మారని రాగాలు...(పూర్తి నవల)


                                                                       మారని రాగాలు                                                                                                                                                           (పూర్తి నవల) 

రచన అనేది వరమో...తపమో మాత్రమే కాదు! అదొక ఎండిపోని జీవనది. చల్ల చల్లగా రాసుకుని వెళ్ళే ఈదురుగాలి. ఒంటి మీద పడి జలదరింపు పెట్టే వానజల్లు. ఇంటి నిండా గుమగుమలాడే సన్నజాజి వాసన. ఎప్పుడూ కొత్తగా వాసన ఇచ్చే వాడిపోని మల్లె.

రచనకు మాత్రమే ఇవి సొంతం కాదు...ప్రేమకు కూడా! ఎన్ని సంవత్సరాలు అయినా ప్రేమ...ప్రేమే. వయసైతే చల్లగాలి గిలిగింత పెట్టదా ఏమిటి? వర్షపు జల్లు జలదరింపు తీసుకురాదా? మత్తు ఎక్కించదా? సన్నజాజి వాసన ముక్కును తాకదా? వాడిపోని మల్లె మత్తు ఎక్కించదా?

వయసవుతున్న కొద్దీ నిజమైన ప్రేమకు బలం ఎక్కువ అవుతుంది. శరీరాన్ని ముట్టుకోవటం ప్రేమ కాదు. మనసును తాకి లోతుగా చెక్క బడుతుందే...దాని పేరే ప్రేమ!

ముందురోజు మొగ్గలను మాలకట్టి, రాత్రంతా గిన్నె కిందపెట్టి మూసిపెడతారు. మరుసటి రోజు పొద్దున దాన్ని తీస్తే గుప్పుమని విరుచుకుని, ఇల్లంతా వాసన వీస్తుంది.

అలాగే ప్రేమ కూడా! దాని వాసన జీవితాంతం వీస్తుంది. మనసులో మూతపెట్టి, మూసిపెట్టిన మాలలాగా జీవితాంతం పూస్తుంది.

వాడిపోకుండా...నలిగిపోకుండా ఉంటుంది. వాడిపోని మెల్లె పూవులాగా కొత్తగా తెలుస్తుంది.

కృష్ణమూర్తి -- మాలతీ ప్రేమ కూడా అలాంటిదే! దాన్ని ప్రేమ అని చెప్పటం కూడా తప్పే అవుతుంది. ప్రేమలో కామం ఉంటుంది. కామంలో ప్రేమ ఉండాల్సిన అవసరం లేదు. వీళ్ళకున్నది కామంలేని...మనసును మాత్రమే తాకిన ప్రేమ. ఒకటిగా కలవని...కానీ ఒకటిగా ప్రయాణం చేసిన ప్రేమ.

ఇలాంటి ప్రేమ అపురూపం...ఆశ్చర్యం కూడా! వీళ్ళకు మాత్రమే సాధ్యం. మామూలుగా మానవ కులం మొత్తానికీ సాధ్యం అవాల్సిన విషయం సుతిమెత్తని కొన్ని మనసులకే సాధ్యమవుతుంది.

అలా ఎందుకు...ఎలా? తెలుసుకోవటానికి వర్ణజాలాన్ని చూడండి. కళ్ళను ఆకర్షించే దాని అందాన్ని అనుభవించండి. తరువాత మీ అభిప్రాయాలు తెలియజేయండి!

***************************************************************************************************** 

                                                                                    PART-1

కృష్ణమూర్తి బయటకు వెళ్ళటానికి రెడీ అయ్యారు. చెప్పుల స్టాండులో నుండి, చెప్పులు తీసి తగిలించుకుంటున్నప్పుడు బాగా నీరసంగా ఉన్నట్లు అనిపించింది. ఇదే చెప్పుల స్టాండులో ఒకప్పుడు నాలుగైదు జతల చెప్పులు ఉండేవి. పద్మజా....సీత...శారదా అంటూ ఆడవాళ్ళ చెప్పులు. అందులో వెతికి తన చెప్పులు తీసుకునేవారు అప్పట్లో.

ప్రస్తుతం వెతుకుడుకు అవసరంలేదు. తనలాగానే చెప్పులు కూడా ఒంటరిగా పడుండటం అనేది అనుకున్నప్పుడు మనసులో నిండిపోయున్న శూన్యం ఇంకొంచం ఎక్కువ అయ్యింది.

లొతైన ఒక నిట్టూర్పుతో వాకిలి తలుపు తెరిచిన ఆయన మెట్లమీద సంకోచిస్తూ నిలబడ్డారు. ఎండ చుర్రున మొహాన కొడుతున్నది. రోహిణీ కార్తి. వీధిలో మనుష్యుల హడావిడే లేకుండా ఖాలీగా ఉంది. నీడకు తలదాచుకోవటానికి ఒక చెట్టు కూడా లేని వీధి అది. వరుసగా, ఇరుకుగా కట్టబడ్డ ఇళ్ళు. గాలికి కరువైన చోటు. సాయం సమయంలో అందరికీ ఖాలీ మేడలే స్వర్గం. ఎండకి ఖాలీ మేడ నేల కూడా కాలుతుంది

పరిస్థితిలో సుమారు పావుమైలు దూరం నడిచి వెళ్ళి హోటల్లో భోజనం చేసి తిరిగిరావాలి. రోజూ మూడు వేళలూ ఇలా భోజనం కోసం తిరగటం ఆయనకు కష్టంగా ఉన్నది. దీనికొసమే రాత్రి భోజనాన్ని తగ్గించి, పొద్దున తినేసి వస్తున్నప్పుడే ఒక చిన్న బ్రెడ్, రెండు అరటిపండ్లు కొనుక్కుని వచ్చేస్తారు.

వాటిని తినేసి, మంచినీళ్ళు తాగేసి పడుకుంటారు. రోజు పొద్దుటి భోజనానికి వెళ్ళటానికి కూడా ఇష్టంలేక పోయింది. పొద్దుటి నుండి కారణం చేతనో మనసు నిలకడగా ఉండకుండా తిరుగుతున్నది. అది ఎందుకు అనేది అర్ధంకాలేదు. ఆయనా మనసును కట్టుబాటులోకి తీసుకురావటానికి ఏమిటేమిటో చేసి చూసారు.

బిందెతో నీళ్ళు తోడుకుని, తలమీద పోసుకుని స్నానం చేసారు. పూజ రూములోకి వెళ్ళి కూర్చున్నారు. లలితా సహస్రనామంచెప్పారు. ఆమ్మవారి ఫోటోకు అర్చన చేసారు. పూజలో కూర్చున్నారు.

