శతమానం భవతి…(పూర్తి నవల)
శతమానం భవతి (పూర్తి నవల)
పెళ్ళి చేసుకుని కాపురానికి వెళ్ళిన మానస సంతోషంగా జీవితం కొనసాగిస్తూ ఉంటుంది. ఆమె సంతోషాన్ని మరింత పెంచే విధంగా ఆమె చెల్లి పెళ్ళి నిశ్చయం అయ్యిందని తండ్రి ఫోన్ చేసి చెబుతాడు. పెళ్ళి చేసుకుని కాపురానికి వెళ్ళిన మానస పెళ్ళి తరువాత తన సొంత ఊరికి ఒక్కసారి కూడా రాలేకపోయింది...అందువలన ఎప్పుడెప్పుడు తన సొంత ఉరు వెళ్ళి, చెల్లిని ఆటపట్టిస్తూ, పెళ్ళి పనులలో తల్లి-తండ్రులకు సహాయం చేయాలని ఆత్రుత పడుతున్న మానసకు, చెల్లి పెళ్ళికి ఊరు రావద్దని, వస్తే తాను చేసిన తప్పు తిరిగి బయటకు వచ్చి చెల్లి పెళ్ళి ఆగిపోయే పరిస్థితి వస్తుందని తల్లి గట్టిగా చెప్పటంతో విలవ్లలాడిపోతుంది.
భర్తకు ఏవో కుంటి సాకులు చెప్పి చెల్లి పెళ్ళికి తాను వెళ్లటం లేదని చెబుతుంది మానస. భర్త కైలాష్ కు భార్యపై అనుమానం వస్తుంది.
చెల్లి పెళ్ళికి నెలరోజుల ముందు వెడతానని పట్టుబట్టిన భార్య, సడన్ గా ఎందుకు అసలు పెళ్ళికే వెళ్లనంటోంది? గత కొన్ని రోజులుగా భార్య పడే వేదనను గమనిస్తున్న కైలాష్, ఆమె బాధకు కారణం ఏమిటో ఎలా తెలుసుకున్నాడా? అసలు ఆ కారణం ఏమిటి? చివరికి చెల్లి పెళ్ళికి మానస వెడుతుందా? లేదా?.....ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ నవల చదవండి.
నవలలో ఎన్నో టర్నింగ్ పాయింట్స్, ఎమోషనల్ సీక్వెన్స్ మిమ్మల్ని అలరిస్తుంది.
*********************************************PART-1********************************************
వంటింట్లో కూరగాయలు తరుగుతున్నది మానస.
'అలూ...బైంగల్...సబ్జీ'- ప్రతి రోజూ సరిగ్గా ఉదయం పదకొండు గంటలకు ఖంగుమని వినిపిస్తుంది కూరగాయలమ్ముకునే తాత గొంతు.
ఆ రోజు ఆ గొంతు వినబడ్డ వెంటనే నవ్వుకుంది మానస.
పెళ్ళి చేసుకుని మహారాష్ట్రం వచ్చిన కొత్తలో హిందీ భాష ఒక ముక్క కూడా అర్ధమయ్యేది కాదు.
"నీకు హిందీ భాష వచ్చా?" గోరింటాకు పెట్టుకున్న భార్య చేతి వేళ్ళను మృధువుగా నొక్కుతూ ఫస్ట్ నైట్ రోజు అడిగాడు భర్త కైలాష్.
“వచ్చు” అన్నట్లు తల ఉపుతూ "హిందీలో మధ్యమ వరకు చదువుకున్నాను" చెప్పింది మానస.
"అయితే...కొంచం తెలుసని చెప్పు"
"హూ" అంటూ తల ఊపింది మానస.
కానీ
మొదటిసారి కాపురానికి డిల్లీ వెళ్ళే రైలు ఎక్కి కూర్చున్నప్పుడు, చెన్నై నుండి మాహారాష్ట్రం వెడుతున్న ఒక గుంపు వాళ్ళకు ఎదురుగా కూర్చుని మాట్లాడిన హిందీ భాషను విని కొంచం భయపడింది మానస. వాళ్ళు భర్త కైలాష్ తో మాట్లాడిన హిందీ, కైలాష్ వాళ్ళకు హిందీలో ఇచ్చిన సమాధానం విన్న మానసకు తల తిరిగినంత పనైంది.
"ఏం మాట్లాడుతున్నారు...నా గురించి ఏదో చెబుతున్నారు?"
భర్త చెవిలో గుశగుశలాడింది మానస.
"నీకు హిందీ బాగా వచ్చు కదా"
భర్త సమాధానంతో పరువు పోయినట్లు ఫీలయ్యింది మానస.
'ఏక్ గావోమే ఏక్ కిశాన్’ కంఠస్తం పట్టిన తన హింది పనికిరాదని తెలుసుకుంది.
ఇదిగో ఈ కూరగాయలు అమ్ముకునే తాత గొంతును మొదటిసారి విన్నప్పుడు, అతను అమ్ముతున్న కూరగాయలు ఏమిటో వాటిని చూసిన తరువాత మానసకు అర్ధమయ్యింది.
ఆ రోజు భర్త కైలాష్ ఇంటికి వచ్చిన వెంటనే కూరగాయలు అమ్ముకునే తాత గురించి, అతని దగ్గర కూరగాయలు ఎలా కొన్నది వివరించి చెప్పింది. పగలబడి నవ్వాడు భర్త కైలాష్.
“నాకు హిందీ బాగా వచ్చు...ఫస్ట్ నైట్ రోజు గొప్పగా చెప్పావు? మొదటి పనిగా హిందీ నేర్చుకో. ఇరుగు పొరుగు వారితో స్నేహం చేసుకో. హిందీ తానుగా వస్తుంది...కానీ అంతవరకు హిందిలో మాట్లాడ కూడదు" అంటూ మళ్ళీ పగలబడి నవ్వాడు. భర్త నవ్వుతుంటే సిగ్గుగా అనిపించింది మానసకు.
అది తలచుకునే ఇప్పుడు నవ్వుకుంటోంది. అలా కూరగాయలు అమ్ముకునే తాత దగ్గర, ఇరుగు పొరుగు వారితో తెలిసీ తెలియని హిందీలో మాట్లాడుతూ, వారి దగ్గర నుండి చాలా వరకు హిందీ నేర్చుకుంది.
మహారాష్ట్రం వచ్చి రెండేళ్ళు అవుతోంది. ఇప్పుడు మానసకు హిందీ భాష మాట్లాడడం, అర్ధం చేసుకోవడం బాగా అలవాటయ్యింది.
