఆమెకు ప్రేమ
ఎక్కువ. ఈ
విషయం తెలుసుకున్నందు
వలన అది
ఎక్కువ అవుతుందే
గానీ తగ్గదు.
ఈ రోజు
అత్తయ్య ఇంటికి
వెళ్తే ఏమవుతుంది? కానీ
ఒంటరిగా వెళ్ళ
కూడదు. నాన్నను
ఎలాగైనా లాకెళ్ళాలి’ అనుకున్నది.
తండ్రిని వెతుక్కుంటూ
తోటకు వెళ్ళింది.
చెట్టుకు నీళ్ళు
పడుతున్న ఆయన
వెనుకకు మెల్లగా
వెళ్ళి నిలబడి, ఆయన్ని
మెల్లగా పిలిచింది...ఆయన
తిరిగి చూసారు.
“ఏం
నాన్నా, చెట్లకు
నీళ్ళు పడుతున్నారా?”
“లేదమ్మాయ్...బట్టలు
ఉతికి ఆరేస్తున్నాను!
ఏమిటి విషయమో
మొదట చెప్పు”
“సాయంత్రం
ఎక్కడికైనా బయటకు
వెళ్దాం నాన్నా?”
“ఎక్కడికమ్మా?”
“ఎక్కడకైనా
సరే”
“ఈ
రోజు ప్రదోషం.
ఆశోక్ నగర్
లో ఉన్న
శివాలయానికి వెళ్దామా?”
నేత్రా కొంచం
గుటకలేసింది. తరువాత
“వెళ్దాం
నాన్నా...అత్తయ్య
కూడా ప్రదోషానికి
వెళ్ళాలని చెబుతూ
ఉన్నది. ఆవిడ్ని
కూడా తీసుకుని
వెళ్దామా?”
“ఎప్పుడు
చెప్పింది?”
“అదీ...ఒక
సారి చెప్పింది
నాన్నా”
“దానికేం...వస్తే
తీసుకు వెళ్దాం”
“నేను
ఏం డ్రస్సు
వేసుకోను?”
“గుడికే
కదమ్మా...పట్టు
లంగా కట్టుకుని
రా. లక్షణంగా
ఉంటుంది”
“వద్దు
నాన్నా. చాలా
ఆడంబరంగా ఉంటుంది.
నేను మామూలు
డ్రస్సు వేసుకుని
వస్తాను”
“నీ
ఇష్టం”
“అమ్మని
పిలవద్దు నాన్నా!”
“ఏమ్మా”
“అత్తయ్యను
చూస్తే మొహం
విరుచుకుంటుంది”
“గుడిలో
ఎవర్నీ చూసి
మొహం విరుచుకోకూడదమ్మా.
అది పబ్లిక్
ప్లేస్. ఎవరైనా
రావచ్చు”
“అలా
అని అమ్మకు
తెలియదు నాన్నా.
అమ్మ వస్తే
నేను రాను
నాన్నా”
తండ్రి ఆమెను
బాధతో చూశాడు.
“కన్ని
తల్లి దగ్గర
ద్వేషం ఉంచుకోకూడదు
నేత్రా. ఏ
తల్లీ తన
పిల్లలకు చెడు
చెయ్యదు. అమ్మ
దగ్గర చెడు
గుణం ఉండచ్చు.
అందుకని ఆమెను
వద్దనడం సరికాదమ్మా.
దాన్ని మార్చి
మన దారికి
తీసుకు రావటమే
న్యాయం”
“ఇన్ని
సంవత్సరాలుగా మీ
వల్లే జరగని
పని నేనెలా
చెయ్య గలను?”
కూతురు తిరిగి
ఆడుగ...ఆయనకు
నవ్వు వచ్చింది.
నేత్రా ఇంటిలోపలకు
పరిగెత్తింది.
ఎప్పుడు సాయంత్రం
అవుతుందా అని
తొందరపడింది. గడియారం
నాలుగు గంటలు
కొట్టగానే...స్నానానికి
వెళ్ళింది.
తండ్రీ, కూతుళ్ళు
బయలుదేరుతున్నప్పుడు
తల్లి కళ్ళు
పెద్దవి చేసింది.
“నేత్రా, ఫ్రెండు
ఇంటికి వెళ్ళాలని
చెప్పింది. తోడు
రమ్మంది. వెళ్ళోస్తాను”
తల్లి మొహం
ఆ అబద్దాన్ని
అలాగే నమ్మింది.
కారు తీసారు.
కూతురు ఎక్కిన
వెంటనే బయలుదేరారు.
కారు తిన్నగా
అత్తయ్య ఇంటి
ముందుకు వెళ్ళి
నిలబడింది.
శబ్ధం విని
తొంగి చూసిన
అత్తయ్య మొహం, తమ్ముడ్ని
చూసిన వెంటనే
వికసించింది. ఆయన
వెనుకే దిగిన
నేత్రాను చూసిన
వెంటనే మారింది.
“రారా
మూర్తీ” అంటూనే లోపలకు
వెళ్ళింది. నేత్రా
ఎప్పుడు వచ్చినా
ఆమెను హత్తుకుని
తనతో తీసుకు
వెళ్ళే ఆమె...ఆ
రోజు నేత్రాను
పట్టించు కోకుండా
లోపలకు వెళ్ళటంతో...
నేత్రా మొహం
వాడిపోయింది.
‘ఒక
వేల అత్తయ్యకు
ఆ రోజు జరిగిన సంభవం గురించి బాధగా ఉందేమో? చదువుతున్న
కొడుకుని నేను
చెడుపుతున్నానని
అనుకుంటుందో. అలా
గనుక ఉంటే
ఆమెను సమాధానపరచి, భయం
పోగొట్టాలి. సమయం
వచ్చినప్పుడు తిన్నగా
మనసు విప్పి
మాట్లాడేయాలి’ అని
అనుకుంటూ తండ్రి
వెనుకే లోపలకు
వెళ్ళిన ఆమె
కళ్ళు ఆకాష్
ను వెతికినై.
అత్తయ్య వేడిగా
కాఫీ కలిపి
తీసుకు వచ్చింది.
“ప్రదోషానికి
వెళ్ళాలని చెప్పావుట...అందుకే
తీసుకు వెళ్దామని
వచ్చాను”
అత్తయ్య ఆశ్చర్యపోయింది!
‘ఎప్పుడు
చెప్పాము?’ అని
ఆలొచించింది. ఆమెకు
అర్ధమయిపోయింది.
‘ఇది
నేత్రా పనే!’ అని
అనుకుంటూ ‘ఇక్కడికి
రావటానికి ఇలా
ఒక అబద్దం’ అని
అర్ధం చేసుకుంది.
నేత్రాను తప్పు
పట్టటానికి ఇష్టపడలేదు.
“వెళ్దాం!
ఐదు నిమిషాల్లో
రెడీ అయి
వస్తాను”
“ఆకాష్
ఎక్కడ?”--తమ్ముడు
అడిగాడు.
“ఎక్కడకో
బయటకు వెళ్ళాడు”
అత్తయ్య ఐదే
నిమిషాల్లో చీర
మార్చుకుని వచ్చింది.
ఆకాష్