కొద్ది నిమిషాలే. మనసు దాంట్లో ఏకాగ్రత వహించకుండా మొరాయించింది...పీటను తీసి గోడకు ఆనించి, చొక్కా తొడుక్కుని బయలుదేరారు. రోజు మాత్రమే కాదు...రెండు మూడు రోజుల నుంచే మనసు అలజడిగా ఉంది. ఏదోదే జ్ఞాపకాలతో కంగారుపడుతోంది. సతమతపడుతోంది. పాత జ్ఞాపకాలలో మునిగి మునిగి లేస్తోంది.

భార్య పద్మజా జ్ఞాపకం, పెద్ద కూతురు సీత యొక్క జ్ఞాపకం, పదిహేనురోజుల క్రితం పెళ్ళి చేసుకుని, అల్లుడితో బాంబే వెళ్ళిపోయిన చిన్న కూతురు శారదా జ్ఞాపకాలు...భార్య చనిపోయిన తరువాత, పెద్ద కూతురు సీత వివాహం జరిగిన తరువాత చిన్న కూతురు శారదానే ఇన్ని సంవత్సరాలు ఆయనతో ఉన్నది. చూసి చూసి అన్నీ చేసింది. నేనూ వెళ్ళిపోతే మీకు ఎవరు నాన్నా తోడు?'’ అంటుంది.

అలా ఎన్ని రోజులు తోయగలడు? చివరగా ఈయనే పట్టుదల పట్టి చిన్న కూతురు శారదాకి పెళ్ళి జరిపించి ముగించారు. పెళ్ళి అయిన నాలుగో రోజే భర్తతో ఊరికి బయలుదేరిన రోజు ఆమె ఏడ్చిన ఏడుపు, రోజు రాత్రి ఒంటరిగా ఇంటికి తిరిగి  వచ్చి, తలుపులు తీసుకుని, లోపలకు వచ్చినప్పుడు మొట్టమొదటి సారిగా ఒంటరి తనాన్ని చవి చూసాడు. శూన్యత భావన కూడా మనసును దెబ్బతీసింది. ఒక్కొక్క సంఘటన జ్ఞాపకానికి వచ్చి వెళుతోంది.మనుషులందరూ జ్ఞాపకాలతో  తేలుతున్నారు. పద్మజా....సీత...శారదా...చివరగా మాలతీ.

మాలతీ...

                                                                                  ******************

ఇన్ని సంవత్సరాల తరువాత కూడా క్లియర్ గా ఎదురుగా వచ్చి నిలబడిన ఆమె రూపం, పాల తెలుపు రంగు, పుష్టిగా ఉండే శరీరం, పొడవు పొడవుగా ఉన్న కళ్ళు. వాటి నుండి బయటపడుతున్న ఇంపైన చూపులు. అపూర్వంగానే నవ్వుతుంది.  ప్రతిదానికీ నవ్వే జాతికాదు. కరిగించే అందం లేదు.

రంభ, ఊర్వశీ, మేనకా అని అందరూ చెబుతారే...అలాంటి వాళ్లను నిలబెట్టి ఆశ్చర్యపరిచే అందం అంతా లేదు. రవివర్మ గీసిన లక్ష్మీ ఫోటో, సరస్వతి ఫోటో లలో చూసే నిరాడంబరమైన అందం, భవ్యమైన అందం, నిదానమైన అందం.

నిదానమూ, భవ్యమే కృష్ణమూర్తిని ఆకర్షించింది. మొదటిరోజు పాఠాలు చెప్పటానికి క్లాసు రూముకు వెళ్లాడు ఆయన. ఆమె ఎలా కాలేజీకి కొత్త స్టూడెంటో, అదేలాగానే ఆయనకూడా కొత్తగా చేరిన లెక్చరర్. మొట్టమొదటి సారిగా క్లాసుకు పాఠం చెప్పటానికి లోపలకు వెళ్లారు.

ఇంగ్లీష్ లిటరేచర్. పురుష గంభీరంతోనూ, లిటరేచర్ చదివిన ఆత్మ విశ్వాసంతోనూ లోపలకు వెళ్ళిన వెంటనే విధార్ధినుల సంచలనం. ఆయన రంగుతోనూ, మొహ లక్షణంతోనూ స్థంభించిన కొందరు కూర్చోనుండగా...తనని పరిచయం చేసుకున్నాడు. తరువాత విధ్యార్ధినులు పరిచియం చేసుకున్నారు.

ఒక్కొక్కరుగా లేచి తమ పేర్లు చెప్పినప్పుడు చేతులు కట్టుకుని, టేబుల్ కు ఆనుకున్న కృష్ణమూర్తి, మాలతీ లేచినప్పుడు గుండెల్లో మంచు గడ్డలు చెదురుమదురుగా పడటంతో జలదరింపుకు గురి అయ్యారు.

అలాంటి ఒక అందం...?

ఇలాంటి దేవతలాంటి ఒక మొహం ఉండటం సాధ్యమా?

మాలతీ.

పేరు విన్నప్పుడే ఆయనలో పుణ్య నది ఒకటి గలగలమని పారింది.

మాలతీ... మాలతీ... మాలతీ.

తరువాత పరిచయమూ ఆయన చెవి వెంట వినబడలేదు. గుండెలకు హత్తుకోలేదు. మనసులో ఆమె రూపం మెరుస్తూ మెరుస్తూ దాగిపోతుంటే...కీద్స్ కవిత్వం ఒకటి చెప్పటం ప్రారంభించాడు.

పూల కుండి ఒక దానిపై అందమైన మగవాడు, ఆడది ముద్దుపెట్టుకుంటున్నట్టు బొమ్మ గీయబడి ఉంది. దాన్ని చూస్తున్న కవి యొక్క భావనలు మాటలతో జల్లబడుతున్నాయి.

వాళ్ళు రక్తమూ, చర్మమూ ఉన్న నిజమైన మనుష్యులే అయ్యుంటే, ముద్దుపెట్టుకుంటున్న పరిస్థితి నుండి విడిపోవటం జరిగేది.

విడిపోవటం బాధ పడటానికి దారి తీస్తుంది. బాధ పడి, ఒళ్ళు క్షీణించి విరహానికి దారితీస్తుంది. కానీ, పూల కుండీ మీద గీయబడ్డ రూపానికో మార్పులేదు. విడిపోవటం లేదు. దానివల్ల ఏర్పడే బాధ ఉండదు. విరహం లేదు. వృద్దాప్యం లేదు.