కైలాష్ కి అక్కడున్న సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం. మంచి జీతం, కావలసిన వసతులతో కంపనీ క్వార్టర్స్, హాయిగా గడిచిపోయే జీవితం.
వంట పూర్తి అయ్యే సమయంలో ఎవరొ తలుపు తడుతున్న శబ్ధం. పక్కింటి “మెహతా బాబీ” అయ్యుంటుంది అనుకుని, గ్యాస్ స్టవ్ ను తగ్గించి, వంటింట్లో నుండి వచ్చి తలుపు తెరిచింది.
ఎదురుగా భర్త కైలాష్.
చేతిలోని మోటర్ సైకిల్ తాళం ను గిరగిరా తిప్పుతూ "ఒక ముఖ్యమైన ఫైలు మర్చిపోయి వెళ్ళిపోయాను. అందుకే తీసుకు వెళ్ళటానికి వచ్చాను" అంటూ కొంటె చూపుతో భార్యను చూశాడు.
“ఫైలు మర్చిపోయి వెళ్ళిపోయారా? ఇది నేను నమ్మాలా? ఇలాగే ఇంతకు ముందు మీరు ఫైలు మర్చిపోయి, తిరిగి ఇంటికి వచ్చినప్పుడల్లా ఏం జరిగిందో నాకు బాగా గుర్తుంది. ఫైలూ లేదు, గీలూ లేదు...మీరు దయచేయండి" అంటూ ఆఫీసుకు తిరిగి వెళ్ళమని చేయి చూపించింది.
"ఏయ్...ఏమిటి నువ్వు? ఆఫీసులో ఇన్స్పెక్షన్ జరుగుతోంది. ప్రతి ఒక్కరూ కాళ్ళ మీద వేడినీళ్ళు పడినట్లు కంగారుగా తిరుగుతున్నారు. తెలుసా? నేనేమో ఒక ముఖ్యమైన ఫైలును ఇంట్లో మర్చిపోయి వెళ్ళాను. ఇది తెలిస్తే జీ.ఎం గంతులేస్తాడు. పది నిమిషాలలో ఆ ఫైలు తీసుకుని ఆయన ముందుకు వెళ్ళకపోతే మనం మూటా ముల్లె సర్దుకొని ఊరికి వెళ్ళి అడుక్కోవాలి"
భార్యను తోసుకుంటూ లోపలకు వెళ్ళాడు.
కంగారు కంగారుగా తన గది లోకి దూరాడు. అక్కడున్న టేబుల్ సొరుగులో నుండి మూడు ఫైళ్ళను తీసి, అందులో ఒక ఫైలును తీసుకుని బయటకు వచ్చాడు.
వంట గదిలో, పూర్తైన వంట గిన్నెలపై మూతపెడుతున్న భార్య వెనుక నిలబడి "మానసా" అని పిలిచాడు కైలాష్.
"ఊ" అన్నది మానస.
"బాగా టయర్డ్ గా ఉంది...కొంచం కాఫీ ఇస్తావా"
"ఇప్పుడు ఏం చేసొచ్చారని...టయర్డ్ అవటానికి"
"ఫైలు వెతికి తీసుకున్నాను కదా...అదే టయర్డ్ అయ్యాను"
"అదేదో చాల కష్టమైన పని లాగా..."
"సరే, సరే. తొందరగా ఇవ్వు. పది నిమిషాల్లో ఆఫీసులో ఉండాలి"
"మీరు వెళ్ళి హాలులో కూర్చోండి...తెస్తాను"
కైలాష్ వెనక్కు తిరిగి హాలులోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు.
కొద్ది నిమిషాల తరువాత అక్కడికి కాఫీ తీసుకు వచ్చిన మానస "ఇదుగోండి" అంటూ కాఫీ కప్పు అందించింది.
భార్య అందించిన కాఫీ కప్పు తీసుకుని, టీపా మీద పెట్టి, గబుక్కున లేచి నిలబడి మానసను గట్టిగా కౌగలించుకున్నాడు.
"అయ్యో...వదలండి"
"ఊహు"...అంటూ అమె బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు.
ముఖాన్ని పక్కకు తిప్పుకున్న మానస "వదలండి...నాకు తెలుసు మీరు ఎందుకు వచ్చారో"
"తెలుసు కదా...మరెందుకు ఈ అబ్జెక్షన్"
“దేనికైనా ఒక టైమంటూ ఉంది...అయినా, బాగా టయర్డ్ గా ఉన్నది, అది ఇది అని కథలు చెప్పారు"
"నిన్ను చూడగానే పూర్తి ఎనర్జీ వచ్చేసింది"
"వస్తుంది...వస్తుంది!” రెండు చేతులతోనూ భర్తను వెనక్కి తోస్తూ “మర్యాదగా ఆఫీసుకు బయలుదేరండి. లేకపోతే మీ జి.ఎం కు ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్న విషయం చెప్పేస్తాను"
"నువ్వు చెప్పినా చెబుతావు! నిన్ను....రాత్రికి చూసుకుంటా" అంటూ అమెను విడిచిపెట్టి ఫైలు తీసుకుని బయలుదేరాడు.
"కాఫీ"
"నువ్వు తాగేయ్"
భర్త హడావిడి చూసి నవ్వుకుంది మానస.
మైన్ డోర్ తలుపుకు గడియ వేసి, మిగిలిన పని చేసుకోవడానికి వంటింట్లోకి వెళ్ళింది మానస.
ఇంతలో హాలులో ఉన్న టెలిఫోన్ మోగింది.
గబగబ హాలులోకి వచ్చిన మానస, రీసీవర్ తీసి "హలో" అన్నది.
"నేనమ్మా...నాన్నను మాట్లాడుతున్నాను"
ఆ గొంతు శబ్ధం విన్న వింటనే మానస మనసులో కాకరపువొత్తులు వెలిగించినంత వెలుగుతో కూడిన ఆనందం వెళ్ళివిరిసింది.
"నాన్నా....ఎలా ఉన్నావు?"
"బాగున్నానమ్మా"
"అమ్మ, చెల్లి ఎలా ఉన్నారు?"
"చాలా బాగున్నారమ్మా. నువ్వు, అల్లుడుగారు ఎలా ఉన్నారు?”