కాలం కాలంగా...యుగం యుగంగా...జన్మ జన్మలుగా ముద్దుపెట్టుకుంటూనే ఉంటారు. వాళ్లకు మరణమూ లేదు. తరువాత పుట్టుకా లేదు.

కళ్ళు మాత్రం చూసే అందానికి వాడిపోవటం, మగ్గిపోవటం ఉంది. కానీ, హృదయంలో లోతుగా చోటుచేసుకున్న అందానికి మరణమేది...?

ఎమోషనల్ గానూ, మాటల జాలంతోనూ చెప్పేసి తలెత్తి మాలతీను చూసారు. క్లాసులో ఉన్న ఇతర స్టూడెంట్స్ కళ్లకు అతకలేదు...మనసులోకి దూరలేదు. ఆయన హృదయం పూర్తిగా ఆక్రమించుకున్నది మాలతీ.

ఇన్ని సంవత్సరాల తరువాత పరిస్థితుల్లోనూ గుర్తుకు వస్తున్నప్పుడు కూడా ఆయనకు ఆమె మొహమే జ్ఞాపకానికి వస్తోంది. పూల కుండి రూపంలాగా మనసులో ముద్రించుకుపోయున్న అందానికి రోజూ ముగింపు లేదు. వాడిపోవటంలేదు. వృద్దాప్యంలేదు. మరణం లేదు.

దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు ఆమెకు పాఠాలు జరిపారు. ఇద్దరూ మనసారా దగ్గరై, కలిసిపోయి, లిటరేచర్ ప్రేమికుల్లాగా తిరిగి అంతోనీ-కిలియోపాట్రా, ఓతెల్లో-ఉష్ట్మోనా, రోమియో-జూలియట్....

వాళ్లకు ఏర్పడ్డ ముగింపు వీళ్ళకు రాకూడదనే భయం ఇద్దరిలోనూ ఏర్పడినప్పుడు --

అదే జరిగింది!

మాలతీ ఇంటి పెద్దలకు విషయం తెలిసింది. కాలేజీ చదువును ఆపేసారు.  

ఇంట్లోనే నిర్బంధించబడి, అన్నయ్యతోనూ, తండ్రితోనూ దెబ్బలు తిని...

మర్చిపో...అతన్ని మర్చిపో!అనేది వేదంలాగ చెప్పబడి రెండు నెలలలో వాళ్ళ కులంలోనే వేరే వరుడ్ని చూసి, పెళ్ళికి ముహూర్తం పెట్టబడింది----

కృష్ణమూర్తి  కల్యాణ మండపంలోకి రాకుండా ఉండాలని ఆమెకు సంబంధించినవారు అందరూ జాగ్రత్తగా ఉన్నారు. అతను రాకుండా చూసుకోవడానికి ప్రత్యేక కాపలాదారులను ఏర్పరిచారు. ఒకవేళ అతను లోపలకు వచ్చినా, అతన్ని కొట్టి పడేయటానికి మనుషులను నియమించారు.

వాటిని అన్నింటినీ మీరి కృష్ణమూర్తి, కల్యాణ మండంపంలోకి చొరబడ్డాడు. కుచించుకుపోయిన ఎమోషన్స్ తో ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు. ఒకసారి ఈయన్ని తలెత్తి చూసిన మాలతీ కళ్ళల్లో కన్నీటి వరద.

ఏడవకూడదుఅన్నట్టు సైగ చేసారు.

మాంగల్యం కడుతున్నప్పుడు కూడా మాలతీ చూపులు ఈయన మీదే పడి ఉండగా -- ఏదైనా చేసి పెళ్ళిని ఆపేస్తారా అనే భయంతోనూ, ఆందోళనతోనూ, ఆవేశంతోనూ సతమతమవుతుంటే-----

కృష్ణమూర్తి ఏమీ చెయ్యలేదు. నిదానంగా, నెమ్మదిగా, జీవితాన్ని దాని దోవలోనే అంగీకరించటానికి తయారైన వాడిలాగా, తీసుకు వచ్చిన నిమ్మ పండును ఆమె చేతిలో ఇచ్చి------

నీ యొక్క ఉపాధ్యాయుడు అనే ఉద్దేశంతో చెబుతున్నా, నీ భర్తకు తగిన భార్యగానూ, ధర్మం మర్చిపోని విధంగా కుటుంబాన్ని నడిపించాలని ఆశీర్వదిస్తున్నాను!

అంతటితో బయటకు వచ్చాసారు.

మండపంలో గొడవ చేయకూడదని, కృష్ణమూర్తి బయటకు వచ్చేంత వరకు  కాచుకోనున్న కిరాయి గూండాలు నలుగురు కలిసి ఆయన్ని లాక్కుని వెళ్ళి కొట్టి పడేసారు. ఆయన వాళ్లను అడ్డగించలేదు.

శరీరాన్నే మాత్రమే కదా మీరు చితకబాది వేరు చేయగలరు. కొట్టండి. మా ఇద్దరి మనసులూ కిద్సిన్ పూల కుండీలలాగా రూపాంతరం చెందిన తరువాత మాకు విడిపోవటం ఎక్కడుంది? ఇది అర్ధం కాని మూర్ఖులారా...కొట్టండి...

తరువాత ఆయన జీవితంలో ఎన్నో మార్పులు. ఈయనకీ పెళ్ళి జరిగి, ఇద్దరు ఆడ పిల్లలకు తండ్రి అయ్యి, లెక్చరర్ పోస్టు నుండి రిటైర్ అయ్యి, ఇదిగో చిన్న కూతురికి పెళ్ళి జరిపించి, కాపురానికి పంపి ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారు.

భోజనం చేసి ఇంటికి తిరిగొచ్చిన ఆయన ఫ్యాను వేసుకున్నాడు. ఈజీ చైర్ ను విడదీసి కూర్చోబోయినప్పుడు ఏదైనా చదవాలని అనిపించింది.

ఏది చదువుదాం?’ అన్న ఆలొచనతో తన పాత జ్ఞాపకాల గురించి చదువుకుందామనుకుని నిర్ణయించుకుని అలమారును తెరిచారు. డైరీలను తీసారు. ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆయన దాచిపెట్టిన నిధి.

మొదటి రోజు రాసుకున్నది తీసుకుంటునప్పుడు ఆయన చేతులు వణికినై. అందులోనే మాలతీ గురించి రాయటం మొదలుపెట్టారు.

తీసిన వెంటనే పెద్ద అక్షరాలతో ఏప్రిల్-25. మాలతీ పుట్టిన రోజు బహుమతిగా శ్రీశ్రీ రాసిన రచన ఒకటి అని రాసుంది. కింద పెట్టేసి తరువాతది తీసి చూసారు. అదే ఏప్రిల్-25 ఆయన బహుమతిగా ఆయన ఆటోగ్రాఫ్ చేసిన పుస్తకం.

తరువాత పుట్టిన రోజుకూ ఒక పుస్తకమే.

గబుక్కున ఆయన చూపు పైకి వెళ్ళి క్యాలండర్ పైకి వెళ్ళింది.

రోజు ----

ఏప్రిల్-20.

ఇంకో ఐదు రోజుల్లో మాలతీ యొక్క పుట్టిన రోజు. దానికి వెళితే ఏం...? ఇరవై ఐదు సంవత్సరాలుగా మనసును లాగి కట్టి పడేసాము. ఆమెను మనసులోనే ఉంచి జీవ సమాధి కట్టాసాడు.

ఆమె ఉండే చోటు తెలిసి కూడా ఆమెతో ఎటువంటి టచ్ పెట్టుకోవటానికి ప్రయత్నించలేదు. చూడాలని, మాట్లాడలని...ఒక వాక్యం రాయాలని...ఊహూ...ఏదీ లేదు. అంత కట్టుదిట్టంగా ఉన్న మనసు, ఇప్పుడు కట్టుబాటును దాటాలని తపిస్తోంది. ఎవరూ లేని ఒంటరి తనం, ఆదరణ లేని పరిస్థితి. అన్నీ కలిసి ఆమెను ఒకసారి చూడాలనే ఆశని ప్రెరేపించింది.

ఇంత వయసు వచ్చిన తరువాత ఆమెను కలుసుకోవటంలో తప్పు ఏముంది? మనశ్శాక్షి అభ్యంతరం తెలుపలేదు. బీరువాలోని చివరి రాక్ కింద పడేసున్న ఆమె అడ్రస్సును వెతికి తీసుకుని బెంగళూరుకు వెళ్లటానికి ఫస్ట్ క్లాసు టికెట్టు కొనడానికి బయలుదేరారు ఆయన.  

*************************************************PART-2******************************************

వంటగది లైటును ఆపేసి బయటకు వచ్చింది మాలతీ. ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్ద అయ్యింది. ఇంటి వెనుకకు వెళ్ళి కుళాయి తిప్పి ముఖాన్నీ, కాళ్ళూ-చేతులను కడుక్కుని తుడుచుకుంటూ లోపలకు వచ్చింది.

సోపుతో కడుక్కోకపోయినా, ఉత్త నీటితో కడుక్కున్నందుకే ఆమె మొహం మెరిసిపోతోంది. చెవి చివరలలో తుడుచుకోకుండా వదిలేసిన నీటి చుక్కలు వజ్రాల బొట్లులాగా మెరుస్తున్నాయి. పూజగదిలో చిన్న గిన్నెలో ఉన్న విభూధిని పాము వేళుతో తీసి నుదిటి మీద రాసుకుంది.

పక్కనే బొట్టు భరిణె ఉన్నది. ముందంతా కూతుర్ల పట్టుదల వలన, అళ్లుల్ల ఒత్తిడివలన ఆవగింజంత బొట్టు పెట్టుకునేది. ఇద్దరు కూతుర్లలో ఒకత్తి ఢిల్లీకి, ఇంకొకత్తి జలంధర్ కూ వెళ్ళిన తరువాత అది వదిలేసింది.

పిల్లలకు సెలవులు ఇవ్వటంతో, కూతుర్లు ఇద్దరూ వాళ్ళ భర్తలతో కలిసి పిల్లలను తీసుకుని రేపు రాబోతున్నారు. ఢిల్లీలో వేసవి ఎండలను తట్టుకోలేమని పెద్ద కూతురు గిరిజ ఒకొక్క పెద్ద సెలవులకు బెంగళూరు వచ్చేస్తుంది. అల్లుడు మొహన్ వాళ్లను తీసుకువచ్చి వదిలిపెట్టి వారమో-పదిరోజులో ఉండి వెళ్ళిపోతాడు. ఇద్దరు పిల్లలకూ స్కూళ్ళు తెరిచేవరకు గిరిజ ఇక్కడే ఉండటం అలవాటు.

చిన్న కూతురు మేనకా ఎప్పుడైనా వస్తుంది. పెళ్ళి చేసుకుని వెళ్ళిన తరువాత గత మూడు సంవత్సరాలలో ఒకే ఒకసారి వచ్చింది. అది కూడా కాన్పుకు వచ్చింది. పిల్లాడు విగ్నేశ్వర్ కు ఆరు నెలలు పూర్తి అయిన తరువాతే అల్లుడు బద్రి వచ్చి పిలుచుకు వెళ్ళాడు.

తరువాత ఇప్పుడే వస్తోంది మేనకా. సారి అల్లుడు గారు కూడా నాతో వస్తారమ్మా. పదిహేను రోజులు ఆఫీసుకు సెలవు చీటీ రాసిచ్చేరు. అందువలన ఆయన కూడా అక్కడే ఉంటారు. గిరిజాను కూడా బావనూ, పిల్లల్ను తీసుకుని రమ్మని చెప్పమ్మా.

అందరూ నీతోనే ఉండొచ్చు. ఎంత పిలిచినా, నువ్వేమో మాతో వచ్చి ఉండవు అంటున్నావు. మేమైనా నీ దగ్గరకొచ్చి ఉంటాము...అని ఉత్తరం రాసింది.

కూతుర్ల లాగానే అళ్లుల్లు కూడా మాలతీతో అభిమానంగా ఉంటారు. మర్యాదతో నడుచుకుంటారు. అమ్మా...అమ్మా...అంటూ చుట్టి చుట్టి వస్తారు. మా అమ్మ వేరు...మీరు వేరు కాదు అత్తయ్యా... అంటారు. వాళ్ళు కూడా ఆమెను తమతో వచ్చి ఉండమని అడిగి చూసారు.

ఇక్కడెందుకమ్మా ఒంటరిగా ఉండటం? మాతో వచ్చి ఉండండి... అని బ్రతిమిలాడి చూసారు.

వద్దు. నేను ఇక్కడే ఉంటాను. చోట ఉండటం నాకు ఓదార్పుగా ఉంది... అన్న సమాధానం తరువాత వాళ్ళు కూడా బలవంతం చేయటం మానుకున్నారు.

రెండు నెలల కోలాహలం తరువాత ఇల్లు అంతకు ముందులాగా నిశ్శబ్ధం అయిపోతుంది. మాలతీ మాత్రం ఒంటరిగా చుట్టి వస్తుంది. ఒంటరితనం, నిశ్శబ్ధం, ప్రశాంతత వీటిని అంగీకరించ మనసు అలవాటు చేసుకుంది. ఎటువంటి లోటుబాట్లనైనా సహించుకో గలిగే ధైర్యం వచ్చేసింది.