"బాగున్నాము నాన్నా…..మిమ్మల్నందరినీ చూడాలాని చాలా ఆశగా ఉన్నది"
"ఒకసారి వచ్చి వెళ్ళొచ్చు కదా"
"ఎక్కడ నాన్నా...ఆయనకు సెలవు దొరకాలి కదా"
"దూరంగా ఉంటే ఇదేనమ్మా ప్రాబ్లం...లాంగ్ లీవ్ పెట్టాలి. ఒక్కసారిగా లాంగ్ లీవ్ కంపనీ వాళ్ళు ఇవ్వరు. అల్లుడు గారిని హైదరాబాదుకు మార్చుకుని వచ్చేయమని చెప్పు"
"అది అంత సులభం కాదు నాన్నా”
"సరేనమ్మా! నీతో ఒక ముఖ్యమైన విషయం చెబుతామని ఫోన్ చేశాను"
"చెప్పు నాన్నా"
"పెళ్ళి చూపులకని సుజాతని చూడటానికి రాజమండ్రి నుంచి వచ్చారమ్మా"
"అలాగా? పెళ్ళి కొడుకు ఏం చేస్తున్నాడు?"
"పెళ్ళి కొడుకు బ్యాంకులో మేనేజర్. మంచి సంబంధం...బాగా ఉన్నవాళ్ళమ్మా. ...చూడటానికి కూడా బాగా హుందాగా, అందంగా ఉన్నాడమ్మా"
"అలాగైతే పెళ్ళి కుదుర్చుకుని ఉండొచ్చు కదా”
"ఈ సంబంధం ఓకే చేసుకుందామనే అనుకుంటున్నాము...జాతకం కూడా బాగా కలిసింది"
"చాలా ఆనందంగా ఉంది నాన్నా. త్వరగా ముహూర్తాలు పెట్టుకోండి"
"కానీ ఒక ప్రాబ్లం నన్ను వేదిస్తోందమ్మా"
"ఏమిటి నాన్నా అది?"
"డబ్బు ఎలా సర్ధుబాటు చేసుకోవాలో తెలియటం లేదమ్మా. నీ పెళ్ళి జరిగి రెండు సంవత్సరాలు అవుతోంది. నీ పెళ్ళికి చేసిన అప్పులు చాలా వరకు తీర్చాను. కొద్దిగా ఉంది...సుజాతకి రెండేళ్ళ తరువాత పెళ్ళి పెట్టుకుందాములే అనుకున్నాను. కానీ దానికి ఇలా సడన్ గా మంచి సంబంధం వస్తుందని అనుకోలేదు. ‘మంచి సంబంధం. వదులుకోకూడదండి. ఎలాగైనా డబ్బు సర్దుబాటు చెయ్యండి’ అంటోంది మీ అమ్మ. అందుకే ఏం చేయాలో తెలియటం లేదు"
"నేను కావాలంటే ఆయన దగ్గర అడిగి కొంత డబ్బు సర్ధుబాటు చేస్తాను"
“వద్దమ్మా... డబ్బు వద్దు. అమ్మ నిన్ను ఒకటి అడగమంది"
"చెప్పు నాన్నా"
"పెళ్ళి వారు యాబై కాసుల బంగారం అడుగుతున్నారు. నువ్వు నీ నగలలో ఏదైనా రెండు నగలు ఇస్తే...వాటిని కూడా ఇచ్చి తాంబూలాలు పుచ్చుకుందామని చెప్పింది"
"దానికేముంది నాన్నా....ఏం నగలు కావాలో అడగండి. ఇస్తాను. సుజాత పెళ్ళి బాగా గ్రాండు గా జరగాలి. దానికోసం ఇదికూడా చెయ్యకపోతే ఎలా నాన్నా? ఎన్ని నగలైనా నేను ఇస్తాను.”
"నువ్వలా చెబుతూంటే ఆనందంగా ఉందమ్మా. కానీ, అల్లుడుగారు ఏమంటారో? ఆయన్ని అడగ కుండా నువ్వే సమాధనం చెబుతున్నావు...ఎలాగమ్మా?"
“నాన్నా...ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన ఇమ్మనే చెబుతారు’
"అల్లుడు గారి మీద నీకున్న నమ్మకం చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. కానీ, ఆయన్ని అడగ కుండా నా దగ్గర ఇస్తానని చెప్పినట్లు ఆయనకు చెప్పకమ్మా. ‘నన్ను అడగ కుండా నగలు ఇస్తానని నువ్వెందుకు మాటిచ్చావు’ అంటూ నీతో గొడవకు దిగుతారేమో"
"నాన్నా...మీ అల్లుడు అలాంటి మనిషి కాదు. చాలా మంచి వారు. ఆయన తన స్నేహితుడి పెళ్ళికే డబ్బు సహాయం చేశారు. అలాంటిది, నా చెల్లి పెళ్ళికి సహాయం చేయరా?"
"ఏంటోనమ్మా...ఇంత మంచి అల్లుడు దొరికినందుకు నేనెంతో పుణ్యం చేసుకోనుండాలి. సుజాత కి కాబోయే అల్లుడు కూడా మంచి వాడుగా ఉంటే, నేనెంతో అద్రుష్ట వంతుడౌతాను. ఇద్దరి కూతుర్లనూ మంచి వారి చేతుల్లో పెట్టానని సంతోషంగా, త్రుప్తిగా మిగిలిన జీవితాన్ని ఆనందంగా గడిపేస్తాను"
"నాన్నా...నీ మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది...నువ్వు అనవసరంగా భయపడకు"
"సరేనమ్మా....అల్లుడు గారిని అడిగానని చెప్పు. ఆయన్ని అడిగి నాకు ఫోన్ చెయ్యి”
“సరే నాన్నా...అమ్మ దగ్గర చెప్పు, దేనికీ కంగారు పడవద్దని. సుజాత పెళ్ళి గొప్పగా జరుపుదాం"
"సరేనమ్మా"
నాన్న టెలిఫోన్ పెట్టాశారు.
మానసకు మహా ఆనందంగా ఉంది. వెంటనే సుజాతను చూడాలని, పెళ్ళి గురించి ఎన్నో విషయాలు మాట్లాడి, పెళ్ళి చేసుకోబోయే పెళ్ళికొడుకు గురించి ఆటపట్టించి, ఆమె ముఖంలో సిగ్గు తెప్పించి, అది చూసి ఆనందపడాలని ఉన్నది.
"వెంటనే వెళ్ళలేను...తాంబూలాలకు వెళ్ళినప్పుడు ఒక పది రోజులు,పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక నెల రోజులు అమ్మా, నాన్నల దగ్గర ఉండాలి. ఊర్లో అందరినీ పలకరించాలి" ఖచ్చితంగా మనసులో ప్లాను వేసుకుంది.