ధైర్యం రోజు కాదు...నిన్న కాదు. పెళ్ళి మండపంలోకి దూరి, చంద్రమోహన్ ఆమెకు తాళి కడుతున్నప్పుడు కళ్ళెదురుగా కూర్చుని, చేతిలో ఒక నిమ్మపండు ఇచ్చేసి కృష్ణమూర్తి వెళ్ళిపోతునప్పుడే ఆమె మనసు రాయి అయిపోయింది.

ఇక జరగబోయేది ఏదైనా మాలతీ యొక్క శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు...అని ఆత్మను, శరీరాన్నీ వేరు వేరుగా విడదీసి ఉంచుకోగల విద్యను నేర్చుకుంది. అందువల్ల జీవితాన్ని కొంతవరకు చిక్కులు లేకుండా నడిపించగల దారిని తెలుసుకోగలిగింది.

ఆమె నవ్వింది అంటే. ఉత్త నోరు నవ్వింది. మాట్లాడిందీ అంటే పెదవులు మాట్లాడినై. చూసింది అంటే కళ్ళు చూసినై. ఇద్దరు పిల్లలను చంద్రమోహన్ కు కనిచ్చింది అంటే శరీరం కని ఇచ్చింది.

మనసు...?

అది ఎప్పుడో కృష్ణమూర్తి దగ్గర ఐక్యమైపోయింది. ఆయన్ని దాంతో అవగాహన చేసుకుంది! అది అర్ధం చేసుకోకుండా ఆయన దగ్గర నుండి ఆమెను వేరుచేశారు. కొట్టారు. గదిలోకి తోసి తాళం వేసి కాపలా ఉండి పెళ్ళి చేశారు.

మనసు గురించి వాళ్ళు పట్టించుకోలేదు. ఆత్మ గురించి బాధపడలేదు. ఈయన కూడా శరీరానికే కదా అని పెళ్ళి చేసారు. వదిలేసారు.

అందువలన చంద్రమోహన్ కు బాధ్యతగా చెయ్యాల్సిన వన్నీ చేయకుండా వదిలిపెట్ట లేదు. ఆయన్ని సంతోషపరచటాన్ని ఆపలేదు. ఒకే పరుపుపై పడుకోవటం తప్పించుకోటానికి ప్రయత్నించటం చేయలేదు.

దాన్ని కర్మ భావనగా తీసుకుని -- కర్మ కోసం బాధ్యతలు స్వీకరించి, ఇరవై సంవత్సరాలు జీవితం గడిపి, తరువాత నిమోనియా జ్వరం వల్ల చంద్రమోహన్ వెళ్ళి జేరిపోయిన తరువాత కూతుర్లకు పెళ్ళిచేసి...ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడ పుట్టిన ప్రదేశాన్ని తొక్కలేదు. తొక్క కూడదు అనే పట్టుదలను రోజు వరకు కాపాడింది. అదేలాగా కృష్ణమూర్తి గురించి ఎవరి దగ్గరా ఎంక్వయరీ చెయ్యలేదు.

తనకు పెళ్ళి అయిన తరువాత ఆయనకు ఏమైంది, ఆయన ఏమైయ్యాడు తెలియలేదు. ఊర్లోనే ఉన్నాడా అనేది కూడా తెలియదు. పెళ్ళి చేసుకున్నారా అనేది కూడా తెలియదు. అలా తన మనసును బంకమట్టి పోసి గట్టి చేసుకుని అనిచిపెట్టుకుంది.

కానీ, అప్పుడప్పుడు ఆయన జ్ఞాపకాలు మాత్రం వస్తాయి. కళ్ళెదురుగా మొహం వచ్చి నిలబడి వేదన పెడుతుంది. చివరగా ఆయన చెప్పేసి వెళ్ళిన ఉపదేశ వాక్యాలు చెవిలో వినబడి జ్ఞాపకాలను కట్టుబరుస్తుంది.

రోజు ఏమిటో పొద్దున లేచిన దగ్గర నుండి ఆయన జ్ఞాపకమే వస్తోంది. వంట  చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, పగటిపూట ఖాలీగా రెస్టు తీసుకుంటున్నప్పుడు.

                                                                               ***********************

అప్పుడే గబుక్కున జ్ఞాపకాలను వెనక్కి నెట్టి పడుకుంది. గదిపై ఉన్న దూలాన్ని చూస్తూనే ఉంది. నిద్రలోకి జారుకుంది.

నిశ్చింతగా నిద్రపోతోంది. పగటి కలలు లేని నిద్ర. కదులుడో, దడబిడలు లేని ప్రశాంతమైన పరిస్థితి.

పరిస్థితిలో పడుకోనున్నప్పుడు పాలవాడి పిలుపు విని మెలుకువ వచ్చింది. లేచి టైము చూసింది. సాయంత్రం ఐదు ఇరవై. అర్జెంటు పడుతూ ముఖాన్ని తుడుచుకుని, గిన్నెతో వాకిట్లోకి వచ్చి పాలు పోయించుకుంది.

రేపట్నుంచి ఒక లిటర్ పాలు ఎక్కువ కావాలి గోపాల్. ఉరి నుండి పిల్లలు  వస్తున్నారు...

సరేనమ్మా...పోస్తాను

భవ్యంగా సమాధానం చెప్పి పాలవాడు వెళ్ళిన తరువాత లోపలకు వచ్చి  డికాక్షన్‌ దింపి కాఫీ కలుపుకుని తాగింది. కొంచం ఉత్సాహం వచ్చినట్టు అనిపించింది. రాత్రి భోజనం అవసరం లేదు అనిపించటంతో, వంటగది లైటు ఆపి మొహం కడుక్కుని వచ్చింది.

హాలులోకి వచ్చినప్పుడు టైము ఆరుగంటలు కొట్టింది. చేతులు యంత్రంలాగా దేవుడికి దీపం వెలిగించి, నోరు లలితా సహస్రనామంచెప్ప...రెండు మూడుసార్లు తడబడింది. మనసును దాంట్లో లగ్నం చేయకుండా చెప్పి ఫలితంలేదని అలాగే ఆపేసింది.

ఈరోజు ఎందుకు ఇలా తడబడుతున్నాం?’ అనేది అర్ధంకాని ఆమె, మెట్లు ఎక్కి మేడపైకి వెళ్ళింది.

రోజూ సాయంత్రం దీపం వెలిగించి, మంత్రం చెప్పిన తరువాత టెర్రస్సుకు వచ్చి కూర్చోవటం అలవాటు. మడత కుర్చీ విడదీసి వేసుకుని గంటలకొద్ది కూర్చుంటుంది.

కళ్ళు ఆకాశంలోని నక్షత్రాలను చుట్టివస్తుంది. గాలి చల్ల చల్లగా వీస్తుంది. కొబ్బరిచెట్టు కొమ్మలు రహస్యం మాట్లాడతాయి. వెన్నెల అందంలో చిన్నపిల్లలా కూర్చోనుంటుంది.

సమయంలో ఆమెలో వివరించలేని ఒక అనుభవం ఏర్పడుతుంది. ఎటువంటి ఆలొచనా లేకుండా... ప్రతిస్పందన లేకుండా, ఎవరి జ్ఞాపకాలూ లేకుండా... దృశ్యమూ కనబడకుండా మనసు శూన్యం అయిపోతుంది.

శబ్ధమూ చెవిలో పడకుండా ఉంటుంది. కళ్ళుమూసుకుంటే ఒంట్లో నుండి ఒక్కొక్కటీ విడిపోయి పైన తేలుతున్నట్టు తెలుస్తుంది. తేలుడులో చాలాసేపు ఉంటుంది. నోరు తానుగా చండీ స్లోకంచెబుతుంది.

కానీ  రోజు.

ఎటువంటి పట్టూలేదు. ఏదో ఒకటి మనసును తరుముకుంటూ వస్తోంది. కళ్ళు మూసుకుంటే ఏవో దృశ్యాలు. కాలేజీ, ఆమె... కృష్ణమూర్తి పాఠం చెప్పే దృశ్యం...పూవుల కుండీపై పెయింటుతో ప్రేమికులు ముద్దుపెట్టే చిత్రం.

ప్రేమకు విడిపోవటం ఏదీ...?.......ముగింపు ఏదీ...?.......అంతం ఏదీ...?......."ఏం చెబుతున్నావు మాలతీ...?".....కొబ్బరి ఆకుల చలనానికి సమాధానం, చెవి దగ్గర కృష్ణమూర్తి స్వరం.

అధిరిపడి ఒళ్ళు జలదరించింది.

గదిలోపలకు దూరినా పేడపురుగు లాగా తిరిగి తిరిగి ఇదేం జ్ఞాపకం...? ఏమైంది నాకు? ఇన్ని సంవత్సరాలుగా లేకుండా ఈరోజు మాత్రం ఎందుకు ఇంత తడబాటు...? ఉండకూడదు. దీన్ని అనిచే తీరాలి...మనసును దాని దారిలో దాన్ని వెళ్ళనివ్వకూడదు

గబుక్కున ఈజీ చైర్లో నుండి లేచి కిందకు దిగివచ్చి రెండు, మూడు గ్లాసులు చల్లటి నీళ్ళు పోసుకుని తాగి మళ్ళీ పడుకోవటానికి  వెళ్ళినప్పుడు,

వాకిలి కాలింగ్ బెల్ మోగింది.

ఎవరై ఉంటారు...?’ అని ఆలొచించింది. ఒకవేళ రేపు వస్తానని చెప్పిన కూతుర్లలో ఒకత్తి ఈరోజే వచ్చేసిందో...?’

హాలులో లైటువేసి, జాగ్రత్తగా మామూలు పరిస్థితిలో కిటికీ ద్వారా ఎవరది...?” అని అడిగింది.

నేనే... అన్న స్వరం... కొంతసేపటి క్రితం చెవులకు వినబడిన స్వరం.

ఇన్ని సంవత్సరాల తరువాత కూడా అరిగిపోకుండా, మార్పు లేకుండా ఉన్న అదే స్వరం.

నిజమా...ఇది నిజమేనా...?”

గబుక్కున ఒంట్లో కొత్త నెత్తురు ప్రవహించిన భావనతో, ఆందోళనతో వాకిలి తలుపులు తెరిచింది.

కృష్ణమూర్తి  నిలబడున్నారు!

*************************************************PART-3******************************************

కృష్ణమూర్తిని అలాగే చూస్తూ నిలబడింది మాలతీ. లోపలకు రమ్మని పిలవాలనిపించలేదు. నోట మాట రాలేదు.

కృష్ణమూర్తియేనా ఈయన...? నిజంగానే ఆయనా...?’

ఇంకా మనసులో నమ్మకం ఏర్పడలేదు. తన జ్ఞాపకాలకు అంతశక్తి ఉందా అనేది ఆలొచించినప్పుడు ఆశ్చర్యంగా ఉన్నది. పొద్దుటి నుండి ఆయన్నే గుర్తుకు తెచ్చుకుంటున్నందువలనే ఆలొచనే ఆయన్ని కట్టి లాకొచ్చి తన ముందు నిలబెట్టిందో...?’

ఎన్ని సంవత్సరాల తరువాత కలుసుకుంటోంది...? తన జ్ఞాపకాలే ఆయన్ని ఇప్పుడు కట్టి లాకొచ్చి నిలబెట్టింది అంటే -- తన జ్ఞాపకాలకు అంతశక్తి ఉందంటే...ఎప్పుడో కలుసుకోవటం జరిగేది...కానీ ఇప్పుడు జరుగుతున్నది!? ఇదే దేవుని సంకల్పం...విధి.

ఆమె తలపైకెత్తి కృష్ణమూర్తిని చూసింది. చాలా మారిపోయున్నారు ఆయన. తలపై బట్టతల పడింది. ఒళ్ళు సన్నబడింది. ముఖం ముడుచుకుని, కళ్ళ కింద నల్ల వలయం పడుంది.

అదేలాగా వయసు తన దగ్గర కూడా మార్పులు ఏర్పరచుంటుంది అని అనుకున్న అదే సమయం.

ఆమెనే చూస్తూ నిలబడ్డ కృష్ణమూర్తి కూడా అదే అనుకున్నారు.

పాత మాలతీనా ఇది? ఎలా మారిపోయున్నది? తలనెరిసి, ఒళ్ళు చిన్నగా మడతలుపడి, రంగుతగ్గి...కళ్ళకు కళ్ళజోడు పెట్టుకుని...పాత ఆకర్షించే ఆకర్షణ లేదు. కానీ, శాంతమూ, దైవీక తనమూ, చెప్పలేని అభిమానమూ అలగే ఉన్నాయి.

ఏమిటి మాలతీ...అలాగే నిలబడిపోయావు! సార్...నిలబడ్డారు. లోపలకు పిలవరా?”