పెళ్ళి తరువాత రెండు సార్లు మానస ఊరికి వెళ్ళీనా, తన ఊరు వెళ్ళలేదు. పిన్ని కూతురు పెళ్ళికి, ఏలూరు వెళ్ళింది.నేరుగా కల్యాణ మంటపానికి వెళ్ళి, మరునాడు అక్కడి నుండి తిన్నగా రైల్వే స్టేషన్ కు వచ్చి, తిరుగు రైలు ఎక్కింది. రెండో సారి అత్తయ్యకు సీరియస్ గా ఉన్నదని చెబితే తిన్నగా హాస్పిటల్ కు వెళ్ళి, అక్కడే రెండు, మూడు రోజులు ఉండి, అక్కడే అమ్మా, నాన్న, చెల్లి ని చూసి హాస్పిటల్ నుండి వెళ్ళిపోయింది.
మధ్యాహ్నం భర్త లంచ్ కు వచ్చినప్పుడు మానస అతన్ని కౌగలించుకుంది.
ఆశ్చర్యపోయిన కైలాష్ "ప్రొద్దున ఫైలు కొసం వచ్చినప్పుడు నన్ను దూరంగా తొసేశావు. ఇప్పుడు కూడా దీనికి ఇది టైము కాదు. మరి ఇప్పటి నీ సంతోషానికి కారణమేమిటో"
"సంతోషమైన విషయం ఒకటుంది"
"వావ్...చెప్పు...చెప్పు"
"కనుక్కోండి చూద్దాం"
"చిన్ని మానస"
"దానికి ఇంకా టైముంది. మీరే కదా దానికి టైము పెట్టారు"
"మరైతే ఇంకేమిటో చెప్పు"
"సుజాతను చూడటానికి పెళ్ళి వారు వచ్చారట"
"అలాగా....సుజాత వాళ్ళకు బాగా నచ్చుంటుందే...ఓకే చెప్పుంటారే"
"అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నారు"
"సుజాత అందం అలాంటిది...ఎవరైనా ఆమె అందానికి బానిసలే"
“మీరు కూడానా"
"అందులో సందేహం లేదు. నిజం చెప్పలంటే సుజాతనే పెళ్ళి చేసుకుందామనుకున్నాను. మా అమ్మే అడ్డుపడింది. అక్కయ్య ను చూడటానికి వచ్చి చెల్లెల్ను ఒకే చేస్తే, మనల్ని తన్ని తరుముతారు అని చెప్పింది. మొదటికే మోసం వస్తుందని నేనే నిన్ను చేసుకోవడానికి సరే అని చెప్పాను"
మానస మొహం ఎర్ర బడింది. వేడి వేడి ముక్కల పులుసును భర్త చేతి మీద పోసింది.
"ఆ... ….ఆ…… రాక్షసీ...మొగుడి మీద వేడి పులుసును పోసే నువ్వూ ఒక భార్యవేనా"
“అదే నేనూ అడుగుతున్నా... మీరూ ఒక మొగుడేనా? …నా మెడలో తాలి కట్టి, ఇంకొక అమ్మయి అందం గురించి పొగడుతున్నారే..."
“ఇంకొక అమ్మాయా....నీ చెల్లెలు అందం గురించే కదా గొప్పగా చెప్పాను"
"సరే...మాట్లాడుతూనే ఉండండి"
"కోపమా? సరదాగా అన్నాను...సరే చెప్పు"
"పెళ్ళికొడుకు బ్యాంకులో మేనేజర్ గా చేస్తున్నాడట. బాగా ఉన్నవాల్లట"
"అలాగా! అయితే ఇంకేం...పెళ్ళి ఖాయం చేసుకోవచ్చుగా?"
"డబ్బు కోసం ఆలొచిస్తున్నారట. నా పెళ్ళికోసం చేసిన అప్పు ఇంకా కొంచం తీర్చాలట...ఈ లోపే మళ్ళీ పెళ్ళి, అప్పు అంటే భయపడుతున్నారు...కానీ మంచి సంబంధం, వదులుకోలేక పోతున్నానని చెప్పారు"
“ఎందుకు వదులుకోవాలి? ఖర్చుకోసం భయపడి వదులుకోకూడదు. కావలసిన డబ్బు నేను ఏర్పాటు చేసిస్తానని చెప్పకపోయావా? నగలు, బంగారం కావాలంటే నీ దగ్గరున్నవి ఇవ్వు"
అంతే, మానస కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. అమాంతం లేచి భర్తను కౌగలించుకుని గట్టిగా ఏడుస్తూ "మీకు చాలా పెద్ద మనసండి" అన్నది.
*********************************************PART-2********************************************
సుజాత నిశ్చయతాంబూల మూహూర్తం ఏర్పాటు చేయబడింది....పెళ్ళి తెనాలి లో కాబట్టి నిశ్చయతాంబూలాలు రాజమండ్రిలొ పెళ్ళికొడుకు ఇంటి దగ్గర అని ఒప్పుకున్నారు.
తాంబూలాలు పుచ్చుకునే తారీఖును మానసకు ఫోన్ మూలం తెలిపాడు తండ్రి.
"మానసా...నిశ్చయతాంబూలాలకు నువ్వు, అల్లుడు గారూ వచ్చేయండి. నీ దగ్గర నుండి ఇరవై కాసుల బంగారు నగలు కావాలని అమ్మ అడిగింది. నువ్వు ఇవ్వగలవా?"
"తప్పకుండా ఇస్తాను"
"చాలా ధ్యాంక్స్ అమ్మా"......తండ్రి గొంతు బొంగురు పోయింది.
"ఏంటి నాన్నా ఇది? కన్న కూతురు దగ్గర ధ్యాంక్స్ చెప్పటం"
"అంత బంగారం ఇచ్చి సహాయపడుతున్నావే..."
"నాన్నా...ఇవన్నీ మీరు నాకు ఇచ్చిన నగలేగా? నువ్వు కష్టపడి సంపాదించినదేగా?"
"అయితే మాత్రం…ఇప్పుడు అవన్నీ మీకు సొంతమైనవి కదా. అల్లుడు గారికి పెద్ద మనసమ్మా...ఎంత త్వరగా తిరిగి ఇవ్వగలనో అంత త్వరగా తిరిగి ఇచ్చేస్తానని అల్లుడు గారి దగ్గర చెప్పు"
"తిరిగివ్వటానికని నువ్వు హైరానా పడకు....మెల్లిమెల్లిగా ఇద్దువుగాని"
“అలాకాదమ్మా...నువ్వూ ఫంక్షన్లకూ, పార్టీలకు వెడతావు కదా"
"నాన్నా...ఇక్కడ మన ఊర్లోలోగా కాదు. ఇక్కడ ఆడవాళ్ళు చాలా తక్కువ నగలు వేసుకుంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే ఎంత తక్కువ నగలు వేసుకుంటే అంత గౌరవం ఇక్కడ"
“సరేనమ్మా.... నువ్వూ, అల్లుడుగారూ తాంబూలాలకు వచ్చేయండి"
"సరే నాన్నా" ఫోన్ పెట్టేసింది మానస.