క్షమించాలి. లోపలకు రండి. ఏదో పాత జ్ఞాపకంలో ఉండిపోయాను. అవునూ...ఎక్కడ్నుంచి వస్తున్నారు...?”

హైదేరాబాద్ నుండే...

ఇన్నిరోజులుగా హైదరాబాద్ లోనే ఉన్నారా?”

అవును! ఏం, నీకు తెలియదా మాలతీ..?” -- అడిగేసి, ఒక్క క్షణం ఆలొచించి, వెనక్కి వెళ్ళారు.

ఐయాం సారీ. హఠాత్తుగా మీరు అని మర్యాదగా పిలవటం రావటంలేదు...

ఎందుకు ఇప్పుడు మర్యాద ఇవ్వాలి...?”

వయసుకైనా ఇచ్చేకావాలి కదా...?”

అలా చూసినా, మీరు నాకంటే పెద్దవారే కదా?”

దానికి తగినట్టు నీకు కూడా వయసు అయ్యిందే...?”

చిన్నగా నవ్వింది మాలతీ.

ఇప్పుడు టైములో ఏం రైలుంది...?”

బెంగళూర్ రైలులో వచ్చాను. హోటల్లో స్టే చేసి కొంచం రెస్టు తీసుకుని వచ్చాను...

ఉండండి...ఒక్క నిమిషంలో వంట చేస్తాను. ఈరోజు నాకు భోజనం వద్దు అనిపించింది. అందువలన వంట చేయకుండా ఉండిపోయాను...

వద్దు మాలతీ. నేనూ రాత్రిపూట తినటంలేదు. అంతదూరం నడిచివెళ్ళి హోటల్లో తినేసి రావటానికి భయపడే రాత్రి భోజనాన్ని ఆపేసాను

హోటల్ కు వెళ్ళి తినాలా...? ఎందుకని, ఇంట్లో ఎవరూ లేరా..?”

నా భార్య చనిపోయిన తరువాత చిన్న కూతురు శారద చూసుకునేది. దానికి మధ్యే పెళ్ళిచేసి పంపించాను. అవునూ, నువ్వు భోజనం నచ్చటంలేదు, వంటచేయలేదని చెప్పావే...ఇంట్లో ఇంకెవరికీ భోజనం అక్కర్లేదా...?”

వేరే ఎవరున్నారు వంట చేయటానికి...?”

అంటూ లోపలకు వెళ్ళిన మాలతీ కాఫీ కలిపి ఇచ్చి వంటచేయటం మొదలుపెట్టింది. వంటచేస్తున్నప్పుడే కృష్ణమూర్తి గురించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంది.

తన గురించి పూర్తిగా చెప్పింది. కృష్ణమూర్తి బలవంతం చేయటంతో...ఆయనతోపాటూ కూర్చుని భోజనం చేసింది. తరువాత కొద్దిసేపు మాట్లాడుతుండగా, టైము పది గంటలు కొట్టటంతో కూర్చున్న చోటునుండి లేచారు.

ఇక నేను బయలుదేరతాను...?”

ఎక్కడికి...హోటలుకా...?”

అక్కడికెళ్ళి ఉండటం కంటే ఇక్కడే ఉండచ్చే...?”

ఆయన ఆలొచించారు. తరువాత --

వద్దు. రేపు పొద్దున రూము ఖలీచేసి వచ్చేస్తాను. మీ పిల్లలు వస్తున్నారని చెప్పావు...చూసి బయలుదేరతాను

రాత్రంతా కృష్ణమూర్తి, మాలతీ నిద్రపోలేదు. ఒకరి గురించి ఒకరు తలచుకుంటూనే ఉన్నారు. ఇద్దరూ తోటలొ ఒంటరి మెక్కలాగా నిలబడిపోయినట్టు ఫీలయ్యారు.

మాట్లాడుకోవటానికి మనుషులు లేక, ఆలొచనలనూ, ఎమోషన్స్ ను చెప్పుకోవటానికి తోడులేక, ఒకవేళ పడకలో ఉండిపోతే చూసుకోవటానికి ఎవరూలేక...ఇదే విధించబడిందంటే ఏం చేయగలం...?

మరుసటిరోజు కృష్ణమూర్తి వెళ్ళినప్పుడు ఇల్లే కోలాహలంగా ఉంది. మాలతీ తన కూతుర్లనూ, అళ్ళుల్లనూ పరిచయం చేసింది.

ఇది గిరిజ...పెద్దది. ఈయన ఆమె భర్త మొహన్. అది రెండో కూతురు మేనకా. ఆయనే అల్లుడు. పేరు బద్రి

పరిచయమప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చిన అళ్ళుల్లు,

అమ్మా, ఈయన ఎవరని చెప్పలేదే...?” అన్న వెంటనే మాలతీ కొంచం తడబడింది.

ఈయన పేరు కృష్ణమూర్తి. ఈయన...ఈయన...నా కాలేజీ ప్రొఫసర్ గా ఉండేవారు...

కానీ... అళ్ళుల్లు బద్రి, మొహన్ ఆమెను వదలలేదు. మాలతీ యొక్క తడబాటూ, కృష్ణమూర్తి యొక్క గంభీరత్వం వాళ్ళల్లో ప్రశ్నలు లేప...చిన్నగా భార్యల దగ్గర విచారణ చేసారు.

వాళ్ళకూ ఏమీ తెలియకపోవటంతో... రోజు కృష్ణమూర్తి దగ్గర చిన్నగా ప్రశ్నగా ప్రారంభించ---

అర్ధంచేసుకున్న ఆయన...వాళ్ళు కూడా వాళ్ల అనుమానాలు తీర్చుకోవాలని నిర్ణయించి అంతా చెప్పారు. తాను మాలతీను ప్రేమించింది, పెళ్ళి టైముకు వేరుచేసింది, తరువాత ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తరువాత కలుసుకోవటానికి రావటం.

ఎమోషన్ అయి, కళ్ళు కొంచంగా నీరు కార్చ చెప్పి ముగించిన తరువాత నిదానంగా తలెత్తి గిరిజనీ, మేనకానీ చూసారు.

అమ్మా...మీ ఇద్దరికీ నా కూతుర్ల వయసే ఉంటుంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు  వాళ్ళే జ్ఞాపకం వస్తున్నారు. మీ అమ్మ లాంటి దేవతను చూడలేము. ఇన్ని సంవత్సరాల తరువాత, వయసు వచ్చిన తరువాత మమ్మల్ని మీరు ఉద్దేశంతోనూ చూడకూడదు.