మానస మనసు ఆనందంతో నిండిపోయింది. తాంబూలాలకు ఒక వారం రోజుల ముందే వెళ్ళాలని ప్లాన్ వేసుకుంది. కానీ కైలాష్ కు లీవు దొరకలేదు. చివరకి నేరుగా తాంబూలాలకు రాజమండ్రి వెళ్ళి, తిరిగి వచ్చే విధంగా సెలవు దొరికింది.
తెనాలి వెళ్ళి తల్లి, తండ్రి, చెల్లితో వారం రోజులు ఆనందగా గడిపి, వాళ్ళతో కలిసి రాజమండ్రి వెళ్ళి, తాంబూలాలు పూర్తి చేసుకుని, తిరిగి తెనాలికి వచ్చి వెడదామని ప్లాను వేసుకున్న మానసకు ఆటంకం వస్తోందని తెలుసుకున్న రోజు నుండి మానస డల్ గా కనబడింది.
"సారీ మానసా...అర్జెంటుగా ఇక్కడి లెక్కలు హెడ్ ఆఫీసుకు పంపవలసి వచ్చింది...అందుకని..." అంటూ కైలాష్ ఏదో చెప్పబోతూంటే.
"మీరేగా, ఇంతవరకు లీవు పెట్టలేదు. అందుకని నాకు లాంగ్ లీవ్ ఖచ్చితంగా గ్రాంట్ చేస్తారని నన్ను ఊరించారు. ఆ ఆశతోనే తాంబూలాలకు పది రోజులు ముందు వెళ్ళాలని ఆశ పడ్డాను"
"లాంగ్ లీవ్ ఇవ్వరని నేనూ అనుకోలేదు మానసా...ఇప్పుడేమయ్యింది చెప్పు. తాంబూలాల తరువాత పది, పదిహేను రోజులు మీ వాళ్ళతో గడిపిరా"
"అదంతా కుదరదు పెళ్లి వరకు అక్కడే ఉంటాను. పెళ్లి అయిన తరువాతే వస్తాను”
“అలాగే ఉండు...ఎవరు వద్దన్నారు"
మానస సంతోషంలో మునిగిపోయింది.
తాంబూలాల ఫంక్షన్ ముగిసింది. తల్లి-తండ్రులతో కలిసి వాళ్ళ ఊరు వెళ్లి, అక్కడ ఉండాలని నిశ్చయించుకుంది. తాంబూలాల ఫంక్షన్ గ్రాండు గా జరిగింది.పెళ్లి కొడుకు అందంగానూ, హుందాగానూ ఉన్నాడు. సుజాతకి ఈడు జోడు లక్షణం గా ఉంది. సుజాత కూడా పెళ్లి కూతురు కళతో చాలా అందంగా ఉన్నది. టైము ఎలా గడిచిందో మానసకు తెలియ లేదు. బంధువులందరిని ఒకే చోటు చూడటం, వారితో సరదాగా మాటలాడటం మానసకు ఎంతో హాయిని ఇచ్చింది. రెండు సంవత్సరాలు ఎవరిని చూడక పోవటంతో, బంధువులందరూ మానసతో బోలెడు కబుర్లు చెప్పారు.
తాంబూలాలు పుచ్చుకున్న తరువాత "అమ్మా...నేను కూడా మీతో పాటూ మన ఊరు వస్తాను. పెళ్లి వరకు మీతో ఉంటాను. మా ఆయన పర్మీషన్ ఇచ్చారు" సంతోషంగా తల్లితో చెప్పింది మానస.
మానస తల్లి మానస చెయ్యి పుచ్చుకుని ఎవరూ లేని చోటుకు మానసను తీసుకు వెళ్లి "ఇప్పుడు ఊరికి వచ్చి ఎం చేస్తావే? పెళ్ళికి ఇంకా రెండు నెలలు ఉంది. అన్ని రోజులు ఆయన్ని వదిలేసి ఉంటావా? పాపం అల్లుడు భోజనానికి ఎం చేస్తాడు?"
“అమ్మా...అదేమీ అంత పెద్ద ప్రాబ్లమ్ కాదు....ఆఫీసు దగ్గర ఒక మెస్ ఉన్నది"
“ఎన్ని రోజులు మెస్ లో తింటారు. ఏదైనా కడుపులో ప్రాబ్లమ్ వస్తే? ఆ తరువాత కష్టపడేది ఎవరు? నువ్వు ఆయనతోనే బయలుదేరి వేళ్ళు"
"అమ్మా...ఏంటమ్మా నువ్వు? నాకు మన ఊరు రావాలనుంది. మీ దగ్గర కొన్ని రోజులు గడపాలని ఆశగా ఉంది"
“ఈ రెండు రోజుల్లో నువ్వు అందరినీ చూశావు కదా? మన ఊర్లో ఎవరున్నారు. నీ స్నేహితులు కూడా లేరు. పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయారు. ఇక ఊరంటావా? తెనాలిలో ఏమీ మార్పు లేదు. అక్కడ కొత్తగా చూడటానికి ఏమీ లేదు"
"అదికాదమ్మా..."
"ఇంకా ఏమిటి చిన్న పిల్లలా మారం చేస్తున్నావు. అల్లుడు గారిని భోజనానికి కష్టపెట్టద్దు. నువ్వు ఆయనతోపాటు బయలుదేరు"
మానస ఎంత చెప్పినా వాళ్ళ అమ్మ వినలేదు. మానస నాన్న, అమ్మకు వంతు పాడాడు. మానస ఆ రోజే భర్తతో కలిసి వెళ్ళిపోయింది.
"చూశావా...అత్త, మామలకు అల్లుడు మీద ఎంత శ్రద్దో" అన్న భర్తను కోపంగా చూసి బెర్త్ లో పక్కకు తిరిగి పడుకుంది మానస.
చెల్లి పెళ్ళి రోజు దగ్గరపడుతున్న సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది మానస. అమె శరీరం మాత్రమే ఇక్కడుంది. ఆమె ఆలోచనలు ఊరికి వెళ్ళిపోయినై. నాన్న-అమ్మ ఫోన్ చేసినప్పుడల్లా ఆ రోజు ఏ పెళ్ళి పని ముగించేరో చెబుతూ ఉండటంతో వెంటనే, ఆ రోజే ఊరికి వెళ్ళిపోవాలని కూతూహల పడేది. భర్త ఆఫీసు నుండి రాగానే ఆ రోజు నాన్న, అమ్మ చెప్పిన విషయాలు ఆయనకు చెప్పటం, అయ్యో, అక్కడ లేకపొయేనే నని బాధపడటం చూసి ఆ రోజూ" మానసా, నువ్వు కావాలంటే మీ ఊరు వెళ్ళు...వస్తున్నానని మీ అమ్మకు ఫోన్ చేసి చెప్పు" చెప్పాడు కైలాష్.
"అలాగే...నాన్నకు ఫోన్ చేసి చెప్తా" అన్నది.
ఫోన్ చేసింది....తల్లి ఫోన్ ఎత్తింది.
"చూడు...ఇక్కడ ముంచుకుపోయే పనులేమీ లేవు...నువ్వు వారం రోజులు ముందు వస్తే చాలు" మానస తల్లి ఖచ్చితంగా చెప్పింది.
మానసకు కోపం, ఏడుపు రెండూ వచ్చినై. ఫోన్ రిసీవర్ ను విసురుగా పెట్టి "ఛీ..ఛీ...ఏం తల్లి-తండ్రులు వీళ్ళు? పెళ్ళి చేసి కాపురానికి వెళ్ళిన కూతురు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తారు తల్లి-తండ్రులు. వీళ్ళేమిటి వద్దు మొర్రొ అంటున్నారు. పది రోజులు అల్లుడు బయట తింటే ఏమౌతుందట? డబ్బులు, నగలు సహాయంగా ఇచ్చినంత మాత్రానా అల్లుడి గురించి ఇంతగా కరిగిపోవాలా? తలచుకొంటేనే సిగ్గుగా ఉన్నది". తనలో తనే మాట్లాడుకుంటున్నా, మాటలు పైకే వినబడ్డాయి.
"మీ తల్లి-తండ్రులను నువ్వే తిట్టచ్చా?"
“లేకపోతే ఏమిటండి. నా ఆశను ఎందుకు అర్ధం చేసుకోరు. ఎప్పుడు చూడు అల్లుడు గారేనా? నాకు వొల్లు మండిపోతోంది"
"నాకు మాత్రం సందేహంగా ఉంది"
"ఏమిటి మీ సందేహం?"
“నేను భోజనానికి కష్టపడతానని నిజంగానే ఫీలౌతున్నారా? లేక నామీద అనుమాన పడుతున్నారా?”
"మీమీద అనుమానమా?"
“అల్లుడు ఎక్కడో దూరంగా ఉన్న రాష్ట్రంలో ఉంటున్నాడు. కూతురు అతన్ని వదిలి వచ్చేస్తే ఏదైనా తప్పుడు పనులు చేస్తానేమోనని భయపడుతున్నారో ఏమో?”
“చాలు ఆపండి! మా తల్లి-తండ్రులను చీప్ గా లెక్కకడుతున్నారా? మీ మీద అంత శ్రద్దగా ఉన్నారే...వాళ్ళను మీరు అంత అసహ్యంగా తీసేస్తున్నారే? ఛి, ఛి" ....మానస మొహం చిన్నబోయింది.
"చూడరా! ఇప్పుడే తల్లి-తండ్రులను తిట్టింది. నేనేదైనా అంటే కోపం ముంచుకొస్తోంది"
"లేకపోతే? మా తల్లి-తండ్రుల గురించి మీరు తప్పుగా మాట్లాడుతుంటే నాకు కోపం రాదా?"
"సరే తల్లీ! చెంపలేసుకుంటాను" అంటూ మానసను గుండెలకు హత్తుకుని “ఉండు...మీ నాన్నతో నేను మాట్లాడతాను" అంటూ ఫోన్ తీసి మామగారికి ఫోన్ చేశాడు.
"మమయ్యగారూ! ఇక్కడుండటానికి మానసకు మనసే లేదు. మానస శరీరం మాత్రమే ఇక్కడుంది. మనసంతా అక్కడే ఉంది. ఎపుడు చూడూ చెల్లి పెళ్ళి...నేను వెళ్ళాలి అని గొణుగుతూ ఉంటోంది. నేను మానసను నెల రోజులు ముందు తీసుకు వచ్చి దింపి, వెడాతా"
“సరే అల్లుడూ. అలాగే చెయ్యండి!"
*********************************************PART-3********************************************
అంతే, మానస సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. తండ్రి ఒకే చెప్పిన వెంటనే బీరువా తెరిచి, చీరలు తీసుకుని సూట్ కేసు సర్ధటం మొదలుపెట్టింది. సంతోషం పట్టలేక ఊరు వెడుతున్న విషయాన్ని పక్కింటి మెహతా బిబీ దగర చెప్పటానికి వెళ్ళినప్పుడు ఆమె సంతోషాన్ని పాడు చేసే న్యూస్ వచ్చింది.
మానస ఇంట్లో ఫోన్ మోగింది.
రిసీవర్ తీసి "హలో " అన్నది.
"మానసా"
తల్లి గొంతే! ఉత్సాహంగా "అమ్మా ...ఏదీ మర్చిపోకుండా అన్నీ సర్ధుకున్నాను. టికెట్లు అందితే రేపు, లేకపోతే ఎల్లుండి బయలుదేరుతాము "
"అది..."
"చెప్పమ్మా...ఏదో చెప్పాలనుకుంటున్నావు"
"పెళ్ళికి నువ్వు రావద్దు"
"ఆ..మ్మా" షాక్ తో అరిచినంత పనిచేసింది మానస.
"మానసా...నువ్వు తెనాలికి రాకూడదనే తాంబూలాలప్పుడు రాజమండ్రి నుంచి, అట్నుంచి అటే అటే నిన్ను పంపించాను. నాతో నువ్వు మన ఊరికి రాకూడదనే ఆ రోజు అలా చేశాను"
"ఎందుకమ్మా…”
"ఇక్కడ నువ్వు చేసి వెళ్ళిన ఘనకార్యం ఇంకా నాలో భయాన్ని రేపుతోంది. సుజాత పెళ్ళి ఏ ఆటంకమూ లేకుండా జరిగిపోవాలి. అందుకే నిన్ను రావద్దు అంటున్నాను. అల్లుడు గారితో నువ్వే ఏదో ఒకటి చెప్పి అక్కడే ఉండిపో"
తల్లి రిసీవర్ పెట్టేసిన శబ్ధం.
మానస గుండెలో కత్తి పెట్టి గుచ్చినంత నొప్పి. రీసీవర్ పెట్టకుండా గోడనానుకుని వొరిగిపోయింది మానస.
దెయ్యం పట్టినట్లు సోఫాలో పడిపోయి ఉన్నది మానస.