ఇప్పుడు నేను మాలతీను వెతుక్కుంటూ చూడటానికి వచ్చింది గొప్ప అనుభవంతోనే. వయసులో మాకు ఒళ్ళు సమస్యలేదు. భావంతో నేనిప్పుడు రాలేదు. ఒక స్నేహితురాలుని చూసే భావంతోనే వచ్చాను.

ఇక్కడికి వచ్చి చూసిన తరువాత మీ అమ్మ కూడా అదే భావం కోసం తపన పడుతునట్టు తెలిసింది. అందువలన మమ్మల్ని, స్నేహితులుగా మీరు అర్ధం చేసుకోవలి. ఇద్దర్నీ చిన్న పిల్లలులాగా కల్మషం-సందేహం లేనివాళ్ళుగా చూడాలి

గబుక్కునలేచి కృష్ణమూర్తి యొక్క చేతులను పుచ్చుకున్నాడు మాలతీ పెద్దల్లుడు మొహన్. వణుకుతున్న స్వరంతో మాట్లాడాడు.

ఏమిటిసార్ ఇలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని అనుమానించి నేను ఏదీ అడగలేదు. ఒక సంతోషంలో అడిగాను. అమ్మ మిమ్మల్ని చూసి  మాట్లాడుతున్నప్పుడు నిర్మలంగా, ప్రశాంతంగా ఉన్నట్టు మనసుకు అనిపించింది. కాబట్టి మీరు ఆమెకు బాగా కావలసిన వారు అయ్యుండాలి అనిపించింది. అది నిజమేనా అని తెలుసుకోవటానికి అడిగాను. మనసులో ఇంకే ఉద్దేశంతోనూ అడగలేదు.

ఇప్పుడు ఇన్ని విషయాలు తెలిసిన తరువాత ఖచ్చితంగా మావల్ల మీ ఇద్దరినీ ఇలాగే వదిలేయటం కుదరదు.. మీరు చెప్పినట్టు ఇది ఒక మంచి స్నేహం అయితే -- లోతైన స్నేహితమైతే -- పవిత్రమైన బంధుత్వమైతే మీరు ఇక్కడే ఉండాలి. మీకూ, ఆమెకూ మధ్య ఉన్న స్నేహం నిలబడాలి.

పరస్పరం ఇద్దరూ ఒకరికొకరు సప్పోర్ట్ గా ఉండాలి. ఇన్ని సంవత్సరాల తరువాత కలిసిన మీట్ వేస్టు అవకూడదని నేను అనుకుంటున్నాను.

వేరు వేరు చోట్ల ఇద్దరూ సన్యాసుల లాగా జీవిస్తున్న మీరు -- ఒక గూడు కింద అదే సన్యాసి జీవితం గడపండి అని మాత్రమే కోరుకుంటున్నాను

విశాలమైన ఆలొచన, మాటలూ హృదయాన్ని తాక...గబుక్కున లేచారు కృష్ణమూర్తి.

ఏం చెబుతున్నారు మీరు...?” అని తడబడ్డారు.

నేనేమీ చెప్పలేదు. ఇక మీదట మీరు ఇక్కడే అమ్మతోనే ఉండిపోవాలని అడుగుతున్నాను. నేను మాత్రమే కాదు... గిరిజ, మేనకా, అందరి అభిప్రయమూ అదే. ఏం బద్రి...మీరు చెప్పండి...

అవునుసార్... అని మెల్లగా మొదలుపెట్టాడు బద్రి.

మా అమ్మగారు వేరు...మా అత్తగారు వేరు అని మేమెప్పుడూ అనుకోలేదు.  ఇలాంటి పరిస్థితి మా అమ్మగారికి ఏర్పడుంటే మేము ఏం చేస్తామో దాన్నే ఆమెకూ చేయాలని నిర్ణయించుకున్నాము. ఇక మీరు అమ్మకు తోడుగా...మంచి స్నేహితుడిగా ఇక్కడే ఉండిపోవాలి...

గిరిజానూ,  మేనకానూ లేచివెళ్ళి మాలతీ ముఖాన్ని పైకెత్త...ఆమె కొంచం సంసయించింది.

అదెలాగమ్మా కుదురుతుంది? ఊరు, లోకం ఏం చెబుతుంది? ఆయన యొక్క కూతుర్లూ, అళ్ళుల్లూ ఏం చెబుతారో?”

ఏమ్మా...ఊరు, లోకమూ మనం సంతోషంగా ఉండటం చూడలేక లేనిపోనివి చెప్పటానికి ముందుకు వస్తుంది? మనం కష్టపడేటప్పుడు ఆ ఊరు, లోకమూ ముందుకురాదు. అందువల్ల ఊరు, లోకమూ గురించిన ఆందోళనను వదులు. ఈయన కూతుర్లనూ, అళ్ళుల్లనూ రమ్మని చెప్పి వెంటనే సమాచారం పంపిస్తాము.

ఆయనకు కూతుర్లుగా పుట్టిన వాళ్ళు మిమ్మల్ని అర్ధం చేసుకునే వాళ్ళుగానే ఉంటారు. అలా అర్ధం చేసుకోకపోయినా పరవాలేదు. అర్ధం చేసుకోలేని వాళ్ల గురించి బాధ పడక్కర్లేదు. అర్ధం చేసుకున్న వాళ్ళకు వివరణ అవసరం లేదు. ఏమ్మా...?”

మాలతీ మౌనంగా ఉండగా...పెద్ద అల్లుడు లేచి కృష్ణమూర్తి చేయి పుచ్చుకుని.

రండిసార్! మీ కూతుర్లను వెంటనే బయలుదేరి ఇక్కడికి రమ్మని చెబుదాం... అనగా, కృష్ణమూర్తి, మాలతీ యొక్క అంగీకారంకోసం ఆమెవైపు చూసాడు.  

అమ్మను ఎందుకు చూస్తారు...? అమ్మా! ఆయన్ని వెళ్లమని చెప్పేసి లోపలకు రామ్మా. పాయాసం చేద్దాం. ఒక మంచి స్నేహాన్ని ఒక మంచి విధంగా సెలెబ్రేట్ చేయాలి... అని చెబుతూ మేనకా లేచి వంటగదిలోకి వెళ్ళగా.

ఉత్సాహంగా తన సెల్ ఫోన్ తీసిన కృష్ణమూర్తి, తన కూతుర్లకు విషయాన్ని  తెలియజేయటానికి రెడీ అయ్యారు!

*************************************************సమాప్తం******************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తొలిచూపు...(పూర్తి నవల)

ప్రేమ సుడిగుండం...(పూర్తి నవల)

జీవన పోరాటం…(పూర్తి నవల)