ఎవరో తనను తీసుకుపోయి అడవిలో...మండుతున్న మంటల్లో పడేసినట్లు ఉన్నది.
ఏదేదో ఆలొచనలు ఆమెను చుట్టుముట్టాయి. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. ఆమె చుట్టూ ఏం జరుగుతోందో ఆమెకు అర్ధం కావటం లేదు!
పాత జ్ఞాపకాలు ఆమె మదిలో జేరి ఆమెను చితక్కొట్టి, ధ్వంశం చేసినై. ఆలొచనల ఒత్తిడి పెరిగి మెదడు నరాలు పేలిపోయి ముక్కు, కళ్ళు, చెవి నుండి రక్తం ధారగా కారుతున్నట్టు భ్రమలో పడింది మానస.
తల్లి మాటలే మళ్ళీ, మళ్ళీ వినబడుతున్నాయి.
"పెళ్ళికి రావద్దు...నువ్వే ఏదైన సాకు చెప్పి అక్కడే ఉండిపో"
“అమ్మ ఏం చెప్పింది? పెళ్ళికి రాకూడదనా? కన్న కూతుర్నా? సొంత చెల్లెలు పెళ్ళికి అక్క వెళ్ళకుండా ఉండటమా? అమ్మ ఇలా ఎలా చెప్పింది?"
"సుజాత పెళ్ళి ఏ ఆటంకమూ లేకుండా జరగాలి...అందుకే రావద్దంటున్నాను"
"నేను వస్తే పెళ్ళి ఆగిపోతుందా? ఎందుకు?"
కళ్ళలో నుండి కారుతున్న నీరు ఆగట్లేదు. ఎవరి భుజం మీదైనా తల పెట్టి ఏడవాలనిపిస్తోంది. ఒత్తిడి మనసులో నుండి మెదడుకు ఏదో చెబుతోంది.
"వద్దు. ఏడవద్దు...కైలాష్ వచ్చే సమయం దగ్గరపడుతోంది. కన్నీళ్ళు, ఎరుపెక్కిన మొహం నువ్వు పడుతున్న బాధను బయటకు చూపిస్తుంది. అతని మనసులో అనుమానం పుట్టిస్తుంది"
పెళ్ళైన కొత్తల్లోనే కైలాష్ కి అనుమానం వచ్చింది. "ఏమిటి మానసా...నువ్వు ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న దానికి మల్లె ఉంటావు? నీకు ఏమిటి ప్రాబ్లం?" అని మాటి, మాటికీ అడిగేవాడు.
"అదంతా ఏమీ లేదే? ...ఇంటి జ్ఞాపకం...అంతే" అని చెప్పి తప్పించుకున్నావు.
"మళ్ళీ ఇంకోసారి నీ భర్త మనసులో అనుమానానికి చోటివ్వకూడదు…ఈ మధ్యే అన్ని మరిచిపోయి సంతోషంగా ఉంటున్నావు...దీన్ని చెడుపుకోవాలా" మానస మనసు మానసను హెచ్చరించింది.
అన్నిటినీ మరిచిపోయి...సంతోషంగా ఉంటోంది కాబట్టే ఊరికి వెళ్ళాలని ఆశ పడ్డది మానస.
పెళ్ళైన కొత్తల్లో ఊరి వైపే వెళ్ళ లేదు. మనసును చాలా నిలకడగా ఉంచుకుంది. భర్త వేసవి సెలవుల్లో వెడదామన్నప్పుడు… మా ఊర్లో ఏముంది, వద్దు కోడై కానలో, ఊటినొ వెడదామని చెప్పేది.
మానసను ఊరి మనుష్యులకు దూరంగా ఉంచాలనే, ఎక్కడో దూరంగా ఉన్న రాష్ట్రంలో ఉంటున్న కైలాష్ ని అల్లుడుగా వెతికి పట్టుకున్నారు. వేరే భాష మాట్లాడే మనుష్యులు, వేరే వాతావరణం, పూర్తిగా బిన్నమైన జీవిత విధానం గల ప్రదేశం....మనసుకు ఊరట, ప్రశాంతత ఇస్తుందనే అంత దూరమైనా ఇచ్చారు.
"ఇప్పుడెందుకు వచ్చింది ఊరికి వెళ్ళాలనే ఆశ, తపన" అని మానస మనసు మానసను ప్రశ్నిస్తున్న సమయంలో ఎవరో మైన్ డోర్ కొడుతున్న శబ్ధం వినబడింది.
చీర చెంగుతో ముఖం తుడుచుకుని, రాని నవ్వును తెప్పించుకుని డోర్ తీసింది. ఎదురుగా భర్త కైలాష్.
లోపలకు వస్తూనే "రేపటికి టికెట్టు దొరికింది. జీ.టీ ఎక్స్ ప్రెస్...కావలసినవన్ని పెట్టుకో....ఏమిటి సంతోషమే కదా?"
అంటూ మానసను దగ్గరకు లాకున్నాడు.
ఆమెలో ఏడుపు ముంచుకువస్తోంది. ఆపుకోవటానికి కొసం మొహం కిందకు దింపుకుంది.
కైలాష్ మానసను మరింత దగ్గరకు లాక్కుని “పెళ్ళైన కొత్తల్లో ఊరికి వెళ్ళిరమ్మన్నా 'వెళ్ళను...మిమ్మల్ని వదిలి నేను ఒక్క రోజు కూడా ఉండలేను’ అంటూ ప్రేమ కబుర్లు చెప్పేదానివి! ఇప్పుడేంటి ఊరికి వెళ్ళటానికి ఎగిరి గంతులు వేస్తున్నావు...ప్రేమ కబుర్లు కూడా మాయమైనాయి"
వస్తున్న ఏడుపును ఆపుకోలేక భర్త గుండెల మీద వాలిపోయి వెక్కి, వెక్కి ఏడ్చింది మానస.
తను అన్న మాటలకు ఏడుస్తున్నదేమో అనుకుని గాబరా పడ్డ కైలాష్ "సారీ మానసా...నేను ఎదో సరదాగా మాట్లాడాను"
"టికెట్టు క్యాన్సల్ చేసేయండి"
గాబరా కాస్తా షాక్ గా మారింది కైలాష్ కి.
"ఏయ్ మానసా...ఏమైంది నీకు?"
"పెళ్ళికి ఇంకా ఇరవై రోజులు ఉన్నది. ఇప్పుడే ఎందుకెళ్ళాలి"
"ఏందుకీ సడన్ యూ టర్న్! నేనూ పెళ్ళి పనులలో నా వంతు సహాయం చేయాలి అంటూ ఎన్నో కబుర్లు చెప్పావు...ఇప్పుడేమిటి ఇలా మాట్లాడుతున్నావు"
“వెల్తాను, వెల్తాను అన్నప్పుడల్ల ఏమీ తెలియలేదు. వెళ్ళే సమయం దగ్గరపడుతున్న కొద్ది అదొలా ఉన్నది. మీరు ఒంటరిగా ఉంటారు అని ఆలొచించినప్పుడు కష్టంగా ఉన్నది. అక్కడ పెళ్ళి పనులు చూడటానికి చాలా మంది ఉన్నారు. కానీ, ఇక్కడ మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరూ లేరే...నేను తప్ప"
కరిగిపోయాడు కైలాష్.
"టికెట్టు క్యాన్సల్ చేశేయండి"
"నిజంగానే చెబుతున్నావా?"
“అవును! పెళ్ళికి రెండు రోజులు ఉందనగా వెడదాం. మిమ్మల్ని ఇప్పుడే వదిలి వెళ్ళటానికి, నాకు ఏదోలాగా ఉన్నది" కన్నీళ్ళు కారుస్తూ మానస చెబుతూంటే, ఆమె ముఖాన్ని దగ్గరకు తీసుకుని, కన్నీళ్ళు తుడుస్తూ బుగ్గలపై ముద్దు పెట్టుకున్నాడు కైలాష.
మానస కన్నీళ్ళు పెట్టుకోవటానికి కారణం, తనపై మానసకు ఉన్న ప్రేమేనని కైలాష్ అనుకున్నాడు.
నిజమైన కారణం మానసకు మాత్రమే తెలుసు కదా!
భయంకరమైన నిశ్శబ్ధంతో కూడిన ప్రశాంత వాతావరణంలో వంట చేస్తోంది మానస. కైలాష్ బయటకు వెళ్ళాడు.
ఫోన్ మోగింది.
ఫోను ఎత్తటానికే ఇష్టంలేదు. అమ్మగానీ, నాన్నగాని చేసుంటారు. వాళ్లతో మాట్లాడటానికే ఇష్టంలేదు.
ఫోన్ వదలకుండా మోగుతూనే ఉండటంతో రిసీవర్ ఎత్తింది.
"హలో..."
“నాన్న మాట్లాడుతున్నానమ్మా!"
"చెప్పండి"
"ఏమ్మా గొంతు అదోలా ఉన్నది. ఒంట్లో బాగోలేదా?”
"అదంతా ఏమీ లేదు నాన్నా...నేను బాగానే ఉన్నాను"
"పెళ్ళికి రావద్దని అమ్మ చెప్పిన దాని గురించే ఆలొచిస్తూ బాధ పడుతున్నావా?"
తండ్రి అలా అడిగేసరికి ఏడుపు పొంగుకు వచ్చింది, గొంతుక అడ్డుపడింది.... సమాధానం చెప్పనివ్వకుండా గొంతును ఎవరో నొక్కి పట్టినట్టుంది.
"ఏమ్మా...మౌనంగా ఉన్నావు"
"మరి..బాధపడకుండా ఎలా ఉండగలను?"
గొంతు బొంగురు పోయింది.
"ఏం చేయగలం చెప్పమ్మా? జరిగిందంతా నువ్వు మర్చిపోయుండచ్చు. కొత్త ప్రదేశం, కొత్త ప్రజలు నిన్ను అన్నీ మరిచిపోయేటట్టు చేసుంటారు. కానీ ఇది గ్రామం అమ్మా. ఎవరూ దేనినీ మరిచిపోలేదు. ఇప్పుడు కూడా నీ గురించి మాట్లాడుతున్నారు. నువ్వు పెళ్ళికి వస్తే ఇంకొచం ఎక్కువగా మాట్లాడతారు. ఈ విషయాలు ఏమైనా కొత్త పెళ్ళి కొడుకు వాళ్ళ చెవికి వెళ్ళి, వాళ్ళు తప్పుగా అర్ధం చేసుకుంటే, సుజాత పెళ్ళిలో ఏదైనా గొడవలు జరిగితే ఏం చేయగలం?
“ఆడపిల్లను కనేసేము...రోజూ మేము భయపడుతూ ఉండాల్సిందే కదా. నిన్ను రావద్దు అని చెప్పటానికి మా కేమన్న ఆశా? నువ్వు పెళ్ళికి రావని గుర్తుకు వచ్చినప్పుడల్లా మేమేంత బాధ పడుతున్నామో తెలుసా? కానీ ఏం చేయగలం చెప్పు? తప్పులన్నీ నువ్వే కదా చేశావు! దానికి తగిన ఫలితం అనుభవించే తీరాలి కదా?"
మనసులో ఏదో విరిగిన శబ్ధం.
దెబ్బ పై దెబ్బ తింటున్న ఫీలింగ్.
కూతురు మనసు విరిగిపోయిందని తెలియకనో లేక తెలిసి కూడా దాని గురించి పట్టించుకోకుండా మాట్లాడుతూనే ఉన్నరు మానస తండ్రి.
"మానసా...నీలాంటి మంచి మనసు ఎవరికి ఉండదు. చెల్లి పెళ్ళికి కావలసినంత బంగారం ఇచ్చి సహాయ పడ్డావు! నువ్వు దేవత లాంటి దానవు. నిన్ను పెళ్ళికి రావద్దని చెప్పటానికి చాలా కష్టంగా ఉన్నది. కానీ ఏం చేయను? అల్లుడు గారితో ఏదో ఒకటి చెప్పి, ఆయన్ను నమ్మించి అక్కడే ఉండు"
నాన్న ఫోన్ పెట్టేసిన శబ్ధం.
మానస తట్టుకోలేక పోయింది!
వంటింట్లోకి వెళ్ళి గ్యాసు పొయ్యి ఆపి బెడ్ రూముకు వచ్చి మంచం మీద పడుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.
*********************************************PART-4********************************************
పెళ్ళిరోజు దగ్గర పడింది.
మానస, భర్తకు దగ్గరగా జరిగింది. అతను చదువుతున్న పుస్తకాన్ని లాగి దూరంగా పెట్టి, అతని గుండెల మీద వాలింది.
"ఒకటే కన్ ఫ్యూషన్ గా ఉందండి"
"ఎందుకు కన్ ఫ్యూషన్" అమె కురులను సద్దుతూ అడిగాడు.
"ఊరు వెళ్ళటం గురించే"
"అనుకున్నా. పెళ్ళికి ముందు రోజు ఏం చీర కట్టుకోవాలి? ప్రొద్దున ముహూర్తానికి ఏం చీర కట్టుకోవాలి? సాయంత్రం